మా నాన్న శ్రీరామ్మూర్తి గారు 1928లో జన్మించారు. మా తాతగారు చిన్నతనంలో మరణించడంతో మా పెదనాన్న గారి సహాయంతో ఇంటర్ పూర్తి చేసి బి.ఏ. చదువుతుండగా 1954లో సబ్ఇన్స్పెక్టర్గా సెలక్ట్ అయ్యారు. అప్పటికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడనందువల్ల మద్రాస్ రాయవెల్లూర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందారు. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో నెల్లూరు జిల్లాకు కేటాయించబడ్డారు. ఆయన చిన్ననాటి నుండి బహు కష్టజీవి. చల్లపల్లిలో వారికున్న కొద్ది పొలంలో నాట్లు వేయడం, కోత కోయడం, కలుపు తీయడం వంటి వ్యవసాయ పనులు చిన్నతనం నుండీ చేసేవారు. మా ఇళ్లు చేనేత వృత్తికారుల ఇళ్ల మధ్య ఉండటంతో వారు మగ్గం నేయడం కూడా నేర్చుకున్నారు.
ఆయన బాల్యంలో జరిగిన కొన్ని సంఘటనలు తరచూ మాతో చెబుతుండేవారు. మా నాన్న గారికి పన్నెండేళ్లప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పని చేస్తున్న మా తాత గారికి చల్లపల్లి నుంచి నందిగామకు బదిలీ అయిందట. ఇంటి సామానంతా నందిగామ చేర్చారు కానీ, ఆవుదూడలను నాన్న గారు, వాళ్ల బావతో కలిసి నడుస్తూ తోలుకు వెళ్లారట. చల్లపల్లి నుండి సుమారు వంద కి.మీ.కు పైగా దూరం ఉన్న నందిగామకు కాలినడకన తోలుకెళ్లడం చాలా కష్టమైన పనే. ఉదయం చల్లపల్లిలో బయలుదేరిన వాళ్లు సాయంత్రం చీకటి పడే వేళకు విజయవాడ కాళేశ్వర్రావ్ మార్కెట్ దగ్గరున్న వినాయకుడి గుడి వరండాలో నిద్రపోయి తెల్లవారగానే తిరిగి ప్రయాణం కొనసాగించారట. అలా ఇంకొంత దూరం వెళ్లేసరికి దూడ నడవలేకపోవడం అదే రోడ్డుపై పోతున్న ఒక ఎడ్లబండతను గమనించి దూడను బండిలోకి ఎక్కించి మీరు వెనుక నడవండి అని చెప్పారట. దూడను బండిపై ఎక్కించి మరికొంత దూరం వెళ్లేసరికి చిన్న పిల్లవాడిగా ఉన్న నాన్న గారు నడవలేక పోతుండటంతో ఆయనను కూడా బండి ఎక్కించుకుని విడిచిపెట్టారట. ఇది జరిగి డెబ్భై ఏళ్లు గడిచిపోయినా ఇప్పటికీ బండి నడిపిన వ్యక్తి ఉపకారాన్ని ఎన్నోసార్లు గుర్తు చేసుకుంటారు.
ఎస్.ఎల్.సి. పరీక్షలు రాసిన తరువాత శెలవులలో జరిగిన మరొక సంఘటనను కూడా ఆయన తరచు చెబుతుండేవారు. వారి పెదనాన్న గారి అమ్మాయి కోటమ్మక్కకు క్యాన్సర్ వ్యాధి సోకడంతో వైద్యం కోసం మద్రాస్‌లోని అడయార్ క్యాన్సర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారట. ఎన్నడూ చల్లపల్లి పొలిమేరలు దాటని ఆయన తమిళం అస్సలు తెలియకపోయినా ఆమెను వెంటబెట్టుకుని విజయవాడ వెళ్లి అక్కడ నుండి తొమ్మిది రూపాయలటికెట్తో మద్రాసు చేరారట. ఆమెను ఆసుపత్రిలో చేర్చి వైద్యం జరిగిన పది రోజులు నుంగంబాకంలో ఉన్న చల్లపల్లి రాజా గారి సోదరుడు, సారథీ స్టూడియోస్ వ్యవస్థాపకులు శ్రీరామకృష్ణ ప్రసాద్ గారి ఆదరణతో వారి ఇంట్లో భోజనం, బస ఏర్పాటు చేసుకుని పగలంతా అడయార్ ఆసుపత్రిలో వారి అక్కగారితో గడిపి వచ్చేవాడిని అని చెప్పారు. ఆ మద్రాసు యాత్రతో ఆయనకు భయం వీడి బయటి ప్రపంచంతో పరిచయం ఏర్పడింది అని చెప్పారు.
సబ్ ఇన్స్పెక్టర్గా ఎనభై రూపాయల నెలజీతంతో ఆయన జీవి తం ప్రారంభించారు. వివాహం జరగక ముందు నెల్లూరు జిల్లా విడవలూరులో పని చేస్తుండగా జరిగిన మరొక సంఘటన ఎప్పుడూ చెప్పేవారు. మా నాన్నగారు రెండేళ్ల పసివాడుగా తీవ్ర అనారోగ్యానికి గురై మా నాయనమ్మగారు విచారంతో ఉన్నప్పుడు మా తాత గారు కోపంగా నువ్వు ‘‘వాడి మంచం ప్రక్కనే కూర్చొని పనులేవీ చేయడం లేదు. ఎప్పుడూ వాడి ధ్యాసేనా! వాడు పెరిగి పెద్ద వాడై నిన్ను ఉద్దరిస్తాడనేనా? లేచి ఇంటి పనులు చూడు’’ అన్నారట. సరిగ్గా ఇది జరిగిన ముప్పై ఏళ్ల తరువాత మా నాయనమ్మ గారు విప్రనారాయణ సినిమా చూడాలని అడిగితే నాన్న వారి మిత్రుడి కారులో ఆమెను నెల్లూరు తీసుకెళ్లి బాల్కనీలో కూర్చోబెట్టి ఆ సినిమా చూపించారట. సినిమా చూస్తూ మా నాయనమ్మ ‘‘వాడు పెరిగి పెద్దవాడయి నిన్ను ఉద్ధరిస్తాడా?’’ అన్న మా తాతగారి మాటలు తలచుకుని కన్నీళ్లు పెట్టుకొని గతంలో జరిగిన సంఘటనను మా నాన్న గారితో చెప్పి సంతోషించారట.

రాయవెల్లూర్ శిక్షణలో
ఆయన పోలీసు శాఖలో ఉద్యోగం చేసినప్పటికీ యూనిఫారమ్‌ను దేహానికే కానీ, మనసుకు అంటించుకోక చాలా సౌమ్యంగా, ఓర్పుగా ఉండేవారు. వారికి సంబంధించిన ఏ చిన్న పనైనా ఎవరితోనూ చేయించుకోవడం ఆయనకు అస్సలు నచ్చదు. ఆయన పనులన్నీ ఆయనే స్వయంగా చేసుకునేవారు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఎనభై ఏళ్లు దాటినా ఎవరినీ కనీసం మంచి నీళ్లు కూడా ఇవ్వమని అడగ్గా నేను చూడలేదు.
రోజూ తెల్లవారు జామున లేచిన వెంటనే ముందురోజు సాయంత్రం పని మనిషి తోమి బాల్కనీలో ఆరబెట్టిన గిన్నెల్ని, ఎంతో ఓపికగా తెచ్చి వంట గది ర్యాక్‌లో సర్దుతారు. ఎప్పుడైనా మీరు ఈ వయసులో ఇలాంటి పనులు చేయడం ఎందుకంటే, ‘‘పాపం వాళ్ళు అర్ధాకలితో నాలుగిళ్లల్లో పని చేసుకునే వాళ్లురా! నాకు చేతనైన చిన్న సాయంతో వాళ్లకు కొంతైనా బరువు తగ్గుతుంది కదా!’’ అనేవారు.
ఇంట్లో పనివాళ్లకు, డ్రైవర్స్‌కు మాతోపాటే, మేము తినే సమయానికే టిఫిన్, భోజనం వారికీ పెట్టాలనేది ఆయన నియమం. ఏ పనులు చేయని మనమే ఆకలికి ఆగలేనప్పుడు పగలంతా కష్టం చేసుకునేవాళ్లకు కనీసం సమయానికి అన్నం పెట్టడం మన ధర్మం అనేది వారి అభిమతం. ఎవరు కష్టడుతున్నా చూడలేని మనస్తత్వం వారిది.
ఆయన మాతో ఉన్నప్పుడు మా అపార్ట్మెంట్ వాచ్‌మేన్ పిల్లలకు పాలకోసం నెలనెలా డబ్బులు ఇచ్చేవారు. మరికొన్నిసార్లు మెస్‌లో భోజనం టికెట్స్ కొని దారిలోకనపడ్డ బీదవాళ్లకు ఇచ్చి ఇస్తుండేవారు. కొన్నేళ్ల క్రితం విజయవాడలో వారికి తెలిసిన వ్యక్తి వృద్ధుడై ఆలనాపాలనా చూసేవాళ్లైవరూ లేకపోవడంతో అతనిని వృద్ధాశ్రమంలో చేర్చి ఆయన చనిపోయే వరకు నెలనెలా డబ్బులు పంపేవారు.
ఉద్యోగ నిర్వహణలో కూడా నాన్నగారు చాలా నిరాడంబరంగా, అందరితో సౌమ్యంగా ఉంటూ ఎటువంటి సమస్య అయినా సామరస్యంగా పరిష్కరించేవారు. సాధారణంగా పోలీస్‌శాఖలో అధికారులు క్రింది వాళ్లను సానుభూతితో చూడడం అరుదు. అలాంటి శాఖలో ఉన్నా మాకు బదిలీ అయిన ప్రతీసారి వారితో పని చేసే సిబ్బంది కన్నీళ్లు పెట్టుకోవడం నాకు బాగా గుర్తు.
ఆయన గుడివాడలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న రోజుల్లో ఒకసారి కైకలూరు క్యాంప్ వెళ్లారు. అక్కడకు వెళ్లిన కొద్దిసేపటికే వారి డ్రైవర్‌కు అపెండిసైటిస్‌తో భరించలేని నొప్పి మొదలయ్యింది. నాన్న గారు అతనిని వ్యాన్ వెనుక సీటులో పడుకోబెట్టుకొని ఆయనే వ్యాన్ నడుపుకుంటూ నేరుగా గుడివాడ ఆసుపత్రికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి అతని భార్యకు కబురు పంపి అతడ్ని సురక్షితంగా అప్పగించారు.
పొన్నూరులో ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నప్పుడు జరిగిన రెండు సంఘటనలు మీతో ప్రస్తావించాలి. ఒక కానిస్టేబుల్ ఇంట్లో ఏదో శుభ కార్యానికి మధ్యాహ్నం భోజనానికి రమ్మని అతను నాన్న గారిని పిలిచారు. యూనిఫారమ్‌తో ఉండటంతో ఇంటికెళ్ళి డ్రస్ మార్చుకుని వస్తానని చెప్పి ఇంటికి వచ్చి నాన్న ఆ విషయం మర్చిపోయారు. అమ్మ భోజనం వడ్డించడంతో తినడం ప్రారంభించిన కొద్ది సేపటికి విందుకు పిలిచిన తను కొంచెం సేపు ఎదురు చూసి ఇంకా రాలేదని మా ఇంటికి వచ్చారు. అతన్ని చూడగానే నాన్న అరెరే! మర్చిపోయాను అంటూ భోజనం మధ్యలో చేయి కడుక్కుని లేచి వాళ్ల ఇంటికి భోజనానికి వెళ్ళారు. వారిని అభిమానించే వాళ్లపట్ల ఆయన ఎప్పుడూ ఎంతో ఆప్యాయతను, ఆదరణను చూపేవారు.
ఒకసారి నాన్న గారిని కలవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళేసరికి ఒక జేబు దొంగను పట్టుకొచ్చి వారి ముందు కూర్చోబెట్టారు. నాన్న అతనితో మాట్లాడుతూ అతని పాదాలు, మోకాళ్లు వాచిపోయి ఉండటం చూసి ప్రక్కనున్న పోలీస్ కానిస్టేబుల్‌తో కారణం ఏమిటి అని అడిగితే, అతను నీళ్లు నములుతూ ‘‘ఇంటరాగేషన్ చేసాం సార్’’ (పోలీస్ భాషలో ఇంటరాగేషన్ అంటే మీకు తెలియందేముంది వారిదైన శైలిలో ప్రశ్నించడమే…) అని సమాధానం చెప్పాడు. ‘‘ఇంటారాగేషనా, నీమొఖమా? అతన్ని ఎలా కొట్టారో చూడండి అతనూ మనిషేగా’’ అంటూ, ఇరవై రూపాయలిచ్చి ‘‘ అమృతాంజనం తెప్పించి అతనికివ్వండి కాపడానికి కొంచెం వేడి నీళ్ళు కూడా ఇవ్వండి’’ అని చెప్పారు.
నాన్న గారు రిటైర్ అయిన తరువాత సుమారు ఇరవై సంవత్సరాలపాటు పెళ్ళి సంబంధాలు కుదర్చడానికి కృషి చేస్తూ సమాజసేవ చేసారు. మా బంధువర్గం, మిత్ర వర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆయన నేటికీ మాటసాయం, ఆర్థిక సాయం చేస్తుంటారు. ఎంతో క్రమ శిక్షణతో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వలన డెబ్భై ఎనిమిదేళ్ళ వయస్సులో మాతో పాటు తిరువణ్ణామలై వచ్చి అరుణాచలగిరి ప్రదక్షణ చేశారు. వారి చెల్లెలు అనారోగ్యంతో ఉంటే ఎనభై ఒకటో సంవత్సరంలో ఇరవై రెండు గంటలు ప్రయాణం చేసి న్యూజెర్సీలో నెలరోజులు ఆమెతో గడిపి వచ్చారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
ఒక రోజు అనుకోకుండా ప్రఖ్యాత సినీ దర్శకులు శేఖర్ కమ్ముల (వారి తండ్రి శేషయ్య గారు నాన్న గారికి చిరకాలమిత్రులు) మా ఇంటికి వచ్చినప్పుడు ఒక కుటుంబ చిత్రం తీస్తున్నాను అందులో తాత గారి పాత్రకు నాన్నగారు సరిపోతారు అని ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’’ సినిమాలో ఆయనను నటింపచేశారు. నాన్న గారికి నటనానుభవం లేకపోయినా ఆ సినిమాలో ఎంత బాగా నటించారంటే ఆ సినిమా రిలీజ్ అయిన మరుసటి రోజు పొద్దున్నే దర్శకురాలు నందినీరెడ్డి గారి అసిస్టెంట్ డైరెక్టర్ మా ఇంటికి వచ్చి వారు తీస్తున్న ‘జబర్దస్త్’ సినిమాలో శ్రీహరి గారి తండ్రి పాత్రలో నటించమని అడిగారు.

డాన్ డాడీ
వారు ఆ చిత్రంలో నటించడం కోసం మలేషియా వెళ్ళి వారం రోజులు షూటింగ్లో పాల్గొని వచ్చారు. ఆ సమయంలో శ్రీహరి గారు వారిని ఎంతో ప్రేమతో శ్రద్దగా నిజంగానే తండ్రిలాగా చూసుకున్నారని చెప్పారు. జబర్దస్త్ చిత్రంలో నటించినందుకు నందినీ రెడ్డి గారు వారికి ఇరవై ఐదు వేలరూపాయలు పారితోషికం కూడా ఇవ్వడం విశేషం. ఆ సినిమాల్లో నాన్నగారి పాత్రకు ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు. డబ్బింగ్ కొరకు స్టూడియోకు వెళ్ళినప్పుడు, నాన్న గారి స్వరం బాగుందని వారు నటించని ఇంకొక చిత్రంలో వేరే పాత్రకు కూడా వారితో డబ్బింగ్ చెప్పించారు.
వారు పిల్లలపెంపకం విషయంలో కూడా ఎన్నడూ దండించడం, ఆంక్షలు విధించడం చేయలేదు. మేము చిన్న చిన్న తప్పులు చేస్తే ఆయనకు నచ్చకపోతే సూచనప్రాయంగా చెప్పేవారు. మనషుల్ని అమితంగా ప్రేమించడం, అభిమానించడం తప్ప మిగిలిన అన్నింటిలో ఆయన మితంగానే ఉండేవారు. చేతనైన సాయం చేయడం తప్ప ఎవరి జీవితాల్లో, ఆఖరుకు వారి పిల్లలజీవితాల్లో కూడా ఎన్నడూ జోక్యం చేసుకోవడం కాని, అజమాయిషీ చేయడం కాని వారు చేయలేదు.
ఆయన దేనికోసమూ అతిగా ఆరాటపడటం, తాపత్రయపడటం మేము చూడలేదు. నేటి తరం తల్లిదండ్రుల్లాగా పిల్లలభవిష్యత్తు విషయంలో పెద్ద పెద్ద ప్రణాళికలు, ఆశలు, కోరికలు లేకుండా జీవితం ఎలా నడిపిస్తే అలా నడుస్తూ దేనినీ ఆశించక, దేనికీ ఆశపడక మమ్ము నడిపించారు. ఇవన్నీ చేయడం ఎంత కష్టమో మాకు స్వానుభవమై Mark Twain ఎప్పుడో తండ్రి గురించి అన్న “When I Was a boy of 14, my father was so ignorant. I could hardly stand to have the Oldman around. But when I got to be 21, I was astonished at how much the Oldman had learned in 7 years” అన్న మాటలు గుర్తుకొచ్చేవి.
పిల్లలకు మనం ఏమివ్వాలి? అంటే, ఒక మహనీయుడు Wings and Roots అన్నాడట. Wings ఎక్కడికైనా ఎగరడానికైతే, Roots మన మూలాల్నీ, విలువల్నీ వీడకుండడానికే! మా పిల్లలు ఏ దేశానికి వెళ్ళినా కుదుళ్ళు పదిలంగా కాపాడినందుకు నాన్నకు నీరాజనాలు. నాన్నగారు తొంభై సంవత్సరాల పూర్ణాయుష్కులు. వారు ‘‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్…’’ అనే సినిమాలో నటించినా, నిజజీవితంలోనూ లైఫ్ ఈజ్ బ్యూటిపుల్గానే జీవించారు.
అందుకేనేమో బాల్యం నుండి వారిని చూస్తూ పెరిగిన మా చిన్నబ్బాయి తేజ ‘‘మా తాతయ్యే నాకు రోల్ మోడల్’’ అని ఎప్పుడూ అందరికీ చెబుతుంటాడు.
(జులై 27 నాన్నగారి ఎనమిదో వర్థంతి సందర్భాన వారిని స్మరించుకుంటూ …)

The first hero in our lives is our own Dad.
తాత గారు ఎక్కడ కనిపించిన, మమ్మల్ని ఎప్పుడూ ఆప్యాయంగా పలకరించే వారు. మా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునే వారు. తాత గారికి నమస్సుమాంజలి_/\_. ఇది నేను ఇంట్లో అందరికి చదివి వినిపించాలి.
అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి – ఈ వాక్యం మీ ఇంట్లో అందరికి చక్కగా సరిపోతుంది.
తాత గారు స్వర్గం నుంచి తన సంతానాన్ని చూసి చాలా గర్వ పడుతున్నారు.
Thank you for taking us to 1928 simultaneously to 1954 – TNPA Chennai and finally to Hyderabad.
Taatha garu is an inspiration.
హర్షవర్ధన్ సర్, తాత గారి జీవిత అనుభవాలను మరియు అయన ఆదర్శ విలువలను మా వరకు తీస్కుని వచ్చినందుకు ధన్యవాదాలు.
Keep inspiring!! Enni Sarlu chadivina, inkaa chadavali anipistuntundi.
ఇందులో కొన్ని విషయాలు ఆయన ద్వారానే విన్నాను, కొన్ని ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకున్నాను, కానీ నేను మాత్రం ఈరోజు ఆయనతో నాకున్న సుదీర్ఘ కాల జ్ఞాపకాలలో చాలాసేపు ఉండిపోయాను. “పోయినోళ్ళందరూ మంచోళ్ళు వున్నోళ్లు పోయినోళ్ల తీపిగురుతులు”
Dear Harsha garu,
Excellent memoir(?)of Nanna garu on his Vardhan. A really moving tribute by a worthy son.
I recalled the telugu saying
‘ Nootiko, kotiko Okkadu’ while reading. As my brother Rambabu wrote, I too recall my father in all walks of my life. He is my role model.
Thanks for a wonderful piece, as usual from Harshavanam.
PS:writing in Telugu typing is not my cup of ….
Kshaminchandi.
Great memories sir, that guide the future generations 🙏
An apt tribute to a great father on his Vardhanthi. మా నాన్న మాకు ఏమిచ్చాడు ? అనే ఈరోజుల్లో మీ నాన్నగారు మీకు ఏమిఇచ్చాడో గుర్తు చేసుకోవడం నిజంగా అభినందనీయం. వారిని కొన్నిసార్లు కలవడం మా అద్రృష్టం.
ఆ మహోన్నత వ్యక్తి దర్శన భాగ్యం నాకు కూడా లభించింది. నేను హైదరాబాద్ లో పని చేసినప్పుడు “గ్రీన్ పార్క్” హొటల్ ఎదురుగా ఓ సందులో మీ సోదరుని ఇంట్లో కలిసాను. ఆ రోజు మీరు కూడా అక్కడ ఉన్నారు.
మీ నాన్నగారి వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించి వారిని మీరు గుర్తు చేసుకుంటూ మాకు కూడా గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
వారికి నివాళులు సమర్పించు కొంటున్నాను.
Super sir.idhi chadhuvuthunnantha sepu.maa grand parents kallamundhu inka vunaatlu vundhi.vaallu kooda 95 years healthy ga jeevinchaaru.maaku inspiration.kooda.old is GOLD.”peddala maata childhi Moota”.namaste
అయ్యా నమస్కారం.
పూర్వపు రోజులు నిజముగానే అమోఘమైన అద్భుత జ్ఞాపకాలు.ఈజ్ఞాపకాల గురించి చెప్పాలంటే 1950నుండి1970మధ్య ఈలోకప్రవేశం చేసినవారికె స్వంతం.అందులోను మానవత్వపు మనసుతో అసమాన వ్యక్తిత్వముతో జీవించిన నాన్నగారి లాంటి వ్యక్తితో పంచుకొన్న మీరు అదృష్టవంతులు.
అయ్యా నమస్కారం.
పూర్వపు రోజులు నిజముగానే అమోఘమైన అద్భుత జ్ఞాపకాలు.ఈజ్ఞాపకాల గురించి చెప్పాలంటే 1950నుండి1970మధ్య ఈలోకప్రవేశం చేసినవారికె స్వంతం.అందులోను మానవత్వపు మనసుతో అసమాన వ్యక్తిత్వముతో జీవించిన నాన్నగారి లాంటి వ్యక్తితో పంచుకొన్న మీరు అదృష్టవంతులు.
Harsha uncle, very nicely described about your father. When i was around 9 years of age remember visiting your house in ponnur.
Story Chala bagundi Bava varu…Mamayya garu kanti mundhey kadalaadinatluga anipinchindi …inka manchi manchi stories enno meru vrayalani korukuntunnanu
హర్ష గారు మీరు మీ తండ్రి గారి గురించి వ్రాసిన ప్రతి విషయం నేను మా తండ్రి గారికి అన్వయించుకుంటూ మా తండ్రి గారి జీవితం నా బాల్యం నుంచి ఆయన శాశ్వతనిద్ర దాకా గుర్తుచేసుకునేలా వ్రాశారు.నేను తండ్రి గురించి ఏ కథ చదివినా,నాన్నకు ప్రేమతో, సన్ ఆఫ్ సత్యమూర్తి వగైరా చిత్రాలు చూసినా చాలా భావోద్వేగానికి గురవుతాను.మీరు అన్ని విషయాలు గుర్తుపెట్టుకుని చాలా హృద్యంగా వ్రాశారు.అత్యంత నిరాడంబరుడు,కష్టజీవి, ఆచరణీయుడు అయిన మీ తండ్రి గారిని స్మరించుకుంటూ వారికి స్మృత్యంజలి మరియు అంత చక్కగా ప్రతి విషయాన్ని మీరు పంచుకున్నందుకు మీకు హ్యాట్సాఫ్ సర్ 🙏
Dear Harsha, My Namaskarams to SreeRamurthy uncle. I am proud of your father and also glad that our fathers were colleagues. There is a lot to learn from your father. With best wishes and regards, Dr SV Praveen
మీకు మాకు చల్లపల్లి లో బంధం ఉందన్నమాట…మీ నాన్న గారి లక్షణాలన్నీ మీరు పునికి పుచ్చుకున్నట్లుగా మీరు జీవనాన్ని సాగిస్తున్నారు…మీ నాన్న గారిని చూసే భాగ్యం కలగడం నా అదృష్టం.
“సామాన్యుల్లో ఓ ఉద్ధందుడు” కొడుకు
నా హృదయ మిత్రుడు కావడం నా
పూర్వజన్మ సుకృతం..కోనసీమ బండా రులంక నుండి నేను..గుణదల నుండి
మీరు తిరుపతి SVU lo కలవడం
పూర్వ జన్మ బంధం..మీరు కూడా నాన్న గార్కి ఏమాత్రం తీసిపోని గుణసంపన్నులు….మీ దంపతులిద్దరికీ
నా హృదయ పూర్వక నమఃసుమంజలులు…
గత స్మృతులు ఎంతో మధురంగా ఉంటాయి. అందునా మీ తండ్రి గారి లాటి క్రమశిక్షణ మంచి వ్యక్తిత్వం ఉన్న వారి సాంగత్యం మరీ మధురం. మీరూ ఆయా జ్ఞాపకాలను పొదవి పట్టుకున్న తీరు అమోఘం.
………………. చలం
Sri Sreerama Murthy garu was sarthakananadheyu. Prathahsmaraneeyulu.🙏🏽🙏🏽He was an elder guide to many of us. Your message rekindled many memories of him with me & my senior Sri KVV Subrahmanyam garu.
🙏🙏
Bhavagari athmaku shanthi kalagalani korukontunnanu
1972 nundi parichayam naku afamilytho
శుభోదయం హర్షవర్ధన్ గారు 🙏
మీరు నాన్న గురించి రాసిన జ్నాపకాలు మధురమైన స్మృతులు. మీరు పదిలంగా దాచుకుని అందించడం అభినంనీయం. మీలాగే మీ రచనా శైలి మృధు మధురం. అభినందనలు సార్.
నాకు శ్రీ రామమూర్తి అంకుల్, 1978 నుంచి పరిచయం. వారి అబ్బాయి మణి ఇంజనీరింగ్‌లో నా క్లాస్ మేట్. నేను ఎప్పుడు మణిని గాని హర్ష అన్న కలవడానికి వెళ్ళిన నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి, బాగోగులు కనుక్కునే వారు. వారి ఎల్లప్పుడు నవ్వుతూ ఉండే ముఖము, వారి మృదు స్వభావము మరిచిపోలేనివి.
అందుకే వారు చాలా మందికి రోల్ మోడల్.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ఎదుట ప్రార్థిస్తున్నాను.
“Nanna” ane emotion ki oka illustrations ivvala?? .. leka mimmalni penchina vyakthini choodala?? !!! Multiple PEARLS can come from same shells!!! Aney theory prove chesaru naaku !!!
Dear sir
A great soul’s journey is described vividly
He is an inspiration to many
You are a blessed son
Love with Dad is a mad love of a Lad❤️
Salutations to dad.Since we have known him from a long time we can attest to his easy going and friendly nature. May his soul R.I.P.
very inspiring sir
Father is our first hero
we imbibe life meaning from them.
for wings & Roots as you rightly said Father and mothers role is predominantly.
May his proud soul be rest in heaven.
Best wishes
Dilip.c.Byra