
తెలుగు భాషా ప్రేమికులు సాకం నాగరాజ గారితో నా పరిచయం పదేళ్ళకు పైగానే. తిరుపతిలో చదువుకోవడం వల్లనో, వెంకన్నస్వామి సమన్స్ తరచు అందుకోవడం వల్లనో ఇంచుమించు ఏడూ మా తిరుపతి యాత్ర జరగవలసిందే. మొదటిసారి నాగరాజ గారిని ప్రత్యక్షంగా కలవడం మా డిపార్ట్మెంట్ మిత్రులు తిరుపతి వాసి రవీంద్రబాబు గారితోనే. ఆ తరువాత నాగరాజ గారిని కలిసినప్పుడల్లా చిన్నవో, పెద్దవో ఒక పుస్తకాల కట్ట చేతిలో పెట్టేవారు. కలవడం వీలుకాకపోతే పుస్తకాలను (తమ ఖర్చులతో) పోస్ట్ చేసేవారు.
చాలా కాలం తరువాత ఇటీవల వారిని ఫోన్లో పలకరిస్తే ‘‘నా జీవితం నల్లేరు మీద బండి’’ అనే వారి ఆత్మకథా పుస్తకాన్ని పంపిస్తానని చెప్పారు. సరిగ్గా మూడో రోజున ఆ పుస్తకంతోపాటు మరికొన్ని పుస్తకాలు జోడిరచి కొరియర్ పంపించారు. పుస్తకం అందుకున్న మూడు రోజుల్లోనే చదివాను అనేకంటే చదివించింది అనేదే నిజం. ఇది నా మాటే కాదు పుస్తకానికి ముందు మాట రాసిన శ్రీమతి గల్లా అరుణకుమారిగారు ‘‘ఒకసారి ఆయన పుస్తకం చదవడం మొదలుపెడితే అదే మనల్ని చదివిస్తూ తీసుకుపోతుంది’’ అనే రాశారు.
ప్రముఖ జర్నలిస్ట్ తాడి ప్రకాష్ రాసిన తన ముందు మాటకు ‘‘వూరికో నాగరాజ వుంటే బావుణ్ణు’’ అని తన మనసులోని మాటను వెలిబుచ్చారు. నాగరాజగారు సాహిత్యాన్ని, సంగీతాన్ని అమితంగా ప్రేమించిన మనిషని, తన గురించి క్లుప్తంగా, స్పష్టంగా ఏ దాపరికమూ లేకుండా రాసిన జీవన చిత్రం ఈ పుస్తకం అంటూనే ఇందులో గొప్పలు చెప్పుకునే దరిద్రమూ కానరాదని నాగరాజ గారికి గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు. వీరి జీవిత చరిత్రలో హిపోక్రసీ లేదు, ఎలాంటి ఫైర్వర్క్స్ లేవు, కవరింగ్ టెక్నిక్స్ లేవు.
చదవడం ప్రారంభించి ముందుకు పోయేకొద్దీ వారి కాంప్లిమెంట్కంటే నాగరాజ గారి కెనోపీ మరికాస్త పెద్దదే అనిపించింది. వీరి ఆత్మకథ ఆద్యంతం నిజాయితీ, హాస్య, వ్యంగ్య మేళవింపులతో సాగింది. లేకపోతే బాల్యంలో వారి తండ్రిగారి నిష్క్రియా ధోరణిని ఆయన ‘‘ఇలా వున్న పుల్లను అలా తీసివేసిన పాపాన పోడు’’ అనగలరా! ఆరోజుల్లో తోడికోడళ్ళ మధ్య ఆప్యాయతలను ‘‘వాళ్లకు తెలీకుండానే ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే పనిపాటలను యథాలాపంగా పంచుకున్న తీరు’’ ఆశ్చర్యం కలిగిస్తుందని నెమరు వేసుకుంటారు.
వెనకటి రోజుల్లో ఇంట్లో పనివాళ్లను చూసుకునే విషయం ప్రస్తావిస్తూ ‘‘మేము వండుకున్న వుప్పాంసుల కూర మాతో పాటు పొలంలో పనిచేసే మా కూలీలకు వేసే వాళ్లం’’ అని రాయడం పేదల పట్ల వారి కరుణను తెలియజేస్తుంది. ఒక ఆడకూలీ తనకు వడ్డించిన కూరను కుక్కి మంచం మీదున్న ముసలి అత్తకు తీసుకుపోవడం గమనించిన బాల నాగరాజ పెద్దయి ‘‘అట్టడుగు వర్గాల వారు ముసలి ముతకాను చూసినంత బాధ్యతగా అగ్ర వర్ణాల వారు చూడరు అని! అగ్రవర్ణాలు అనడం దేనికి అనుకుంటే డబ్బున్న వాళ్లు అందాము’’ అని నేటి సమాజాన్ని కళ్ల ముందుంచుతారు.
చిన్నప్పుడు వారి కుటుంబ పెద్ద సంతవ్వ ‘‘నువ్వొకరి చేతిలో పెట్టేదే నిన్ను కాపాడుతుంది. నువ్వు తినేస్తే సరిపోదు నలుగురికి పెట్టాలిరా నాయనా’’ అని చెప్పిన మాటనే జీవన వేదం చేసుకున్న నాగరాజ గారు మాన్యులు.
చిన్నతనంలో చేసిన చిన్న చిన్న దొంగతనాల్ని, పెద్దయిన తర్వాత స్టూడెంట్‌గా చేసిన దొంగతనాల్ని మనస్ఫూర్తిగా వొప్పేసుకుని ఆ నింద మోసిన వారిని క్షమాపణలు కూడా అడిగేస్తాడు మన నాగరాజగారు. బాల్యం మరచిపోలేక ‘బాల్యం అనేది మీకైనా నాకైనా ఒక చెలమ. తవ్వేకొద్దీ జల వూరుతూనే ఉంటుందని’ intense nostalgia కి లోనవడం వారి విశిష్ట వ్యక్తిత్వం. నాగరాజ గారికి వ్యంగ్య చతురత పాలు ఎక్కువే. వాళ్ల అన్నగారి చదువులను ముచ్చటిస్తూ మా అన్న ‘‘హిందీ సబ్జెక్టుకు భయపడి వంకలు, వాగులు, చెరుకు తోటల్లో దాక్కుని హైస్కూల్‌కి పోకుండా ఎగ్గొట్టే వాడు’’ అని కవిత్వీకరించారు.
ఉద్యోగం ఆలస్యమై ఉంటే ‘‘తిరుపతి తీర్థకట్టవీధిలో ప్రొవిజనల్ స్టోర్లాంటిది పెట్టుకుందామన్న ఆలోచన కూడా చేయకపోలేదు’’ అని ప్లాన్ ‘బి’సిద్ధం చేసుకున్న సిద్దహస్తులు, దీర్ఘదర్శి నాగరాజ సార్. కాలేజి డేస్‌లో అంధులైన తన మిత్రుల గురించి ప్రస్తావిస్తూ ‘‘మనం వొట్టి కళ్ళతో చూసే లోకాన్ని వాళ్ళు మనోనేత్రంతోనే కాదు జ్ఞాన నేత్రంతో కూడా దర్శిస్తారు’’ అని హెలన్కెల్లర్ను గుర్తుకు తెస్తారు.
నాగరాజ గారు అలుపెరుగని పనిమంతుడు. తన మిత్రుడు ‘‘ఏ పనీ లేకపోతే అది మిట్ట మధ్యాహ్నమైనా ఎండనపడి తిరుగుతూండు, ఖాళీగా ఉండకు, పగటి పూట పడుకోకు’’ అని చెప్పిన మాటనే మంత్రదీక్ష వహించి జీవితాంతం యంత్రంలా గిరగిరా తిరిగేశారు.
పెళ్ళిమాటలు జరిగే రోజుల్లో వారి శ్రీమతి శశిగారి ఇంట్లో బాయిలర్‌తో సహా గ్యాసు గ్రైండర్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని అబ్బురపడి, ఒకరిద్దరు బావమరుదులు కూడా ఉన్నందుకు భరోసాతో పెళ్ళికి ‘యస్’ చెప్పేశాను అని సంబరపడిన అల్పసంతోషులు నాగరాజగారు. ఉద్యోగపర్వంలో ‘‘లెక్చరర్ అసోసియేషన్స్ ఉద్యమాలన్నీ కూడా శాలరీస్, ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్లు సర్వీస్ మేటర్స్.. ఇంతే! విద్యార్థుల బాగుపట్టదు’’ అని తమ ఆవేదనను నిర్మొహమాటంగా వెలిబుచ్చారు.
తనకు నచ్చని ఇన్విజిలేషన్ క్రతువుల గురించి రాస్తూ ‘ఎగ్జామ్ చీఫ్ ఒకరు వచ్చి కాపీలకు పాల్పడవద్దని ఒక రౌండ్ (కాల్పులు జరిపినట్టుగా) హెచ్చరించి వెళ్లాడు అని, మరోసారి తనిఖీకి వచ్చిన లేడీ లెక్చరర్ ఒకావిడకు చేతిలో పిస్తోలు ఒకటే లేదు అంతే అని వారి ఓవర్‌యాక్షన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది చదివితే చలంగారు మ్యూజింగ్స్‌లో ముచ్చటించిన వారి ఇన్విజిలేషన్ అనుభవాలు గుర్తుకొచ్చాయి. ఎవరి కష్టమూ చూడలేని మనసున్న నాగరాజగారు వారి పనిమనిషి భారం తగ్గించాలని సింకులో గిన్నెలు కొన్నిటిని తానే కడుగుతారట. అది శ్రమతో పాటు మానసికారోగ్యం కూడా ఇస్తుందని వారి నమ్మకం. వీరు గిన్నెలు తోమే సంగతి చదువుతుంటే నా స్ట్రెస్ పోగొట్టుకోడానికి నేను గిన్నెలు తోముతాను అని చెప్పిన బిల్‌గేట్స్ తో పాటు నాకు నేనూ గుర్తొచ్చాను (నేనూ ఆ బాపతులెండి). కవి ఇస్మాయిల్ గారు ఏదో కవితలో ‘కరుణ ముఖ్యం’ అన్న మాటే వీరి బాట.
జీవితాంతం విద్యా వ్యవస్థలో విద్యార్థులతో మమేకమైన నాగరాజగారు ఎన్నో ప్రయోగాలు చేశారు. పిల్లల్ని ప్రోత్సహించి వ్యాసాలు, ఉత్తరాలు రాయించారు. నాగరాజుగారి పెద్ద అమ్మాయి వారికి రాసిన ఉత్తరంలో తండ్రిగారు తనని పుస్తకాలు చదవమని చిన్నప్పుడు ప్రోత్సహించడం గుర్తు చేసుకుని పుస్తకాలు చదవడం వల్లనే తనకు కొంత ‘హృదయ సంస్కారం అబ్బిందని, నాలెడ్జ్ అనేది తీరని దాహం’ అని కూడా అర్థమైందని తండ్రికి కృతజ్ఞతలు తెలియజేసిందట.
నాగరాజగారి వ్యక్తిత్వంలో ప్రత్యేకత వారి కృతజ్ఞతాగుణం. నామిని గారింట భోజనాల్ని, వారి శ్రీమతి ప్రభావతిగారి దండిచేయి ఆతిథ్యాన్ని ఎంతో అపురూపంగా పదేపదే స్మరించుకుంటారు. నామినిగారు నాగరాజగారి పట్ల గల అవ్యాజమైన ప్రేమాభిమానాలతో మిట్టూరోడి సమగ్ర సాహిత్యం పుస్తకాన్ని వారికే అంకితమివ్వడం వారి స్నేహానికి నిదర్శనం. ఆ పుస్తకాన్ని అంకితమిస్తూ ‘‘డెబ్బయిలలోకి అడుగిడుతున్న ఈ పసి పిలగాడికి, ఇతగాడి గుణానికి అంటూ కితాబివ్వడం నాగరాజ గారికి జీవన సాఫల్య పురస్కారం ఇచ్చినట్లే. మిత్రుడు వాకా ప్రసాద్ సాయానికి మురిసిపోయిన నాగరాజగారు ప్రసాద్ వల్ల తనకు కొడుకులేని లోటు తీరిందని చెప్పుకున్నారు.
పలు పుస్తకాలను ప్రచురించి, ఎన్నో ప్రపంచ ప్రఖ్యాత కథా సంకలనాల్ని వెంటబడి, వెంటబడి మిత్రులతో ప్రచురింపచేసి ఆ పుస్తకాలను సైకిల్‌కు కట్టుకుని స్కూల్ పిల్లలకు పంచిన నాగరాజగారు అసలు సిసలైన సరస్వతీసేవకులు, తెలుగు భాషా ప్రేమికులు. వారి చేతుల మీదుగా వచ్చిన ప్రతి పుస్తకం వారన్నట్లు చేతవెన్న ముద్ద చెంగల్వపూదండే. మహాకవి శ్రీశ్రీ సైతం వారి చిత్తశుద్ధిని ప్రశంసిస్తూ ‘వారి సామాజిక చైతన్యం, ఉత్సాహం గొప్ప కవిత్వాంశం’ అనడం విశేషం. వారి సేవలను బాపు, రమణలతో పాటు సాహితీ ప్రియులు భూమన కరుణాకరరెడ్డి, దుర్గాప్రసాద్, కోట పురుషోత్తం వంటి తిరుపతి ప్రముఖులు మెచ్చుకుని, చేయూతనివ్వడం వారికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించిందట.
పుస్తక ప్రేమ అనే మంచి వ్యసనంతో తన రిటైర్మెంట్ సొమ్మునంతా పోగొట్టుకున్న సత్తెకాలపు మనిషి నాగరాజగారు. వారి అమితమైన కధాభిమానం చదివినప్పుడు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జీవిత సంఘటనొకటి గుర్తుకొచ్చింది. ఒక రోజు ఐన్‌స్టీన్ గారి సభానంతరం ఒకామె తన పదేళ్ల కొడుకుతో ఐన్‌స్టీన్ వద్దకు వచ్చి ‘‘మా అబ్బాయి తెలివైన వాడు కావాలంటే ఏమి చేయాలి?’’ అని అడిగిందట. ఐన్స్టీన్గారు ‘‘మీ వాడికి కథలు చెప్పండి’’ అని చెప్తే ఆమె ‘‘అలా కాదు మీలా గొప్ప తెలివైన వాడు కావాలంటే ఇంకా ఏమి చేయాలి?’’ అని అడిగిందట. ‘‘ఏముంది, వాడికి మరిన్ని కథలు చెప్పండి’’ అని నవ్వేసాడట. కధల ప్రాధాన్యత, వ్యక్తులపై వాటి ప్రభావం ఐన్‌స్టీన్ గారి తరువాత మా నాగరాజన్నకే తెలియడం వల్ల నేమో కధలంటే చెవితో పాటు, కాలు చెయ్యి కోసేసుకునైనా పుంఖానుపుంఖాలుగా అచ్చు వేయించి వాటిని పంచే పనిని ఉద్యమంలా నిర్వహించాడు. కధల్ని సాకడంలో, సేకరించడంలో, పంచడంలో సాకంగారి తపన, కృషి నిరుపమానం. ఆచార్య ఎన్.గోపిగారు, ‘కవిత్వమంటే ఇష్టమే కాని మనిషికంటే కాదు’ అంటారు. నాగరాజగారు ‘మనిషంటే ఇష్టమేకాని, పుస్తకమంత కాదు’ అంటారేమో!
కథలు వినడంలో, చెప్పడంలో నామిని గారన్నట్లు ‘పసి పిలగాడు’ నాగరాజగారి సదా బాలకత్వం చూస్తే ఆచార్య రజనీష్ జీవితానందం ‘once again be a child’ గా ఉండటం వల్లనే అనే మాట నిజమే అనిపించక మానదు.
తన పొరపాట్లను, తప్పులను, ఆల్కహాలిజాన్ని నిజాయితీగా వొప్పేసుకుని పశ్చాత్తాపం చెంది మంచి భర్తగా అనారోగ్యంతో ఉన్న ధర్మపత్ని శశిగారిని ఎంతో శ్రద్ధగా కంటికి రెప్పలా చూసుకుంటున్న వారు ధన్యులు. వారి ధర్మపత్ని అనారోగ్యానికి వ్యధ చెందుతూ ఆమెకంటే చాలా పిన్న వయస్కులైన మరో ఇద్దరు పేషంట్లను తలుచుకుని ‘సాత్విక్, రోహిత్‌ల ముందు మా శశిది చిన్నగీత’ అని నిబాయించుకుంటారు.
వాస్తవానికి వారి జీవితం నల్లేరు మీద బండేమీ కాదు. పల్లేరు మీద నడకే. జీవితం పట్ల వారికున్న సంతృప్తి, కృతజ్ఞతా గుణం, సేవా తత్పరత వారి కష్టాల్ని మైమరపించి పల్లేరు నడకను నల్లేరు మీద బండి చేసేసింది.
అతి సామాన్య ఉపాధ్యాయుడిగా అసమానమైన భాషా సేవల్ని అందించిన, అందిస్తున్న నాగరాజుగారి జీవితం కొందరికైనా స్ఫూర్తినివ్వాలి.
సాకం గారి జీవితచరిత్ర చదవడం పూర్తి చేస్తుంటే సత్యం శంకరమంచి గారి అమరావతి కథల్లో ఒక రోజెళ్ళి పోయింది కథలో
“పిచ్చయ్య గారు ఏవీ సాధించడమే. తగాదాలు తీర్చలేదు.
సమస్యలు చర్చించలేదు. కానీ కాలానికి తెలియకుండా కాలంలో కలిసిపోయి బతికాడు.
అది చాలదా! చాలడం లేదు చాలా మందికి“ అనే ముగింపు మాటలు మదిలో మెదిలాయి. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఇన్ని సత్కార్యాలను చేసి త్వరలో వజ్రోత్సవం జరుపుకోనున్న వారి సేవలను మయోపిక్ ప్రభుత్వాలు గుర్తించకపోవడం సర్వసాధారణమే. Governments polish the pebbles and ignore the Gems అన్న నానుడి లోక విదితమే.
అటువంటి సన్మిత్రుల సాన్నిహిత్యం ఆలస్యంగానైనా నాకు దొరకడం ‘‘దొరకునా ఇటువంటి సేవ’’ పాడుకోడానికే మో!

good way of knowing a meaningful life