
ఈ లోకంలో మాట్లాడ్డం వచ్చిన వాళ్ళు వందలకోట్లలో ఉన్నా సరిగ్గా మాట్లాడ్డం వచ్చిన వాళ్ళు కొన్ని వేలకు మించరు. మీ నాన్నగారున్నారా? మీ బాబున్నాడా? మీ అమ్మ మొగుడున్నాడా? అని అడగడంలో ఎన్ని షేడ్సో చూడండి. పై ప్రశ్నలు విన్నవాళ్ళకు ప్రశ్నప్రశ్నకు పదిపాయింట్లు బి.పి.పెరగడమో, ఎడ్రినాలిన్ భారీగా పంప్ అవ్వడమో ఖాయం. ఆ ప్రశ్నా విధానం అట్టిది మరి. అందుకనే మనవాళ్ళు ‘అమ్మా అనబోయి వొసే’ అనొద్దంటారు. వాస్తవానికి మనం ధరించే డ్రస్సులు, అభరణాలు మనకు భూషణాలు కావు. మన పెద్దలు ‘వాగ్భూషణం’ అనడం అందువల్లనే. మనమాటే మన వ్యక్తిత్వాన్ని, మనస్తత్తాన్ని, ఆలోచనలను ప్రతిబింబిస్తుంది, పట్టిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత ఊరికే రాలేదు.
ఆ మధ్య ఒక రిటైరై ఎనభైల్లో ఉన్నాయనతో కూర్చున్నాం. కేవలం మాటకలపడానికి ఏ(దురు) ఉద్దేశ్యం లేకుండా ‘‘మీరు మీ చిన్నబ్బాయితో ఉంటున్నారా?’’ అని అడిగా. ఆయన చిరుకోపంతో, కాస్త అసహనంతో, గంభీరంగా ‘‘లేదు మా అబ్బాయే నాతో ఉంటున్నాడు. ఈ ఇల్లు నేనే కట్టిచ్చా. నాకు నెలకు లక్షరూపాయలు పైనే పెన్షన్ వస్తుందని’’, ఏకబిగిన ప్రవర చదివేసాడు. వారు రజోగుణ సంపన్నులని గ్రహించి మంచినీళ్ళు తాగి వాళ్ళబ్బాయి వచ్చే వరకు మారుమాట్లాడక పేపరు తిరగేస్తున్నట్లు నటిస్తూ కూర్చున్నా. గవర్నమెన్ట్ ఉన్నతాధికారులుగా, పోలీసు సూపర్‌బాస్‌లుగా పనిచేసినవారిలో కొంతమందిని కలిసినప్పుడు సుధాకరో, సుబ్బారావో మీకు తెలుసా అని అడిగితే ఆయన ఆంగ్లంలో అధికార దర్పంతో ‘Yes he worked under me’ నా కింద (వేలు నేలకు చూపిస్తూ మరీ) పనిచేసాడు అని చెప్తారు. ఎవరైనా ఎవరి కింద ఎలా పనిచేస్తారో! మేము కలిసి పనిచేశాం అనే సత్వగుణ సంపన్నులు కొందరు లేకపోలేదు. వారివారి వ్యక్తిత్వాలు రజో, తామస, సత్త్వ గుణాలు ఇలాంటి చిన్న మాటల్తో (మీకు మంచి ఏంటెన్నా ఉంటే) ఇట్టే గ్రహించేయొచ్చు. అందుకే ‘ఉద్యోగికి దూరభూమిలేదు ప్రియవాదికి శత్రువు లేడు’ అనేది ఏ కాలానికైనా వర్తించే ఆర్యోక్తి.
కొన్నేళ్ళ క్రితం ఎకానమీ క్లాస్‌లో విమానయానం చేసిన ఆంగ్ల భాషాకోవిదుడు. “I came by cattle class” అని నోరుజారి క్లాసులు మీద క్లాసులు పీకించుకున్నాడు. ఆయన ఖర్మకాలి వారి అధినాయకురాలు కూడా అంతకుముందే కాటిల్ క్లాస్‌లో వెళ్ళడంతో ‘‘శశి’’ (కి) గ్రహణం పట్టేసింది. మరో దూకుడు బాబు ‘ఈడినా, బోడినా’ అని ప్రాస వదిలి ప్రయాసలో పడ్డాడు. మన నాలుకే మన ప్రథమ శత్రువంటారు. ఎవరైనా దాని తర్వాతనే. నోరు పారేసుకోవద్దని నోరరిగేలా పెద్దలు పదేపదే చెప్పడం అందుకనే.

ప్రాసగోస
మనం అనుకునేట్లు పెట్రోలు, డీజిల్ , ఎల్.పి.జి మాత్రమే Highly Inflammable కాదు. కొందరి మాటలు కూడా. యజ్ఞ యాగాదుల్లో వెయ్యాల్సిన సమిధల్ని వీరు జనం మధ్యన వేసి తప్పుకుంటారు. లేని పేచీలు సృష్టించే పుల్లారావులు ఫ్రమ్ పుల్లంపేట, పుల్లమ్మలు ఫ్రమ్ పుల్లారెడ్డి పాలెం ఇందులో నిష్ణాతులు. వారొచ్చి వెళ్ళిన ఇంటికి మరో అరగంటలో అగ్నిమాపక దళం రావాల్సిందే. వీరంతా నారదాంశజులే. ఇవన్నీ గ్రహించే గురజాడ వారు కన్యాశుల్కంలో అగ్నిహోత్రావధాన్లు గారిని సార్థక నామధేయులుగా తీర్చిదిద్దారు.
అమెరికాలో 23×23 క్రోమోజోమ్స్ అనే సంస్థ వాళ్ళు ఉమ్మును విశ్లేషించి మీ పూర్వీకులు ఎవరు మీరు ఎక్కడనుంచి వచ్చారో చెప్పేస్తారు. మీకు దగ్గరగా డి.ఎన్.ఎ గల వారెవరో కూడా వారు చెప్పేస్తారు. వీరందరికీ ఎంతో కొంత నాదరమహర్షుల డి.ఎన్.ఎ ఉండి ఉంటుందేమో అనేది నా గట్టి నమ్మకం. ఇలా తంపులు పెట్టే వాళ్ళను మా కాలేజీ రోజుల్లో ధంపీ ధామస్లని, దేవదేవ పరంధామ (మేఘాల్లో వచ్చే నారదుని పసందైన పాట) లని పిలిచేవాళ్ళం. మన టి.వి. ప్యానల్ డిస్కషన్ యాంకర్లు వీరికి చాలా దగ్గరివారు. నలుగుర్ని పిలిచి వాళ్ళను గిల్లి గిచ్చి, వారిని మొరిగించి మొరిగించి అలిపించి వదుల్తారు. అరిచే ‘గో’ స్వాములు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే లాంటి ప్రశ్నలు సంధించి అతిథులు మైక్ పారేసిపోయేంతగా రెచ్చగొడ్తారు.
BK తో ముఖాముఖి వంటి కొన్ని కార్యక్రమాల్లో విజ్ఞులైన యాంకరుడు తన ఎదురుగా నెల్సన్మండేలా, కలామ్‌గారు, దలైలామా, అన్నాహజారే కూర్చున్నా, ‘ఇప్పుడంటే మీరు గొప్పవాళ్ళయ్యారు. మీ స్కూల్ రోజుల్లో అమ్మాయిల జడలు లాగారా, గోడలు దూకారా’ అనే చవకబారు ప్రశ్నలు అడిగి వారిని తమ స్థాయికే దించేయాలనుకుంటాడు. వాస్తవానికి ఇలాంటి ప్రశ్నలన్నీ ట్రంప్ దొరకో, పుతిన్ బాబుకో, కిమ్జాంగోకో నప్పుతాయి. కొందరు యాంకర్లకు ఇంగితజ్ఞానం ఇంగువంతైనే ఉండకపోగా అజ్ఞానహంకారాలు కొండంత.
మాటతో మన్నన పొందవచ్చు లేదా మన మర్యాద పోగొట్టుకోవచ్చు. మనం రైతు బజార్లో కూరలు బేరమాడబోతే ఉత్తముడైతే ‘గిట్టదు బాబు’అంటాడు. మధ్యముడైతే ఇవ్వనని చెప్పకుండా ‘నడువ్నడువ్’అంటాడు. మనం వాళ్ళను మరీ విసిగిస్తే ‘పెద్ద కొనేవాడొచ్చాడయ్యా’ అని కసిరేస్తాడు. ఈ మాట తీరు ప్రాంతాన్ని బట్టి, నీళ్ళను బట్టికూడా మారుతుందేమో. మా బావ రాధాకృష్ణమూర్తి గోదావరి, కృష్ణ నీళ్ళ ప్రభావం గురించి ఒక జోక్ చెప్పేవాడు. శబరిమలయాత్ర ముగించుకుని పంబానదిలో మునిగిన గోదావరి ప్రాంత అయ్యప్పస్వాములు ఒకరి చేతులు ఒకరికి పొరపాటున తగిలితే ‘‘దెబ్బకాని గట్టిగా తాకేసిందా? క్షమించండి బాబాయ్య’’ అంటారట. అదే కృష్ణ నీరు తాగినోళ్ళు ‘ఏంటీ చెయ్యి తగిలిస్తున్నావ్! బలిసిందా, ‘మాల’ఉంచి చూసుకుందామా ‘మాల’తీసి చూసుకుందామా?’ అని కోడిపుంజుల్లా కాలు దువ్వుతారట.

మరి కొంతమంది వాక్చాతుర్యులు పెళ్ళికిపోయి పెళ్ళికొడుకు ఎదుటే వాళ్ళ మామగార్ని పట్టుకుని మొత్తానికి అల్లుడ్ని చవకలో కొట్టేసావనో, లవ్ మ్యారేజి చేసుకున్న పెళ్ళి కూతురుతో ప్రేమించడానికి ఇంతకంటే నవ మన్మధుడు దొరకలేదా అని డయాస్ మీదే అనేస్తారు. వీరు నోటి దూల వరప్రసాదరావులు. (NDVP’ లు). మేము ఇంటర్ చదివే రోజుల్లో మాకు NDV Prasad ఇంగ్లీషు గ్రామర్ పుస్తకం ఉండేది. వీరంతా అది బాగా చదివేసిన బాపతన్నమాట.
ఇంకొందరు హాస్పిటల్లో పేషంటును చూడ్డానికి పోయి ఆయన బంధువులతో ‘ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, డాక్టర్స్ అంతా మాయా, మోసం. మొన్న మా బంధువొకాయనకు అరవై లక్షల ఫీజు అయ్యింది, కాని ఆయన అట్నించి అటే పోయాడు’ అనేస్తారు. శుభం పలకరా మంచెన్న అంటే పెళ్ళికూతురు ముండ యాడ అనో, అక్క ఆరాటమే కానీ బావ బతకడు అనేసే రకాలు మరికొందరు. ఇలాంటి సుమధుర భాషణులు పలకరింపుకు రాకపోతేనే మేలు.
చిన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు రేపల్లెలో చదువుకునేప్పుడు ఒకరోజు ప్రొద్దున్నే పాలు పోయించుకురమ్మంటే వెళ్ళా. అక్కడ నాలాగే మరికొందరు బాలకార్మికులు అదే పనిమీద వచ్చారు. పాలుపితుకుతున్న గేదె పెద్దకొమ్ములతో గుమ్మానికి ఆవల చిన్న పాకలో ఉంది. నా ప్రక్కనున్న యక్షుడు ‘‘అన్నా గేదె కొమ్ములు అంత పెద్దగా ఉన్నాయి తలుపు ఇంత చిన్నగా ఉంది గేదె చచ్చిపోతే బయటకు ఎలా తెస్తారు?’’ అని అడగడం… వాళ్ళు కర్రతో వాడి వెంట పడటం, వాడు చెంబెత్తుకుని లగెత్తడం చిటికెలో జరిగిపోయాయి. మా వాడి సందేహం సహేతుకమే గానీ, టైమింగే రాంగ్.
OUR TONGUE IS LIKE A LOADED GUN
THAT WE ALWAYS CARRY
WITHIN US

మాటలే తూటాలు
మ్యాచ్ ఫిక్సర్లు పెళ్ళిళ్ళు కుదిర్చే ఆరాటంలో ‘‘వాళ్ళకు ఇద్దరూ అమ్మాయిలే, 100 Cr ప్రాపర్టీ తదనంతరం మీకే అని సాఫ్ట్ వెర్షన్లో ఆశపెడతారు. మరి అత్యుత్సాహవంతులైన ఫిక్సర్లు ‘ఒక్కటే అమ్మాయి 50 Cr ప్రాపర్టీ తండ్రికి హార్ట్ ప్రాబ్లమ్, తల్లికి క్యాన్సర్ (చేతకాని ప్రభుత్వాల వేచి చూచే ధోరణి అనే అరిగిపోయిన రికార్డును ఎరువు తెచ్చుకుని) మహా అంటే మరో ఐదేళ్ళు కాస్త ఓపిక పట్టండని భరోసా ఇచ్చేస్తారు. ఒకవేళ హామీ ఇచ్చిన్నట్లు వారు నిష్క్రమించకపోతే మన తెలుగు సీరియళ్ళ సౌజన్యంతో మేటర్ వేగవంతం చేయడానికి బోలెడన్ని ప్రత్యామ్నాయాలు ఉండనే ఉన్నాయి అని వారి ధీమా. 100 Cr, 50 Cr అంటే తెలియని నా బోటి బైతుకు Crores – కోట్లు అని వారు కనువిప్పు కలిగించారు.
తెలివిగా మాట్లాడకపోతే ఏమౌతుందో ఒకసారి లైవ్ డెమోనే అయ్యింది. ఒకరోజు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారి మిత్రునితో కూర్చున్నా. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా టూవీలర్‌తో పట్టుబడ్డ యువకుడ్ని ఎవరో సిఫారస్‌తో ఆయన ముందు ప్రవేశపెట్టారు. ‘లైసెన్స్ లేకుండా బండి నడపడం నేరం. ఇంకెప్పుడూ ఇలాంటి పనిచేయకు’, అని మందలించి బండి ఇచ్చేయమని ఆయన తన పి.ఎ.కి చెప్పాడు. వాడు థాంక్స్ చెప్పి పోయేవాడు. పోకుండా, ‘నాలుగేళ్ళ నుంచి బండి నడుపుతున్నాను అంకుల్ ఇంతవరకు ఎవ్వరూ లైసెన్స్ ఏ రోజూ అడగలేదని’ ఘనత చాటాడు. మిత్రుడు బెల్లుకొట్టి పి.ఎ.ని పిలిచి ‘వీడికి నాలుగు నెలల వరకు ఎవరు చెప్పినా, చివరకు నేను చెప్పినాసరే చచ్చినా బండి వెనక్కి ఇవ్వద్దు ’ అని హెచ్చరించాడు.
మరొక లైవ్ డెమోలో ఆదాయపన్ను అధికారి భార్యగా ఉన్న కలవారి కోడలు కలికి కామాక్షిని వాళ్ళ అత్తగారు డైమండ్ చెవిపోగులు కొనుక్కుంటాను కాస్త డిస్కౌంట్ ఇప్పించమని అడిగింది. ‘తప్పకుండా అత్తమ్మా మీరు పోయిన తరువాత అవి నాకే ఇస్తానంటేనే’, అని (కండీషన్స్ అప్లై) షరతులు వర్తిస్తాయి అని పని పూర్తి చేసి వేచి చూస్తోంది. ‘I often regret my speech but never my silence’ అనేది తెలుసుకుంటే బోలెడన్ని వాదనలు, వేదనలు పుట్టవు.

ఒక చిరు ప్రభుత్వోద్యోగి అయ్యగారి మీద అతిగౌరవంతో ‘‘మన పిల్లల్ని ఏ స్కూల్లో చేరుస్తున్నారు సార్’’ అని అడిగి చింతపల్లి ఫారెస్ట్‌కు ట్రాన్సఫరయ్యాడు. ఇదే తోవలో చదువుమీద సరిగ్గా శ్రద్ధ పెట్టని కొడుకుని ఊళ్ళోకొచ్చిన స్వామీజీ దగ్గరకు తీసుకెళ్ళి ఏదైనా రెమెడీ చెప్పమని తల్లి అడిగింది. స్వామి ఆలోచిస్తుండగా ‘‘పోనీ మీతో పంపించేస్తా సన్యాసిగా అయినా మీతో బతికేస్తాడు’’, అనడంతో తేరుకున్న స్వామీజీ ‘‘సన్యాసం అంటే అంత తేలికైపోయిందామ్మా?’’ అని దు:ఖించాడు. స్కూల్లో చదివే మరో పిల్లవాడికి పైక్లాస్లోకి ప్రమోట్ అవ్వడానికి స్కోర్ తగ్గింది. పిల్లవాడి మాతృమూర్తి ఇంటర్నల్స్‌లో మార్కులు వేయమని సదరు మాస్టారును బతిమలాడటానికి పోయి, ‘‘ఏమిటో మాస్టారూ వీడు సరిగ్గా చదవకపోవడం కాదు గానీ అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సొస్తోంది’’ అనడంతో మాస్టారు పిచ్చి చూపులు చూసాడు.
గతంలో మా ఇంటికి నన్ను కలవడానికి ఒకాయన వచ్చారు. మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్‌లో రమణ మహర్షి పటాన్ని చూసి ‘ఆయన మీ తాతగారా సార్’ అని అడిగాడు. మా తాతగారు తెలియనందుకు నేను చింతించలేదు కానీ ఆయన అలా అడగ్గానే “It is better to shut your month than open and confirm you are a fool” అన్నమాట గుర్తొచ్చి నవ్వుకున్నా. మాటలే మన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. మాటల వల్లే మానవ సంబంధాలు బలపడతాయి. మాటల వల్లే బాంధవ్యాలు తెగిపోతాయి. అందుకే మాటలు మృదువుగా, కోమలంగా ఉండాలి. ఇటీవల వచ్చిన ‘బలగం’ సినిమా ఇచ్చిన సందేశం ఇదే.

మితభాషిణులు
ఏమైనా ఎదుటి వారు నొచ్చుకోని విధంగా, వారిని ఆకట్టుకునేవిధంగా మాట్లాడటం గొప్పకళే. మన పురాణేతిహాసాల్లో విదురుడు, హనుమంతుడు, విభీషణుడు, శ్రీరాముడు, ధర్మరాజులు ఇందుకు ఆదర్శపురుషులు. శల్యుడు, దుర్యోధనుడు, శిశుపాలుడు, శకుని మామ బ్యాడ్ రోల్‌మోడల్స్. కురుక్షేత్రయుద్ధంలో కర్ణునికి సారధ్యం వహించిన శల్యుడు కర్ణుడ్ని తన మాటలతో నిర్వీర్యుడ్ని చేసి ‘శల్య సారధ్యం’ పేటెంటే కొట్టేసాడు.
ఎంతో గొప్ప సంభాషణా చతురుడ్ని అని భ్రమించే ఒక మిత్రుడు నన్ను కలిసినప్పుడల్లా “Let me have the pleasure of your company” అంటే నేను మనసులో “Let me have the pain of your company” అనుకుని హేమరింగ్ సెష్షన్స్కు గేరప్ అవుతాను. ఇదంతా చదివి మీరు ఆ గట్టునున్నారో ఈ గట్టునున్నారో బేరీజు వేసుకోండి. మాట మార్చుకుని మనసులు గెలుచుకోండి.


after long time i read your story felt very much happy….
వ్యాసం బావుంది సర్
Naku arhatha saripodhu Babai garu to comment on your writings..but Beautifully written and Great use of examples to understand your points in better way.
It made everything much more relatable.
Thank you so much Babai garu…mee parichayam Devudu naku ichina goppa varam🙏
Excellent written
చాలామంది మనస్సులో కలిగే భావాలను మరియు వారి వారి అనుభవాలను అక్షర రూపంలో అద్భుతంగా పొందుపరిచినట్లు అనిపించింది సార్. చక్కని సందేశం కూడా. థన్యవాదాలు.
Harsha,
Very good article.Humorous and yet straight forward .Fit to be a subject of “Communication “ for personality development..
🙏🙏🙏
Anna very good narrative lines and very good information how to be with people
Sir It is great work which is very useful in human life to keep up humanity Really a great work from your idealistic brain
భూషలు కావు మర్త్యునికి భూరి మయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్;
భూషలు కావు; పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి; వా
గ్భూషణమే సుభూషణము; భూషణముల్ నశియించునన్నియున్ !!
Bavagaru
Overall, your work is a delightful blend of humor, wisdom, and literary flair, making it a pleasure to read and reflect upon. Their unique voice and perspective are sure to resonate with readers, leaving a lasting impression long after the words have faded from memory.
భూషలు కావు మర్త్యునికి భూరి మయాంగద తార హారముల్;
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు కావు; పూరుషుని భూషితు జేయు పవిత్ర వాణి; వా
గ్భూషణమే సుభూషణము; భూషణముల్ నశియించునన్నియున్ !!
Bavagaru
Overall, your work is a delightful blend of humor, wisdom, and literary flair, making it a pleasure to read and reflect upon. Their unique voice and perspective are sure to resonate with readers, leaving a lasting impression long after the words have faded from memory.
हर्षः सर्वदा नूतनं विषयं गृहीत्वा एकं आख्यानं निर्माति यत् उत्तमं रोचकं च करोति वर्तमानलेखनं तादृशम् एव। कृपया गच्छन्तु अस्मान् बोधयन्तु ।
Bavagaru
Overall, your work is a delightful blend of humor, wisdom, and literary flair, making it a pleasure to read and reflect upon. Their unique voice and perspective are sure to resonate with readers, leaving a lasting impression long after the words have faded from memory.