
సినీ రంగంలో రజతోత్సవం జరుపుకుంటున్న ఆత్మీయుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ టీజర్ చూడగానే మా చిన్నప్పుడు బెల్లం కాసే వాళ్లు పాకం మధ్యలో ఠంగున పళ్ళానికి కొట్టే పిల్లల ఉడుకు బెల్లం తాయిలం అంత ఊరించింది. ఆపుకోలేక మొదటి రోజు మొదటాటకే మా అబ్బాయి తేజ వెంటబడి హాల్లోకి చేరాం.
తెలుగు సినిమా అంటేనే మసాలా ఎక్కువ కూర తక్కువ. ‘కుబేర’ సినిమా గడిచేకొద్ది మసాలా వాసన తగలకపోగా, స్విట్జర్లాండ్, ప్యారిస్ లొకేషన్లు లేవు, కాస్ట్యూమ్స్ ఛేంజ్ పాటల్లేవు, కనీసం ఐటం సాంగూ లేదు. హీరోయిన్ జఘన తలంపై కాంగో డ్రమ్స్ లేవు, హీరోల వరస నరుకుళ్ళు, కొడితే కరెంట్ వైర్లకు తగిలే శివకాశి ఫైర్ వర్క్స్ లేవు. ఇవేమీ లేకపోగా మన్మధుడు, కింగ్ నాగార్జునను డీ గ్లామరస్ గా ఫక్తు ఫ్యామిలీ మ్యాన్ (కనీసం కింగ్ ఫాన్స్ అంటే కించిత్ భయం లేకుండా) స్థాయికి దించేశాడు. ఇది చాలదన్నట్లు గ్లామర్ గర్ల్ రష్మిక ముఖానికి పావుసేరు ఆముదం పామేసి ‘రాజా’ మాయలోపడి లేచిపోయేంతగా మార్చేశాడు. పోన్లే పాపం అని ఓపికతో చూస్తున్నాం కదా అని మరింత స్పీడు పెంచి ఏకంగా బిచ్చగాడినే హీరోని చేసేశాడు. సినిమాలో పావు భాగం గార్బేజ్ గుట్టలో తీయడం, నేషనల్ క్రష్‌ని చెత్తబుట్టలో క్రష్ చేసి దొర్లించడం నిజంగా దుస్సాహాసమే. యాభైల్లో పడ్డ శేఖర్ సినీ రంగంలో ఇరవై ఐదేళ్లు నిండిన సాహస బాలుడే. సామాజిక బాధ్యతను, విలువల్ని మరువని ధీరుడే
వాస్తవానికి ‘కుబేర’ సినిమా కథలో ప్రత్యేకత ఏమీ లేదు. అనునిత్యం మన నిజ జీవితంలో ప్రస్తుతం అన్నీ దేశాల్లో జరుగుతున్నదే. ఒక దేశంలో ఎలానో మస్కా అయితే మరో దేశంలో కంబానీలో, వదానీలో. Just names change, modus operandi same.. రాజకీయ నాయకుల, అధికారుల కృారమైన స్కాములు చెప్పడంలో ఫ్రెష్‌నెస్, సంభాషణల్లో పట్టు శేఖర్ మాత్రమే ఇవ్వగల వేల్యూ ఎడిషన్. సినిమా ఆరంభంలో లక్ష కోట్లకు ఆయిల్ అమ్మే డీల్ క్లైమాక్స్ లో తారుమారైతే చివరకు ఆవు వ్యాసంలా మళ్లీ లక్ష కోట్లు ఇవ్వండి మీకంతా ఇచ్చేస్తాం అని సిద్దప్ప అనడం ‘కనకపు సింహాసనమున శునకమును కూర్చుండ బెట్టిన వెనకటి గుణమేల మాను’ అన్న సుమతీ శతకకారుడ్ని గుర్తు చేస్తుంది.
సినిమాలో బిచ్చగాడి పాత్రలో అత్యంత సహజంగా జీవించిన ధనుష్ (దేవ) పాత్ర నాజీ concentration క్యాంప్ నుంచి బయటపడి ‘జీవితం జీవించడం కోసమే’ అని తన The Meaning of life పుస్తకంలో విక్టర్ ఫ్రాంకెల్ చెప్పిన జీవిత సత్యాన్ని ధ్వనింప చేస్తుంది. దేవ rustic innocence ను చివరి వరకు అలాగే కాపాడుకుని సాటి బిచ్చగాడి అంత్యక్రియలు కట్టెలతో జరగాలనడంలో, నేను చనిపోయిన పర్వాలేదు దేశంలో బిచ్చగాళ్ల జీవితం బాగుపడాలని తాపత్రయపడటంలో అది మరింత హైలైట్ అయ్యింది.
నారాయణ మంత్రం నలుగురికి చెప్తే నరకానికి పోతావన్న గురువు మాటలు లెక్కపెట్టని సమతావాది
శ్రీ రామనుజాచార్యులను దేవాకీ ఆదర్శం చేసిన శేఖర్ కమ్ములకు kudos. బిచ్చగాళ్లకు వేషం మార్చి తీసుకెళ్లినప్పుడు pristine innocence తో ‘మా కిడ్నీలు, వేళ్ళు తీసేసుకుంటారా సార్’ అని అడగడం మన కమర్షియల్ సమాజం సామాన్యులను సైతం ఏ మేరకు కండీషనింగ్ చేసేసిందో తెలుస్తుంది. బిచ్చగాళ్ళను తమ పని అయ్యేవరకు పందెం కోళ్లను జీడిపప్పు పెట్టి మరీ మేపినట్లు వాళ్లకు బిర్యానీలు పెట్టించడం స్వార్థ కారుణ్యమే. నాగరికత వెర్రితలలు వేస్తున్న ఈ కాలంలో ఆగర్భ శ్రీమంతుల అద్దె గర్భాలు మోసే గర్భ దరిద్రులను (వారు మోస్తున్న రిచ్‌కిడ్స్ డెలివేరి అయ్యే వరకు) అపురూపంగా చూసుకోవడం స్వలాభం కోసమే.
CBI ఆఫీసర్ దీపక్ పాత్రగమనం చూస్తే గోపీచంద్ రాసిన ప్రఖ్యాత నవల అసమర్ధుని జీవ యాత్రలోని మొదటి వాక్యమే గుర్తొస్తుంది. ‘’సీతారామారావు జీవితం విచిత్రమైంది. ఉన్నత శిఖరాగ్రం నుంచి స్వచ్ఛమైన జలంతో భూమి మీద పడి, మలినాన్ని కలుపుకొని, మురికి కూపంలోకి ప్రవహించే సెలయేటిని జ్ఞప్తికి తెస్తుంది.’’ నిజాయితీ పరుడైన దీపక్ జైలు పాలై వ్యవస్థ మీద నమ్మకం పోయి నిస్సహాయతతో బలహీన క్షణాన తప్పుదారి పడతాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత తన తప్పు సరిదిద్దుకోవాలనుకుంటాడు. దీపక్ మానసిక సంఘర్షణలో చివరకు మానవత్వం, మంచితనమే జయిస్తుంది. If you move away from your true Self, you will suffer more అనే వాస్తవానికి దీపక్ పరివర్తనే కారణం. ఇటువంటి పాత్రను నాగార్జున అంగీకరించి మెప్పించడం గొప్పే. వీల్ ఛైర్‌కు పరిమితమైపోయిన పాత్రకైనా ఊపిరులూదే మరో సాహిసి నాగ్.
సినిమా క్లైమాక్స్ లో దేవాకు చిన్నతనంలో అండగా నిలిచిన ఓబులేసన్నను నేనే అని హామీ ఇచ్చి కాపాడటం పశ్చాత్తాప హృదయంతో తను నమ్ముకున్న వాళ్లకోసం ప్రాణాలు అర్పించేంతగా పరిణితి చెందడమే.
రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా బాగా కుదురుకుంది. దేవా పట్ల పెరుగుతున్న కోపం, అసహనపు షేడ్స్‌ను బాగా పలికించింది. ఇంత క్రైసిస్‌లో హ్యాండ్ ఇచ్చిన ‘రాజా’ ను మరువని సమీర అమాయకపు జీవే. శేఖర్ కమ్ముల మెగాస్టార్ చిరంజీవికి మెగా ఫ్యాన్. అందుకే ‘చూడాలని ఉంది’లో వెర్రిబాగుల సౌందర్య ‘కోడి’ రక్తంతో ప్రేమలేఖ రాసిన తన ప్రియుడు రాజు గురించి చెప్తే… మన శేఖర్ అదే రాజును సమీరకు కొనసాగించారు. దేవాతో ఉండలేక, అతని మానాన అతన్ని వదల్లేక మథనపడటం ఆమె మంచితనమే. సమీర ఓల్డ్ మాంక్ కోడ్ చెప్పి తాళం అడగ్గానే సెక్యూరిటీ వాడు పిచ్చి చూపులు చూడటం, రాజు కోసం కొన్న పెళ్ళి డ్రస్ దేవాకు ఇచ్చేయడం, కుబేరుడు బిచ్చమెత్తుకుంటూ లాఠీ దెబ్బలు తినడం సినిమాలో ట్రాజీ కామెడీలు.
ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడో కాని ‘కుబేర’ విలన్ చాలా గ్లామరస్. వాడి బుద్ధి మాత్రం మమ్ముల్ని అడగొద్దు. సినిమా చూస్తే మీకే అర్దమవుతుంది. వాడికి మనిషి ప్రాణాలంటే నథింగ్. కొంతమంది పోతే dead weight పోయినట్లు దేశానికి బరువు తగ్గుతుంది అని నమ్మే రకం. వాడు ఎలాంటి జాలి, దయ, కరుణ లేని కరుడు కట్టిన క్యాపిటలిస్ట్. పాపం వాళ్ళ నాన్నమాత్రం వింటేజ్ విలన్. తప్పు చేస్తున్నా, కొంత పాప భీతితో, భయంతో, మాటిమాటికీ వెంకన్నకు వజ్రాల కిరీటం లంచంగా బంపర ఆఫర్ ఇవ్వచూపుతాడు.
మంత్రి సిద్ధప్పకు విలన్స్‌తో మాట్లాడేప్పుడు ప్రెస్, మీడియా, రాబోయే ఎలక్షన్లే సమస్య కానీ పోయే ప్రాణాలు, దేశ సంపద మీద ఏ మాత్రం దృష్టి లేదు. విలన్బాబు with more advanced features తో పాపం, పుణ్యం, నరకం, దయ వంటి గుణాలు డిసేబుల్ చేసేసిన వెర్షన్. తండ్రి, కొడుకుల పాత, కొత్త విలనీల కాంట్రాస్ట్ చాలా బాగుంది.
DSP సంగీతం అద్భుతం. గుడిలో అన్నమయ్య కీర్తనలు, బొంబాయి మసీదులో సూఫీ పాటలు, మేడ మీద నుండి దేవా తాడు లేకుండా బంగి జంపింగ్ చేసేప్పుడు ‘నడిపించు నా నావ నడిసంద్రమున దేవా’ క్రైస్తవ కీర్తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సెక్యులర్‌గా వినిపించి వందకి వంద స్కోర్ కొట్టేశాడు. సినీ విశ్వకర్మ తోట తరణి గారు ఇంద్రజాలంతో ఏది గుడో, ఏది సెట్టింగ్ తెలియనంత భ్రమలో పడేసారు. గోడమీద ధర్మో రక్షతి రక్షితః ఆర్యోక్తి బిచ్చగాళ్ళ సంభాషణకు మ్యాచింగ్ బ్యాక్ డ్రాప్.
‘కుబేర’లో శేఖర్ కమ్ముల ప్రతిపాదించిన జీవిత సత్యాలు… దురాశ దుఃఖానికి చేటు, కృతజ్ఞత గొప్ప గుణం. దేవుడికి వజ్రాల కిరీటాలిచ్చినా విలన్లకు వర్కౌట్ అవ్వదు. దీపక్ జీవితం స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ, Be true to yourself to be happy and peaceful. ఇవి చాలవా అండీ కుబేర మంచి సినిమా అనడానికి! నిడివి కాస్త ఎక్కువ అనిపించడం ఒక్కటే నాకు అనిపించిన చిన్న లోపం.
ఆకలి రాజ్యం సినిమాలో కమలహాసన్ తన ఫోటో గార్బేజ్‌లో వెదుక్కుని చెత్తలో దొరికిన చిత్రరత్నం అన్నట్లు కుబేర నిజంగానే చెత్త నుండి మలిచిన చిత్ర రాజమే.
గడ్డం పెంచేసుకుని, ఆరేడు కేజీల బరువు తగ్గి మరీ (అసలే శేఖరులు ఫెదర్ లైట్) సాహసం సేయరా రాకుమారి సిద్దిస్తుందన్నంత intense passion తో ‘కుబేర’ తీస్తే, రాకుమారి సిద్ధించకపోయినా బుద్ధి వికసింప చేసుకునేందుకైనా మనం ఒక చూపు చూస్తే పోలా!

ఈ బ్లాగ్ లో మొదటి సారి ఒక సినిమా రివ్యూ!!. ఇందులో ఏముంది అని మొదటి సారి జూన్ లో చదివినప్పుడు నాకు చాలా విషయాలు తెలిసాయి .
Manam chuse or chese prati vishayam lo manchi padi mandiki cheppali and ah positivity create cheyatam is a magnificient Art. Shekar Kammula sir eppuduu nativity baaga kanipinchela movies chestaru.
Thank you sir for bringing us various life lessons and realizations through this review.
Mee review chadivaka movie tappakunda chudalani vundandi.chala baga rasaru.
ఎంత బాగుందో మీ రివ్యూ.. ఒక్క ముక్కలో నిజం చెప్పాలంటే.. అసలు ఆసినిమాను మీ ఈ రివ్యూనే మొత్తం మింగేసేట్టుందిస్మీ.. ఎంత మీరు అక్షరాల్ని బేరీజువేసి మరీ పరచడంలో కింగైతే మాత్రం మరీ ఇంతలా అసలు సినేమానే అరగుప్పెట్లో ఆరేడుసార్లు ఇముడ్చుకునేంత డామినేషనా? “సినిమా పిచ్చ పీక్స్ లో ఉంది! అదరహో!” అని మీలాంటి పరిణతి చెందిన చేయి తిరిగిన సాటిలేని మేటి రచయితలో, నాలుకను మెలకువగా ఎటువైపైనా (పాజిటివ్ గానేస్మీ) తిప్పగలిగిన సాటిలేని మేటి వక్తలో బలంగా చెబితేనేగానీ, సర్టిఫై చేస్తేనేగానీ తెలుగు హినిమాలు స్ట్రెయిట్ గా చూడగలిగే సాహసం చెయ్యలేని మాలాంటి సగటు తెలుగు సినిమా వీక్షకులకు సైతం కళ్లూరించేరీతీలో మీరు రిసిన ఈ రివ్యూని శేఖర్ కమ్ముల గనగ చూస్తేగీస్తే.. దీన్నిగనక ప్రాపగాండాకు ఆ డైరెట్బ్రరారు అగ్ని (ఆగని) మిస్సైల్లా మలచుకోగలిగితే.. సామిరంగా.. క్లాస్ కాసులవర్షం కురిసినట్టే అంటే నమ్మండి..
ఎప్పటిలాగే “పరిణతి సమ్మిళితమైన ప్రేమతోకూడిన అభినందనలు” మీకు.. నాలుగు మంచి అచ్చరాలు రాసినందుకు..
మల్లాది
మిత్రమా.. హర్షాజీ.
యీ రివ్యూ చదివాక,సినిమా ఎలా చూడాలో అర్థమవుతుంది.ఇంతటి
సినీ పరిజ్ఞానం,దృశ్యాన్ని ఎనలైస్ చేసే
మేధాశక్తి నీకు యిచ్చిన నటరాజు కు
నా కృతజ్ఞతలు…ఇంతటి విస్తృత
రివ్యూ యిప్పుడు చూడలేదు,వినలేదు.
యిక వినము
Adbhuthaha,vishleshaña,àvishkarana!theater loney chùdàlani decided!
Sir, శేఖర్ కమ్ముల ‘కుబేర’పై మీ సమీక్ష – ఓ బిచ్చగాడి బరిలో చిరునవ్వుతో విజయం!
హాస్యం, హృదయాన్ని కలిపిన మీ సమీక్ష, చదవగానే హాల్లోకి పరుగెత్తేలా చేసింది.
మసాలా లేకపోయినా, జీవితానికి మసాలా ఇచ్చేలా చిత్ర విశ్లేషణ సాగింది.
నాగ్ డీగ్లామరైజేషన్ ప్రస్తావనలో మీ తీపి టోన్ చదువరులను అందరినీ ఆకట్టుకుంటుంది.
రష్మిక పాత్రపై మీ కుర్రతన వ్యాఖ్య నిజంగా చిరునవ్వు పుట్టించింది.
ధనుష్ పాత్రను విక్టర్ ఫ్రాంకెల్తో లింక్ చేయడం తెలివైన గమనిక.
సమాజపు లోతుల్లోకి వెళ్లే విధంగా వచనమంతా పొలిటికల్ సాటైర్గా నిలిచింది.
కామెడీ ట్రాజెడీ మిక్స్‌తో శేఖర్ ధైర్యాన్ని ప్రశంసించిన తీరు ముదావహం.
విలన్ల తరం తారతమ్యాన్ని మీ లైన్లో చిత్రీకరించిన తీరు అద్భుతం.
సంగీతం, సెట్టింగ్స్‌కు ఇచ్చిన తీపి గుర్తింపు పాఠకుని భావనా స్థాయిని పెంచుతుంది.
చివరికి – “సినిమా చూసి రివ్యూకన్నా మళ్లీ మీ సమీక్ష చదవాలనిపించింది!” అన్నదే నిజమైన సర్టిఫికేట్ మీ review కి.
మీరు మళ్ళీ మళ్ళీ మంచి సినిమాల రివ్యూల్ ఇలాగే రాస్తూ ఉండాలని నా కోరిక!
True review, this movie welcomes a new horizon for movie making.
Wonderful presentation on Kubera movie. Now I am very anxious to see the movie at the earliest. Keep going chandugaru
శేఖర్ కమ్ముల సినిమాలంటే నాకిష్టం. ఎక్కడ అసభ్యత ఉండదు. నిజానికి హాల్ లో సినిమా చూసి చాల సంవత్సరాలయింది. బుల్లి తెరమీదే సినిమా చూడ్డం.హాపీడేస్, లీడర్ సినిమాలు ఎప్పుడు వచ్చినా పూర్తిగా చూస్తాను.
ఇక మీ విషయం-మీరు వ్యాసం రాస్తున్నట్టు ఉండదు. కథనం రాస్తున్నట్టు ఉంటుంది. ఆ కుశలత మీకు అబ్బింది.
అభినందనలు హర్షవర్ధన్ గారూ!
Share this review with the director of the film and other actors and actresses.
ఇంకా చూడలేదు. కాని ఇప్పుడు చూడాలని ఉన్నది. మీ వివరణ, విశ్లేషణ, బాగున్నాయి. చదువుకొనే రోజులలో వారపత్రికలోప్రచురితమైన విశ్లేషణ చూసి చిత్రం చూచిన రోజులు గుర్తుకొచ్చి నవ్వుకొన్నా . చూద్దాం చూసి మాట్లాడు మాట ఏలా ఉంటుందో .
Nice sir.👏👏👏👏👏👍👍👍
“గర్భ దరిద్రులు” పద ప్రయోగం చాలు మీరేం రాసినా రాయించుకుని చూసి ఆనందిచొచ్చని😀 . ఇక పోతే రివ్యూ చదివాక సినిమా చూడడం మానేసిన మా లాంటి వాళ్ళకి కూడా చూడాలని అనిపిస్తుంది.
సూపర్ సర్ 🙏🏻
“గర్భ దరిద్రం” పద ప్రయోగం చాలు మీరేం రాసినా రాయించుకుని చూసి ఆనందిచొచ్చని😀 . ఇక పోతే రివ్యూ చదివాక సినిమా చూడడం మానేసిన మా లాంటి వాళ్ళకి కూడా చూడాలని అనిపిస్తుంది.
సూపర్ సర్ 🙏🏻
మీ రివ్యూ చాలా పరిశీలనాత్మకంగా ఉంది. ఏదో పడికట్టు పదాలతో ఒకే మూసకు అలవాటుపడిపోయి, కనీసం సినిమా సరిగ్గా చూడకుండా, ఎవరివో అభిప్రాయాలు తనవిగా అందించే చాలామంది సమీక్షలు చదివి విసిగిపోయిన వాళ్ళకి ఒక నిష్పాక్షికమైన సమీక్ష ఇది!
సినిమా చూడదలచుకున్న వారికి ఒక మార్గదర్శి కూడా.
సార్,
రివ్యూ చాలా బాగుంది.
సినిమా చూడాలనిపిస్తే ఓడింది.
హ ర్షవనం లో ఇదొక వైవిధ్యం.
Excellent movie review which compels to make you watch the movie once. Great analysis of the characters shown in the reels.
Brilliant film review, well deserved for a movie making which needs conviction and sustained commitment on the part of the director. We too, who don’t stir out of our routine, watched the movie on the second day. In every frame we find the protagonists and not the actors . Film going has been fruitful after a long time