ఈ మాట నాది కాదు మహాప్రభో సాక్షాత్‌ కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యన్నారాయణగారిదే. పెద్దలు మొహమాట పడి వేయి అన్నారేమో గాని నేటికి పలురంగాల్లో వెర్రి వేయిపడగలకంటే పై చిలుకే. వారికంటే మరో రెండాకులు ఎక్కువే చదివిన షేక్‌స్పియర్‌ వెర్రికీ ఒక విధానం ఉంది అని హేమ్లెట్‌ నాటకంలో సిద్ధాంతీకరించారు

చూడగా చూడగా మన ఇద్దరు పెద్దలు చెప్పిందీ కరెక్టేనండి. ఆహార్య, ఆహారాల్లోని వెర్రే వేయి దాటేసింది. ఆహార్యం అంటే వేషధారణ, డ్రెస్సింగ్‌. మన జీవిత కాలంలోనే వీటిలో ఎన్నో మార్పులు, కూర్పులు చూశాం.
హాలీవుడ్‌ పాత తరం నటుడు యూల్‌బ్రిన్నర్‌ ఒక సినిమాలో గుండుతో నటిస్తే ప్రపంచంలోని వారి ఫ్యాన్స్‌ అందరూ ఆ రోజుల్లోనే తిరుపతి క్రాఫ్‌ చేయించుకున్నారట. బాలీవుడ్‌ హీరో దేవానంద్‌ ప్రతిసినిమాలో మెడకు Scarf చుడితే (కాస్త తెలివొచ్చాక తెలిసిందిలెండి వారి Scarf మెడముడతలను దాచడానికేనని) కుర్రకారంతా ఆ రోజుల్లో Scarf ఫ్యాషనని ఎగబడేవారు. శివునికి నాగాభరణంలా మెడలో Scarf తో గుప్పెటలో పొగ ఊదుతూ ఆకాశం వైపు చూస్తూ దమ్ముకొడితేనే కవి కాదు అనుకునేవారే ఎక్కువ. ఈ సందర్భంలో సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌గా నేను ఉన్నప్పుడు శ్రీ కె.వి.రమణాచారి గారు (IAS) చెప్పిన జోకొకటి గుర్తొస్తుంది. కవిలాంటి వారు 365 రోజులూ రవీంద్రభారతి సభలకు మెడలో మఫ్లరేసుకుని రావడం చూసిన రమణగారు ‘‘హర్షా! మఫ్లర్‌ లేకపోతే వీరిని కవి అనుకోరేమో అని మండుటెండల్లో కూడా మఫ్లర్‌లోనే కవిశేఖరులు మగ్గుతున్నారు పాపం’’ అన్నారు.
స్వాతంత్య్ర పోరాట సమయంలో పాకిస్థాన్‌ నేత జిన్నాగారి శ్రీమతి మద్రాసులో ఒక సభకు నిజమైన చిన్న పామును మెడలో అలంకరించుకుని అది అటుఇటూ కదులుతుంటే సర్ధుతూ కూర్చున్నారని ఆ సభకు వెళ్ళిన ఆచంట జానకిరామ్‌గారు ‘నా స్మృతిపథం’ లో రాశారు. Method in Madness అంటే ఇదేనేమో. అమెరికాలో పిల్లులు, కుక్కలు, కుందేళ్ళతోపాటు ఊసరవెల్లుల్ని, కొండచిలువల్ని, ఉడుములని, తాబేళ్ళని పెంచకుంటారట. అక్కడే ఒకాయన రహస్యంగా తన పెద్ద ఇంట్లో పులుల్ని, సింహాల్ని, ఎలుగుబంటుల్ని, మొసళ్ళను పెంచేవాడట. ఒకానొక రోజు ఆయన బుర్రలో ఏ బుద్ధి పుట్టిందో గేట్లెత్తేసి ఊరి మీద వదిల్తే, వాటన్నింటినీ పట్టుకోవడానికి అటవీ అధికారులు నానాపాట్లు పడ్డారట.
గతంలో బాలీవుడ్‌లో పాత నటుల ప్రాభవం తగ్గి రాజేష్‌ఖన్నా అమితాబ్‌ల శకం మొదలవగానే, మోకాళ్ళు దాటేసిన రాజేష్‌ఖన్నా జుబ్బాలతో పాటు చెవులు కప్పేసే అమితాబ్‌ క్రాఫ్‌లూ పెరిగిపోయాయి. ఈ విషయంలో మా అన్న ఎన్టీఆర్‌, నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్‌బాబులూ ఏమీ తగ్గేదేలేదన్నట్లే ఉండేవారు. ఒక సీజన్లో అన్నగారి కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేసిన బెజవాడ Yax tailors ‘వాలి’ గారు అన్నగారి షర్టు కాలర్లు ఎంతలా పెంచేసారంటే ఒక్క కాలర్‌ గుడ్డతో రెండేళ్ళ పిల్లవాడికి నిక్కరు, చొక్కా కుట్టగా కర్చీఫ్‌ మిగిలేంతగా! అన్నగారు యుగపురుషుడు, అడవి రాముడులో వేసిన ప్యాంట్లు బెల్‌బాటమ్స్‌ కాదు ఎలిఫెంట్‌ బాటమ్స్‌!
‘అవేకళ్ళు’, ‘గూఢచారి 116’ లో నటశేఖర వేసిన Narrow cut Pants చూస్తే, ఇవి కుట్టించి వేసుకోలేదు. వేసుకున్నాకనే కుట్టారు అన్నట్లు ఉండేవి. చిన్నతనంలో మా అన్నలు కొందరు అవి తొడగడానికి పేపర్‌ మీద నుంచి జార్చుకుని (Shoe horn తో Shoes తొడుక్కున్నట్లు) మా సహకారంతో శ్రమించి తొడిగేవారు. అవి పిగలకుండా నడవడం రాంప్‌ మీద క్యాట్‌వాక్‌ లాగానే ఒక art. కొందరు రోడ్లను ఊడ్చే బిగ్‌ బెల్‌బాటమ్స్‌ అడుగులు చిరగకుండా జిప్పులు వేయించేవారు. వీరి కారణంగా మున్సిపాల్టీ స్వీపర్స్‌కు మీరు ఊడ్చేది సగమేగా అని సగం జీతమే ఇచ్చేవారని వినికిడి. ఒకసారి హైదరాబాద్‌ డబల్‌ డెక్కర్‌ బస్‌లున్న రోజుల్లో ఫుట్‌బోర్డు ట్రావెలింగ్‌ చేస్తున్న బెల్‌బాటమ్‌ వీరుడి బాటమ్‌ మీద ఇద్దరు ముగ్గురు నిల్చొని ఉండగా అతడు చూసుకోకుండా రన్నింగ్‌లో బస్‌ దిగబోయి ప్యాంటు చిక్కుకుని బస్‌ ఈడ్చడంతో మోకాళ్ళు మోచేతులు అర్థరూపాయి మందాన డోకించుకున్నాడు.
హెయిర్ స్టైల్ లో క్రాఫుల్లో రకాలు కోకొల్లలు. కూచిపూడి భాగవతుల్లా, పిచ్చిక గూళ్ళలా, జట్కావాలాల్లా, అంటకత్తెరలు, స్పైక్‌లు, పంక్‌లు, పోనీటెయిల్స్‌, మష్రూమ్‌లు, Obama cut, Dhoni cut చివరగా the one and only Great Kalam Saab cut. క్రాఫింగ్‌ కోసం వెళ్ళిన ఒక ఫిలాసఫర్‌ను ‘How do you like to have it’? అని సెలూన్‌ బాయ్‌ అడిగితే, ‘Silently’ అని వాడినోటికి తాళంవేసి ప్రశాంతంగా క్రాఫ్‌ చేయించుకున్నాడట. ఈ క్రాఫ్‌ విషయంలో బాపుగారి కార్టూన్‌ను మించినది మరొకటి లేదు, రాదు.

మీసాలు పెంచడంలోనూ మగమహారాజుల వేషాలు మరెన్నో–నియంత హిట్లర్‌ గారిలా చిన్న ఈగ వాలినట్లో, ఛార్లీ చాప్లిస్‌లా పెద్ద ఈగ వాలినట్లు, రెల్లు దుబ్బుల్లా మూతి కనపడని, కాఫీని మీసాల్తో తాగించే గుబురు మీసం, నల్ల చీమల బారులా సింగిల్‌ లైనర్స్‌, ప్రక్కన కూర్చున్నవాడి ముక్కులో దూరి తుమ్ములు తెప్పించే దేవరమగన్‌, వీరప్పన్‌ మీసాలు, రాళ్ళు కట్టివేలాడదీసిన పొట్లకాయాల్లా, మర్రి ఊడల్లా జాలువారిన క్రికెటర్‌ బ్రిజేష్‌ పటేల్‌ మీసాలు, మరీ విసుగెత్తితే కొత్తగా వేసిన సిమెంట్‌ రోడ్డు, రన్‌వేల్లా హిందీ హీరోల ‘నో’ మీసాలు.

మహాకాళేశ్వరులు

పార్థసారధులు

నాకు తెలిసినంతలో మన దేవుళ్ళలో ఉజ్జయని మహాకాళేశ్వరులు, చైన్నైలోని పార్థసారధులు మాత్రమే మీసధరులు. చెన్నై స్వామికి మీసంతో బాటు ముఖంపై రక్తపు మరకలూ ఉన్నాయి. వార్‌జోన్లో ఫ్రంన్ట్‌లైన్లో రథసారధిగా కావడంతో దేవదేవునికి సైతం Collateral Damage. ఇటీవల ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పోలీసు సోదరుల గెటప్‌, గాంభీర్యాలను ఇనుమడింపజేసేందుకు Moustache Maintenance allowance నెలకు 50 నుండి 250 రూపాయలకు పెంచిందట. ఇకపై మీసాలకు సంపెంగ నూనె కొనుక్కోవడం వారికి ఆసాన్‌.
వంద మంది కొట్టినా చెక్కుచెదరని రింగు క్రాఫింగ్‌తో మన నటభూషణులూ మననేమి నిరాసపరచలేదు. కలెక్షన్‌కింగ్‌ కొన్ని సినిమాల్లో తొడిగిన చొక్కాలు ఫుల్‌స్లీవ్సో, హాఫ్‌స్లీవ్సో తేల్చుకునేలోపు సినిమా అయిపోయేది.
కాస్ట్యూమ్స్‌ విషయంలో మన హీరోయిన్సూ ఏమీ తక్కువ తినలేదు. వాణిశ్రీ బుట్ట జాకెట్లతో మొదలై హైనెక్కులు, లోనెక్కులు, నోనెక్కులు, ఫుల్‌ హాండ్స్‌, స్లీవ్‌లెస్‌లూ. ఇలా భుజాలపై పైకి, కిందకీ నేటికీ నిరంతరంగా షాపింగ్‌మాల్స్ లో లిఫ్ట్ ల్లా జరుగుతూనే ఉన్నాయి. ‘లేచింది నిద్రలేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం’ అని మేడమ్స్‌ మీరేనా త్రీపీస్‌ సూట్లు వేసేది అని కంచిపట్టు చీరల్ని కాదని బొటిక్‌ల పుణ్యాన త్రీపీస్సుల్లోకి వచ్చేశారు. Low cost airlines లో మంచి నీళ్ళు కూడా ఇవ్వనట్లు Low cost airlines సినిమాలో దర్శకులు తమ పొదుపంతా శక్తికొలది హీరోయిన్‌ కాస్ట్యూమ్స్‌ లో చూపించి నిర్మాతలకు ఖర్చు తగ్గించి, ప్రేక్షకులకు వినోదం పంచేందుకు అహర్నిశలూ పోటీపడి శ్రమిస్తున్నారు.
మా చిన్నప్పుడు కంచిపట్టు చీరలు పాతబడితే అమ్మలకు బోల్డు స్టీల్‌ సామానొచ్చేటిది. లెహంగాలను మార్చితే స్టీల్‌ పళ్ళెం కాదు కదా చిన్న స్పూన్‌ కూడా రాదు. అయితే గియితే కళ్ళు తుడుచుకోడానికి కర్చీఫ్‌ అవుతేందేమో? అంతా కలిపి రెండు గజాలు లేని మూడు పీసుల లెహంగాల్ని లక్షలకు కొనలేక ఆడపిల్లల తండ్రులు పీసుపీసై పోతున్నారు. పెళ్ళికో, రిసెఫ్షన్‌కో ఒక్కసారి వేషం కట్టిన ఈ డ్రస్‌లు మళ్ళీవేసుకునే కష్టం పగవాళ్ళకూ రాకూడదండి. ఈ భారీ లెహంగాలను వేసుకోవడం సులువే కాని మోసుకుంటూ తిరగడమే పెద్ద ‘లె’హంగామా! ఈ కాస్ట్యూమ్స్‌ తో వీధిలోకి పోతే మనం ఏ సినిమా సెట్లో నుంచి పారిపోయివచ్చామని కుక్కలు మొరుగుతాయి. పూర్వజన్మలో వీరు మగధీరలో మిత్రవిందలేమో భ్రమవీడక ఈ జన్మలో డిజైనర్‌వేర్లకు ఫిక్సయిపోతున్నారు.
ప్రస్తుతం చిరిగినవి వేసుకుంటే పేదరికం, చింపినవి వేసుకుంటే awesome. అమెరికాలో చిరగని జీన్స్‌ ధర ఇరవై డాలర్లే. ఒక చోట చింపిందైతే వంద, రెండు చోట్ల చింపిందైతే రెండొందలు. అందువల్లనే మన యూత్‌ చింపేసావ్‌ అని పొగిడేసుకుంటారు. మరింత చిత్రంగా ఫుల్‌లెన్త్‌ ప్యాంట్లు అరవై డాలర్లు, అందులో సగం గుడ్డే పట్టే నిక్కర్లూ, బెర్ముడాలూ అరవై డాలర్లే. ఎందుకనో ఎప్పటికీ అర్థం కాని లెక్కే. నేను లెక్కల్లో వీకే అని వొప్పేసుకుంటున్నా.
ఆహార్యాన్ని మించిన మరిన్ని పోకడలు ఆహారంలోనే! చైనా సోదరులు వేల రకాల జీవుల్ని జీర్ణించుకోవాలని ఉబలాట పడటంతో కంటికి కానరాని జీవికాని జీవి ఎందర్నో ఖర్చు రాసేసింది. వైఫై లేని చోటుందేమో కాని కరోనా వైరస్‌ చొరని చోటేలేదు. ఏదో మన టైమ్‌ బాగుండి Vision 2020 కి మించిన దూరదృష్టి గల మన ప్రజానేతలు (వేక్సిన్‌ మాటెలా ఉన్నా) డబ్బాలు, పళ్ళాలు మోగించో, దీపాలు వెలిగించో, పారసిటమాల్‌ మింగించో, బ్లీచింగ్‌ చల్లించో మనల్ని ఆ జీవితో ‘సహజీవనం’ చేయిస్తున్నారు కాబట్టి బతికిపోయాం. లేకపోతే ఈ పాటికి ఎన్నో జీవాత్మలు పరమాత్మలో లీనమై పోయేవే!
ఆహారంలో వెర్రి ముదిరి తినేవాటికి Hot Dogs, Buffalo wings, Dirty Rice తినాల్సొస్తుంది. ఇవి మన భాషలోకి మార్చుకోకుండా తింటేనే గొంతుమింగుడు పడుతుంది. వాళ్ళను చూసి మనమూ వెర్రెక్కిపోయి జామకాయపచ్చళ్ళు, నవరతన్‌ పులావులు వండేశాం. మన సెక్యులరిజమ్‌ చాటిచెప్పేందుకు ఆవకాయ బిర్యాని, పనసకాయ బిర్యానీలను కనిపెట్టేశాం. మన ఉలవచారు బిర్యానీ వంటను మించిన సమైక్యాంధ్ర ప్రతీక లేనేలేదు. మెగాస్టార్‌ స్ఫూర్తితో మన చట్నీస్‌ వారు చిరంజీవి దోసె వేస్తే తమిళ తంబిలు ఖుష్బూ ఇడ్లితో జుగల్‌బందీ చేసేశారు.
తినే ఆహారంతో పాటు తినే హోటళ్ళ పేర్లు వెర్రెక్కించేశారు. ఇటీవల అమెరికాలో మా మనవరాలు రేయ పుట్టినరోజుకు డిస్నీలాండ్‌ వెళితే అక్కడ Polite pig అనే రెస్టారెంట్‌ కనబడింది. కోసి కూరొండుతుంటే ఈ పేరేమిటో పాపం, అయితే గియితే Sorrow pig అని పెట్టాలి! Polite Pig తోపాటు Fainting Goat అనే హోటల్‌ కూడా ఉందని తెలుసుకుని స్పృహ తప్పి పోయినంత పనైంది.

సౌమ్య వరాహకేఫ్‌

మూడు చీపుళ్ళ ఫుడ్‌కోర్ట్‌

బేహోష్‌ బకరాభవన్‌

అక్కడే హేరీపోటర్‌ కథల్లోని Three Broom Sticks Restaurant లో మెనూ అంతా తిరగేసి దిక్కుతోచక నాకు అర్థమైన Corn with cob అనే item తెమ్మంటే ఉడకబెట్టిన మొక్కజొన్న కండె మీద పీచు కప్పి ప్లేటులో వడ్డించి నిజంగానే ‘కండె’ తినిపించాడు.
డిస్నీల్యాండ్‌లో కండె తిన్న షాక్‌ నుండి కోలుకునే లోపు లాస్‌వేగస్‌లో Shaking Crab రెస్టారెంట్‌ చూశాం. ఉడికినంతసేపూ పీత వణుకుతుంది కనుక ఈ పేరు నప్పిందిలే అని సరిపెట్టుకున్నా. ఇంకాస్త ‘ముందుకు’ పోతే Hell’s kitchen అనే బోర్డు. ఎంత ఆలోచించినా అందులో ఏమి వండుతారో వంటపట్టలా. లోనకు వెళ్ళి చూద్దామనుకుని టెంప్ట్‌ అయి, నరకంలో శిక్షలు పడినవాళ్ళనేమైనా… అనుకుని దాటిపోయాం.

పీతకష్టాల కార్నర్‌

నరక బావర్చి

అమెరికా నుండి హైదరాబాద్‌ చేరుకుని ఒకరోజు ఎక్కడికో వెళ్తూ ‘Antera’ అనే హోటల్‌ బోర్డు చూసి దీని అంతేదో తేల్చేద్దామని డిక్షనరీలన్నీ రెండు రోజులు తిరగేసా! నా కష్టం చూస్తున్న మా తేజ ‘కంగారు పడకు నాన్నా ANTERA అంటే Andhra – Telangana – Rayalaseema వంటకాలు అందించే హోటల్‌’, అని వివరణ ఇచ్చాడు. ‘ఓస్‌ ఇంతేనా’ అనుకుని అప్పటి నుండి దానికి పోటీగా కొత్త హోటల్‌ తెరవడానికి ఇన్వెస్టర్స్‌ కోసం వెతుకుతున్నా. మా కొత్త హోటల్‌ పేరు తమిళ వంటల్నీ చేర్చి Antera Thambi అని మీతో చెప్పడం మరిచా. ఇలాగే మనవూరిలో KRITUNGA అనే హోటల్‌ కృష్ణా, తుంగభద్రల పేర్లమీదనే అని తెలుసుకుని మరింత క్యాచీగా ఉండేలా గోదార్నీ జత చేసి GODKRITUNGA అని Launch చెయ్యాలని ఫిక్సయ్యా.
పెళ్ళిళ్ళు చేసుకోవడంలోనూ వెరైటీలు వెర్రిగా పెరిగిపోతున్నాయి. ఆ మధ్య మా ఫ్రెండ్‌ వాళ్ళబ్బాయి పెళ్ళి సంగీత్‌ రిహాసల్స్ ల్లో ‘నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్’ అని పై నుండి రాయి మీద దూకి లిగమెన్ట్‌ తెగ్గొట్టుకుని పెళ్ళి పీటల మీదకు ‘పుష్ప’ స్టైల్ లో నడిచొచ్చాడు. నీళ్ళల్లో డైవింగ్‌ చేస్తూ, ఆకాశంలో డైవింగ్‌ చేస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు.’

మునుగుడు

దూకుడు

పెళ్ళితో ఎటూ మునుగుతాం కదా ముందే మునిగితేనో దూకితే పోయేదేముంది Dude అనుకునేసుకుని పెళ్ళికొడుకులు ఇలాంటి సాహసాలు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్‌ షూట్స్ లో మరెన్నో విచిత్రాలు, రాళ్ళల్లో, కొండల్లో, అడవుల్లో, సమాధుల్లో జరుపుకుంటున్నారు. ఈ మధ్యే చూసిన అరుదైన Pre Wedding Shoot …

బహుశః వధూవరులు బురదలో వికసించే స్వర్ణకమలాలని figurative గానే కాదు literal గానూ కూడా మనం అనుకోడానికే వారి శ్రమంతా. ఇవన్నీ చదివి మీరు వెర్రి వేయి విధమ్ములని నాతో ఏకీభవించగలరని నమ్ముతూ …

12 Replies to “వెర్రి వేయి విధములు”

  1. ఎలిఫెంట్‌ బాటమ్స్‌😂🤣

  2. మీ విషయ పరిజ్ఞానం హాస్యచతురత అద్భుతం సుమండి🙏🏼———-చలం

  3. Anna now a days people are became mad..mad..and they adopted to follow some one …very less people will live as they like…and marriage traditions also keep on changing

  4. చాలా అందమైన వ్యాసం హర్ష. నేను వ్యాసం చదవడం ద్వారా పూర్తిగా ఆనందించాను. అమెరికాలో మీ పర్యటన నిజంగా అద్భుతంగా ఉంది. మీరు మీ వ్యాసంలో అమెరికాలోని హోటళ్ల పేర్లను పొందుపరిచిన విధానం అద్భుతం…

  5. Very lively narrative Sir,True reflection of today’s madness,which is called by names like trend, Gen X . Enjoyed reading it

  6. హర్షా!! మీకు తెలియదేమో విజయవాడలో Second Wife అనే restaurant ఉంది. హా హా!!!

  7. అన్ని పచ్చి నిజాలే అండీ….
    మీరు 100% రియల్….మీరు పెట్టే నూతన ఫుడ్ కోర్టు లో మాకు కూడా భాగస్వామ్యం కలిగించండి……

  8. The method of madness is beautifully narrated with a very aptly examples, enjoyed the reading Sir 😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.