అమెరికా వెళ్ళి వచ్చిన వాళ్ళందరికీ అక్కడవన్నీ నచ్చకపోవచ్చునేమో కానీ Fall season (ఆకులు రాల్చేకాలం) నచ్చలేదంటే మాత్రం వాళ్ళు కాస్త తేడా కేసులే! ముత్యాల ముగ్గు సినిమాలో రావుగోపాల్ రావుగారన్నట్లు బొత్తిగా కలాపోసనలేని మనుషులే. ఫాల్‌ సీజన్‌ ప్రత్యేకతే సుఖమైన వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి. సెప్టెంబర్‌ నెలలో మొదలయ్యే ఫాల్‌ను Autumn అని కూడా అంటారు. అప్పటివరకు ఆకుపచ్చని చెట్లన్నీ ఒక్కసారిగా రోజురోజుకు రంగులు మారిపోవడం ఒక అద్భుతం. ఉన్న పూలన్నీ పోయి ఆకులే పూలుగా అయిపోవడం క్రమక్రమంగా గంట గంటకు మనం చూడొచ్చు. ఇక్కడ ఋతువులన్నీ సకాలంలో సంతరించుకుంటాయి. మన ఋతువులు ప్రస్తుతం మన ఆరు ప్రాచీన కవుల కావ్యవర్ణనల్లో మిగిలిపోయాయి.

మనకు గత కొన్నేళ్లుగా ఋతువులన్నీ పోయి ఎండాకాలం, మండేకాలం, మరీ మండేకాలం (మన మేడమ్స్‌ మాచింగ్‌ బ్లౌజుల్లో Blue, Sky blue, Dark blue, Peacock blue అన్నట్లు) ఎండల్లో వెరైటీస్‌ మాత్రమే. మన దగ్గర ఫాల్‌సీజనంటే జనం పిట్టల్లా రాలే Summer సీజనే. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ‘‘నాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు, నన్ను మనసారా ఏడ్వనీరు’’ అన్నట్లు మాకు వర్షఋతువు లేదు, శరదృతువు లేదు మమ్ము తనువు తీర చెమటోడ్చనిండు అనుకోవాలి. ఒకడు చనిపోయి నరకానికిపోతే అక్కడ నూనెలో వేపుతుంటే చిరునవ్వులు చిందిస్తుంటే చిర్రెత్తిన యమధర్మరాజు చిత్రగుప్తుడి వైపు చేస్తే ఏతావాత ఎంక్వయిరీలో తేలిందేమిటంటే ఆయన బెజవాడ వాస్తవ్యుడట. “బ్లేజ్‌వాడ ఎండలు చూసిన మాకు ఇదొక లెక్కా?” అనడంతో మన ఎండల సెగ నరకానికీ తెలిసొచ్చింది.

సీజన్స్‌ అన్నీ తారుమారు కావడంతో మన కోయిలలు సైతం మళ్ళీ దేవుపల్లి వారు ‘‘తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసిందన్నట్లుగానే’’ తత్తరపడి ప్రతి కోయిల ఎపుడూ కూస్తోంది. మన కోయిలలు ఉగాది కవి సమ్మేళనాలలో మాత్రమే కూస్తున్నాయి, మామిడి కాయలు ఆల్‌సీజన్స్‌లో కాసేస్తున్నాయ్. మన వానా కాలాలూ ఏనాడో పోయాయి, మన వానలన్నీ అల్పపీడనాలు తుఫానులు తెచ్చే హుద్‌హుద్‌లే! చిత్రం ఏమిటంటే మనకు లేని వర్షాకాలం, శీతాకాలాల గురించి అన్ని పేపర్స్‌లో వచ్చే వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు శీర్షిక చదువుతుంటే పుట్టని బిడ్డకు పూసలు గుచ్చడం అనే సామెత ఇలాంటివి చూసే వచ్చుండొచ్చు అనుకోవచ్చు. మా అమ్మమ్మ గారి ఊరు రేపల్లెలో ధనుర్మాసంలో సంక్రాంతికి గంగిరెద్దులోళ్ళు, హరిదాసులు వచ్చేవారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మా కాలనీలో గంగిరెద్దులోళ్ళు అన్ని మాసాల్లో హాజరే!

ఆకులు రాలే కాలంలో ఇక్కడ ఇదంతా వేగంగా పదిరోజుల్లో జరిగిపోతుంది. అన్ని ఆకులు క్రమంగా రంగు, రంగులు మారిపోతాయి. ఆకులు రంగు మారుతుండగానే స్విచ్చేసినట్లు ఆకులు గలగల రాలిపోతాయి. అప్పుడే నేలంతా రంగు రంగుల ఆకులతో తివాచీ అయిపోతుంది. అలనాటి మధురగీతం’’ సడిసేయకోగాలి పాటలో ….

‘‘ఎటిగలగలకే ఎగసిలేచేలే
ఆకుకదలికలకే అదరి చూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే’’

గుర్తొచ్చి అమెరికా ఫాల్‌ గాలికి స్వామి నిదుర చెడకుండా ఉండాలంటే ఇయర్‌ప్లగ్స్‌, సీట్‌బెల్టుతో అన్న గారిని పడుకో పెడితే కానీ కుదరదు. నాలుగేళ్ళ క్రితం వర్జీనియాలో ఆకులన్నీ రాల్చిన చెట్లను చూసి ఒక నాని రాసుకున్నా …

ఇక్కడ ఫాల్‌ సీజన్లో పిల్లల్ని బయటకు పంపి సీజన్‌కు ప్రత్యేకమైన వాటిని చూసి రమ్మని చెప్పి ఆ జాబితా ఇచ్చి మరీ చూసి రమ్మంటారు. పిల్లలు ప్రకృతితో మమేకమవ్వాలనేది అక్కడి పెద్దల ఆకాంక్ష.

అమెరికా, కెనడా దేశాల్లో ఫాల్‌ సీజన్లో మారుతున్న రంగుల ప్రకృతి అందాలను చూసేందుకు వెర్మాంట్‌, వాంకోవర్‌ వంటి ప్రదేశాల్లో ప్రత్యేకంగా టూరిస్ట్‌రైల్‌ ప్యాకేజీలుండటం విశేషం. ఇక్కడ ఫాల్‌సీజనే కాదు సూర్యోదయ, సూర్యాస్తమయాలు చాలా అందంగా, అద్భుతమైన రంగుల్లో కనిపిస్తాయి. మిచిగన్‌ లేక్స్‌ దగ్గర ఒక యువకుడు ఏడాదిపాటు ప్రతిరోజు సూర్యోదయాల్ని తన కెమెరాలో చిత్రీకరించాడని చదివాను. ఇది విన్నప్పుడు మన నగరవాసుల పరిస్థితిని జనార్థన మహర్షి ‘‘ఈ అపార్ట్‌మెంట్స్‌ పుణ్యాన మాకు కనపడాల్సిన సూర్యచంద్రులు కనపడక పోగా, కనపడకూడనివన్నీ కనబడుతున్నాయి’’అని ఒక కవితలో వాపోయాడు. మనకు ఆకాశం చూసే అవకాశం అరుదే, పెళ్ళిలో అరుంధతిని చూసేప్పుడు తప్ప.

అమెరికాలో అన్ని ఋతువుల్లోకి ఫాల్‌ సీజన్లోనే బంగారు రంగు డామినేటింగ్‌గా, ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరో కవి ….

అని ఫాల్‌ను వర్ణించాడు.

అమెరికా ఫాల్‌ ఆకులు బంగారం అనగానే మా పి.వి. సుబ్బారావు సార్‌ ఎప్పుడో చెప్పిన జోక్‌ గుర్తుకొచ్చింది. ఆయన హైదరాబాద్‌లో సి.టి.వో గా పనిచేస్తున్నప్పుడు దసరా సెలవులు ముగిసిన తరువాత ఆఫీసు స్టాఫంతా ఆయన ఆంధ్రప్రాంతపు సహోద్యోగితో రేపు మిమ్ముల్ని ఉదయమే ఆఫీసులో కలిసి బంగారం ఇస్తామ ని చెప్పారట. ఆయన వారి శ్రీమతితో ఈ విషయం చెప్పి ఎంతో హుషారుగా రెండో రోజు ఉదయం ఆఫీసులో కూర్చుని వారి రాకకై ఎదురు చూస్తుంటే ఒకస్టాఫ్‌ మెంబర్‌ లోపలికి రాగానే తలుపేసిరమ్మని కులాసాగా కుర్చీలో కూర్చున్నారట. ఆ వచ్చినతను సార్‌ చేయిపట్టండని జాగ్రత్తగా నాలుగు జమ్మి ఆకు రెమ్మలు విదిల్చి ‘‘బంగారం సార్‌, దీవించండి’’ అనడంతో సార్‌ గారు నీరసించి తలుపులు బార్లా తీసి సాయంకాలానికి కళ్ళు తుడుచుకుంటూ జమ్మిఆకు బంగారం గుట్ట పేర్చుకున్నాడట. ఈ సంఘటన జరిగిన రోజు సాయంత్రం సదరు సార్‌ గారు దారిలో ఆగి మరీ హెల్మెట్‌ కొనుక్కుని ఇంటికి ఎందుకు వెళ్ళారో వారికి నేటికీ వీడని మిస్టరీయే! తెలంగాణలో మన వాళ్ళు దూరదృష్టితో బంగారం అని జమ్మి ఆకుల్ని అన్నందుకు మనకూ బంగారం ఉందిలే అని నిభాయించుకున్నా. తెలుసుకోవాలే గానీ ఎవరికైనా ఆకులే నిజమైన బంగారం.

ఋతువులు, కాలాలన్నీ ప్రకృతి సిద్ధమైనవే కాకుండా ఎంతో తాత్త్వికతనూ బోధిస్తాయి. ప్రత్యేకించి ఫాల్‌సీజన్‌ పరిణితకు, పరిపక్వతకు ప్రతీక. బౌద్దమత మూలస్థంభాలైన మార్పు, అనిత్య (Impermanence) కు కూడా ఫాల్‌ సంకేతమే. రంగులు మారే ఆకులు ప్రకృతి లయకు నిదర్శనాలు. అహోరాత్రులు, సుఖదు:ఖాల వలె వస్తూ పోతుంటాయి అనే ఎరుక, మార్పు ఒక్కటే మార్పులేనిదనే అనే స్థితప్రజ్ఞత కాలాలు మనకు నేర్పుతాయి. రాలిపోయే ఆకులు Let go అనే గుణాన్నీ నేర్పుతాయి. అందుకే ఎవరితోనైనా గొడవపడ్డ తరువాత Just leave it, let go వదిలేయ్ అనడం మనం వింటుంటాం. Leave it literal గా “Leave” it యే!. కాలం అనుకూలించని ఋతువుల్లో పక్షుల వలసలు, ఇతర జీవుల హైబర్నేషన్లు మనకూ వర్తిస్తాయి. అమితపరాక్రమవంతులైన పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేయడం, చక్రవర్తియైన హరిశ్చంద్రుడు కాటికాపరిగా వీరబాహుడికి తనకు తాను అమ్ముడుపోవడం కాలపురుషుని మహిమే.

ఈ ఆర్టికల్‌ ముగించే సమయానికి చెట్ల ఆకులన్నీ రాలిపోయి ఎ.ఎన్‌.ఆర్‌ హిట్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు, వీణ మీద పాట, శాలువతో, చేతిలో సీసాతో, మాసిన గడ్డంతో, ఆత్రేయ గారి మనసు పాట పాడుతూ మోడువారిన చెట్టు కింద నిలబడే చెట్టులా అయిపోయాయి.

మేము బళ్ళో చదువుకునే రోజుల్లో మహాకవి శ్రీశ్రీ గర్జించు రష్యా, గాండ్రించు రష్యా కవితలతో ఉర్రూతలూగిస్తుంటే అవేమీ పట్టని మేము మా పుస్తకాలకు అంగీలు (అట్టలు) లేకపోతే మా అంగీలూడదీసే గురువులంటే భయంభయంగా గడిపేవాళ్ళం. అప్పట్లో రష్యా నుంచి సోవియట్‌ ల్యాండ్‌, అమెరికా నుండి స్పాన్‌, జర్మనీ నుండి GDR Review అనే పత్రికలు వస్తుండటంతో వాటిని ఎలాగోలా చేజిక్కించుకుని మా పుస్తకాలకు అంగీలుగా తొడిగేవాళ్ళం. వాటిల్లో ఎన్నో ఇంగ్లీష్‌ క్యాలెండర్‌ లాంటి అద్భుతమైన ఫాల్‌సీజన్‌ ఫొటోలున్నా మేము గాడిదకేమి తెలుసు గంధం వాసనన్న చందాన వాటన్నింటినీ ఆస్వాదించక ఎడాపెడా చించి అంగీలుగా వాడేసే వాళ్ళం. ఇప్పుడు తలుచుకుంటే ఆ అందాలన్నీ మాకు అడవి కాచిన వెన్నెలలే!

భావి తరాల యువత మాలాగా కాకూడదనీ, మరచిపోయినవారి విషాదాన్ని లేటుగా వచ్చి మరీ గుర్తుచేసే ఓదార్పు యాత్రలా కాకూడదనీన్నూ ఇక్కడి ఆకులన్నీ రాలిపోకముందే ఈ నాలుగు అక్షరాలు రాల్చడం! అమెరికా వచ్చే అవకాశం ఉన్నవారందరూ (మన తెలుగు రాష్ట్రాల్లో ఈ అవకాశం లేనివారు ఎవరండి?) ఒక్క ఫాల్‌ సీజన్లోనైనా అమెరికాలో గడపండి.

Seeing is believing అని మీకే తెలుస్తుంది.

(ఫాల్‌ గురించి రాయాల్సిందే అని నన్ను తొందరపెట్టిన తమ్ముడు డెట్రాయిట్‌ మూర్తికి కృతజ్ఞతలతో …)

14 Replies to “Falling Season”

 1. Dear sir
  Your Harsha VANAM is full of Mother Nature’s beautiful colors
  Your poetic expression added more colors to it
  I need to ruminate your crunchy presentation
  You brought the golden heavens close to our hearts
  We await more and more explorations from you

 2. Sir
  Beautiful narration coupled with excellent photos of fall made us to feel the fall.. Special hing is that while describing about fall season ..you linked that concepts of Fall to real life is really Great.
  2 Quotes summed up everything Sir
  Autumn season shows how beautiful change can be and let certain thongs go for good..which sqaurely applies to our lives also…Excellent linkage of two issues…

 3. కొమ్మ మరియు ఆకు మధ్య ఉన్న జాయింటు బలహీనపడితే, గాలి ఆకును పతనం చేయగా fall season ప్రారంభమవుతుంది.

  మీరు వివిధ కోణాల నుండి ప్రకృతిని తాకారు. పిల్లలు మాత్రమే కాకుండా సందర్శించే తల్లిదండ్రులందరూ బంగారు పతనాన్ని ఆస్వాదించాలి.

  మనకు సీజన్లు లేవని సరిగ్గా చెప్పారు. ప్రతిదీ అన్ని సీజన్లలో అందుబాటులో ఉంటుంది.

  మీ బ్లాగుల్లో నా అనుభవాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ధన్యవాదాలు.

 4. వాటె ఫాల్!!! మనమేమో ఇక్కడ శీత వేళ రానీయకు…శిశిరానికి చోటియ్యకు….అని పాడుకుంటాం. టైమ్ గ్యాప్ లేకుండా టికెట్లు బుక్ చేస్తే చాలా కాస్ట్లీ పడుతుంది గానీ ఆకులు పువ్వులైపోతాయని మీరు వర్ణించిన తీరు చూశాక అమాంతం అక్కడ వాలిపోవాలని పిస్తోంది సర్.

 5. హర్ష గారు,మీరు “falling season ” in America గురించి చాలా చాలా బాగా వర్ణించారు.ప్రకృతి విన్యాసాలను మీ బాషా విన్యాసాలతో బహు బాగా తెలియ చేశారు.ఇది చదివాక నాకు తప్పనిసరిగా అమెరికా లో Falling season experience చెయ్యాలని అనిపించింది.
  ధన్యవాదములు అండి

 6. అమెరికాలో ఆకులు రాల్చే కాలంలో కనువిందు చేసే
  అధ్భుతమైన రంగు రంగుల ఆకుల వర్ణణ చాలా మనోహరంగా ఉంది.
  మన ప్రకృతికి మరియు మానవ జీవితానికి గల సారూప్యాన్ని అంతర్లీనంగా విశదీకరించి
  హాస్యాన్ని పంచినారు.
  కృతజ్ఞతలు సార్.

  1. Excellent Harshavardhsn garu. You just taken us to a different world n let us know what we were missing all along. Nature’s beauty has no parallel. “A thing of beauty is joy forever”
   As you rightly said see n believe the beauty of falling leaves in colours. Great. It was really refreshing n a glimps of different places of US n different contexts of our experiences. Best wishes. Regards. [email protected]

 7. Sir, Thank you for sharing the blog on Fall Season, your write-up is very close to the heart where we can feel the leaves falling in front us while reading the blog.

  I liked the point on the children being sent to experience the fall season, this is how we teach our younger generations to stay connected with the Mother Nature.

  I am great fan of your blogs and eagerly waiting for the next….

 8. హర్షవర్ధన్ గారు ఏ విషయం మీద అయినా చాలా చక్కగా, విపులంగా వ్రాస్తారు. వారి సునిశిత ధ్రృష్టి కి hats off.

  1. హర్షవర్ధన్ గారూ!రవి కాంచనిచో కవి కాంచును. ప్రకృతి అందాలను ఒడిసి పట్టి అందించడంలో మీరు సిద్ధహస్తులు. ఉదహరించడంలో లౌకికం,అదే జమ్మి ఆకులు, వాక్య విన్యాసంలో లౌక్యం కన్పించింది.
   శుభకామనలు.

 9. ప్రకృతిపరముగా మనకు మరియు ఈపశ్చిమదేశాలకు ఉన్న వ్యత్యాసాలు అందులో వున్నటువంటి అందమైన ఇలాంటి రంగులరీతుల గురించి చాల చక్కటి ఉపమానాలను శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మహొన్నత పాటలతో బెజవాడ ఎండలను అలాగే సూర్యదర్శనమేలేని అపార్టుమెంట్లు మధ్య మనము భరించే వేడి గురించిచెబుతూ మధ్యలో రాజమకుటంలో సుతిమెత్తగా రాజసులోచన గారి సుమధుర గానం అలాగే అన్నగారి ప్రస్తావన కలగలిపిన మీకవిత బావుంది సార్.

  1. “మన దగ్గర ఫాల్‌సీజనంటే జనం పిట్టల్లా రాలే Summer సీజనే”😂🤣.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.