మా పెదనాన్న గారి పేరు వంగల సుబ్బారావు అయినా కృష్ణా జిల్లాలోని చల్లపల్లి ప్రాంతాల్లో పోస్టుమాస్టర్ సుబ్బారావు అంటేనే అందరూ గుర్తు పట్టేవారు. మా స్వగ్రామం దివి తాలూకాలో మెరకనపల్లి. కానీ నేను ఏనాడూ ఆ గ్రామం వెళ్ళలేదు. చూడలేదు. మాది సామాన్య రైతు కుటుంబం. పెద్దగా భూమి, ఆస్తులు లేవు. మొదట వలసగా మా కుటుంబాలు చల్లపల్లి చేరాయట. పెదనాన్న గారి తరువాత మానాన్నగారు, తరువాత ఒక చెల్లెలు, తమ్ముడు (పుట్టి పోయినవారు పోగా) మా కుటుంబం.

బాబాయి శ్రీరామచంద్ర రావు, మేనత్త రాజేశ్వరి, పెదనాన్న సుబ్బారావు గారు, నాన్నగారు

మా తాత గారు జానకిరామయ్య గారు సైన్యంలో సిపాయిగా చేరి చిన్న వయస్సులో కుటుంబ భారం మీద పడడంతో పెదనాన్న గారు బిట్స్ పిలానీలో వచ్చిన సీటు వదులుకుని పోస్టల్ డిపార్ట్మెంట్ లో గుమస్తాగా చేరారు. అప్పటినుండి కుటుంబపెద్దగా మా కుటుంబాలకు ఎంతో బాసటగా నిలిచారు. తరువాత కొన్ని సంవత్సరాలకు మా నాన్నగారు శ్రీరామ్మూర్తి గారు బి.ఏ. చదువు మధ్యలోనే ముగించి సబ్ ఇన్స్పెక్టర్ గా 1954లో సెలెక్ట్ అయి, అన్నగారి బాధ్యతలు కొంతవరకు పంచుకొన్నారు.

మా పెదనాన్న గారికి చదువుల పట్ల అమిత ఆసక్తి. సజ్జన సాంగత్యం వలన చిన్నతనం నుండే మంచి సంస్కారం ఆయనకు అలవడింది. చల్లపల్లి అప్పటికే రాజకీయ, సామాజిక స్పృహగల ప్రాంతం కావడం వలన సమకాలీన సమస్యలపై ఆయనకు మంచి అవగాహన ఏర్పడింది. పోస్టాఫిస్ లో పని చేయడం వలన పలురంగాల్లోని వ్యక్తులతో పరిచయంతోపాటు మంచి జర్నల్స్, మ్యాగజైన్స్ చదివే అలవాటు బలపడింది. ఈ పఠనాసక్తి జీవితాంతం వరకు ఆయనను వదలలేదు. ఆయనకు ఎనభై ఏళ్ళు నిండిన తరువాత కూడా నేను ఎప్పుడు ఆయన్ని కలిసినా ‘ఈ పుస్తకాలూ చదివే అలవాటే లేకపోతే నా సమస్యలకు నేను ఏమయిపోయే వాడినోరా’ అనేవారు. ఈ మతాల వెనుక కారణం ఆయనకు వారి డెబ్భై రెండవ ఏటా భార్యావియోగం సంభవించి, ఆ తరువాత ఒకే కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం, ఆ తర్వాత ఆయన చిన్న అల్లుడు అకస్మాత్తుగా చనిపోవడం లాంటి విషాద సంఘటనలే.

ఆయన ఎనిమిది పదులు దాటినా తరువాత కూడా పుస్తకాల దొంతర టేబుల్ పైన పెట్టుకొని, పదే పదే డిక్షనరిని చూసుకుంటూ పెన్సిల్ తో అండర్ లైన్ చేసుకుంటూ, అర్థాలు రాసుకుంటూ గడపటం సర్వసాధారణ దృశ్యం. ఎప్పుడు వారిని కలిసినా ‘ఇల్లు కొన్నావా? జీతం ఎంత? కారు కొన్నావా?’ లాంటి ప్రశ్నలు వేసేవారు కాదు కానీ, ‘ఏ పుస్తకాలూ చదివావు? మొన్న పేపర్ లో శ్రీశ్రీ గారిపై వ్యాసం చదివావా?’ అని అడిగేవారు. న్యూస్ పేపర్ లో వచ్చిన ఆసక్తికరమైన వ్యాసాలు, విషయాలు కత్తిరించి ఒక పుస్తకంలో అంటించి, నేను వెళ్ళినప్పుడు చదివి మరీ వినిపించేవారు.

ఆయన చాలాకాలం కృష్ణా జిల్లాలో పనిచేసి 1970 తరువాత హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ పోస్టాఫీసులో పోస్టుమాస్టర్ గా పనిచేయడంతో ఎంతోమంది ప్రొఫెసర్లతో, వైస్ ఛాన్స్ లర్లతో, విద్యావేత్తలతో కలిగిన పరిచయాలు వారి అభిరుచిని, విద్యాశక్తిని మరింత పెంపొందించాయి. వారి ప్రేరణతో పిల్లల్ని బాగా చదివించి అందర్నీ బాగా స్థిరపరిచేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన తన చిన్ననాటి సంఘటన జ్ఞాపకం వస్తోంది. ఆయన హైస్కూల్లో చదివే రోజుల్లో education is future insurance అని ఎక్కడో చదివారా. ఆ వయస్సుకు ఆ మతాల నిగూడార్థం తెలుసుకోలేపోయారట. ఆ తరువాత కొంత కాలానికి ఉద్యోగం చేస్తున్న తోలి రోజుల్లో వారి బంధువు, మేనత్త వరసైనామె భర్త మరణించిన తరువాత ఆయనకు కనిపించారు. ‘మామ పోయిన తరువాత జీవనం ఎలా కొనసాగిస్తున్నావు అత్తా?’ అని ఆమెను అడిగారట. ‘ఏముంది నాయన ఎనిమిదవ తరగతి వారు చదువుకున్నాగా, పదిమంది పిల్లలకు ప్రైవేట్ చెప్పుకొని బతుకు నెట్టుకొస్తున్నా’ అని చెప్పిందట.

అది విన్న తరువాతే education is future insurance అంటే ఇదేనన్న మాట అని అవగతమయ్యిందని చెప్పేవారు. వారు రిటైరయి పది సంవత్సరాల తరువాత కూడా ఇళ్లలో పనిచేసే పనిమనుషులు పిల్లలకు ఉచితంగా లెక్కలు ట్యూషన్ చెప్పేవారు. మా కుటుంబాల్లో ఏ పిల్లగాడు ఎగ్జామ్ ఫెయిల్ అయినా, ‘ఫీజ్ కట్టడానికి తరువాత తేదీ ఎప్పుడో కనుక్కోండి’ అనేవారు కానీ పిల్లల్ని మితిమీరి శిక్షించడం, మాటలనడం మేము ఎన్నడూ చూడలేదు. ఆయన చూపు ఎప్పుడూ గతంపై కాక భవిష్యత్ వైపే. పిల్లలకు పేర్లు పెట్టడంలో సైతం ఆ రోజుల్లో ఎంతో వినూత్నంగా త్రివేణి, వసుంధర, అరవింద్ కుమార్, అశ్విని కుమార్ అని వారి పిల్లలకు పేర్లు పెట్టారు. ఆ రోజుల్లోనే ఆంధ్ర విశ్వవిద్యాలం వెళ్ళినప్పుడు అక్కడ హాస్టల్స్ కు పెట్టిన అశోకవర్ధన, హర్షవర్ధన పేర్లు స్పూర్తితో వారి మూడో అబ్బాయికి అశోక్ బాబు అని, నాకు హర్షవర్ధన్ అని పేర్లు పెట్టారు. అప్పటికి ఇలాంటి పేర్లు పిల్లలకు పెట్టుకోవడం చాలా అరుదుగా ఉండేది

సుమారు ముప్పై సంవత్సరాల క్రిందటే ఆయన వారి పిల్లలకు కులాంతర వివాహాలు జరిపించిన అభ్యుదయవాది. ఇటీవల వారి పెద్ద మనవడు ఒరిస్సాకు చెందిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు మా వదిన గారు ఆందోళన చెందుతుంటే వారు ‘అమ్మాయి బాగా చదువుకుందా? మంచి సాంప్రదాయ కుటుంబమేనా?’ అని అడిగి ‘అలా అయితే నిరభ్యంతరంగా చేసుకోవచ్చు’ అని ప్రోత్సహించి ఆమెను ఒప్పించి, భువనేశ్వర్ వెళ్లి, దగ్గరుండి మరీ పెళ్లి జరిపించారు. ‘చదువు, సంస్కారాలే ముఖ్యం, మిగిలినవి పెద్దగా పట్టించుకోనవసరం లేదు’ అనేది వారి నమ్మకం.

ఆయన సంప్రదాయాలకు, విలువలకు, స్నేహానికి ఎంతో గౌరవం ఇచ్ఛేవారు. మా తాతగారు జీవించింది నలభై ఏడు సంవత్సరాలైతే, ఆయనకు యాభై ఎనిమిది సంవత్సరాలు. ప్రతి సంవత్సరం పితృకార్యం నిర్వహించిన సంప్రదాయవాది మా పెదనాన్న. అలాగే వారి తల్లికి కూడా క్రమం తప్పకుండ అబ్దికాలు నిర్వహించారు. ఆ రోజుల్లో భోజనం వేళకు ఎవరు ఇంటికి వచ్చినా మా పెద్దమ్మ గారు భోజనం పెట్టకుండా పంపేవారు కాదు. సమకాలీకులైన చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామకృష్ణ బహదూర్ గారితో ఆయనకు ఎక్కువ సాన్నిహిత్యం. ఒకసారి ఎలక్షన్ ప్రచారం సందర్భంగా ఆయన పెదనాన్న గారి ఇంటికి వచ్చినప్పుడు ఒక కుర్చీలో కూర్చున్నారట. ఆ తరువాత ఆ కుర్చీకి వారు రిపేర్ చేయిస్తూ పదిలంగా కాపాడుతూ, చివరి వరకు ‘మా రాజా వారు కూర్చున్న కుర్చీ’ అని అందరకీ గొప్పగా చూపించే వారు. రాజా గారు మా కుటుంబానికి చేసిన సహాయాన్ని వారు జీవితాంతం కృతజ్ఞతతో పదే పదే జ్ఞాపకం చేసుకునేవారు.

స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో ఇంగ్లీష్ వారి ప్యాంటు, షర్ట్ వేసుకోవడం మానేసి జీవితాంతం వారు సాంప్రదాయ దుస్తులైన పంచె, లాల్చి, కండువా మాత్రమే ధరించేవారు. వారి బాల్యమిత్రులైన ప్రగతి ఆర్ట్స్ ప్రింటర్స్ వ్యవస్థాపకులు కీ.శే. పరుచూరి హనుమంతరావు, కావూరి హిల్స్ స్థాపకులు శ్రీ సాంబశివరావు, అభిరుచి ఫుడ్స్ వ్యవస్థాపకులు శ్రీ బలరాంమూర్తి మరియు నిమ్స్ మాజీ డైరెక్టర్ శ్రీ కాకర్ల సుబ్బారావు వంటివారిని ఆయన ఎనభై ఏళ్ల దాటినా తరువాత కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కలిసేవారు.

ఆయన మాటల్లో హాస్యం ఎప్పుడూ తొణికిసలాడుతుండేది. వారికి ఎనిమిది పదుల వయస్సు దాటినా తరువాత ఒకామె ‘తాతగారు మీరు నెయ్యితినడం తగ్గించండి’ అని సలహా ఇస్తే, ‘ఏమిటమ్మా నువ్వు చెప్పేది చచ్చేవాడికి సంధి మంత్రం అన్నట్లు ఇప్పుడు నేను ఏమి తింటే ఏంటి, తినకపోతే ఏంటి ఇంకా ఉండి ఏమి చేయాలి? అందుకని ఇష్టమైనవన్నీ తినాల్సిందే’ అని సమాధానం చెప్పారు. ఆయన సాయంకాలంపూట వారి ఇంటి దగ్గర్లో ఉన్న ఆర్ట్స్ కాలేజీ రైల్వే స్టేషన్ కు వాకింగ్ కు వెళ్లి, స్టేషన్ లోని బెంచీలపై కూర్చొని రోజూ అక్కడికి వచ్చే ఇతర మిత్రులతో కొంత సమయం గడిపి వచ్చేవారు.

చివరి రోజుల్లో నడవలేని స్థితిలో వాకింగ్ కు వెళ్లడం మానేశారు. అప్పుడు నేను ఒకసారి వారిని కలవడానికి వెళ్ళినప్పుడు ‘వాకింగ్ కి వెళ్లలేక పోతున్నానురా! అందుకని చివరగా స్టేషన్ లో కలిసే మిత్రులందరికీ మంచి విందు భోజనం పెట్టి వీడ్కోలు చెబుదామనుకుంటున్నాను’ అన్నారు. వారి చిన్నబ్బాయి వారితో ‘ మీకానవసరపు శ్రమ ఎందుకు వద్దులే’ అని వారించారు. కానీ ఆయన పట్టుదలతో ఏమైనాసరే ఆ విందు కార్యక్రమం డిసెంబర్ ఐదో తేదీన చెయ్యాల్సిందే అని నిర్ణయించేసారు.

ఆ తర్వాత వారు అనుకోకుండా మరణించడం తర్జనభర్జనలు జరిగిన మీదట సరిగ్గా వారు విందుకు నిర్ణయించిన డిసెంబర్ ఐదో తేదీనే వారి పూర్ణ తిధి నిర్వహించి అందరికీ భోజనాలు పెట్టడం జరిగింది. ఆ రోజుకు వారు లేకపోయినా, వారు అనుకున్న రోజున వారు అనుకున్న మాట అమలు జరిపించుకొని మాట నిలబెట్టుకున్నారు. ఈ సంఘటనతో వారి మరణం వారు ముందే ఊహించారేమో అనుకున్నాం.

వారు చాల చిన్న చిన్న కోరికలతో ఎప్పుడూ అల్ప సంతోషిగా కనిపించేవారు. ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ చేతిలో కాఫీ కప్పు అందుకుంటూ ‘థాంక్స్ అమ్మా’ అనకుండా ఉండేవారు కాదు. చాలా చిన్న వయస్సు నుండి బిన్నీ కంపెనీ బట్టలు, బాటా చెప్పులు, మైసూర్ సాండిల్ సబ్బులు మాత్రమే వాడుతూ చాలా హుందాగా ఉండేవారు. ఎప్పుడూ మడత నలగని తెల్ల పంచె లాల్చీలతో, పైకండువాతో ఠీవిగా కనిపించేవారు. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వారు కడవరకు స్థితప్రజ్ఞతతో ఆత్మస్థైర్థ్యంతో నిలిచారు. ఎనభై ఏళ్ల ప్రాయంలో కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆయన అన్నం ఆయనే వండుకుంటూ, మెస్ నుంచి తెప్పించుకున్న కూరలు తింటున్నా ఎవరినీ ఏమీ అనక స్థితిప్రజ్ఞతతో జీవించారు.

ఇంకోసారి నేను వారితో ఉన్నప్పుడు ఒక పద్నాలుగు సంవత్సరాల వయస్సున్న అమ్మాయి ఆయనను చూడడానికి వచ్చి ‘అంకుల్ బాగున్నారా!’ అని అడిగింది. అందుకు ఆయన ‘అంకుల్ ఏమిటి అమ్మాయి! నీ వయసేంటి నా వయసేంటి? పిలిస్తే తాత అని పిలువు, లేకపోతే మానేయ్ ‘ అని కోపగించుకున్నారు. వారి చిన్నతనంలో జరిగిన ఏ సంగతులు చెబుతున్నా ‘మా ధర్మరాజులు మామయ్య, మజ్జిగ మామ్మగారు, అల్లిమ్మత్త, హుస్సేన్ బాబాయ్’ అని అన్ని పేర్లకు వరసలు చేర్చి చెప్పేవారు. అంకుల్, ఆంటీ, మమ్మీ, డాడీల సంస్కృతి అంకురించని రోజులవి. ఇప్పుడంటే చెత్త తీసుకువెళ్ళడానికి వచ్చినవాళ్లు కూడా కాలింగ్ బెల్ కొట్టి ‘చెత్తాంటి’ అనీ, ఇస్త్రీ బట్టలకోసం వచ్చి ‘ఇస్త్రీ అంకుల్’ అని, ఎనభై ఏళ్ళనుండి ఇరవై ఏళ్ల వరకు అంకుల్, ఆంటీ లేబెల్స్ తో పిలిచే ఆధునిక పోకడలకు అలవాటు పడిపోయాం. వారు ఎవరిని పలకరించినా వారి మాటల్లో ఆత్మీయత తొణికిసలాడేది.

ఆయన ఎనభై ఎనిమిది సంవత్సరాలు జీవించి గతించి ఐదు సంవత్సరాలైనప్పటికీ ఆయన స్మృతులు, మాటలు మాకు నిత్యం జ్ఞాపకమొస్తుంటాయి. మా కుటుంబాలలో ఆయన నాటిన చిన్న సరస్వతీ బీజాక్షరం శాఖోపశాఖలై వృక్షంగా విస్తరించింది. ఆయన మనువులు, మనవరాండ్రు ఉన్నత విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించి పలు ఉద్యోగాల్లో స్థిరపడటం వారి దివ్యాశీస్సులతోనే అని విశ్వసిస్తూ వారు గడిపిన ఆదర్శ జీవనం మాకు వెలుగుబాట.

A person can learn anything by
Being simple and humble

– Rigveda

(నవంబర్ 13 పెదనాన్న గారి వర్ధంతికి నివాళులతో)

12 Replies to “పోస్టుమాస్టర్ సుబ్బారావు”

  1. పెద్దలమాట చద్ధన్నం మూట అంటే ఇదేనన్నమాట. చదువు future insurance అన్న ఆయనమాటలో ఎంత విజ్ఞత దాగుంది!!! వారి విద్యాజిజ్ఞాస అనుసరణీయమైంది. తరువాత తరాలకు ప్రేరణ కూడాను👌👍🙏🏼🙏🏼🙏🏼

  2. నేను పెద్ద తాతయ్య గారు అని పిలిచే కీ.శే. శ్రీ వంగల సుబ్బారావు గారు గురించి కొంత మరలా మీనుంచి వినడం చాలా ఆనందంగా ఉంది, వారితో నాకు బాగానే సాన్నిహిత్యం ఉంది, ఆయన మంచి ఛలోక్తులు మాట్లాడేవారు, ఆయనతో సంభాషించేటప్పుడు సమయం తెలిసేది కాదు, వారు ఎక్కడ ఉన్న వారి ఆశీస్సులు మనతో ఉంటాయని నమ్ముతూ, స్మృత్యంజలి 🙏.

  3. Sir, Thank you for sharing the glimpse of your Pedananna garu biography.

    The events are very inspiring to all the age groups and the importance of education is very well written 🙏🙏🙏

  4. Namasthey sir really very heart felt inspiration of the biography of your pedda Nanna Sri Subba Rao garu and remembering of olden days relation ships in villages especially and felt very happy while reading your narration is also very great sir.

  5. అన్నయ్య చదివితే పెద్ద నాన్న తో మాట్లాడినట్లు వుంది.

  6. మిత్రమా.హర్షా…ఏ రోజు నీతో స్నేహబంధం ఏర్పడిందో..ఆరోజు నుండి
    నా జీవితానికి నువ్వు ఓ icon వి.
    ఈ మినీ “అనుభవ కావ్యం” వినే ఈ
    సత్భాగ్యం ఈ రోజు కలిగినందుకు
    చాలా ఆనందపడుతున్నాను..
    సదా నీ సాంగత్యమే నాకు శ్రీరామ రక్ష..

  7. హర్ష సామాన్యమైన జీవిత శైలిలో కూడా కొన్ని విశేషాలు ఉంటాయని వాటిని అనుసరించటం మంచిగా ఉంటుందని మీరు చెప్పిన జీవిత చరిత్ర లో రాశారు.
    మా నాన్న గారి పేరు కూడా సుబ్బారావు గారు వారి జీవనశీలి ఒకసారి గుర్తు చేయించుకుని ఆనందం పొందాను.ధన్యవాదాలు

  8. కీర్తిశేషులు శ్రీ వంగల సుబ్బారావు గారు మూలపురుషులనదగిన మహానుభావులు. జన్మతహః మహోన్నత లక్షణాలను కలిగి, జీవనరీత్య సమెూన్నతంగా బ్రతికి, తమ నుండి తమ కుటుంబంతో పాటు తమ చుట్టూ వున్న వారికి ఆలంబనగా వుండి, ఆచరణీయమైన ఉన్నత జీవన విలువలను వొసంగిన మహనీయుడికి ఆత్మ నమస్కారం!
    అట్టి వారి జీవితామృత విశేషాలను ఇలా తెలుసుకోగలిగి నందులకు మహాద్భాగ్యంగా భావిస్తున్నాను! ధన్యవాదములు!!

  9. కీర్తిశేషులు శ్రీ సుబ్బారావు గారి తో పరిచయం మా గురువుగారైన శ్రీ హర్షవర్ధన్ గారి ద్వారా కలిగింది. వారిది చాలా గొప్ప వ్యక్తిత్వం. నేను కూడా వారి నివాసానికి దగ్గరగా ఉన్నందు వల్ల ఆ మహానుభావుని తరుచుగా కలిసే అద్రుష్టం నాకు కల్గింది. దీపావళి పండుగ సందర్బంగా కూడా వారిని కలిసేవాడిని. వారు చాలా ప్రేమతో మరియు ఆత్మీయతతో నన్ను ఆదరించే వారు. చిరు నవ్వులతో పలకరించి వారి జీవితం లో ఎదురైన అనుభవాలను వివరించే వారు.
    ఆ మధురానుభూతులను ఎప్పటికిని మరువలేను.
    చాలా కృతజ్ఞతలు సార్ 🙏🏻🙏🏻

  10. Highly inspirational life. It is a guiding torch for the people who are struggling to find the way in dark alleys of haze called Life.
    Exceptionally well presented by Sri Harsha garu.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.