సుప్రసిద్ధ ఫ్రెంచి నవలా రచయిత విక్టర్‌ హ్యూగో నవల Les Miserables ఆరంభంలో …….

“Wherever men go in ignorance or despair, wherever children lack a book to learn from or a warm heart, Les Miserables knocks at the door and says: “Open up, I am here for you” అన్న మాటలు అక్షరాలా రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి సాహిత్యానికీ వర్తిస్తాయి. మహాకవి శ్రీశ్రీ ‘కవి’ అంటే కష్టజీవికి అటు ఇటు వుండి కాపలా కాసేవాడని, పతితుల, బాధా సర్పదష్టుల జీవితాలను కవిత్వీకరిస్తే, రావిశాస్త్రిగారు అదే పనిని Prosaic కథలుగా మలిచారు. పద్య గద్య విబేధం తప్ప వారిద్దరిదీ ఒకే బడి ఒకే ఒరవడి. వారిద్దరూ విశాఖ వాసులు కావడం కాకతాళీయమైనా అక్కడున్న సముద్రం మాత్రం వాస్తవం. అందువల్లనేమో వారి కవితలు, కథలు ఎడతెరపి లేని సాగరఘోషలా పాఠకుల మనస్సులో, ఆలోచనల్లో అలజడి సృష్టిస్తూనే ఉంటాయి.

ఎవరైనా చలం గారిని రావిశ్రాస్తిగారి కథలకు ముందుమాట రాయమని అడిగి ఉంటే ఆయన ఎక్కువ శ్రమపడకుండా, నిముషం ఆలోచించకుండా మహాప్రస్థానంకు రాసిన యోగ్యతా పత్రంలోని ‘‘నెత్తురూ, కన్నీళ్లూ తడిపి కొత్త tonic తయారుచేశాడు ఈ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, ఈటెలు, మంటలుగా మార్చటం అతనికే చాతనవును’’ అనే మాటలు cut, copy, paste చేసి ఇచ్చేవారేమో.

ఒక శతాబ్దం ముందు గురజాడ అప్పారావు గారు మామూలు మనుషులను పాత్రల్ని చేసి ఉత్తరాంధ్ర మాండలికానికి పట్టం గడితే రావిశాస్త్రి గారు ఈ శతాబ్దంలో Once more అని వారి కథలతో అదే పని చేశారు. కాకపోతే గురజాడ గారిది విషాద హాస్యం రావిశాస్త్రి గారిది విషాద విషాదం. శాస్త్రిగారు ఒకానొక సందర్భంలో ‘‘పేదలకి, పేదలను పీడించే వారికి మధ్య జరిగే సంఘర్షణలు చిత్రించగలిగేదే నిజమైన సాహిత్యం’’ అన్న మాటలు త్రికరణశుద్దిగా వారి రచనలన్నింటిలో నింపారు. ‘‘నిజాన్ని తెలుసుకోవడం, అందులో మంచి చెడ్డలేవో నిర్ణయించుకోవడం మనుషుల్ని మంచికి మళ్ళించడానికి ప్రయత్నించడం రచయితల కర్తవ్యం’’ అన్న రావిశాస్త్రి గారు తుదివరకు ఏ ఇజానికి లొంగక Humanism వైపే నిలిచారు. అందువల్లనే డాస్టోవిస్కీ “పశువు మనిషంత కళాత్మకంగా కౄరంగా ఉండదు” అన్నమాట వారి కథల్లో ప్రతిబింబచేశారు. విశ్వమానవులుగా ఎదిగిన రచయితలు మాత్రమే విశ్వజనీనమైన ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించగలరు. రావి శాస్త్రిగారు అందులో ప్రథములు, ఉత్తములు.

మాయాబజార్‌ సినిమాలో శకుని మామ ధర్మపీఠం ఎక్కిన కాసేపే నిజాలు మాట్లాడితే రావిశాస్త్రిగారు జీవితాంతం దీనార్తుల తరుపున వకాల్తా పుచ్చుకుని, ధర్మపీఠం మీదే బైఠాయించి తమ రచనలు కొనసాగించారు. అందుకే వారి సాహిత్యం చదివేందుకు పాఠకులకు గుండె నిబ్బరం కావాలి, అంగీకరించడానికి నిజాయితీ కావాలి, ఆచరించడానికి చిత్తశుద్ధి కావాలి. శాస్త్రిగారి కథలు, పాత్రలు సామాన్యుల జీవన పోరాటంలో నుండి పుట్టినవే. ఒకసారి ప్రముఖ కథారచయిత Ruskin Bond ని మీ కథలకు ఇతివృత్తం ఎలా దొరుకుతుందని అడిగితే ఏ రోజు సాయంత్రమైనా రెండు గంటలు రైల్వేస్టేషన్లో కూర్చుంటే నాలుగు కధలకు కావాల్సిన నేపథ్యం దొరికేస్తుందని చెప్పారట. మన శాస్త్రిగారికి కోర్టుకు నడిచివెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, కోర్టు ప్రాంగణంలో బడ్డీ కొట్టుదగ్గర నిలుచున్నప్పుడు తారసపడ్డ బడుగు జీవుల్నే పాత్రలుగా జీవింపజేశారు. వాక్యాన్ని పొదగడంలో ఆలోచనను సంధించడంలో వారిది అనితరసాధ్యమైన ప్రత్యేకశైలి.

పలుసందర్భాల్లో వారి కథల్లోని వివిధ పాత్రలతో వారు చెప్పించిన కొన్ని మాటలు వ్యక్తిత్వ వికాసానికి, మెరుగైన సమాజానికి మహాకావ్యాలు. మచ్చుకి కొన్ని ….
మంచిని రక్షించడానికి అబద్దాలు ఆడొచ్చుగాని చెడ్డని పోషించడానికి అబద్దాలు ఆడకూడదు.

(మూడు కథల బంగారం)

పై వాక్యం చదివిన ఎవరికైనా ధర్మసంస్థాపనార్థం ‘అశ్వత్థామ హతః కుంజరః’ అన్న భారతంలోని మాటలు గుర్తుకు రాకపోవు.
‘‘అవసరాల కోసం రాజులు భగవంతుడ్ని ప్రార్థిస్తారు. ఆ భగవంతుడు ఆ అవసరాలన్నింటికీ వారికి వారి ప్రజల్నే చూపిస్తాడు’’ (వేతన శర్మ)
ఇదే నేటిభారతం. కాకపోతే రాజులు అన్నచోట ‘‘రాజకీయనేతలు’’ అని చదువుకుంటే సరిపోతుంది. నేతల సంపదకు, ఉచిత ప్రజాపధకాలకు ప్రజల అజ్ఞానము, ప్రజాధనమే పెట్టుబడి.

భిక్షాధికారుల మంచితనమే లక్షాధికారుల సెక్యూరిటీ (అగ్గిపుల్ల)ఇది నేటి మన కేపిటలిస్ట్‌ వ్యవస్థ నిజస్వరూపం.
‘‘బ్రిటీష్‌ హయాంలోనిది మన రాజ్యం
కాదనిపించింది. ఇప్పుడూ అలాగే అనిపిస్తోంది
ఈ రాజ్యం ప్రభువులది పోలీసులది’’ (రావిశాస్త్రీయం)

ఈ మాటలు శాస్త్రిగారు ఏభై సంవత్సరాల క్రితం అన్నా అవి మనకు భవిష్యత్‌ వాణే! నేటి బాణే!

అధికారానికి ఉండే ఆకర్షణకి వయస్సుతో నిమిత్తం లేదు (రత్తాలు రాంబాబు)

అరవై దాటిన వాళ్ళు యూత్‌కాంగ్రెస్‌ నాయకులుగా, ఎనభై దాటి లేవడానికి కష్టపడుతున్నవారు సైతం గవర్నర్లుగా పోవడానికి ఆరాటపడటం చూస్తూ రావిశాస్త్రిగారి మాటలతో ఎలా విబేధిస్తాం?

పైన చెప్పుకున్న మాటలన్నీ ఒక ఎత్తు కాని, రావిశాస్త్రిగారు రత్తాలు రాంబాబులో …

‘‘అందరి ఎడలా మంచిగా ఉండగలగడం అక్షరజ్ఞానం కంటే ఎక్కువ’’ అన్న మాట ఒక తులసిదళం. Goodness is Godliness అని చెప్పుకునే మాటలో దైవత్వం మంచితనం కంటే వేరొకటి కాదు అని నమ్మి మంచితనాన్ని, త్రికరణశుద్ధిగా మానవత్వాన్ని మూర్తీభవించే సాహితీకృషి చేసిన రావిశాస్త్రిగారు చిరస్మరణీయులు. విశాఖలో డాల్ఫిన్‌నోస్‌ ఉన్నంతకాలం రాచకొండ వారి సాహిత్యం పాఠకులకు అండగా నిలిచి లైట్‌హౌస్‌లా వెలుగుబాట చూపుతూ ఉంటుంది.


(రాచకొండ విశ్వనాథశాస్త్రిగారి శతజయంతోత్సవ వేడుకల సందర్భాన ఆ మహనీయునికి నివాళులతో)

12 Replies to “రావి శాస్త్రీయం”

  1. Congratulations and Thank Harsha for bringing out the personality if Sri Raavi Sastry garu in a simple language. Simple is,always beautiful.

  2. చాలా చక్కగా శ్రీ రావి శాస్త్రి గారి
    రచనా శైలిని తెలియచేసినారు సార్. కృతజ్ఞతలు 🙏🏻🙏🏻

  3. చాలా బాగా వ్రాసారు సర్. పీడిత తాడిత ప్రజల గుండె చప్పుళ్ళు వినిపించిన రావి శాస్త్రి గారి రచనా వ్యాసంగం గురించి మీదైన శైలి లో చక్కగా వివరించారు. Excellent

  4. రావి శాస్త్రి గారి మహోన్నతవ్యక్తిత్వాన్ని మీదైన ప్రత్యేక తరహాలో ఆవిష్కరించారు సర్ 🙏🏼🙏🏼🙏🏼

  5. Chaala lothu ha, kluptanga raasaru Sir 🙏..

    E rachana “Recursion in Programming ” la undi 🙂 -> వ్యక్త పరిచే అంశాలలో మనుషులు వేరైనా, చుట్టూ కవిత్వం ఉంటుంది.

  6. “భిక్షాధికారుల మంచితనమే లక్షాధికారుల సెక్యూరిటీ (అగ్గిపుల్ల)ఇది నేటి మన కేపిటలిస్ట్‌ వ్యవస్థ నిజస్వరూపం.”

    చాలా కాలం తర్వాత మంచి వాక్యములు
    గుర్తు చేసి నందుకు ధన్యవాదములండి🙏🏻💐🌺
    వారి రచనలు వీలైనంతగా చదువుతాను

  7. శుభోదయం
    కాచిన పాల లో మీగడ తీసి ఇచ్చినట్లు
    రావిశాస్త్రి గారి కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలను మాకు అందించారు.

  8. నమస్కారం.విలువైన సమాచారం మాకు పంచారు.విశాఖపట్నంలో పనిచేసిన వారు కాబట్టి రవి శాస్త్రిగారి నివాసం,ఇతర ప్రదేశాలు కూడా సందర్శించిన వారు మీబ్రతుకు ధాన్యం.మీకు హదయపూర్వక ధన్యవాదములు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.