వెనకటికి తోచీ తోచనమ్మ తోడికోడలు పుట్టింటికెళ్ళిందట. తోచీ తోచని రాజకీయ నాయకుడు తన పార్టీ వాళ్ళనే దుమ్మెత్తి పోసాడట. ప్రస్తుతం అమెరికాలో మా పనీ అలాగే ఉండటంతో గడిచిన ఆదివారం మా ఊరికి దగ్గర్లో ఉన్న లూయిస్‌బర్గ్‌ అనే పల్లెటూళ్లో జరిగే సంతకు పోయాం. ఇక్కడ ప్రతి రాష్ట్రానికీ నిక్‌నేమ్‌ ఉంటుంది. ఫ్లోరిడాను ఆరెంజ్‌ స్టేట్‌ అని, న్యూజెర్సీని గార్డెన్‌ స్టేట్‌ అన్నట్లుగానే కాన్సెస్‌ను సన్‌ఫ్లవర్‌ స్టేట్‌ అని, కార్న్‌ స్టేట్‌ అని అంటారు.

ఈ సంత కూడా మన సంతల్లాగే సందడి సందడిగానే ఉంది. కాకపోతే మన ఊరి సంతల్లో ఎడ్లబండ్లు, అవులు, మేకలు ఉంటే ఇక్కడ కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కనపడ్డాయి. చుట్టు ప్రక్క గ్రామాల రైతులు వాళ్ళు పండించిన కూరలు, ఇళ్లల్లో తయారుచేసిన కేకులు, క్యాండిలు, తేనె, జామ్‌లు, జెల్లీలు, కుక్కీలు, హెర్బల్‌ టీలు వాళ్ళే టెంట్స్‌ వేసి అమ్ముకుంటారు. మన సంతల్లోనూ, తిరుణ్ణాల్లోనూ అమ్మేది అవే! పేర్లే మార్పు. వాళ్ళది Coconut crunch అయితే మనది కొబ్బరి లౌజు. వాళ్ళది Hard candy అయితే, మనవి జీడీలు, వాళ్ళవి Cotton Candy, మనది పీచుమిఠాయి, వాళ్ళవి homemade tent candies, మనవి మంచం మిఠాయిలు. మన తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో బెల్లం పాకం, వాళ్ళ apple cider vineger, Maples syrup మిగతాదంతా Shame to Shame యే!

అమెరికా స్వగృహ సరుకు

ఒక రకంగా మన సంతలే గొప్ప, మాంచిగా బేరాలాడవచ్చు. ఆత్మబంధువు సినిమాలో సంతలో నడిగర్‌ తిలకన్‌ శివాజీ గణేష్‌ గుడ్డ కింద హీరోయిన్‌ రాధ చేతులు పట్టుకుని (రేటు రహస్యంగా ఉంచేందుకు) మేకపిల్ల వనమూలికలు తిన్న organic herbal goat అని మాయ చేసి మంచి రేటుకు అమ్మిస్తాడు. ఆ సీన్‌ చూసే వరకు గుడ్డ కింద బేరం నాకు తెలియనే తెలియదు.

ముసుగు కింద బేరం

మా అమెరికా సంత Halloweenకు ముందు రోజుల్లో జరిగింది కనుక సంతంతా గుమ్మడి కాయలే. టామోటా సైజు నుంచి, రకరకాల రంగుల్లో షేపుల్లో. కొన్నైతే మన గుండెపోటు గుమ్మడి గారి భారీ డైలాగులంత భారమైన సైజువి. ‘గుమ్మడికాయల దొంగంటే భుజాలు తడుముకున్నాడు’ అన్న సామెత మాటేమోగాని ఈ మెగా గుమ్మడికాయ కొని భుజానికెత్తుకున్నామా పోటుతో భుజాలు తడుముకోవాలి, శాస్త్రి బామ్‌ రాసుకోవాలి. మన సూపర్‌ డూపర్‌ చిత్ర దర్శకులు అమెరికా షూటింగుల్లో అలవాటు ప్రకారం హీరోయిన్‌ మీద పండో, కాయో విసరాలని సరదాపడి అమెరికా సంతలో గుమ్మడి కాయను సుతారంగా విసిరితే మన జీరోసైజు హీరోయిన్‌ను అమెరికా ఆసుపత్రి E.R రూమ్‌కైనా మోసుకెళ్ళాలి, లేదా మొత్తానికి మార్చనైనా మార్చాలి (తెలుగు సీరియల్స్‌లో హీరోయిన్లను సడన్‌గా మార్చినట్లు). వారికి ఆ ఆలోచన రాకపోవడంతో మన తారలు బచ్‌గయా!

తెల్లోడి బిసతో, మార్కెటింగ్‌ స్కిల్స్‌తో అందరం క్లీన్‌బౌల్డే! అక్కడ అమ్మే తినుబండారాల్లో గుమ్మడికాయ లేని (మన కేరళి కుట్టిలు అన్నింట్లో కొబ్బరి, తమిళ పాటిలు ఇంగువ దట్టించినట్లు) పదార్థమేలేదు. Pumpkin candy, Pumpkin jam, Pumpkin cookies, Pumpkin yogart, pumpkin sauce. ఆఖరుకు Pumpkin Shampoo, Pumpkin soap. ‘అంతా రామమయం ఈ జగమంతా రామమయం’ అన్నట్లు, సంతంతా గుమ్మడి మయం. పదిమంది కాఫీ తాగితే మన సగం జీతం కట్టుకోవాల్సిన Starbucks వారు సైతం Pumpkin coffee, Pumpkin shakes తో షేకాడించేస్తున్నారు. చిన్నప్పుడు ఒక సీజన్లో మా పెరట్లో సొరకాయ పాదు విరగకాసింది. మా అమ్మ సొరకాయపప్పు, సొరకాయ పులుసు, సొరకాయ పచ్చడి, సొరకాయ సాంబార్లతో ఏకబిగిన సొరకాయ వారోత్సవాలు జరుపుతుంటే విసుగెత్తి మా తమ్ముడు సుబ్రహ్మణ్యం ఒక రోజు రాత్రి సొరపాదు పీక తప్పించి మాకు సొర చెఱ విడిపించాడు. ఆ తరువాత మా అమ్మ వాడిని పోలీసుల్లా తనదైన శైలిలో ప్రశ్నించిందనుకోండి.

గుమ్మడి గారి గుమ్మళ్ళు

సంతలో మరికాస్త ముందుకు పోతే రైతులు తయారుచేసిన goat milk soaps అమ్మడం చూసి ఔరా వీళ్లు గాంధీగారు మేకపాలు తాగిన విషయాన్ని వొంట పట్టించుకున్నారో లేదో తెలియదు కానీ, వొంటికి మాత్రం మేకపాలు పట్టించేస్తున్నారు అని సంబరపడ్డా. ఎతావాతా మన మక్కబుట్టలు స్వీట్‌ కార్న్‌ అనే పేరుతో అమ్మడం మన సంత మాదిరే! కాపోతే రేట్లు మన Imax లో మాదిరి bank loan తీసుకుని కొనాల్సినంత ఎత్తులో లేవు. మనసంతల్లో రంగులరాట్నాలు గుర్రపు స్వారీలు ఇక్కడా ఉన్నాయి. అమెరికా సంతలో సవ్వారి గుర్రాలకు మేత కంటే నల్లమందే ఎక్కువ పెడుతున్నట్లుంది. పిల్లలు గుర్రాలనెక్కితే, అవి పిల్లల్ని మోయడం లేదు, వాటిని పిల్లల్ని గుర్రాల మనిషే తాడుతో ఈడుస్తూ లాగుతున్నాడు. ఏ పిల్లోడో for suppose గుర్రం మీద నుండి పడితే, తల్లిదండ్రులు ంబవ చేస్తే సత్యహరిశ్చంద్రుడిలా గుర్రంతోపాటు తానూ అమ్ముడుపోవాల్సి వస్తుందన్న భయంతో గుర్రాలను నత్తలంత మంద్రంగా నడుపుతున్నారని అర్థమయింది. ఈ దేశంలో ఎవడి భయం వాడిది పాపం.

నత్త గుర్రాలపై సవారీ

అమెరికా సంతంతా తిరిగిన తరువాత బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటిరోజు ప్రతిపక్షాల వాళ్ళు పసలేని బడ్జెట్‌, పేదల నడ్డి విరిచే బడ్జెట్‌ (ప్రి ప్రింటెడ్ స్టేషనరీలా) అన్నట్లు నేనూ ఇది జోష్‌, సందడి లేనేలేని సంత అని స్టేట్‌మెంన్ట్‌ ఇచ్చా. మా తమ్ముడు రాజా భీమవరం నుండి ఆదివారం సంత చేశాను అని ఎప్పుడు చెప్పినా ఆదివారం సంత చేయడమంటే ఎగిరేజీవులకో, ఈదే జీవులకో, నడిచేనాలుక్కాళ్ళూ జీవులకో, నూకలు చెల్లించడమే అని వెలిగింది. మన పాడేరు, చోడవరం, అరకు, గోదావరి జిల్లాల్లో కపిలేశ్వరం, సిద్ధాంతం, కాపవరం, ద్రాక్షారం, నాగాయలంక చేపల సంత, అనకాపల్లి బెల్లం సంత, తెలంగాణల్లోని భువనగిరి, సిరిసిల్ల సంతల ఊపే వేరు. అమెరికా సంతల్లో వొట్టి అమ్మకాలతో చెల్లు. మన సంతల సందడులు, సంగతులు తెలుసుకోవాలంటే చిందేస్తూ గోరేటి వెంకన్న గారు పాడిన పాటలో ….

‘‘సంత మా వూరి సంత…
గోలిసోడాలు, బజ్జీలు,
బోండాలు, కాల్చిన చీకులు…

సంత కల్లుతోనే
పిల్ల పెండ్లి ఖాయం చేసి
పేరు బలమడగనేకి
నేరుగాపోయి…

నేరుగా పోయి …
కాశీమజిలీ కథలు,
దాశరథి కీర్తనలు
యక్షగానాలు …

బేరాలు, సారాలు, సరుకుల పారాలు
లాభాలు, నష్టాలు, ఇష్టాలయిష్టాలు
గువ్వలు, పువ్వులు, నవ్వులు, నటనలు
అరుపులు, కేకలు, వలపులు, గెలుపులు …

బోధివృక్షము కింది
సాధుభైరాగి
బతుకే ఒక సంతని
పసిపాపలా నవ్వాడు’’

మన సంత మంగళగిరి చాంతాడంత. అందులో పదో వంతు కూడా అమెరికా సంతలో ఉంటే వొట్టు. అమెరికాలో ఖరీదైన గోల్ఫ్‌ ఆడుతూ బిజినెస్‌ డీల్స్‌, ఎలైట్‌మేరేజస్‌ జరిగిపోతాయట. మనం ఆర్‌.కె.లక్ష్మణ్‌ గారి ఆమ్‌ ఆద్మీలం (పార్టీ ప్రమోటింగ్‌ కాదని మనవి) కనుక మన సంతలే మనకు బియాండ్‌ కాఫీ, బియాండ్‌ గోల్ఫ్‌ గ్రౌండ్స్‌.

పూర్వం వేదం చదివేటప్పుడు, దూరానికి ఏదో ఘోషలా వినపడేది. వేదపఠనాన్ని ‘సంత’ చెప్పుకోవడం అని కూడా అంటారు. ఘోష యొక్క సామ్యాన్ని బట్టి ‘‘వేద పఠన ఘోష’ ఆధారంగా మన సంతలకూ ఆ పేరు వచ్చి ఉంటుందని పెద్దల ఉవాచ. మన సంతలు అంత గొప్పవి. తమిళులు సంతను ‘సందై’ (త- పలకలేక) అంటారు. అందుకే వాళ్ళ సంతలు మన కంటె కోలాహలంగా, అరుపులతో అరవంగా ఉంటాయి.

మా స్కూల్‌ రోజుల్లో సంతలో సినిమా పాటల పుస్తకాలు కొనేవాళ్ళం. ఒకసినిమా పాటల పుస్తకంలో ‘‘నీవు లేక నేను లేను(సం)’’ అని, ‘‘నీవు లేక నేను లేను (దు:)’’ అని రెండో పాట ఉన్నాయి. ఆలోచించగా, ఆలోచించగా తట్టింది ‘సం’ అంటే సంతోషమైన పాటని, ‘దు:’ అంటే దు:ఖం పాటని. Happy and sorrow versions అన్న మాట. సంతలో ఆ పాటల పుస్తకాల ముచ్చట్లే పోయాయి.

అమెరికా వాళ్లు Carnivals అనో Mardigras అనో మరొటనో ఏ పేరుతో పిలిచినా మన కోటప్ప కొండ తిరుణాళ్ళ, అంతర్వేది తీర్థం, సమ్మక్క సారక్క మేడారం జాతర, తిరుపతి గంగ జాతర, కసుమూరు దర్గా ఉరుసు, కొల్లేరు పెద్దింటమ్మ తిరుణాల, విజయనగరం పైడి తల్లి సిరిమానోత్సల ముందు ‘‘యేతో కుచ్‌ భీనహిహై!’’

18 Replies to “అమెరికా సంత”

 1. మీ అమెరికా సంత కధాకమామీషు భలే తమాషాగా ఉంది సుమండీ. మీ సునిశిత పరిశీలన మరోసారి మా కళ్ళముందు నిలిచింది. మన దేశంలో దాదాపు కనుమరుగైన సంతల సరదా అమెరికాలో ఇంకనూ ప్రముఖమైన కార్యక్రమంగా నడుస్తున్న వైనం ఆశ్చర్యం! వైరుధ్యాల నడుమ అమెరికా!!! ఆంధ్రలో అరకులోయలో మాత్రమే సంతలు ఇంకా నడుస్తున్నాయ్!
  మీ తులనాత్మక విశ్లేషణ చాలా ప్రత్యేకమైంది. విజ్ఞానదాయకమైంది. ——చలం

 2. మీదైన శైలిలో అమెరికా సంత కళ్ళకు కట్టినట్టు చాలా బాగా వివరించారండి.మన సంతలకి వాళ్ల సంతకి చాలా వైవిద్యం ఉంది.ఇక్కడ ఉండే మేము అమెరికా సంత చూసినట్టు ఉంది.మీ హాస్య చతురత చాలా బాగుంది.ధన్యవాదములు అండి.

 3. హర్షవర్ధన్ గారు అమెరికా సంత గురించి హాస్య భరితంగా చక్కగా చెప్పారు.

 4. అవును Farmers Nest అని ఇంకా చాలా పెర్లతొ పిలిచినా సంత సంతె. కాని మన దగ్గిర ఉన్నంత వైవిధ్యందా సరదగా ఆ సంతలు లెవు. మీరు అన్ని రకాల కోణాల్లొ అలోచించారు 🙏

 5. “సంత “ ల లో సంబరాన్ని , చిన్ననాటి చిరు ముచ్చట్లని తిరిగి గుర్తు చేస్తూ , మమ్మల్ని మీతో పాటుగా విదేశ సంతలో నడిపించిన తీరు అద్భుతం సర్ . 🙏🏻

 6. అమెరికా సంతను చాలా అధ్బుతంగా, మా కళ్ళకు కట్టినట్టుగా చిత్రాలతో సహా
  వివరించి ఎంతో అహ్లాదాన్ని
  కలిగించినారు. అక్కడి సంతలో తేనపట్టుతో పాటు స్వచ్చమైన తేనె అమ్మడము చూసాము.
  చాలా కృతజ్ఞతలు సార్ 🙏🏻

 7. అమెరికా సంత చూపించడం మొదలెట్టి చిన్నప్పటి భీమవరం మా ఆదివారం సంత గుర్తు చేసి
  “బోధివృక్షము కింది
  సాధుభైరాగి
  బతుకే ఒక సంతని”
  “సంత్” బ్రతుకుని “సంత” తో పోల్చిన వేదాంతిని పరిచయం చేసి చివరికి “యేతో కుచ్‌ భీనహిహై“ మన మే గ్రేట్ అనిపించేసి అలరించే చతురత హర్షవనమాలి హర్షవర్ధన్ గారికి
  వెన్నతో పెట్టిన మరియు తెలుగు బ్లాగు కు వన్నె తెచ్చిన విద్య🙏🏻

 8. చాలా సరదాగా హ్యాపీ హా ఉండండి
  … . మందు వేసవిలో జల్లులా.
  చిన్నప్పటి … పాతరేసిన పాత సంగతులు అన్నీ బయటకు లాగుతున్నారు .

 9. మీ కథనం మంచి buffet లా ఉంది. సంత వ్యాసంలో చాలా విషయాలు స్పృశించి పాఠకులకు విషయమును వినోదం తో జోడించడం, అన్ని ప్రాంతాల పేర్లను సందర్భాన్ని బట్టి ఉదహరించుట వలన ప్రతి ఒక్కరూ స్వంతానికి అన్వయించుకోవటం వ్యాసకర్త ప్రతీభే.

 10. సంతలు ప్రపంచ వ్యాప్త సంస్కృతి అన్నమాట. మన దేశంలో సంతలు, తిరునాళ్ళు, జాతర లు అన్నీ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. పాత రోజుల్లో తిరునాళ్ళ లో క్రష్, సబ్జా గింజల జ్యూస్ లు తాగిన జ్ఞాపకాలు మెదిలాయి. కోటప్ప కొండ జాతర, రొట్టెల పండుగలు కూడా సంతల్లాటివే. మంచి రైట్ అప్.

 11. పొన్నూరు తిరునాల, సనత్‌నగర్ సంత గుర్తుకు వస్తున్నాయి. మీరు నన్ను ఐదు దశాబ్దాల వెనక్కి ప్రయాణించేలా చేశారు. సంత ఎక్కడైనా సంతే.

 12. Adbhutham Sir. Nenu America vellaanukaani Santa choodaledu. Kallakikattinatlu choopinchaaru, mee kalam dwaara 🙏

 13. అమెరికా లో సంత అద్భుతమైన వ్యాసం హర్ష

 14. Yes it’s correct sir and I have also visited to such weekend markets at Redwood City , California in 2010 while we are staying there. But one thing sir the quality including weight is quite good and accuracy. Here in our Rythu Bazars we can’t get such quality of items nowadays. Thank you very much sir as I have remembered those days. Article is very interesting with nice narration sir.

 15. Sir, Thank you for sharing the experiences in the blog; while I was reading I was in the state that I was seeing through my eyes. I am a big fan for your write ups; eagerly waiting for your next post 😊🙏

 16. మీరు నన్ను ఆరు దశాబ్దాల వెనక్కి వెళ్లేలా చేసారు. నేను పొన్నూరు తిరునాల మరియు సనత్‌నగర్ సంత చూడగలిగాను. ధన్యవాదాలు.

  1. మీసంతలో మా సిరిసిల్ల కనబడగానే తెలియని ఉత్సాహకరమైన అనుభూతి… ఏతావాతా సంతెక్కడైనా సంతే ఐనా అది వింతే!!! మా మంథని గుర్తొచ్చేలా కూష్మాండం (గుమ్మడికాయ) పై వివరణ వెరసి అత్యధ్భుతః

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.