పుష్కర కాలం ముందు మొట్టమొదటి కాశీయాత్ర చేశాం. ఆ తరువాత రెండు మూడుసార్లు కాశీ వెళ్లడం కేవలం యాత్ర కోసమే. ఈసారి మాది యాత్రే కాదు, పదిరోజుల మజిలీ కూడా. మొదటిసారి కాశీ వెళతున్నానని రచయిత, మిత్రుడు పరవస్తు లోకేశ్వర్‌తో చెప్తే, ‘‘కాశీని భౌతిక నేత్రంతో చూడకండి సార్‌, డిసప్పాయింట్‌ అవుతారు. మనోనేత్రంతో చూడండి’’ అని చెప్పారు. తొలిసారి వారి మాట విన్నందుకు ఆనందమే కలిగింది. ఆ తరువాత ఆ మాట దాటి ఇంకో అడుగు ముందుకేసి జ్ఞాననేత్రంతో చూస్తే ఎలా ఉంటుదో అనుకుని అంత జ్ఞానం మనకెక్కడిదిలే అని మనోనేత్రంతో సరిపెట్టుకున్న.

ఈసారి వారణాశి ఎయిర్‌పోర్ట్‌లో దిగి బయటకు రాగానే సత్యహరిశ్చంద్ర నాటకంలో వారణాశి సీన్లోని ‘‘దేవీ కష్టములెటునున్నను’’ ఎడిట్‌ చేసుకుని, కష్టములేమీ లేకుండగనేగా పుణ్యక్షేత్రమైన వారణాశిని దర్శించితిమి అనుకుంటు …
‘‘భక్త యోగపదన్యాసి వారణాశి …
పావనక్షేత్రములవాసి వారణాశి
’’ పాడుకుంటూ కారెక్కాము.

ఆప్తమిత్రులు సత్యన్నారాయణగారి ఆతిథ్యంతో పదిరోజులు కాశీమజిలీ చేసే అదృష్టం మాకు దక్కింది. ముఘల్‌ సరాయిలో కాదు లెండి మిత్రుల ‘ఘర్‌’ సరాయిలోనే. ఈ సారి మజిలీలో కొంత ప్రశాంతంగా అక్కడ ఎన్నో ప్రదేశాలు చూడగలిగాం. మాన్య మోడీగారి చొరవతో, కృషితో గత ఐదారేళ్ళుగా కాశీ రూపు, రేఖలు మారిపోవడంతో కాశీని భౌతికనేత్రంతో కూడా చూడగలిగే భాగ్యం కలిగింది. పన్నెండేళ్ల క్రితం చూసిన విశ్వేశ్వర మందిరానికి ఇప్పటి సువిశాలమైన ప్రాంగణానికీ, పాత రోడ్లకు, ఇరుకైన ఘాట్లకు ఇప్పటి సుందరమైన ఘాట్లకు పొంతనే లేదు. Seeing is believing. కాశీ వచ్చి చూసిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. ఈ అభివృద్ధి, మార్పు ఒకింత భయాన్నీ కలిగించింది.

రవిగాంచని వీధులు

బాలగోపాల్‌కు సాధు దీవెనలు

ఇరుకు సందులు, ఇద్దరు మనుషులు కష్టంగా వెళ్ళగలిగే గొందులు, అర్థనిమీల నయనాలతో, నిర్నిమిత్తంగా యోగముద్రలో సంచరించే గోవులు, హెరిటేజ్‌ ఘాట్లు, వామనుడి పెద్ద గొడుగులు అన్నీ మాయమైపోతే మనోనేత్రంతో దర్శించగల చారిత్రాత్మక, ఎథినిక్‌ లుక్‌ పోయి కాశీ కూడా మిగిలిన నగరాల్లా అయిపోవడం కన్నుకనపడనంత కాటుక సింగారించుకోవడమే! ఈ ‘మోడి’ ఫికేషన్‌ మోతాదు మించకుండా కొంతలో కొంత, పురాతన ఛాయలు మిగిల్తేనే నేటివిటీ కనబడుతుంది.
ఇప్పటివరకు కాశీ నగరం గొప్పదనాన్ని గురించి, ప్రాచీనత గురించి కొన్ని వందల పుస్తకాలు వచ్చాయి. కొన్నివేల మంది ఎన్నో విషయాలు రాశారు. మనం మళ్ళీ రాయాలా అన్న సందిగ్ధంలో పడినప్పుడు విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షం రాయడానికి ముందు …

‘‘మరలనిదేల రామాయణం బన్నచో
నీ ప్రపంచక మెల్లనెల్ల వేళ
తినుచునన యన్నమే తినుచున్న దిన్నాళ్ళు
తన రుచి బ్రదుకులు తనవి గాన
చేసిన సంసారమేసేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన ….
నా భక్తి రచనలు నావిగాన
’’ … అన్నట్లు, వారి స్ఫూర్తితో ఎవరి కాశీయాత్ర వారిదే ఎవరి అనుభూతి వారిదే అన్న నమ్మకంతో ఈ నాలుగు మాటలు. దీనికి తోడు అక్కడే పదిరోజుల మజిలీ ఇంకొంచెం యోగ్యత పెంచడం వల్ల కూడా.
కాశీపుర వీధుల్లో తిరుగుతున్నప్పుడు గుళ్ళతో సమానంగా శివలింగాలు కనపడ్డాయి. వెతకే ఓపిక ఉండాలే గాని కాశీలో ఇళ్ళ కంటే శివలింగాలే ఎక్కువ. కొన్ని ఇళ్లల్లో శివలింగాలు, శివాలయాలు మాకు కనపడ్డాయి. అక్కడ తొక్కినా శివుడే, మొక్కినా శివుడే! కాశీనగరంలోని దేవాలయాలన్నీ తిరిగి అలిసి సొలసిన ఒక రచయిత పద్మపురాణంలో “Making a pilgrimage there in Banaras everyday for a whole year, still she did not reach all the sacred places. For in Banaras there is a sacred place at every step” అన్న మాటలు నాలుగురోజుల అక్కడ తిరిగిన తరువాత నాకూ స్వానుభవమైంది. ఈ శివలింగాలకు సాటిగా కెనడాకు ఏనాడో తరలించిన అన్నపూర్ణ విగ్రహాన్ని కూడా మోడీగారు వెనక్కి రప్పించి విశ్వనాథ మందిర ప్రాంగణంలో పున:ప్రతిష్ట చేయించడం విశేషం.

కాశీలోని ప్రముఖమైన అన్నీ దేవాలయాలకు ఒక కుండం (కోనేరు) ఉంది. ఎన్నో కుండాలు కనుమరుగై పోయినా కొన్ని నామమాత్రంగా మిగిలే ఉన్నాయి.ఆ కోనేర్లలో మాయమైపోయిన కలువలు,పద్మాలుగా కాశీనగరమంతా పునరుజ్జీవనం పొంది పద్మశ్రీలు, పద్మభూషణలు, పద్మ విభూషణులుగా వికసించి వెల్లివిరిశాయి. కాశీలో వీధికొక పద్మశ్రీ గ్రహీతలు, విభూషణలుండటం గొప్ప విశేషం. ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌, పండిట్‌ రవిశంకర్‌ కాశీభారత రత్నాలే.

గత ఇరవై ఏళ్ళలో మూడోసారి కాశీలో పనిచేస్తున్న మిత్రులు సత్యనారాయణగారు కాశీ ప్రజల జీవనంలో గమనించిన ప్రత్యేకతను గుర్తించి చెప్పారు. కాశీవాసులలో ఎక్కువ శాతం మంది పెద్దపెద్ద ఆశలు, కోరికలు లేకుండా ఎంతో సంతృప్తితో జీవిస్తారట. ఏదో చేసేయాలి, ఎంతో పోగేసుకోవాలనే ఆరాటపడకుండా అన్నీ ఉన్నాయి, సబ్‌ సబ్‌ టీక్‌ హై అనేసుకునే సంతృప్త జీవులని చెప్పారు. వారు చెప్పిన మాట ఆ వీధుల్లో తిరుగుతూ కొంతమంది సామాన్యులను చూసినప్పుడు ఎంతో వాస్తవమని తెలిసింది.

శేషశయనుడు కాదు సింపుల్‌ సేల్స్‌మెన్‌

11 గం॥లకు పాడుకుంటూ దుఖాణం తెరిచిన తాపీరాయుడు

కాశీ ఎంత ప్రాచీనమైనదో పరమత సహనానికి, ఐక్యతకు అంతే పేరు పొందింది. రెండువేల సంవత్సరాలకు పూర్వమే ఆదిశంకరులే కాశీలో జరిగిన అపూర్వమైన ఘటనతో మనీష పంచకంలో… ‘మెలకువ, కల, గాఢ నిద్రావస్థలోనూ ఏ చైతన్యం కొనసాగుతున్నదో, ఏది బ్రహ్మనుండి చీమవరకు సకల ప్రాణులలో ఒక్కటే అయి వ్యాపించి ఉందో, ఆ చైతన్యమే నేను, అంతే కానీ కేవలం కంటికి కనిపించే ఈ శరీరం నేను కాను అనే జ్ఞానము ఎవరికి ఉంటుందో అతడు జన్మత: ఛండాలుడైనా, బ్రాహ్మణుడైనా నాకు గురువే. అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మకంటే నేను భిన్నంకాదు అన్న అద్వైత జ్ఞానం కలవాడు ఎవ్వడైనా నాకు పూజ్యుడే’ అన్న వారి డిక్టమ్‌ను ఎన్నో చట్టాలు చేసినా నేటికీ ఆచరించలేకపోవడం విచారం.

మనీషపంచక ప్రేరణ

ఆ తరువాత పదిహేనో శతాబ్దంలో మతసామరస్యాన్ని కలనేతగా నేసిన సంత్‌ కబీర్‌దాస్‌ బోధలు ఎంతో విలువైనవి. పరమత సహనానికి వారి బోధలు గొప్ప ప్రతీక. 18వ శతాబ్దంలో నాలుగునెలలు కాశీలో మజిలీ చేసిన ప్రముఖకవి మీర్జా గాలిబ్‌ ఆ నగర వైభవానికి ముగ్దుడై ‘The Lamp of the Temple’ అన్న దీర్ఘకవిత రచించి అందులో …
‘‘బెనారస్‌ నగరం మీ మనోక్లేశాలను తొలగించి
మీ ఆత్మలకు శాంతిని, సాంత్వనను కలిగిస్తుంది
అందువల్లనే దేహాన్ని విడిచిన ఆత్మలు సైతం
ఈ నగరాన్ని వీడవు …
బెనారస్‌ వైభవం మహోన్నతమైనది
స్వప్నావస్థలోనూ దానిని మనం చేరుకోలేం…
’’ అన్నారు.

తన ముప్పైయ్యో ఏట కాశీ ఉత్సవ వేడుకల్ని చూసి మైమరచిన గాలిబ్‌ ‘ఈ సుందర నగరాన్ని దర్శించిన యాత్రికులకు వారి బాధలు, కష్టాలూ గుర్తుకే రావు’ అని, అవకాశం వస్తే నా జీవితాన్ని గంగాతీరాన ముగిస్తానని’ తన మనసులోని కోరికను మిత్రునికి లేఖ రాసాడట. ఒక ఏడాది పాటు బెనారస్‌ విశ్వవిద్యాలయంలో అధ్యయనం చేసిన హార్వర్డ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డయాన ఎక్‌ మరికొన్ని నెలలు అక్కడే పరిశోధన చేసి ‘Banaras: City of light’ అని ఏకంగా ఐదు వందల పేజీల పుస్తకమే రాసింది.

రామాయణంలో శ్రీరాముడు తన పాదస్పర్శతో రాతిగా ఉన్న అహల్యను నాతిగా మార్చితే, చరిత్రలో కాశీ విశ్వనాధుని ఆలయాన్ని పునర్నిర్మించి రాణి అహల్యాబాయి చరితార్థురాలయింది. భిన్న సంస్కృతులకు, మతాలకు ఆలవాలమైన కాశీ `గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరులు (నలుగురు తీర్ధంకరుల జన్మస్థానం కాశి), ధన్వంతరి, శుశ్రుత, పతంజలి, ఆదిశంకర, రామానుజ, కబీర్‌, రవిదాస్‌, తులసీదాస్‌, నానక్‌, ఝాన్సీ లక్ష్మీబాయి (జన్మస్థలం), అనీబిసెంట్‌ మున్షీ ప్రేమ్‌చంద్‌, మాలవ్యాలను ఆకర్షించి ప్రభావితం చేసింది. కాశీలో ఒకరోజు సత్యనారాయణగారితో కాలనీలో మార్నింగ్‌వాక్‌లో పరిచయమైన ఒక డాక్టర్‌గారు ‘‘గత నలభై ఏళ్ళలో కాశీని వదిలి నాలుగైదు చోట్ల స్థిరపడాలని ప్రయత్నించాను కానీ కాశీ నన్ను వెనక్కి లాగేసి కట్టి పడేసింద’’ని చెప్పారు. జీవితంలో ఈ చోటును వదిలేది లేదన్నారు.

అనునిత్యం కాశీనాథుని మేలుకొలుపు ఉసాద్‌ బిస్మిల్లాఖాన్‌ షెహనాయితోనే కావడం, రామేశ్వరంలోని రామలింగస్వామికి ప్రతి ఏడు జరిగే తెప్పోత్సవానికి తెప్పల నిర్మాణం అబ్ధుల్‌ కలామ్‌ గారి పూర్వీకులదే కావడం, శబరిమల అయ్యప్ప స్వామికి అత్యంత ప్రియమైన హరివరాసనం గాన గంథర్వుడు జేసుదాస్‌ ఆలపించడం కాకతాళీయం కాదు, అంతర్లీన సందేశమే. అంతర్యామి ఆదేశమే.

కాశీ ఆధ్యాత్మికా కేంద్రమే కాదు అధ్యయన కేంద్రం కూడా. కొన్ని వందల సంవత్సరాలుగా కాశీవేద పండితులే దేశంలో మిన్న. ఇరవై సంవత్సరాలకు పూర్వం తూర్పు గోదావరి కపిలేశ్వరపురంలో సర్వరాయ ట్రస్టు నిర్వహణలో ఉన్న వేదపాఠశాలను దర్శించినప్పుడు మాన్యులు ఎస్‌.పి.బి.వి. సత్యన్నారాయణగారు కాశీలో యజుర్వేదం నేర్చుకున్న పండితుడ్ని వారి వేద పాఠశాలలో ఆచార్యులుగా నియమించారని తెలిసింది. కాశీ వేదాధ్యయనం అంత గొప్పది. ఆనాడు మొదలైన జ్ఞానాన్వేషణ, సత్యశోధన అక్కడ నేటికీ ఆ నేలన కొనసాగుతోంది. మేము అక్కడ ఉన్నప్పుడు ఒక రోజు రాజ్‌ఘాట్లో తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారు 1934 లో స్థాపించిన పాఠశాల, అధ్యయన కేంద్రం చూశాము. గంగాతీరాన, పెద్దపెద్ద వృక్షాలతో విశాలమైన ప్రాంగణంలో ఉన్న స్టడీసెంటర్లో తత్త్వ చింతనాపరులు రోజులు తరబడి ఉండి తమ శోధనను కొనసాగిస్తున్నారు.

జె.కె.అధ్యయన కేంద్రంలో యువజిజ్ఞాసులు

మరొక రోజు సారనాథ్‌లోని Tibetan centre of Higher Studies సందర్శించాము. ప్రశాంత వాతావరణంలో అందమైన భవనాలతో, బౌద్ధ గ్రంథాలతో, తాళపత్ర గ్రంథాలలో ఉన్న లైబ్రరీ చూశాము. గత ఐదేళ్ళుగా అక్కడ Buddhist studies కోర్సు చేస్తున్న రష్యన్‌ యువకుడు భైరవ్‌ను కలిసి కొంతసేపు ముచ్చటించాము. మొత్తం తొమ్మిదేళ్ళ అధ్యయన కోర్సులో మరో నాలుగేళ్ళు చదువుకుని వెనక్కు వెళ్ళి రష్యాలో బౌద్ధసిద్దాంతాలను బోధిస్తానని చెప్పిన భైరవ్‌ ఎంతో ఉన్నతంగా అగుపించాడు. అక్కడే ఉన్న బుక్‌స్టాల్లో ఆచార్య నాగార్జున తన శిష్యుడైన శాతవాహన చక్రవర్తికి రాసిన సుహృల్లేఖకు వ్యాఖ్యాన పుస్తకం తీసుకున్నాం. ఇందులో నిత్యజీవితంలో ప్రపంచంలో మనం గమనించాల్సిన నియమాలు, దైనందిన జీవనంతో ఆధ్యాత్మిక జీవనం అనుసంధానం గురించి ఆచార్య నాగార్జునుడు రాయడం విశేషం.

టిబెటన్‌ విశ్వవిద్యాలయం

రష్యాబౌద్ధ విద్యార్థి భైరవ్‌తో మా పోలీసు మిత్రులు

కాశీలో వందేళ్ళకు పూర్వమే నెలకొన్న బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం ఎంతో మంది ఆచార్యులను, శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడంతోపాటు జ్యోతిష్య శాస్త్రం, ఫిలాసఫీ రంగాల్లో పలుకోర్సులను ప్రవేశపెట్టడం విశేషం. ఇటీవల BHU, కాశీ మార్మికతను, ప్రాచీనతను అధ్యయనం చేయడానికి Kasi studies అనే పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సును ప్రవేశపెట్టింది.

కాశీలో ఉన్నన్ని రోజులు ఏ వేళలో ఎటు వెళ్ళినా ఘాట్లలో మహాప్రస్థానానికి శవాల్ని మోసుకుపోయే వారి ‘రామ్‌నామ్‌ సత్యహై’ అన్న స్మరణ మారుమోగుతూనే ఉంది. అది వినివిని రామ్‌ నామ్‌ సత్యహై తోపాటు శక్యముని తొలి బోధలో చెప్పిన అనిత్య గుర్తుకొచ్చి ‘‘బాకీ సబ్‌ అనిత్యహై” అని కూడా వారు కలిపి పాడితే బాగుంటుదనుకున్నా. ఘాట్లలో అహోరాత్రులు నిరంతరం దహనమవుతున్న దేహాల్ని, ఇళ్ళే ఎరుగక ఏళ్ళ తరబడి గంగా తీరాన ఆనందానుభూతితో జీవితాల్ని గడిపే సర్వసంగపరిత్యాగుల్ని, సిద్ధపురుషుల్ని చూసి చూసి, ముక్తి కోసం ముక్తి లాభ్‌ భవన్‌, ముముక్షు భవన్ల వంటి ఫైనల్‌ డెస్టినేషన్ల పరిసరాల్లో సంచరిస్తూ, సంచలిస్తూ కాశీ వాసులందరికీ సంతృప్తితోపాట ఎంతోకొంత వైరాగ్యం వంటపట్టిందేమో.

ముక్తిలాభ్‌ భవన్లో నిరీక్షణలో పెద్దలు

ఆదిశంకరులు భజగోవిందంలో ప్రవచించిన …..
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తి: కాశీవాసుల అనుష్టానం.

వెయ్యికోట్ల విలువైన ఇంట్లో ఎలాగోలా సర్ధుకుపోయి జీవనం సాగిస్తున్న నిరుపేదలను, బంగారు కమోడ్లనే వాడే ‘ఘనులను’, పెళ్ళివిందుల్లో ప్లేటు భోజనానికి కేవలం పదిహేనువేల రూపాయలు చెల్లించే బడుగు వేతన జీవులను, చీకటి పడగానే వేల రూపాయల బ్లూ, రెడ్‌ లేబుల్స్‌ను సేవించి ఉదయానికి ఒకే కలర్‌ అవుట్‌పుట్‌ ఇచ్చే ‘మధూ’ షియన్స్ ను, మన మహానేతలను హరిశ్చంద్ర ఘాట్లో వారం రోజులపాటు కుర్చీలకు కట్టేసి, మరో పదిరోజులు కాశీవీధుల్లో పాదయాత్ర చేయిస్తే కొంతలో కొంత గుణం కనిపిస్తుందేమో అని చిన్న ఆశ.

కాశీ నగరం సంగీతానికి, నాట్యానికీ ఆలవాలం. మొఘల్‌ చక్రవర్తుల కొలువులోని గానగంధర్వుడు తాన్‌సేన్‌ జన్మస్థానం కాశీయే. హిందుస్థానీ సంగీతంలో బెనారస్‌ ఘరానాదీ విశిష్టమైన స్థానం. బెనారస్‌, మిర్జాపురీ కజ్రీ కాశీసంగీత విద్వాంసుల ప్రయోగాలే. అమీర్‌ ఖుస్రో సంగీత ప్రయోగాలకు కాశీనగరమే రంగస్థలం. పద్మవిభూషణ చున్నీలాల్‌ మిశ్రా కాశీ వాసే. వైరాగ్యంతోపాటు, రాగంతోపాటు జిహ్వానురాగాలకీ కాశీ ప్రసిద్దే. పెద్దలు గురజాడ గారు వందేళ్ళకు పూర్వమే తమ మనసులోని మిఠాయిపై మక్కువను, కన్యాశుల్కంలో …. ‘‘నా దగ్గర కరెన్సీ నోట్లు వున్నవిగాని మార్చలేదు. పదణాలు పెట్టి ఓ శేరు ‘కాశీ మిఠాయి’ పట్టుకురా’’ అని గిరీశం నోట శిష్యుడు వెంకటేశానికి పురమాయింపజేశారు. అక్కడ ఉన్నప్పుడు మా కాశీ అన్నపూర్ణ రమగారు భోజనాల తరువాత ఎప్పుడు డైనింగ్‌ టేబుల్‌పై జిలేబి పెట్టినా సగానికి పైగా నేనే ఖాళీ చేసిన తరువాతే గురజాడ గారి కాశీ మిఠాయి రుచి తెలిసింది. కాశీ మిఠాయే కాదు బెనారస్‌ కచౌరీ కూడా భేషే. బెనారస్‌ లస్సీ మరింత లెస్స, లెస్స. ఇవన్నీ ముగించుకున్నాక భుక్తాయాస నివారణకు ముక్తాయింపుగా బెనారస్‌ పాన్‌ ‘లా జవాబే’. బెనారస్‌పాన్‌, తంబాకు సేవకులు రెండు రకాల హిందీ మాట్లాడగలరని అక్కడ కొంత మందిని చూశాకే తెలిసింది. పొరపాటున భోజపురి, ఖరీబోలి అనుకునేరు! కాదండి .పాన్‌, తంబాకు నోట్లో ఉండగా అవి తినేవారికి మాత్రమే అర్థమయ్యేది మొదటి రకం హిందీ అయితే అవి నోట్లో లేనప్పుడు అందరికీ అర్థమయ్యేది రెండోది. పాన్‌ నోట్లో ఉండగా తలను ఒక యాంగిల్‌ లో పైకెత్తి పాన్‌ తుంపర్లతో చొక్కా తడుపుకోకుండా మాట్లాడటం బనారసీ పానీయుల పేటెంటెడ్‌ ఆర్టే!. అందువల్లనే ‘ఖయ్‌కే పాన్‌ బనారస్‌వాలా. ఖుల్‌జాయేబంద్‌ అకల్‌కా తాళా’ అని బిగ్‌బీ ఏనాడో పాడుకున్నారు. ఆఖరుకు మా చిన్నప్పుడు వీధుల్లో బయోస్కోపు వాళ్ళు కూడా ‘కాశీపట్నం చూడరబాబు’ అనే పాటే పాడటం గుర్తే.

మహాకాలుడి మహా రిలాక్సింగ్‌ ‘భంగి ’మ

కాశీ నగరంలోని అన్ని అద్భుతాలకంటే కాశీనాథుడే మహాద్భుతం. మనకు వేలకొద్దీ ఇలవేల్పులున్నా జీరో ప్రోటోకోలున్న, అత్యంత ప్రజాస్వామ్యక, సోషలిస్టిక్ దేవుడు మన ఆదిభిక్షువే. మిగిలిన స్వాముల్లా పులిహార, చక్కెర పొంగల్లు, పవళింపుసేవలు వారికి పెట్టనసరం లేదు. చిన్న హగ్గుకే మురిసిపోయి యముడికే కిక్కిచ్చి మార్కండేయుని చిరంజీవిని చేసి, కాలితో తాకిన కన్నప్పకూ కరుణతో కైవల్యమిచ్చిన ఆదియోగి మనకూ ఏమి తక్కువ చేయలేదు. పిడికెడు బూడిద, చెంబుడునీళ్ళు, రెండు మారేడు దళాలతో తృప్తి చెంది, సోషల్‌ డిస్టెన్సింగ్‌ అస్సలు పాటించని అల్పసంతోషే విశ్వనాథుడు. కొన్ని గుళ్లలో అయ్యవార్లు ప్రసాదాలను వరదబాధితులకు హెలికాఫ్టర్ల నుండి ఫుడ్‌ప్యాకెట్స్‌ డ్రాప్‌ చేసినట్లు భక్తుల చేతులకు తగలకుండా పైనించి వదిల్తే, మన విశ్వనాథుడు, శ్రీశైల మల్లన్న తమవద్దకు వచ్చిన భక్తులందరినీ కమ్‌క్లోజర్‌ అని స్పర్శదర్శనమిచ్చి పులకింపచేసే ఇంటిమేట్‌ గాడ్స్‌. శివయ్యకు భక్తులందరితో సెల్ఫీ దిగాలన్నముచ్చట ఉన్నా భద్రతా దళం మన సెల్‌ఫోన్స్‌ లాక్కోవడంతో ఆయనకు వీలుపడటం లేదు.

మరెక్కడా చూడని బహుళ సంస్కృతే విశ్వనాథామృతం. ఏ నియమాలను పాటించని, భక్తుల నుండి ఏమీ ఆశించని పసుపతి నాథుని నివాసమే మరుభూమి. గంజాయి సేవిస్తూ, జటాధారివై, పేద, గొప్ప, పవిత్ర, అపవిత్రతలు పాటించని శివుడు సంప్రదాయాల్ని ప్రశ్నించే రెబల్స్‌కూ ఆమోదయోగ్యమైన భిన్న సంస్కృతులకు నెలవైన కాశీ పురాధీశుడు. శివుడు భోళాశంకరుడు. పిలవగానే పలుకుతాడని భక్తుల నమ్మకం. అందుకే ఆయనకు దేవుళ్ళందరి కంటే ఫాలోయింగ్‌ ఎక్కువే కానీ, ఈ భోళాతనమే ఆయన్ని ఛేజింగ్‌ పాల్చేసింది. భక్త సులభుడు హేస్టీగా భస్మాసురునికి వరమిచ్చేసి ట్రయల్‌రన్‌ కోసం వెంటబడితే రన్‌ చేయక తప్పలేదు. హరహరమహాదేవ టి.వి. సీరియల్లో పార్వతిని వివాహమాడిన తరువాత శివుడు కొత్త అల్లుడిగా మామగారింటికి వస్తాడు. కొత్త పెళ్ళి కొడుక్కి హారతిచ్చి ఆడపడుచులు కానుక అడిగితే చిరునవ్వులు చిందిస్తూ ఆ సదాశివుడు మెడలోని పామును తీసి హారతిపళ్ళెంలో వేయడంతో కొందరు పడుచులు బేహోష్, మిగిలిన ఆడపడుచులు కకావికలాంగా పరుగే పరుగు. పసుపతినాథుని దగ్గర నాగాభరణాలు, కరిచర్శాలు, కపాలాలు, భస్మాలు కాక ఇంకేముంటాయి! ఆయనవి కానివి మనకేమి మిగిలి ఉంటాయి.

కాశీ తీర్థయాత్ర చేసిన అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానుల వంటి మహనీయులను కొంతైనా సంస్కరించాలన్న సంకల్పంతో మన పెద్దలు అరిషడ్వర్గాలలో ఏదో ఒక దాన్ని అక్కడ వదలండి అంటే, మనవాళ్ళు ఇది మా తోనికాదులే అని, ఇంకోమాటుంటే చెప్పు అనుకుని ఎక్కడా దొరకని రామాఫలాల్నో, చేదు కాకరకాయనో, చైనా డ్రాగన్‌ఫ్రూట్‌నో, మెక్సికో అవకాడోనో, అక్కడ వదిలి అమ్మయ్యా అని వ్రతఫలం దక్కించుకుంటున్నారు. సోక్రటీస్‌ వంటి పెద్దమనిషితో మీకు ఇష్టమైన వాటిని మాత్రమే అక్కడ వదలాలి అని ఎవరో అంటే, ఆయన ఠక్కున ‘మా ఆవిడ్ని వదిలేస్తా’, అని నాలిక్కరుచుకున్నాడట.

అమెరికాను Land of the Brave, Land of freedom అని ఇహాన్నిచ్చే వాటి గురించే గొప్పగా చెప్పుకుంటే, వారణాశి పరాన్నిచ్చే City of Liberation (ముక్తిధామ్‌) అని పేరుపొందింది. ప్రపంచంలో ఇటువంటి మరోనగరం లేదు. ఈ కారణంగానే ప్రాచీన యుగం నుండి నేటి కంప్యూటర్‌ యుగం వరకు ఎందరో కాశీని దర్శిస్తున్నారు. బీటిల్స్‌ సంగీత బృందంలోని ప్రఖ్యాత గాయకుడు జార్జి హారిసన్‌ మరణానంతరం తన చితాభస్మాన్ని కాశీతీరాన గంగా నదిలో నిమజ్ఞనం చేయాలని కోరుకుని తన భార్య, కుమారుని ద్వారా అది నెరవేర్చుకున్నాడు. నేటి ప్రఖ్యాత హాలివుడ్‌ నటులు బ్రాడ్‌పిట్‌, విల్‌స్మిత్‌, మోర్గన్‌ ఫ్రీమన్‌, ఎంజిలినా జూలి కాశీ సందర్శకులే. ముందు ముందు A.I శాస్త్రవేత్తలు రోబోలకు ఆత్మల్నిస్తే అవి కూడా కాశీ దారే పడతాయేమో!

జీవితంలో కాశీ చివరి మజిలీ కావాలని తనికెళ్ళభరణిగారు ఎంతోకాంక్షతో, ఆర్తితో
‘‘ఖాయిష్‌ ఒక్కటే నాకు ఎప్పటికి
కైలాసమెటు బోవుడో!
కాశీపోవుడు – కాలిపోవుడు
‘‘ అని వేడుకున్నారు.

చివరగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ప్రముఖ హిందీకవి కేదార్‌నాథ్‌ సింగ్‌ ‘బెనారస్‌’ కవితను ఎంతో అందంగా తెలుగులో అనువదించిన ఆప్తులు సత్యనారయణ గారు బెనారస్‌ను వర్ణిస్తూ …
‘‘అరుణోదయ సూర్యునికి
అర్పించే అర్ఘ్యాలు
శతాబ్ధాలుగా ఇలాగే
గంగానదిలో వొంటి కాలిపై
నిలుచుంది ఈ నగరం
రెండో కాలు గురించి
దానికి ఏ మాత్రం తెలియదు
’’ అన్న అపురూప వాక్యాలతో ముగిస్తా.

(మా యాత్రను సాకారం చేసిన కాశీనాథునికి నమస్సులతో, ఆత్మీయులు రమాసత్యనారాయణ దంపతులకు కృతజ్ఞలతో…)

17 Replies to “కాశీ మజిలీ”

 1. బాగుంది సార్ మీ కాశి యాత్ర ఆశాంతము చదివాను మీ స్క్రిప్ట్ లో భావుకత, పోయేటిక్ నేరేషన్ చాలా బాగున్నాయి అక్కడక్కడ మీరు పొందుపరిచిన ఫోటోలు మరింత అందాన్నిచ్చాయి. ధన్యవాదాలు మంచి వ్యాసం అందించినందుకు.

 2. కాశీమజిలీ కథ చాలా బాగుంది. కాశీ విశేషాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఏ విషయం పైన అయినా మీ రచనా శైలి చక్కగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. మరెన్నో రచనల కోసం ఎదురు చూస్తున్నాం.

 3. Respected Harshavardhan Garu, even though we visited Varanasi many times we didn’t know the details brought out in your narration. You have rightly mentioned that the Kashi yatra would never be completed and it’s not possible to visit all the temples located in and around the sacred city. We are very much thankful to yourself and Satyanarayana Garu for the great help during our recent visit. All our team members are highly greatful and indebted to both of you Sirs. May Lord Viswanatha shower lot of blessings on the members of both of your families. Looking forward to meet both of you in person and express our gratitude in person. Thank you very much Sir.

 4. మీ మజిలీ మహిమనుకుంటాను. ఈ రోజు తెల్లవారుజామునే మెలకువొచ్చింది. ఉదయం కాఫీతో కుకీస్ లా కాకుండా, ఉదయం గ్రీన్ టీ లో తేనెలా
  లోపలికి వెళ్ళింది మీ మజిలీ. కాశీలో మూడు సార్లు ఉద్యోగవాసం చేసినప్పటికీ, మీరు పది రోజుల్లో సేవించినంత కాశీపానకాన్ని మేం సేవించ లేకపోయాం.
  మీరు జీవితకాలంలో సేవించిన జ్ఞానామృతాన్ని ఇప్పుడు హర్షవనంలో తీర్ధంగా మాకు అందిస్తున్నారు. కాశీమజిలీ మజిలీలాగే రాసారు.
  కాశీ మీద రాసినన్ని పుస్తకాలు రోమ్ మీద రాసినవాటి కన్నా ఎక్కువని ఓ పండితుడు చెప్పారు. ప్రతీ ఊర్లో కిళ్ళీ దొరుకుతుంది. కానీ కాశీ కిళ్ళీ కాశీ కిళ్ళీయే. అదే ఆకు. అదే వక్క. అదే సున్నం. కానీ చేసే చెయ్యిని బట్టి కిళ్ళీ రుచి మారుతుంది. రాసే కలాన్ని బట్టి విషయం స్వాదిష్టం అవుతుంది. మీ చేతుల్లో కాశీమజిలీ అలా కాశీపాన్ లా రూపుదిద్దకుంది.
  మనం గడిపిన ఆ పదిరోజులూ మీ మజిలీలో భాగమైనందుకు మాకు చాలా సంతోషం కలిగింది.

 5. Dear sir
  You presented the reality of Kaasi in a picturesque beauty in the Gangatic aura of which I was totally bathed
  The imprint of your narration became a seed of longing to penetrate Kaasi with an inner eye

 6. Sir It is too beautiful and language wrote by you is excellent.Ex.Modi-fication and other words.You are great Sir 🙏🙏🙏🙏🙏

 7. గొప్ప అనుభవం గురుంచి అద్భుతంగా రచించారు. చాలా బావుంది హర్ష.

 8. Dear Bro,
  It is a truly great presentation that connected events of historical, mythological & modern times. Your erudite knowledge in this blog feels me more enjoyable. I also felt your Yatra places as if I could present physically.
  Wish you have more creative blogs in future!

 9. మీ ఆధ్యాత్మిక కాశీ యాత్ర విశేషాలు పరిశీలన అమోఘం! మీరు పొందే అనుభూతిని అక్షరబద్దం చేసే పద్ధతి బహు ప్రత్యేకమైంది. అభినందనలు సార్🙏🏼🙏🏼🙏🏼చలం

 10. చాలా రోజుల, కాదు ఈ మధ్య కాలములో ఇంత మంచి తెలుగు సాహిత్యాన్ని ఈ రచన ద్వారా మనకు రుచి చూపించిన రచయిత గారికి మనః పూర్వక నమోవాకములు. 

 11. హర్షవర్ధన్ గారూ!మీరు రాసిన ఎపిసోడ్స్ లో ఇదే సుదీర్ఘమైన దనుకుంటాను. మనో చక్షువుతో చూసారు కాబట్టే అనుభూతి అధికమయింది. అనుభూతి అక్షర రూపం ధరించడానికి మీరు పడిన శ్రమ సఫలీకృతం అయింది, విస్తారమయింది.
  అభినందనలు
  -అరిపిరాల.

  1. కాశీ పర్యటన అనుభూతిని అణువణువును మాకు అందించారు..ఇదే మహా ప్రసాదం

 12. What a wonderful narration sir…covering all the events in your journey and stay ,remembering every incident and a lucid presentation sir..👏👏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.