పదిరోజుల క్రితం కాటరాక్ట్‌ ఆపరేషన్‌ చేయించుకుని కోలుకుంటున్న ఎనభై దాటిన మా అమ్మ ఒక రోజు మధ్యాహ్నం నేను బ్లాగులో ఏదో రాద్దామని ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమిస్తుండగా ‘‘కేట్‌కు అన్నం వేసారా’’ అన్న ఆమె కేకతో నిద్ర ఎగిరిపోయి, రాయాలనుకున్న టాపిక్కూ ఎటోపోయి కేట్‌ ముచ్చట వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఇలా మొదలయ్యింది. కేట్‌ మా పెట్‌డాగ్‌ కాదు, అలా అని టైటానిక్‌ హీరోయిన్‌ కేట్‌ విన్స్లెట్ కూడా కాదులేండి. ఆమెకు అన్నం పెట్టే ఛాన్సూ మనకు రాదు, అలాగే ఆమె అన్నం తినేదీ లేదు.

కరోనా క్లైమాక్స్ కు చేరుకునే సమయం. మనుషులకే అన్నం దొరకని కాలం, కూలీల వలసలు పోతున్న కాలం. అలాంటి రోజుల్లో ఒకానొక రోజు మా నాలుగో ఫ్లోర్‌ అపార్టుమెంట్ ప్రక్కన సెయింట్‌ థెరీసా హాస్పిటల్‌ రెండోఫ్లోర్‌ రూఫ్‌ మీద ఎనిమిది, తొమ్మిది నెలల చిన్న కుక్కపిల్ల కుయ్‌కుయ్‌ మని తిరగడం చూశాము. హాస్పిటల్‌ వాళ్ళు రూఫ్‌మెట్ల దగ్గరిగేట్‌ మూసేయడంతో అది అక్కడే చిక్కుబడిపోయిందని తెలుసుకుని ఆ పూటకు మా ఫ్లాట్‌ కిటికీలో నుంచి దానికి ఆహారం వేసి, రెండో రోజు హాస్పిటల్‌ వాళ్ళతో మాట్లాడి మా తేజ గేటు తీయించాడు. అప్పటి నుండి అది రూఫ్‌ మీదకు రావడం మేము ఆహారం విసరడం గత ఏడాది నుండి దినచర్య.

మాలాగే వీధి కుక్కపిల్లకు చిక్కిన యువకవి మోహన్‌ రుషి, ‘కుక్కపిల్లలు దేవుడూ చల్లనివారే’! అన్న కవితలో …

‘‘గేటు ముందరనేనూ, నా ముందర తనూ, ఇక ఈ విషమ పరీక్షను
దాటుడెట్లు? దరిద్రపు అపార్టుమెంట్ బతుకు, పొమ్మనలేను, రమ్మనలేను.
ఈ కరకు అర్థరాత్రి ఒకర్నికరం చూసుకుంటూ నిలబడ్డాం, ఎవరైనా వచ్చి
ఈ రెండు కుక్కపిల్లలూ ఒక్క చోట ఉండగలిగే ప్రదేశానికి తీసుకుపోతే బాగుణ్ణు’’ అని వ్యధ చెందాడు.

కేట్‌ విషయం మా ప్లాట్స్ లో కొందరు దయార్ద్ర హృదయులకు తెలిసింది. మేము ఎప్పుడైనా ఊరెళ్తే వాళ్ళు ఛార్జి తీసుకుని దానికి ఆహారం వేసేవాళ్ళు. ఈ సంగతి తెలిసిన మరింత కరుణామయులు దానికి అన్నం పెట్టడం కన్నా ఏకంగా ముక్తినే ప్రసాదిస్తే మరింత పుణ్యమొస్తుందన్న సత్‌సంకల్పంతో GHMC Stray dog squad ను పిలిపించారు. మా కైవల్యానికి సాయపడదామనుకున్న ఆ అల్పజీవి దాక్కోవడంతో డాగ్‌స్క్వాడ్‌ వారు సర్దుకున్నారు. ఇలాంటి వారు కూడా ఉంటారా అని సందేహిస్తున్న నాకు ఒక ఇంటి ముందు చూసిన క్రిందబోర్డు కళ్ళు తెరిపించింది.

వాషింగ్టన్‌ మెడ్‌స్టార్‌ హాస్పిటల్లో న్యూరాలజీ ప్రొఫెసర్‌ రాబర్ట్‌ లారినో ఎన్నో కుందేళ్లు, ఎలుకలు, కుక్కలపై పరిశోధన చేసి అరుదైన విషయాలు కనుగొన్నారట. జీవితంలో ఎదురైన ఎన్నో చేదు అనుభవాల కారణంగా ఆయన ఒక రోజున అక్కడే ఫెలోషిప్‌ చేస్తున్న మా అబ్బాయి సందీప్‌తో ‘‘ఇవాళ కొంతమందిని చూస్తే ఇలాంటి మనుషులకోసం అకారణంగా అన్ని మూగజీవుల ప్రాణాలు తీసానా అన్న పశ్చాత్తాపం, అపరాధ భావన నాకు రోజురోజుకి పెరిగిపోతోంద’’ ని చెప్పి మధనపడ్డాడట.

మహాభారతంలో జనమేజయ మహారాజు యాగం చేస్తుండగా సారమేయుడు అనే పేరు గల కుక్క యాగస్థల పరిసరాల్లో తిరుగుతోందట. దానిని మహారాజు సోదరులు కొట్టి తరిమేస్తే అది పోయి తన తల్లి సరమతో చెప్పుకుందట. సరమ జనమేజయుని సభకు సారమేయుడిని వెంటబెట్టుకుని వచ్చి ఫిర్యాదు చేయడంతో ఆయన లోక్‌అదాలత్‌ నిర్వహించాడట.

సరమ ‘నా కుమారుడు ఏ నేరమూ చేయలేదు, యాగ ప్రాంగణంలోనికైనా ప్రవేశించలేదు. అదిలించితే పోయేదానికి కొట్టడం దారుణం’ అనడంతో జనమేజయుడు జరిగిన పొరపాటుకు చింతించి, తమ్ముళ్ళను మందలించి సరమకు క్షమాపణలు చెప్పినా కోపం తగ్గని సరమ ‘‘విచక్షణా జ్ఞానం కోల్పోయి సజ్జనులకు, పేదలకు, మూగజీవులకు హానిచేసే దుష్టులకు అకారణంగా భయం, బాధ, దు:ఖం సంభవిస్తాయి’’ అని హెచ్చరించి వెళ్ళిపోతుంది.

కేట్‌ వృత్తాంతం అంతా జ్యోతిష్య పరిజ్ఞానమున్న తమ్ముడు లక్ష్మీప్రసాద్‌తో ప్రస్తావిస్తే ‘‘ఏదీ కారణం లేకుండా జరుగదు’’ కేతుగ్రహ దోషపరిహారం మూగజీవుల ఆకలి తీర్చడమే అని చెప్పడంతో ఆ రోజు నుండి మా తేజ ఆ కుక్కకు ‘కేట్‌’ అని నామకరణం చేసి పిలవడంతో అది కూడా ఖాయం చేసుకుని పలకడం మొదలెట్టేసింది. కేతు నిస్వార్థ గుణానికి నిస్సంగత్వానికి ప్రతీకే కాక ఆధ్యాత్మిక ప్రచోద కారకుడట. కుక్క యజమానిపట్ల విశ్వాసానికి, షరుతుల్లేని ప్రేమకు ఆదర్శజీవి. కేతుగ్రహ కారకంగా తమ కోరికలను తగ్గించుకుని నిస్సంగత్వం అలవరచుకునేందుకు మూగజీవుల పోషణ దోహదపడుతుందని పెద్దల నమ్మిక.

గతంలో శ్రీ రామకృష్ణ ప్రభలో చిన్నకథ చదివిన గుర్తు. ఒక రిక్షావాలాకు సాయంత్రం వరకూ ఎంత ఎదురు చూసినా ఒక్క బేరమూ దొరకడం లేదట. అతడు గుడిలో ప్రవచనం చెబుతున్న స్వామిజీతో తన గోడు చెప్పుకోగా, స్వామిజీ ‘‘రోజూ ఉదయం పనికి బయలుదేరే ముందు గుప్పెడు అన్నం మెతుకులు వాకిట ముందు చీమలకు వేసి వెళ్ళు’’ అని చెప్పడం. అతడు అలా చేయడంతో రిక్షా ఆగకుండా తిరగడం జరిగిపోయిందట. దోసెడు వేసుంటే రిక్షాపోయి ఆటోనే వచ్చేదేమో!

చానాళ్ళ క్రితం ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళాం. అక్కడి పూజారి చాలా ప్రత్యేకంగా కనిపించారు. ఆయన భక్తులందరికీ స్వామి దర్శనం చేయించిన తరువాత గుడి ప్రాంగణంలో వారిని కూర్చోబెట్టి మంత్రాల అర్థాలను వివరించి, భక్తుల సహకారంతో చిన్నచిన్న సూక్తులను అచ్చువేయించి భక్తులకు పంచేవారు. వాటిలో ‘తల్లిదండ్రుల్ని, వృద్ధుల్ని గౌరవించండి, ఇరుగుపొరుగుతో సఖ్యతతో మెలగండి’ వంటి వాటితో పాటుగా ‘ప్రతిరోజు మీ ఇంటి మేడమీద పక్షులకు, ఉడుతలకు ఆహారం, నీరు పెట్టండి’ అన్నమాటలూ ఉండటం కూడా విశేషం. ఈ జీవ కారుణ్యం ఎంతో ప్రతిఫలాన్నిస్తుందని వారి నమ్మిక.

గత కొద్దినెలలుగా కేట్‌కు ఆహారం అందించడం అలవాటుగా కొనసాగుతోంది. మా పిల్లలు కేట్‌కు పౌష్టికాహారం కోసం డాగ్‌ బిస్కెట్లూ తెప్పించారు. ఈ విషయాలన్నీ రాయడం మొదలుపెట్టగానే కథ ఊహించని మలుపు తిరిగింది. ఒక రోజు మధ్యాహ్నం ఆహారం ఇవ్వడానికి కేట్‌, కేట్‌ అని ఎన్నిసార్లు పిలిచినా అది రాలేదు. ఎటో పోయుంటుందిలే అనుకుని రాత్రి మరో సారి పిలిచినా కనపడకపోవడంతో మాకు ఆందోళన మొదలయ్యింది. మరుసటి ఉదయం మా వాచ్‌మెన్‌ నాగబాబును ప్రక్క బిల్డింగ్‌లోకి కేట్‌ అన్వేషణకు పంపగా (యూట్యూబ్‌ వీడియోల్లో ఇది చూస్తే కన్నీళ్ళు ఆగవు, అన్నట్లు కాదులెండి) నిజంగానే షాకింగ్‌ వార్త. ఏదో సాహసం చేయబోయిన కేట్‌ సెకండ్‌ ఫ్లోర్‌ నుండి దూకి పదడుగుల క్రింద విండో షేడ్‌ మీద పడి చిక్కుబడిపోయింది. అది కిందకు దిగేంత ఎత్తుకాదు. పైకి ఎక్కడం దానివల్ల కాలేదు. గత రెండు రోజులుగా తిండి తినలేదన్న ఆందోళన ఎక్కువై నాగబాబు ఫుడ్‌ప్యాకెట్‌ విండో షేడ్‌ మీదకు విసిరితే, అది దిగులుతో అక్కడే కొంత కతకడంతో అందరికీ కొంతలో కొంత రిలీఫ్‌.

దూకుడుతో

త్రిశంకులో కేట్‌

నాగబాబు ఉదయం లైవ్‌ రిపోర్టింగ్‌ ఇవ్వడంతో అందరం మా అపార్టుమెంట్ పైకి చేరి కేట్‌ నిస్సహాయ స్థితిచూశాం. కేట్‌ అని పిలవడంతో నా గతేంటి అని అది మొసలి నోట చిక్కిన గజేంద్రునిలా బేలచూపులు చూడటంతో నీరసించాము. మాలో ఎవరూ విష్ణుమూర్తులు (ఒట్టండి! మా ప్లాట్స్ లో విష్ణుమూర్తులు కాదు కదా కనీసం శ్రీహరులూ లేరు) కాకపోవడంతో ‘‘సిరికిన్‌ చెప్పడు, శంఖచక్రములు జేదోయి సంధింపడు’’ అని పాడుకోవడానికి మాత్రమే పరిమితమయ్యాము.

కేట్‌ను చూసి ఫ్లాట్లోకి వచ్చే లోపు మస్తిష్కంలో కిడ్నాపర్స్‌ సైకాలజీ, పోలీస్‌ ఖైదీ సైకాలజీ, జడభరతుడు, శుకమహర్షి ఉదంతాలు మూవీ ముందు యాడ్లలా చకచకా కదిలిపోయాయి. ఈ లోపు మా కోడలు రితిక Blue cross, Animal Rescue Teams వాళ్ళ కోసం ఎంత ప్రయత్నించినా ఆ రోజు ఆదివారం కావడంతో మధ్యాహ్నం వరకూ ఎవ్వరూ రెస్పాండ్‌ కాలేదు. వాళ్ళు వచ్చేలోపు బుర్రలో తిరుగుతున్న రీళ్ళన్నీ మీ ముందు విప్పేస్తా.

కిడ్నాపర్ల సైకాలజీలో కిడ్నాప్‌ అయినవాళ్ళు, కిడ్నాప్‌ చేసిన వాళ్ళ మధ్య రోజులు గడిచే కొద్దీ దోస్తానా కుదురుకుంటుందట. నిజజీవితంలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ కిడ్నాప్‌ ఉదంతంలో రోజులు గడిచే కొద్దీ కిడ్నాపర్స్‌ ఆయనకు దగ్గరై చాలా బాగా చూసుకున్నారన్న వార్త విన్నాం, రోజా సినిమాలో కిడ్నాప్‌ అయిన హీరో అరవిందస్వామి క్లాసులతో కరుడుగట్టిన తీవ్రవాది సైతం క్లైమాక్స్ లో మనసు మార్చుకుని ‘‘వెళ్ళు నేస్తం, నువ్వొక తీవ్రవాదినే మార్చావ్‌’’ అని అతడ్ని వదిలేయడమూ చూశాం. మా నాన్నగారు పోలీసు అధికారిగా పని చేస్తున్నప్పుడు దీర్ఘకాల శిక్షలనుభవించే ఖైదీలు, జైలువార్డెన్ల మధ్య, పలు వాయిదాలకి కోర్టుకు వెళ్ళే నేరస్థులకు, పోలీసులకు మధ్య తెలియని సాన్నిహిత్యం, అనుబంధం ఏర్పడటం నా చిన్నప్పుడు కళ్ళారా చూశాను. వారి మధ్య బేడీల మీదుగా బీడీలు, అగ్గిపెట్టెల ఎక్స్చేంజ్‌తోపాటు వారి కుటుంబాల యోగక్షేమాల పరామర్శలు సర్వసాధారణ దృశ్యాలే! ఇదంతా దీర్ఘకాల సంగమంతో ఏర్పడ్డ బాంధవ్యమే. Familiarity breeds contempt అన్న నానుడికి ఇలాంటివి చిన్న exceptions ఏమో!

పూర్వం మహారాజుగా జీవించిన జడభరతుడు తీవ్ర వైరాగ్యంతో తపస్విగా మారి జీవనం కొనసాగిస్తూ ఒకరోజు తల్లిలేని జింక పిల్లపై జాలిపడి దానిపై ప్రేమను పెంచుకోసాగాడు. ఆ జింకపిల్ల స్పర్శ ఆయనకు ఎంతో ఆనందాన్నిచ్చేది. జింక పిల్ల పెద్దదై మేత కోసం అడవిలో కాస్తదూరం వెళ్ళి సమయానికి తిరిగి రాకపోయినా మహర్షి దాని గురించే ఆలోచిస్తూ ఉండేవారు. ఆయన క్రమంగా భగవన్నామస్మరణా మరచి జింకపిల్ల ధ్యాసలో పడిపోయారట. ఇలాంటి బంధనాలకు భయపడే శుకమహర్షి ఎక్కడా ఎక్కువ కాలం నిలిచేవారు కాదట. ఒక ఆవుకు పాలు పితికే సమయం దాటే లోపే ఆయన ఆ స్థలం విడిచిపోయేవారట. చిరకాల సాన్నిహిత్యం వ్యక్తులకు, జీవులకు బంధనాన్నేర్పర్చి వారి సాధనకు ప్రతిబంధకం అవుతుందని శుకమహర్షి బోధ. మహాతపస్వి కణ్వ మహర్షి సైతం తను పెంచుకున్న శకుంతలను వీడలేక తీవ్ర మనో వేదనకు గురయ్యాడు.

సోమవారం సాయంత్రానికి Animal Warriors Rescue Team రావడంతో ఆలోచనా స్రవంతికి తెరపడింది. రెస్క్యూ టీమ్‌ వాళ్ళు ముగ్గురూ పర్వతారోహకుల్లా తాళ్ళు కట్టుకుని సన్‌షేడ్‌ మీదకు దిగి కేట్‌ను వలలో చేర్చి క్రిందకు జార్చారు. మా కేట్‌ రక్షకుడు ‘అలవైకుంఠపురంబులో నా మూల సౌధంబు’ నుండి రాలేదు కాని విష్ణు మూర్తి డెలిగేషన్‌తో అస్సామ్‌లోని జోర్హట్‌నగరి నుండి వచ్చాడనేది వాస్తవం. రెస్క్యూటీమ్‌లో కిందకు దిగిన సాహస బాలుడిపేరు హరిచరణ్‌. మూగజీవుల పట్ల ప్రేమతో ఈ పనిలో కుదురున్నానని చెప్పాడు. అతడు దిగి వల పన్ని క్రిందకు దించగానే కేట్‌ పరుగు తీసి సాయంకాలానికి తిరిగి రూఫ్‌ మీదకు చేరుకుని డిన్నర్‌కు సిద్ధమవడంతో కథసుఖాంతం అయ్యింది కాని నా ఆలోచనలు అంతం కాలేదు.

ఆపరేషన్‌ కేట్‌

తిరుపతిలో చదువుకుంటున్న రోజుల్లో స్వామి చిన్మయానంద గీతా జ్ఞానయజ్ఞానికి వెళ్ళా. స్వామిజీ తమ ప్రవచనంలో ‘Wherever there is attachment there is fear’ కనుక నిస్సంగత్వంతో జీవించాలి. అది సాధ్యం కాకపోతే కనీసం practice attached detachment అని చెప్పారు. విన్నప్పుడు అబ్బ ఎంత తేలికో కదా! అనుకున్నా. ఆచరణ ఎంత కష్టమో కేట్‌ కథ మమ్ముల్ని ఒక ఊపు ఊపాకే తెలిసింది. జడభరతులు, కణ్వమహర్షులే అంతగా చలించిపోతే మనమే పాటి అని నాకు నేనే సర్ధిచెప్పుకున్నా.

శ్రీశ్రీ గారి ‘‘మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము’’ అని పాడుకునే అతి కొద్దిమంది అదృష్టవంతులున్న అమెరికాలో పెట్‌డాగ్స్‌ ఉండబట్టి సరిపోయింది. లేకపోతే ఇంటికో సైకియాట్రిస్టుండాల్సిందే! ఇప్పుడు మనమూ ఆ దారే పట్టాములెండి.

కుక్కతోక పట్టుకుంటే గోదారి ఈదలేక పోవచ్చేమో గాని కుక్కను పెంచుకుంటే సైకియాట్రిస్టు గడప తొక్కనసరం ఎన్నటికీ రాదు. కనీసం దానిలా షరతుల్లేని ప్రేమను, విశ్వాస గుణాన్ని అలవరచుకుంటే స్వర్గ ద్వారాలను చేరుకోగలం. అక్కడ దాకా పోవాలే గానీ గేట్‌ కీపర్‌ కాళ్ళో, గడ్డమో పట్టుకుని లోనికి జొరబడలేమంటారా? మనకు ఎంపిరికల్‌గా మహాభారత క్లైమాక్స్ లో ధర్మరాజు సైతం కుక్కతోనే స్వర్గలోకం చేరుకున్నారట. మనం ధర్మరాజులం కానప్పుడు వాటి గుణాలతో అయినా ఎదుగుదాం.

ఈ కేట్‌ ముచ్చటతో పద్మపురాణంలోని
‘‘ఋణానుబంధ రూపేణ
పశుపత్ని సుతాలయా:’’ అనుభవైకవేద్యం.

స్వర్గారోహణ

ఎందుకైనా మంచిది life నుండి మనం detach అయ్యేలోపు జీవితమనే సర్కస్‌ తీగెపై attachment-detachment balance చేయడం సాధనచేద్దాం. పడిపోతామని భయపడకండి. I have a good panel of orthopaedicians to take care. ఇకనేం, కొత్త సంవత్సరంలో ప్రాక్టీసు మొదలెట్టండి బాబయ్య!

(ఆత్మీయులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలతో…)

7 Replies to “కేట్‌”

  1. హర్షవర్ధన్ గారు ఏ విషయాన్ని తీసుకొన్నా చాలా చక్కగా వ్రాస్తున్నారు. ఎన్నో సందర్భాలను, పురాణాలలో ఘట్టాలను ఉటంకిస్తూ వ్రాయాలంటే చాలా విషయ పరిజ్ఞానం అవసరం.

  2. కేట్ అదే పెట్ విశేషాలు బాగున్నాయి సర్👌👍🙏🏼

  3. ఇక నుండీ దానిని ముద్దుగా
    Cate ‘win’ slet అని పిలుచుకోవచ్చన్నమాట-టైటానిక్ మూవీ హీరోయిన్ లాగా బతికి బట్ట కట్టినందుకు.. కాకపోతే అక్కడ షిప్పు ముంచింది. ఇక్కడ ఫ్రెండ్షిప్ తేల్చింది.
    నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా..

  4. అద్భుతంగా వుంది సార్. విశ్వాసం
    అనే పదం కుక్కలకే పరిమితం కాకుండా మనుషుల్లో కూడా పెంపొందాలి.

  5. అంతా చదివిన తర్వాత “Oh My Dog” అనిపించింది.😀

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.