జీవితం దర్శకుని ఉచ్ఛ్వాస కావాలి
సినిమా దర్శకుని నిశ్వాస కావాలి
– మేరీ సెటన్

నేను ఏలూరులో పనిచేస్తుండగా 2002లో పాలకొల్లు దగ్గర ‘అల్లరి రాముడు’ సినిమా షూటింగ్ జరుగుతోందని అందులో శ్రీ విశ్వనాధ్ గారు నటిస్తున్నారన్న వార్త తెలిసి ఎగిరి గంతేసి, వారిని కలిసే ప్రయత్నం చేసాను. అదృష్టవశాత్తూ చిత్ర నిర్మాత చంటి అడ్డాల గారు నాకు చిరకాల మిత్రులు, సిద్దిరెడ్డి గణపతి గారికి సన్నిహితులు కావడంతో, వారి సహకారంతో విశ్వనాధ్ గారిని కలవడానికి షూటింగ్ జరిగే రోజుల్లో ఒక సాయంత్రం కుదిరింది. వారిని కలుసుకోడానికి ప్రత్యేకంగా ఏలూరి నుండి పాలకొల్లు బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు వారు బస చేస్తున్న వీనస్ లాడ్జికి చేరాను. సాయంత్రం వరకు షూటింగ్ లో పాల్గొని అప్పుడే వచ్చి రెస్టులో ఉన్నారని చెప్పారు.

మరికొంత సేపటికి వెళ్లేసరికి వారు స్నానం, సాయంకాల పూజాదులు ముగించుకొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. వారు ఉంటున్న గది దేవునిపటం, పూలు, అగరొత్తుల సువాసనతో దేవాలయాన్ని తలపించింది. అంత గొప్పవారితో సంభాషణ ఎలా ప్రారంభించాలని సందేహిస్తున్ననన్ను ఆప్యాయంగా ‘మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడకు ఎప్పుడు వచ్చారు’ అని పలకరించారు. సాయంకాలం వరకు షూటింగ్ లో పాల్గొనడం వలన అలసటగా ఉన్నా ఒక్క పది నిముషాలు మాత్రం మీతో గడప గలను అన్నారు. అదే మహాభాగ్యం అనుకున్నాను. మరిన్ని కుశల ప్రశ్నల తరువాత వారితో సాన్నిహిత్యం బలపడి వారి సినిమాల గురుంచి కొంత ముచ్చటించుకున్నాము.

వారిని మొట్టమొదటగా ‘మీరే గొప్ప దర్శకులు కదా! అటువంటప్పుడు వేరే దర్శకుల ముందు నటించేటప్పుడు మీ అనుభూతి ఏమిటి? వారు సక్రమంగా దర్శకత్వం చేయకపోతే వారిని సరిదిదుతారా?” అని అడిగాను. దానికి వారు నవ్వుతూ ‘ఎంత గొప్ప సర్జన్ అయినా ఇంకొక సర్జన్ దగ్గరకు వైద్యానికి వెళ్ళినప్పుడు సూచనలు ఇవ్వకూడదు కదా! ఇదీ అలాంటిదే. ఇవాళ్టి నా పాత్ర నటుడిది. కనుక కేవలం దర్శకుని సూచనల ప్రకారమే వెళ్ళాలి’ అని చెప్పడంలో వారి నమ్రతను, వినయాన్నీ చూపారు.

సినిమా బలమైన మాధ్యమం కనుక మనుషుల్ని ప్రభావితం చేస్తుందా? అని అడిగితే, తప్పకుండా చేస్తుందని చెబుతూ వారు దర్శకత్వం వహించిన ‘సిరిసిరిమువ్వ’ విడుదలైన కొన్ని నెలల తరువాత వారి అభిమాని ఎవరో ఫోన్ చేసి ‘సార్ మీ సిరిసిరిమువ్వ సినిమా చూసి నేను ఒక మూగ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను’ అని చెప్పాడట. ఉత్తమ సినిమాల ప్రభావం ఎలాంటిదో చెప్పడానికి ఇంతకంటే మంచి నిదర్శనం ఇంకేముంటుంది. అలాగే కొన్ని క్రైమ్ సినిమాలు చూసి తాము ఎలా దొంగతనం చేసింది, పట్టుబడిన దొంగలు పోలీసులకు వివరించడం మనం చూస్తున్నాము కదా. అంత బలమైన ప్రభావం చూపగల సినిమాలకు దర్శకత్వం వహించే దర్శకునికి సామాజిక బాధ్యత ఉండాలని, ప్రజలను సన్మార్గంలో నడిపించడానికి అవి ప్రేరణగా ఉండాలని తెలియచేసారు.

వారు దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లో మానవతా విలువలకు, సంప్రదాయాలకు, శాస్త్రీయ సంగీతానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. వారి సినిమాల్లో కధానాయకులందరూ ఆదర్శ పురుషులు, మర్యాద రాముళ్లు. ‘శంకరాభరణం’ సినిమాలో శంకరశాస్త్రిగా జే. వీ. సోమయాజులు గారితో నూతన శకం ప్రారంభింప చేసినా, ‘సిరివెన్నెల’ సినిమాతో సీతారామశాస్త్రి గారి ఇంటి పేరు మార్చేసినా అది వారికే తగును. ‘స్వయంకృషి’ లో చిరంజీవి గారిని ‘శ్రమయేవ జయతే’కు ప్రతీకగా చూపించినా, ‘ఆపద్భాందవుడు’లో ఆరాధనకు, త్యాగానికి ప్రతీకగా కథానాయకుడిని చిత్రీకరించినా, ‘సాగర సంగమం’ లో భగ్న ప్రేమతో వ్యసనపరుడిగా కమలహాసన్ ను చూపించినా, అత్యంత సంస్కారవంతులుగా ఉన్నతులుగా మన సానుభూతిని, అభిమానాన్ని చూరగొనేలా వారి పాత్రలను తీర్చిదిద్దడం కళాతపస్వి విశ్వనాధ్ గారికే సాధ్యమయింది.

‘శంకరాభరణం’ సినిమా తరువాత చాల మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు శాస్త్రీయ సంగీతం నేర్పించడం, స్వర్ణ కమలం, సాగర సంగమం, శృతిలయలు సినిమాల తరువాత శాస్త్రీయ నృత్యం నేర్పించడం వారి ప్రతిభకు గీటురాయి. ‘శంకరాభరణం’ సినిమాలో నటించడానికి ముందు నెగటివ్ పాత్రలకే పరిమితమైన మంజుభార్గవి గారిని ఒక్కసారిగా కరుణాపూరితమైన ఉదాత్త పాత్రలో చూపించి ప్రేక్షకుల మైండ్ సెట్ నే మార్చేయ గలిగిన సమర్థులు విశ్వనాధ్ గారు. ఈ పాత్రకు ఆమెను ఎంపిక చేసినప్పుడు చాలామంది సందేహపడిన వారు పూర్తి విశ్వాసంతో ఆ పాత్ర ఆమె చేయడమే సముచితం అనిపించేలా నటింపచేసి ఔరా అనిపించారు.

వేటూరి సుందరరామూర్తిగారి ప్రతిభను ప్రస్తావిస్తూ శంకరాభరణం సినిమాలో అత్యంత ప్రజాదరణ పొందిన గొప్ప సంగీత, సాహితీ విలువలు కలిగిన పాటలన్నీ వారు అలవోకగా అతి కొద్దీ రోజుల్లో రాసి ఇవ్వడం వెనుక వారి ప్రతిభ పతాకస్థాయిలో ఉండడమే కారణం అని చెప్పారు. ఇలా పది నిమిషాలని వారు నాకు పెట్టిన గడువు దాటి సుమారు గంటకు పైగా మా సంభాషణ కొనసాగింది. చివరగా వారి వద్ద సెలవు తీసుకునేటప్పుడు ‘మీరు నేను వెళ్ళేలోగా మరొకసారి రాగలరా’ అనిపించుకునే అదృష్టాన్ని నాకు కల్పించారు. వారు షూటింగ్ ముగించుకొని వెళ్ళేలోగా మరొకసారి వారిని కలిసి ముచ్చటించుకోవడం జరిగింది. వారితో గడిపిన మధుర క్షణాలు మరువలేనివి.

కళాతపస్వి సన్నిధిలో

గతంలో ఒక మిత్రునితో మాట్లాడుతున్నప్పుడు మన తెలుగు ఉత్తమ దర్శకులు బాపు గారు, విశ్వనాధ్ గార్ల గురించి ప్రస్తావించుకున్న మాటలు గుర్తొచ్చాయి. బాపు గారు (సత్తిరాజు లక్ష్మీనారాయణ గారు) రామ భక్తులు అవడం వల్లనేమో అన్నీ రామకథలే ఇతివృత్తంగా ఆయన సినిమాలుంటాయి. అలాగే శివనామధారి విశ్వనాధ్ గారు (ఇంటిపేరుతో కలిపితే శివద్వయం) కావడంతో ఆయన సినిమాలన్నీ శివమయం అయి, ఆయన కథానాయకులు కూడా సాంబయ్య, శివయ్యలే అయ్యారు. ఈ విధంగా శివ, కేశవ దర్శనం మనకు వారు కలిగించడం మన అదృష్టం అనుకున్నాము. బాపుగారు, విశ్వనాధ్ గారు తెలుగు వాళ్లవడం మన పూర్వజన్మ సుకృతం.

ఎన్ని గొప్ప చిత్రాలు తీసినా, ఎన్ని జాతీయ అవార్డులు గెలుచుకున్నా వారు నిర్మలలు, నిరాడంబరులు. Cinema is extension of one’s life and personality అనేది ఎంత వాస్తవమో వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే వారి చిత్రాల్లోని కధానాయకుల పాత్రలను చూస్తే మనకు అవగతం అవుతుంది. సినిమాల ద్వారా మన సాహితీ, సాంస్కృతిక రంగాలకు వారందించిన సేవ ఎనలేనిది. నా జీవితాన్ని వ్యక్తిత్వాన్ని వారి శివయ్య (స్వాతిముత్యం), బాలు (సాగర సంగమం) వంటి సజీవ పాత్రలు ఎంతో ప్రభావితం చేశాయనేది వాస్తవం.

స్వాతిముత్యం సినిమాలో పసివాడికి మేలు జరగాలని నిప్పుల మీద గాయపడిన శివయ్యని చూడ్డానికి వచ్చిన వైద్యుడు వాళ్ళ నాయనమ్మతో ‘నువ్వు అదృష్టవంతురాలివి రాజమ్మా! మనిషి స్వార్ధాన్ని చంపుకొని ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా పరోపకారాన్ని చెయ్యాలంటే ఎంతో దీక్ష ఉండాలి. సాధన కావాలి. అలాంటి వాణ్ణి యోగి అంటాం.’

‘మరి నీ మనవడు ఏ ప్రతిఫలాన్నిఆశించి నిప్పుల్లో దూకాడంటావ్? వాడు దుమ్ముధూళి అంటని స్వాతిముత్యం. జన్మతః యోగి, మహాజ్ఞాని. అలాంటి వాడికి నువ్వు సేవ చేస్తున్నావ్, ఇంతకంటే ఏం కావాలి చెప్పు’ అని అనిపించడంతో ఒక్క శివయ్య వ్యక్తిత్వాన్ని కాదు, ఉత్తమ పురుషుడి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపచేశారు. ఈ సన్నివేశ బ్యాక్ డ్రాప్ లో మెహర్ బాబా ఫోటో పై ఉన్న real happiness lies in making others happy అన్న మాటలతో కధానాయకుడు శివయ్య వ్యక్తిత్వాన్ని మరింత ఎలివేట్ చేసి చూపించిన గొప్ప ప్రతిభాశాలి కళాతపస్వి విశ్వనాధ్ గారు.

స్వర్ణకమలం చిత్రంలో సంప్రదాయం పట్ల, పెద్దల పట్ల ఏ మాత్రం గౌరవం చూపని ప్రభుత్వాధికారిని కధానాయకుడు సూర్యంతో ఒక దులుపు దులిపించి, ‘మనస్సు లేని నృత్యం, ఆత్మ లేని శరీరమే’ అని ఒక విదేశీ నర్తకితో అనిపించి కథానాయికకు కనువిప్పు కలిగించి, సమాజం పట్ల, కళల పట్ల మనం సరైన దృక్పధాన్ని ఎలా అరవరచుకోవాలో తెలియజేసారు.

విశ్వనాధ నమోనమః.
(కాశీనాథుని చేరిన కారణ జన్ములకు నివాళులతో)

13 Replies to “కళాతపస్వి విశ్వనాధ్ గారు”

 1. Great memories regarding our greatest director of Telugu film industry and a grat human being.
  మీరు ఆయనతో కలవటం మళ్లీ తిరిగి ఆయన మిమ్మల్ని ఆహ్వానించటం గొప్ప విషయం.
  మీరు విశ్వనాథ్ గారితో గడిపిన మధురస్మృతులు మాతో పంచుకోవటం మాకెంతో ఆనందం కలుగచేసింది

 2. Thank you for sharing your personal experiences with legendary Director, Actor and more importantly a fine Human Being

 3. విశ్వనాధ్ గారిలాంటి లబ్థప్రతిష్ఠులతో మీ పరిచయం, ముచ్చట్లు చాలా ప్రత్యేకం! అవి మీకు మాత్రమే సాధ్యమైంది.——————చలం

 4. Excellent meeting. I met him in a lift in Greem park Vizaq. I did not know at that time that he was such a great personality.

 5. Extremely well written sir. It is an analytical article on legend Viswanath garu giving your personal insight.

 6. కళాతపస్వి విశ్వనాథ్ గారిని సందర్భోచితంగా మీ హర్షవనం లో ఆవిష్కరించడం హర్షణీయం.

 7. విశ్వనాథ గారితో పరిచయం మీ అదృష్టం.
  ఆ మహనీయుని కి మీ నివాళి చక్కగా ఉంది సర్!!!

 8. Anna it is a great feeling to meet vishawanath garu …I met once in Hyderabad along with director aditya he is Brahma who created a great characters and gave life to many people..we missed him I don’t know weather we can see such a great creator… we pray for him OM SHANTI

  1. We need proud of him such a great director , actor , sound engineer, who always tried to give a meaningful full messages to society

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.