ఫిజిక్స్ ఏ కాస్త చదువుకున్నా మనకు దగ్గరగా ఉన్న ఒకానొక నక్షత్రమే మన ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడని తెలిసే ఉంటుంది. నక్షత్రాలన్నీ రాత్రుల్లో దూరం నుంచి ఆకాశంలో తళుక్కున మెరుస్తూ అందంగా కనబడతాయి. సరదాపడి వాటి దగ్గరకు పోయామా అంతే, వొళ్ళు కాలి మండిపోతాం. ఆకాశంలో స్టార్స్ మనకు కనబడటం లేదు. మనం వాటిని చూడటం కూడా ఎప్ప్పుడో మానేసాం. వాటి స్థానాన్ని మన సినీస్టార్స్‌కు ఇచ్చేశాం. ఈ స్టార్స్‌లో కూడా చాలా మంది దూరం నుంచి భలే బాగుంటారు. దగ్గరకు పోయామా ఎక్కువసార్లు సన్ బర్న్స్యే. ఈ భయంతోనే మాయాబజార్లో మాయా శశిరేఖ “ఆర్య పుత్రులు దూరం దూరం” అన్నట్లు వారితో ఎక్కువ దూరమే ఉంచుకున్నాను.
ఎంత దగ్గరకు వెళ్ళినా, తాకినా వెన్నెల్లా చల్లదనాన్ని పంచే ఒకే ఒక స్టార్ మా “మెగా స్టారే”. వారి పేరుకు ఆ బిరుదు చేరకముందే 90 శకంలో ఆపద్భాందవుడు షూటింగ్ జరిగేటప్ప్పుడు పూడిపల్లి గ్రామంలో మొట్టమొదటసారి వారిని కలిశాను. అప్ప్పుడు మా అబ్బాయి సందీప్‌కు నాలుగేళ్ళు. పెద్గగా మాట్లాడే అవకాశం లేకపోవడంతో వారితో ఒక ఫొటో దిగాం. ఆ కాసేపట్లోనే సిగ్గుతో తలదించుకున్న మా అబ్బాయితో “తలెత్తవయ్యా బాబు. మళ్ళీ ఇంటికెళ్ళిన తరువాత అసలు చిరంజీవిని చూపించలేదని మీ నాన్నతో పేచీ పెట్టొద్దు” అని వాడి తలెత్తించి చూశారు. ఆ తరువాత ఎస్.వి.ఆర్ గారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన సంగమం అకాడమి సంజయ్‌కిషోర్ ఎస్.వి.ఆర్ గారి చిత్రమాలికా విశేషాలతో మంచిపుస్తకాన్ని ప్రచురించాడు. ఆ పుస్తక కమిటిలో సభ్యునిగా ఉన్న నాకు పుస్తకావిష్కరణ సభలో “చిరు” సన్మానం చేయించారు. శాలువా కప్పి మెమెంటో ఇచ్చే లోపే వారు నన్ను కుశల ప్రశ్నలడిగి ఆప్యాయంగా పలకరించారు. రెండో ప్రయత్నంలోనూ అంత కంటే మాట్లాడే అవకాశం దొరకలేదు.

ఇటీవల చిరంజీవిగారికి పద్మ విభూషణ్ పురస్కారం వచ్చిన తరువాత వారిని కలిసి అభినందించాలనుకున్నా. మా చెల్లెలు రేవతితో వారి కుటుంబానికి ఉన్న కొద్ది సాన్నిహిత్యం ఈ సారి నా కోరిక పూర్తిగా నెరవేర్చింది.
మేము వారి ఇంటికి ఒకరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు చేరాము. సురేఖ గారు మమ్ముల్ని సాదరంగా ఆహ్వానించి చిరంజీవి గారు ఇంట్లోనే రొటీన్ మెడికల్ చెకప్ చేయించుకుంటున్నారని, వచ్చేస్తారని చెప్పారు. మరో పదినిముషాలకు వారు వచ్చీరావడంతోనే “కాస్త ఆలస్యమయింది, సారీ” అన్నారు. వారిని అభినందించిన తరువాత నేను రాసిన “వాణిజ్యఫన్నులు” పుస్తకంలో వారు చదివిన నర్సాపురం వై.ఎస్.కాలేజి ప్రస్తావన ఉండటంతో వారికి పుస్తకాన్ని ఇచ్చి ఆ సంగతి గుర్తు చేశాను. నర్సాపురం మాటెత్తగానే వారు కొండంత పొంగిపోయారు. పుస్తకంలో కొన్ని పేజీలు అప్ప్పుడే చదివి సంతోషంతో మరిన్ని నర్సాపురం ముచ్చట్లు మాతో పంచుకున్నారు. మధ్యమధ్యలో “మీకు టైముంది కదా! పర్వాలేదా?” అని అడగడంతో నవ్వొచ్చింది. పుస్తకం ఇంకాస్త తిరగేసి అందులో చివరలో రాసిన విషయమేదో వారికి నచ్చడంతో “ఈ సంగతులు నేను ఎక్కడైనా వాడుకోవచ్చా” అని అడిగారు. “రఫ్ ఆడిస్తా, ఫేస్ కొంచెం టర్నింగిచ్చుకో, అల్లుడు బూతులు మింగేయ్, తింగరి బుచ్చి, కోడి రక్తం, యాక్షన్ చింపుతా”, లాంటి మీ ఎన్నో పేటెంట్లను మేము మీ పర్మిషన్ లేకుండా రోజూ ఎడాపెడా వాడేస్తున్నాం సార్ మీరు నిరభ్యంతరంగా వాడుకోవచ్చని” చెప్పా.
మాతో వారు గడిపిన గంటన్నర సమయంలో ఒక్కసారి కూడా ఫోన్ చూసుకోలేదు. ఏ distraction లేకుండా మా కోసమే మాతోనే గడపడం వారిపట్ల గౌరవభావాన్ని మరింత పెంచింది. సమయం ఒంటిగంటన్నరవుతున్నా మా అందరితో ఓపిగ్గా ఫొటో సెషన్స్ చేశారు. నేనెదో పెద్ద సెలబ్రిటీని అన్నట్లు మా వాళ్ళందర్నీ పక్కకు జరిపి ప్రత్యేకంగా నాతో ఒక ఫొటో దిగారు. ఫొటో కోసం వారిని తాకినా, (తాకి చూడండి మీకే తెలుస్తుందన్న యాడ్‌లా) చాలా కూల్‌గానే ఉన్నారు. మాటలు ముగించి ఇంట్లో నుంచి మా కారు దగ్గరకు వెళ్తుంటే వారు మాతో రావడం చూసి “వద్దండి ప్లీజ్” అంటే, ఎండలో తిరక్కే “డి” విటమిన్ లోపం మరేం పర్లేదు అని కారు వరకు వచ్చి మమ్ముల్ని సాగనంపారు.
కారులో ఇంటికి వెళ్తూ వారి ఔదార్యాన్ని తలుచుకుంటుంటే వారి జీవిత గమనం కలైడోస్కోప్ దృశ్యాల్లా గుర్తు చేసుకున్నాను. చిరు ఉద్యోగి కొడుకుగా మధ్యతరగతి కుటుంబంలో పెద్దన్నగా ఏ అండదండలు లేకుండా కేవలం “స్వయం కృషి” తో నటనపట్ల ‘ఆరాధన’తో ఈ పోటీ ప్రపంచంలో వారు “మెగాస్టార్” గా ఎదగడం అనితర సాధ్యం. కృషి, పట్టుదలతోపాటు ఆయన్ను ఆయన మలుచుకున్న తీరు నేటి యువతరానికి గొప్ప స్ఫూర్తి. వారు చిత్రసీమలో ప్రవేశించే నాటికి నలుగురు దిగ్గజహీరోలు సినీ రంగంలో స్థిరంగా ఉన్నారు. ఎలాంటి వాక్యూమ్కు తావులేదు. తనదైన స్టైల్‌తో, ప్రత్యేకతతో ఆయన మార్క్‌తో నిలదొక్కుకున్నారు. ఎందరికో చేయూతనిచ్చి వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఒకానొక సమయంలో తోటి నటుడు “ఆగ్రహం” కనబరచినా, సినీ వేడుకలో మేటి విలన్ వేదికపై సిసలైన విలనత్వాన్ని ప్రదర్శించినా, సాటి హీరోయిన్ కొంత కాలంపాటు విమర్శలు గుప్పించినా, చివరకు అవధానులు అవధులు మీరి అనుచితంగా ప్రవర్తించినా ఏ సందర్భంలోనూ ఏ మాత్రం నిగ్రహం కోల్పోక సంయమనం పాటించి Patience pays అని నిరూపించారు.

శివశంకర వరప్రసాద్ గారు చిరంజీవి గా మారడం కాకతాళీయం కాదు. కేవలం ఈశ్వరానుగ్రహంతో, హనుమత్ కృపతో అని నమ్ముతాను. అంతులేని స్టార్డమ్, ఛరిస్మా, ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిన తరువాత ఇంత గ్రౌండెడ్‌గా ఉండటానికి ఎంతో సాధన, దీక్ష ఉండాలి. అన్న విజిలేస్తే మాస్, అన్న నడిచొస్తే మాస్ అన్న సినీ తళుకుల పంచరంగుల ప్రపంచంలో ఉన్న వారికి అది మరింత కష్టం. నిరంతరం ఫ్లడ్ లైట్స్ మధ్య, రిఫ్లెక్టర్ల మెరుపుల్లో ఉన్నవారికి ఎదుటి వారు మనుషులుగా కనపడటమే కష్టం. సహజ సుందరమైన జన్మ సంస్కారం గల చిరంజీవి గారికి మాత్రమే అది చెల్లింది. అర్థశతాబ్ధపు సినీ ప్రస్థానంలో పావు శతాబ్దం నుండి “మెగాస్టార్” బిరుదును, బాధ్యతగా మోస్తూ, పద్మశ్రీ, పద్మభూషణాలు వరించినా వీసమంతైనా భేషజం, స్వాతిశయం లేని వినయశీలత ఆయన వ్యక్తిత్వం. ఎన్ని భుజకీర్తులొచ్చినా ఎంత ఎదిగినా ఏ నిర్మాతతో, దర్శకునితోగాని, సాటినటులతో కానీ, హీరోయిన్లతో గానీ ఒక్క చిన్న విబేధం లేకుండా ఇంతకాలం నెగ్గుకు రావడం Walking on a razor’s edge which he could do most successfully.
ఎంత చిన్న వాళ్ళనైనా కళ్ళల్లోకి చూస్తూ ఆప్యాయంగా ‘చిరు’ నవ్వుతో పలకరించడం ఆయన నేచరు, సిగ్నేచరు. బహుశ: వై.ఎన్.కాలేజ్ రోజుల్లో “always remember people whom you meet when you climb a mountain as you have to meet them again when you come down” అనే పాఠం బాగా చదువుకుని ఉంటారు. “నేనెప్ప్పుడూ నేల మీదే పడుకుంటాను. అందుకని పడిపోతాననే భయం నాకు ఎప్ప్పుడూ లేదు” అని పలుమార్లు సభల్లో వారు చెప్పిన మాటలే ఇందుకు కారణమేమో. బాపు బొమ్మ, కృష్ణశాస్త్రి కవితలతో పాటు చిరు లెక్క కూడా మన తెలుగు నుడికారమైపోయింది.
చిరంజీవిగారు విశ్వనాథ్, బాపు, భాగ్యరాజా, బాలచందర్ వంటి మేటి దర్శకుల ఎక్స్పెక్టేషన్స్కు ఎదిగారు. ఎదగడమేకాదు అధిగమించారు. play dough లా వాళ్ళు ఎలా మలిస్తే అలా ఆయా పాత్రల్లోకి వొదిగారు. నటన అనే పాఠశాలలో ఆయన సదా బాలకుడిగా నిరంతర అధ్యయనం చేయడం వల్లనేమో నిజజీవితంలో వారు తాతైనా కూడా కళాతపస్వి విశ్వనాథ్‌గారు ఎన్నోసార్లు ఆయనను ఆప్యాయంగా బుగ్గలపై ముద్దాడారు. వాళ్ళబ్బాయి నాగేంద్ర గారినైనా వారు అలా ముద్దాడి ఉండరేమో! బాపు గారు ఒకానొక సందర్భంలో చిరంజీవిగారి కళ్ళు పులికళ్ళల్లా మెరుస్తూ నిరంతరం దేన్నో వెతుకుతుంటాయి అన్నారు.
బయట ఎంత స్టార్డమ్ ఉన్నా ఇల్లు చేరగానే మెగాస్టార్ ఫక్తు “ఫామిలీ మ్యానే”. సగటు నాన్న, సగటు అన్న, మధ్యతరగతి మామయ్యే. పిల్లలకోడిలా ఇంట్లో అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడటం ఆయనకు ఎంతో ఇష్టం. ప్రతి సంక్రాంతికి బెంగుళూర్లో ఉన్న ఫామ్ హౌస్‌లో నాలుగురోజులు అందరితో సందడిగా గడపటం ఎన్నో ఏళ్ళుగా వారికి ఆనవాయితీ. ఎప్ప్పుడైనా ఎవరైనా కుటుంబసభ్యులు అక్కడకు రాకపోతే వాళ్ళ మీద అలుగుతారని కూడా విన్నాను. ఆచార్య రజనీష్ అన్నట్టు ‘once again be a child’ గా ఉండిపోయిన ‘చిరంజీవి’ గారి లాంటి వారికే ఆ అదృష్టం దక్కింది.
ఒక చిన్న జీవితంలో ఇన్ని విజయాలు సాధించడంతోపాటు రుద్రవీణలో నేను సైతం అన్నట్లు చిరంజీవి బ్లడ్‌బ్యాంకును, ఐ బ్యాంకును స్థాపించి సామాజిక సేవ చేస్తూ, దేశంలో ఏ విపత్తు సంభవించినా తమ వంతు సాయం అందించడంలో ముందుండటం వల్లనే వారు మెగాస్టార్‌గా నిలిచారు. మూడు తరాలుగా మరో ముప్పై తరాలు తిన్నా తరగనంత సంపద సంపాదించినా ఎవరికీ ఏమీ చేయందించని వారికన్నా ఆయన స్థానం ఎప్ప్పుడూ పైనే. ఇన్ని అద్భుత కార్యక్రమాల్లో వారి వెంట నడుస్తూ సహకరించిన వారి సహధర్మచారిని, శ్రీమతి సురేఖమ్మకు సగభాగం ఇవ్వడం సముచితం. ఆమె ఈ తరానికి ఉత్తమ ఆదర్శ గృహిణి.
ఆయన నొచ్చుకున్నా చివరగా ఒక మాట చెప్పాలని ఉంది. హైదరాబాద్, మద్రాసు తప్ప పల్లెటూరు చూడని రామచరణ్ అతిచిన్న వయస్సులో అమాయకపు పల్లెటూరు బైతుగా రంగస్థలంలో నటించిన రీతిలో, స్థాయిలో మెగాస్టార్ నటించగలిగే వారేనా అనే సందేహం అప్పుడప్పుడు కలుగుతుంది. ధర్మంగా తీర్పు చెప్పాల్సింది మన బిగ్‌బాసే!

(మెగాస్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలతో చెల్లెలు రేవతికి ధన్యవాదాలతో…)

కృషి, పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చును అనే దానికి నిలువెత్తు ఉదాహరణ మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. అన్నయ్య, ఒదినలతో మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. ” “M
Wonderful narrationand photos give nostalgia.
కృషి,పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర శ్రమ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చును అనే దానికి నిలువెత్తు ఉదాహరణ మన మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య. అన్నయ్య, ఒదినలతో మిమ్మల్ని చూడటం చాలా సంతోషం.🙏🙏🙏
సార్, చిరంజీవి గారు మెగాస్టార్ మాత్రమే కాదు గొప్ప మానవతావాది.చిరంజీవి గారి గురించి ,వారితో మీకున్న సాన్నిహిత్యం గురించి చక్కగా వివరిస్తూ మీ అనుభవాన్ని మాతో పంచుకోవడం చాలా సంతోషం సార్.మీ రచన చదివిన తరువాత నాకు వారిని కలిసిన సంతోష సందర్భం చెప్పాలనిపించింది. చిరంజీవి గారిని కలిసే అవకాశం 95 లో వచ్చింది.చిరంజీవి classmate మన ACTO నాయుడు ,నేను ఒక marriage కి వెళ్లడం జరిగింది.ఆ marriage కి చిరంజీవి గారు వచ్చారు. చిరంజీవి గారు అంత జనసందోహం లోకూడా నాయడుని పలకరించడం ఆయన గొప్ప వ్యక్తిత్వానికి నిదర్శనం.అంతేకాకుండా నన్ను ACTO నాయుడు పరిచయం చేసినప్పుడు నాతో కరచాలనం చేసి నన్ను అభినందించడం నాకు ఒక మరపురాని ఒక మధురానుభూతి.ఈ సందర్భంగా నాకు ఇవన్నీ గుర్తుచేసుకునే అవకాశాన్ని కలగచేసినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ,నమస్కారములతో..మీ జగదీష్.
మీకు మాత్రమే సొంతమైన చక్కటి సొబగైన పదజాలంతో చిరంజీవి గారితో మీరు గడిపిన సంగతులు చదవడానికి మా కళ్లు పరిగెత్తాయంటే మీరు నమ్మాలి.
మీరు ఇలా ఆయన ఆతిధ్యం స్వీకారుస్తున్నారని ముందే తెలిసుంటే మేము మీతో బాటు వర్చ్యువల్ ఆతిధ్యంలో ఉండేవాళ్లమి.
ఆయన సినిమా అంటే వంటిమీద బట్టలు చించుకుని మరీ దూకేవాళ్లమి. ఆయన సృష్టించిన ట్రెండ్ అటువంటిది. ఆయనకే సొంతం.
వారితో మీకున్న సాన్నిహిత్యానికి ఒక రవ్వంత ఈర్ష్య కలిగినప్పటికీ, మీ అనుభవాన్ని మాతో పంచుకోవడంతో ఆ ఫీలింగ్ న్యూట్రల్ అయిపోయిందిలెండి .
నమస్కారాలతో———-చలం
Nindu kunda thonakadu ki example Chiranjeevi tharuvatha meeru Annaiah
సారు, మీకు చిరంజీవి గారితో ఇంతటి సాన్నిహిత్యం స్నేహం అంతకు మించి కుటుంబ బాంధవ్యం ఉన్నట్లు మీరు ఏ సందర్భంలో కూడా ఎక్కడ చెప్పలేదు. మీరు చిరంజీవి కుటుంబంతో గడిపిన విషయాలు నిజంగా చాలా బాగున్నాయి. ముఖ్యంగా స్టార్స్ గురించి మీ వ్యంగ్య వ్యక్తీకరణ నవ్వుతోబాటు నిజాన్ని ఆవిష్కరించింది. మీ రచన పాఠకులకు అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది. నేను కూడా కొద్దిగా మీ అడుగు జాడల్లో రాస్తుంటాను. మీకు హర్షాభినందనతో .. అనుచరుడు అన్వర్
అత్యద్భుతమైన రచనా శైలి. కళ్ళకు కట్టినట్లు రచించడం మీ ప్రత్యేకత. ఈరచన చిరంజీవి గారికి చేరేలా చూడండి. వారు చాలా సంతోషిస్తారు. మేము కూడా మీతోపాటు చిరంజీవి గారిని కలిసిన అనుభూతిని కలిగించారు. హృదయ పూర్వక అభినందనలండీ
చాలా చక్కగా చిరంజీవి గారి గురించి వివరించారు. వారితో పరిచయం ఉన్నట్లుగా మాకు తెలియదు
. కానీ సినీ ప్రపంచంలో రారాజుగా ఎదిగిన చిరంజీవి గారు కుటుంబాన్ని బాధ్యతగా నడిపించారు. “మెగా స్టార్” అక్షరాల వారికి వర్తిస్తుంది సినీ ప్రపంచంలో “చిరంజీవి”గా ఉండాలని హృదయపూర్వకంగా కాంక్షిద్దాం.
One of the best description of, sorry, the best description of Megastar’s Character. Beautifully described by Harsha garu in his signature style.
Well done Harsha garu.
Namasumanjjalu.