
ఇటీవల సింగపూర్ వెళ్ళినప్ప్పుడు ఆప్తమిత్రుడు ప్రసాద్ హైదరాబాద్ నుండి ఫోన్ చేసి అక్కడ పద్మజ అని మన బంధువులమ్మాయి ఉంది వీలైతే కలవమని చెప్పాడు. పద్మజ, శంకర్ దంపతుల్ని సింగపూర్‌లో కలిసా. త్వరలో బెంగుళూర్లో జరగనున్న వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వారు సాదరంగా ఆహ్వానించారు. ఎనిమిదేళ్ళ విరామం తరువాత ఈ పెళ్ళి పేరుతో మూడు రోజులు బెంగుళూరు పోలీస్‌గెస్ట్ హౌస్‌లో ఉన్నాను. సాయంత్రం బ్రిగేడ్ రోడ్, మెజెస్టిక్ సర్కిల్స్‌లో నడుస్తుంటే తమ్ముడు సుబ్రహ్మణ్యం ఆర్.వి.కాలేజ్ లో 1980 లో చదివే రోజుల్లో అక్కడి మా షికార్లు గుర్తుకొచ్చాయి.
మరుసటి రోజు A.N.R కాలేజ్‌లో చదువుకుని స్వయంకృషితో I.P.S ఆఫీసరై బెంగుళూర్లో పనిచేస్తున్న కిషోర్‌బాబును కలవడానికి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్ళాను. ఆ కాంపౌండులోకి ప్రవేశించగానే ఆత్మబంధు కీర్తిశేషుడు D.G.P బిపిన్ గోపాలకృష్ణ జ్ఞాపకాలు ఒక్కసారిగా నన్ను కమ్మేసాయి. తన జ్ఞాపకాలను మననం చేసుకోవాలనిపించే ఈ నాలుగు మాటలు. కర్ణాటక ప్రజలకు బిపిన్ Director General of Police అయితే తన ఆత్మీయులకు బంధుమిత్రులందరికీ మాత్రం Dearest Gentle Person.
బిపిన్ తో స్నేహం 1979 లో సివిల్స్ ప్రిపరేషన్‌కు హైదరాబాద్‌లో ఉన్నప్ప్పుడు మా ప్రసాద్ ద్వారానే. అప్పటికి బిపిన్ సివిల్స్ పోరాటంలో క్లైమాక్స్‌కు చేరుకుని I.P.S కు సెలక్టయి కర్ణాటక కేడర్ లో చేరాడు. అదుగో అప్పటి నుండి ‘వస్తా నీ వెనుక ఏమైనా కాని ఇక’ అని తన పనిచేసిన చాలా ఊళ్ళల్లో తనతో కలిసి ఉన్నాం. వాళ్ళ పిల్లలు వరుణ్, పునీత్‌లు మా పిల్లలతో పాటు కలిసే పెరిగారు.
బిపిన్ మాటకు మా మిత్రుడే అయినా తన బెటర్ హాఫ్ పద్మజగారే మాకు పెద్ద అండ. మంగళూర్, మైసూర్, బెంగుళూర్లో ఎన్నోసార్లు మేము వాళ్ళింట్లోనే దిగేవాళ్ళం. నిజానికి అది ఇల్లులా ఉండేదికాదు. చిన్న సత్రమే. నిరంతరం వచ్చేవాళ్ళుపోయే వాళ్ళతో వాళ్ళకు ఎప్ప్పుడైనా నా ‘గెస్ట్ ఫ్రీ డే’ ఉండేదా అనేట్లుండేది. ఇన్ని సంవత్సరాల్లో పద్మజ గారు ఏనాడూ ముఖం ముడుచుకోవడం మేము చూడలేదు. మా బిపిన్ సంగతి సరేసరి. ఇంట్లో అందర్నీ చుట్టూ కూర్చోపెట్టుకుని జోకులేస్తూ భువన విజయం నిర్వహిస్తూ ఎంతో ఛీర్‌ఫుల్‌గా ఉండేవాడు. సాయంత్రం అయ్యిందా వూళ్ళో ఉన్న క్లబ్ కో రిసార్ట్కో తీసుకెళ్ళి మాతో గంటలు గంటలు ముచ్చట్లు చెప్పించుకునేవాడు. తనతో ఉంటే ప్రతీరోజు పండగే.
గతంలో మంగళూరు వెళ్ళినప్పటి సంగతొకటి నాకు బాగా గుర్తుండి పోయింది. పిల్లలు, పెద్దలు అందరం ఇరవై మందివరకు అప్ప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. పద్మజగారు అక్కడ లోకల్‌గా దొరికే కల్లు ఇడ్లీలు భారీగా తెప్పించారు. బాగున్నాయి, బాగున్నాయి అనుకుంటూ అందరూ అన్నీ ఊదేశారు. బిపిన్ పదిగంటలకు ఆఫీస్‌కు వెళ్ళే ముందు బ్రేక్ ఫాస్ట్‌కు కూర్చుని హాట్ ప్యాక్ తెరిస్తే అందులో ఒకటిన్నర కల్లు ఇడ్లీ ఎండాకాలంలో మంగళగిరి బావులో నీళ్ళలా ఎక్కడో ఉన్నాయి. అవి చూసి “చూడవయ్యా డిఐజి కి పెట్టే బ్రేక్‌ఫాస్ట్ ఎలా ఉందో” అని నవ్వేశాడు. ఇది ఇరవై ఏళ్ళ క్రితం జరిగినా మా ఇంట్లో ఎప్ప్పుడు అడుగ్గుపోయినవి చూసినా మేమందరం “డిఐజి కి పెట్టే టిఫినా?” అని బిపిన్ మాటను పేటెంట్ చేసుకున్నాం. కనీసం వారానికొక సారైనా ఈ డైలాగ్ మా ఇంట్లో పడాల్సిందే, బిపిన్ గుర్తురావాల్సిందే.
బిపిన్‌కు సెన్సాఫ్ హ్యుమరెక్కువ. మా అబ్బాయి సందీప్‌కు మెడికల్ సీట్ ప్రయత్నించే రోజుల్లో బెంగుళూరులో వాళ్లింట్లో ఒక వారం మకాం వేశాము. మతా అమృతానందమయి మెడికల్ కాలేజి కొచ్చిన్‌లో సీటు ప్రయత్నిద్దామని అడిగా. కేరళలలో తన బ్యాచ్‌మేట్‌కు ఫోన్ చేసి సీటు కోసం ట్రై చేయమని అడిగితే “నాకు ఆశ్రమంలో ఎవ్వరూ తెలియ” దన్నాడు. బిపిన్ వెంటనే ‘తెలిసేదేముంది బ్రో ఒక మంచి ఇన్ హౌస్ దొంగను రాత్రి ఆశ్రమంలో వదులు. వాడు లోపలి వెండి, బంగారు సామాన్లు తెచ్చేస్తాడు. పదిరోజుల గ్యాప్ తరువాత ఆ సామానంతా వెనక్కిచ్చేసి సీటు అడుగు. ఇంత సింపుల్’ అనడంతో అవతలాయన బుర్రగోక్కోవడం మాకు ఫోన్లో వినబడింది.
పద్మజ, బిపిన్ బంధుమిత్ర పరివారమంతా కర్ణాటకలో ఏ పని ఉన్నా వాళ్ళింట్లో బస చేసేవారు. బిపిన్ కు కాస్త చిరుకోపం. అందుకని మేము మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అని పద్మజగారి ద్వారా కొన్ని పనులు చక్కబెట్టించుకొనేవాళ్ళం. ఇది గమనించిన బిపిన్ ఒక రోజు “హర్షా నా సి.సి.కి నేను తప్ప అందరూ పనులు చెప్పేవాళ్ళే” అని గోల పెట్టేవాడు. బిపిన్ చిన్నప్పటి నుండి బడాదిల్ వాలా. ఒకసారి చిన్నపని మీద తనకు కాల్ చేస్తే ఎత్తగానే “నువ్వు ఫోన్లు చేస్తే ఇక్కడెవ్వరూ పనులు చెయ్యరు. నీ పనికావాలంటే ఇక్కడకు రా. మా ఇంట్లో దిగు. కారెక్కి నాతో ఆఫీస్కురా. నా ముందు కూర్చుని కావలసిన ఫోన్లు చేయించుకుని పని పూర్తి చేసుకో” అని ఉతికేసి ఫోన్ పెట్టేసాడు. బ్లెండెడ్ కాఫీలా ఇందులో కోపం 20%, తన ఆత్మీయత 80%.
పద్మజ గారి మంచితనం గురించి చెప్పకపోవడం ధర్మంకాదు. ఒకసారి మా అబ్బాయి, మా తమ్ముడు కూతురు సుమేధ బెంగుళూర్లో KCET పరీక్ష రాయడానికి బయలుదేరి నాంపల్లిలో ఎక్కాల్సిన రైలు బదులుగా కాచిగూడలో తప్పుగా ఇంకో రైలెక్కాము. తప్పు తెలుసుకుని గబగబ రైలు దిగేశాం కానీ ఈ లోపు మా రైలు వెళ్లిపోయింది. తెల్లవారితే పరీక్షకు బెంగుళూర్ చేరి చేరాలి. బిపిన్‌కు చెప్తే ఫోన్లోనే లాఠీఛార్జి చేస్తాడని భయపడి పద్మకు చెప్పాము. ఆ రోజు రాత్రి 12 గంటలకు ఎయిర్ డక్కన్ ఫ్లైట్‌లో బెంగుళూరు వస్తున్నాం అని చెప్తే పద్మజగారు ‘డ్రైవర్స్ అందరూ వెళ్ళిపోయారు. It’s ok. Don’t worry I will come and pick you up from Airport’ అని భరోసా ఇచ్చిన ఆప్తురాలు. అదృష్టవశాత్తు మరో డ్రైవర్ దొరకడంతో ఆమెకు శ్రమ తప్పింది. ఆమె అభిమానం మరువలేనిది.
బిపిన్ పెద్ద టిప్ప్పుసుల్తాన్. అందుకేనేమో మైసూర్లో రెండుసార్లు ఉద్యోగం చేసాడు. ఎప్ప్పుడైనా హోటల్ కో, క్లబ్‌కో వెళ్తే బేరర్ వచ్చీ రాగానే వాళ్ళు సర్వ్ చేసీ, చేయకముందే వాళ్ళకి ధారళంగా టిప్ ఇచ్చేవాడు. అఫీషియల్ డ్రైవర్ సాయంత్రం ఆఫీస్ నుండి తనని ఇంటి దగ్గర డ్రాప్చేయగానే అతనికి వందలరూపాయల టిప్పివ్వడం నేను చాలాసార్లు చూశాను. ‘మనల్ని బాగా చూసుకోనేవాళ్ళను మనం బాగా చూసుకోవాలి’ అనేది తన దగ్గరే నేర్చుకున్నా. సాయంత్రం ఒక చిన్న పెగ్గు తీసుకోవడం తన అలవాటు. ఒకరోజు ఆఫీసు నుండి రాగానే విస్కీ బాటిల్ కోసం వెదికి, కనబడకపోవడంతో పద్మగారిని పిలిచి అడిగాడు. ఆమె ఆర్డర్లీలు, డ్రైవర్లు తాగేస్తారని లోపల దాచానని ఎక్కడినుండో తెచ్చి సీసా ఇచ్చారు. బిపిన్ “రోజూ నా మంచి చెడ్డలు చూసేది వాళ్ళే. వాళ్ళు ఒక పెగ్గు తాగితే తప్పేంటి?” అనేసాడు. ఇంతకంటే ఏమి చెప్పాలి మా మిత్రుడి సహృదయత గురించి.
కరుకు పోలీస్ యూనిఫామ్ కింద అనుక్షణం ‘ఇగోను’ పెంచిపోషించే వంధిమాగధుల మధ్య హ్యూమన్ ఫామ్ నలిగిపోకుండా కాపాడుకోవడం అంత తేలికైన పనికాదు. ఎంతో సంయమనం, నిగ్రహంత, స్వీయ నియంత్రణ గల బిపిన్ లాంటి అతి కొద్ది మందికే అది సాధ్యం.
అమీర్‌ఖాన్ ‘సత్యమేవజయతే’ సీరియల్లో పోలీసు ఎపిసోడ్లో బిపిన్ కూడా పాల్గొన్నాడు. ఆ ఎపిసోడ్లో తను బిపిన్ చెప్పిన సమాధానాలు పోలీస్ వ్యవస్థపై తన అభిప్రాయాలను వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఇంగ్లాండు పోలీసు వ్యవస్థలో ప్రతి అధికారి క్రింద కానిస్టేబుల్ స్థాయి నుండే ప్రారంభించి పదోన్నతులు పొందుతాడు. అందుకని అక్కడ పై అధికారులందరూ క్రిందస్థాయి ఉద్యోగులు పట్ల సానుభూతితో, అవగాహనతో పని చేస్తారు. మన దేశంలో కానిస్టేబుల్, S.I, D.S.P, I.P.S స్థాయిలో పలు రిక్రూట్మెంట్లు జరగడం వల్ల పై అధికారులు నిరంతరం సుపీరియారిటీ, స్థాయిబేధం చూపిస్తూ క్రింది ఉద్యోగుల్ని చాలా చిన్నచూపు చూస్తారని చెప్పాడు.’ తన మాటల్లోనే ….
Here, IPS officers are like heroes, they come directly as Superintendents of Police. Once we clear the exams, that’s the end and there is no mid-term appraisal.
All I am asking is, why should a constable not become an SP or DG? Why should merit not be rewarded? All cases are detected by junior-level officers, constables, head constables and Sub-inspectors. We (IPS) only go for photo-ops and take credit. We need to democratise the system and not build it on the lines of the army.” ఇంత నిష్కర్షగా విశ్లేషించడం వ్యవస్థ పట్ల తన అవగాహనని సాటి చిరు ఉద్యోగుల పట్ల సానుభూతిని తెలియచేస్తుంది.

మేము బిపిన్ వాళ్ళింట్లో ఇంచుమించు ప్రతి శుభకార్యానికీ వెళ్ళాము. ఆ దంపతులిద్దరి ఆదరాభిమానాలు నిరుపమానం. తను అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా తన రిటైర్మెంట్ఫంక్షన్లో అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ సంతోషంగా గడిపాడు. తనను ఎప్ప్పుడు కలిసినా మొదట అడిగే ప్రశ్న “తిన్నావా?”
బిపిన్‌ను చివరిసారి చూడ్డానికి వెళ్ళేసరికి ఇంటి బయట లాన్లో చాలా నీరసంగా కూర్చొని ఉన్నాడు. నన్ను చూడగానే “తిన్నావా?” పోయి తినిరా” అన్నాడు. ఆ విషయం ఎప్ప్పుడు గుర్తొచ్చినా మిత్రుడు మోహన్ రుషి రాసిన ‘స్పర్శ’ కవితలోని …
“సర్వకాల సర్వావస్థలోనూ ఒకే మొదటి ప్రశ్న
అన్నం తిన్నావా”
ఆ ఒక్క ప్రశ్నకోసమే ఓపికంతా కూడ దీసుకుని
మంచం మీద కూర్చున్న తీరై
ప్రేమకూడా ఒక కొండ చరియే. విరిగిమీద
పడ్తుంది. ఒక మాటగా “అన్నం తిన్నావా”
అనే వాక్యాలు నా చెవుల్లో ధ్వనిస్తూనే ఉంటాయి.
బిపిన్‌తో గడిపిన మధురక్షణాలు ఎప్ప్పుడు గుర్తొచ్చినా మనసు వికలమవుతుంది. మా అందర్నీ వదిలేసి ముందే వెళ్ళిపోయిన తను అదృష్టవంతుడేమో కానీ తనను కోల్పోయిన మేమందరం చాలా దురదృష్టవంతులం.
బిపిన్ రిటైర్మెంట్కు కొద్దిరోజులు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భవిష్యత్ కార్యకలాపాలను ‘I Plan to work with retired Inspectors, SPs and Lawyers to help common People’ అని చెప్పాడు. ఆమ్ ఆద్మీ పక్షాన పోలీసింగ్ చేసిన, చేయాలనుకున్న బిపిన్ true Civil Servant in letter and spirit.
బిపిన్, బెంగుళూరు మాకు ముప్పై ఏళ్ళపాటు పర్యాయపదాలు. తను లేని బెంగుళూరు మాకు కృష్ణుడులేని ద్వారకే. అందుకే అక్కడికి వెళ్ళడం మనస్కరించక తగ్గించేసా. బిపిన్‌ను తలిస్తే
“అతనెప్ప్పుడూ అంతే
ఒంటరిగా రమ్మంటే
వసంతాన్ని వెంట తెస్తాడు
అతనిప్ప్పుడు లేడు
తన జ్ఞాపకాల్ని మిగిల్చాడు”
(బిపిన్ ను కలిపిన ప్రసాద్‌కు, బిపిన్ జ్ఞాపకాల దొంతరలను కదిపిన శంకర్, పద్మజలకు కృతజ్ఞతలతో… జులై 31 బిపిన్ జయంతి)

మంచి వారు మనతోనే ఉంటారు.
అన్ని హోదాల్లో ఉంటారు అని తెలియచెప్పిన పరిచయం. మీ మాటల్లో మరింత బాగుంటుంది.
కనులు తడిసాయి…
It is interesting to know about sri Bipin Gopala krishna garu and his wife through your ‘Manasunna maaraju’ Sir.
Excellent depiction of Bipin Bava qualities. We never forget the noble soul of Bipin Bava.
He left the world too early. Big loss to our families and friends.
Well done Harsha Anna for this presentation.
Thanks and regards,
Sudhir
బిపిన్ అన్న అంటే సంస్కారానికి మారు పేరు 🙏🏻.perfect gentleman ..We miss u Anna 💐
సార్ మీకు అత్యంత సన్నిహితులు అయిన బిపిన్ గారు మరియు పద్మజ గార్ల గురించి మీరు క్లుప్తంగా తెలియచేసిన కానీ వారు ఎంత ఆత్మీయులు. ఆదరణ చూపుడములోఎంతటి ఉన్నత్తులో అర్థమవుతుంది. మీరు తెలిపిన విషయం వారు మీమధ్య లేరు అనేమాట చదివిన మాకు బాధగా వుంది.
A person is remembered not for how long they lived, but for their kind heart and good deeds. Bipin garu was a wonderful example of this. You have beautifully presented his noble qualities and the goodness of his heart through this touching and heartfelt tribute, Sir. 🙏
Very nice.rare personality from Police dept.
What about his last day s and Children.Settled in USA like our boys or India.pl
మనసు ఆర్ద్రమయ్యింది. “నిన్నునిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు” పదాలను నేను ఇక్కడికి అరువు తెచ్చుకున్నా చాలనంతటి ఆర్ద్రత. నిజమైన, నిండైన అభిమానం లేకపోతే ఇంత బరువైన అభివ్యక్తి రాదు, సాధ్యంకాదు. ఆయన, ఆయన జ్ఞాపకాలను కూడా మదిని నింపుకునేంతటి గొప్ప మనిషన్న విషయం మీ మాటలద్వారా తెలిసింది. అంతమంచి మీ మిత్రుడిని ఒక్కసారైనా నేను కలవలేకపోయానే అనిపించింది నాకు సిన్సియర్ గా మీ పోస్టు చూశాక.
మీ అనుభవాల పుస్తకం లో ఈ సంఘటనలు చాలా ప్రేమపూర్వక
అనుబంధాలు everygreen
మరుపురాని అనుబంధాల విలువైన
పేజీలు..నీతో పరిచయమున్న ప్రతి
స్నేహితుడు కీ నువ్వు ఒక స్పెషల్ ఐకాన్ వి…
అంత మంచి స్నేహితులు కలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి. స్నేహం లోని తీయదనాన్ని హృద్యమంగా చెప్పినందుకు ధన్యవాదములు.
మీ బిపిన్ గారి ముచ్చట్లు బాగున్నాయి. ఆయన వ్యక్తిత్వం ఆదర్శనీయమైనది. ఆయన లేరన్న చేదు నిజం బాధనిపించింది.
Heart felt tribute to a great departed soul. 🙏🙏🙏🙏
Bipin Gopalakrishna Garu. Good human being. Noble soul. May his soul rest in peace. If rebirth theory is to be believed probably he would have been born again and may even receive service from you all. Hope madam Padmaja Garu would receive enough strength from God to move on. May God Bless You All.
Good human being. Noble soul. May his soul rest in peace. If rebirth theory is to be believed probably he would have been born again and may even receive service from you all. Hope madam Padma Garu would receive enough strength from God to move on. May God Bless You All.
Very great person, human values and desire to help poor people and no IPS ego, down to earth.We can’t see such police officer nowadays.. you are lucky to have such great friend sir regards