

గత రెండేళ్లుగా ‘మిసిమి’మాసపత్రికలో ప్రచురితమవుతున్న ఆత్మీయ మిత్రులు కిల్లాడ సత్యనారాయణ గారి వ్యాసాలు చదివాను. ఇవన్నీ ఒక పుస్తకంగా వస్తే బాగుండు అనుకునేలోపే వారు ఫోన్‌చేసి ‘బహుముఖ బనారస్’ పుస్తకం వస్తోందని చెప్పారు. శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివానుగ్రహం లేనిదే బహుముఖ బనారస్ పుట్టదు. బహుశ: హరిహరతత్త్వాన్ని మరోసారి ఎరిగింప చేయడానికేమో శివుడు ఈ కార్యాచరణకు సత్యనారాయణగారిని ఆదేశించారు.
ఇటీవల మాన్యులు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడుగారు ఆ పుస్తకాన్ని హైదరాబాద్ దసపల్లా హోటల్లో ఆవిష్కరించిన సందర్భాన రచయిత చేవ్రాలుతో ఒక కాపీ సంపాదించి చదివాను. ఆయన పుస్తకాన్ని అంకితమిస్తూ…
‘జననమరణాల మధ్య ప్రవహిస్తున్న చైతన్యాన్ని
అనుభవంగా ప్రసాదించిన ..కాశీవిశ్వనాధునికి’
అనడంతో ఫిదా అయిపోయా. సత్యనారాయణ గారు చిన్నప్పుడు నర్సీపట్నం బయోస్కోపులో ‘కాశీపట్నం చూడర బాబు’ ఎన్నిసార్లు చూసారో గానీ ఈ పుస్తకంలో కాశీనగరాన్ని కలైడోస్కోప్‌లో తిప్పితిప్పి చూపించారు. ముందుమాటలో పుస్తక రచనకు ప్రేరణను తెలియజేస్తూ రచయిత కాశీని ఆసక్తితో చూడాలని ఎంచుకున్నారు అని, కాశీనగర వైశిష్ట్యాన్ని ఎలా తెలియ చేయబోతున్నారో అన్న ఉత్కంఠను రేకెత్తించారు. క్షీరసాగర మధనంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి ఉద్భవించినట్లు ఆసక్తికర కాశీనగర మేధోమధనంతో లౌకిక, చారిత్రక, సామాజిక, ఆధ్యాత్మికమైన బహుముఖీన పార్శ్వాలను పాఠకులకు సీట్‌బెల్డ్ బిగించి మరీ రోలర్ కోస్టర్ రైడ్ చేయించారు.
ప్రథమాంకంలో కాశీనగర ప్రాబల్యంతో మమేకమైన ఆదిశంకరుల వాదనలతో శ్రీకారం చుట్టి ప్రారంభించి శంకర కృపకు పాత్రులయ్యారు. ‘కాశీజ్ఞాన యోగులు’ చాఫ్టర్‌ను ఆరంభిస్తూ, ‘మేఘాల్లో రథం మీద ప్రయాణిస్తున్న చంద్రుడిలా, గంగానదిపైన బ్రిడ్జి మీద వెళుతున్న రైలు. ఈ బ్రిడ్జి మీద మరో బ్రిడ్జి, దానిపైన చంద్రుడి వెనుక కదులుతున్న నక్షత్రాల్లా వేగంగా పరుగెడుతున్న వాహనాలు. రైల్లోనుంచి గంగవైపు తొంగి చూస్తున్న వాహనదీపాలు… మొత్తం దృశ్యం ఆకాశం గంగమీదుగా వాలినట్లుగా ఉంది.’ అని గంగాప్రవాహంలా సాగిపోతుంది. ఇది చదివిన ఎవరికైనా రచయిత లోని కవే ఎక్కువగా కనిపిస్తాడు. కబీరు, రవి దాసుల ప్రతిభను స్తుతిస్తూ ‘‘కబీరు, రవి వాసుల కవిత్వం సమాజ పునాదుల మీద నిలబడితే, తులసీ కవిత్వం సంస్కృతి పునాదులు మీద పెరిగింది.’’ అని వారికి సరళంగా ఘన నీరాజనాలనిచ్చారు.
‘అంతరించిపోతున్న అగ్నిహోత్రులు’ అన్న చాఫ్టర్ ఆరంభంలో ‘‘బనారస్ హిందూ యూనివర్సిటీకి దగ్గరలో ఆకుపచ్చ చీరతో నేలను కప్పినట్లు లాన్, చిరునవ్వుతో పలకరిస్తున్న పూలచెట్లు. కళాహృదయంతో కట్టిన భవనాలు. జ్ఞానం లాగా ప్రవహించాలని చెబుతున్న గంగా’’ అని కవితావేశంతో మనల్ని లాక్కెళతారు.
ఔరంగజేబు సోదరుడు దారాషికో సంస్కృతం నేర్చుకోవడానికి కాశీ చేరుకున్నాడన్న సంగతి చదివి సంభ్రశ్చర్యానికి గురయ్యాను. ఈస్టిండియా కంపెనీ రెసిడెంట్ ఓనాథన్ డంకన్ కాశీలో సంస్కృత కళాశాలను 1791 లో ప్రారంభించాడన్న విషయం చదివి ముగ్ధుడనయ్యాను. సంస్కృతభాషలో క్రికెట్ ఆడుతూ, సంస్కృత కామెంట్రీనిస్తున్న ఏకైక నగరం కాశీనే అని తెలుసుకొని మురిసిపోయాను.
ఉత్తరభారత దేవాలయాలు దర్శించిన వారందరికీ గుడులు, గుళ్ళో దేవుళ్ళను మర్చిపోయినా ఇంచుమించు ‘గూండాలకు’ ఏ మాత్రం తీసిపోని కొందరు పండాలు మాత్రం గుర్తుంటారు. జవహార్‌లాల్ నెహ్రుగారు న్యాయవాదిగా మొదట వాదించిన కేసు బనారస్ పండాలదేనటా. ఇది చదివి నెహ్రూగారికి మంచి బోణీనే తగిలిందనుకున్నా. ఈ పండాలు మన మహాత్మాగాంధీనీ వదల్లేదు. కాశీలో వారికి దక్షిణ ఇవ్వనందుకు ‘‘ఇలా మమ్ముల్ని అవమానిస్తే నువ్వు నరకానికి పోతావనడం’’ వారి దాష్ఠీకానికి పరాకాష్ట. ‘‘బతుకు నావకు విలువలనే చుక్కాని ఉండాలన్న గాంధీజీ మాట పండాల చెవిన ఎప్పుడు పడుతుందో’’ అని రచయిత వాపోయి జీవితాన్ని నరకం చేసుకుని చావలేక బతుకున్న పండాలపై జాలిపడతారు.
కాశీలో కబీర్ జ్ఞానోదయం పొందిన స్థలాన్ని కబీర్ చౌరా వీధిగా పిలుస్తారు. కబీర్ చౌరా అనే చిన్న వీధిలో ఎంతో మందిని పద్మశ్రీలు, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి. భారతరత్న ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ షెహనాయి స్వరమే కాశీనాధునికి మేలుకొలుపు. ‘అచ్చట పుట్టిన చిగురుకొమ్మైన చేవ’ అంటే కలువకొలనైన కబీర్ చౌరానే. కబీర్ చౌరాలో సంగీత, సాహిత్య నృత్యాలు, నేటికీ నిరంతరాయంగా ప్రతిధ్వనిస్తుంటాయట. బహుశ: భారతదేశంలో ఇలా పుష్కలంగా పద్మాలు వికసించిన చోటు మరెక్కడా లేదేమో.
కాశీ సంగీత విద్వాంసుల జీవితచిత్రాలను పరిచయం చేస్తూ రచయిత టీ’అమ్ముతూ టుమ్రీలు పాడే రసూలన్‌బాయి గొప్పదనాన్ని గుర్తుచేస్తారు. టుమ్రీని విశ్వసంగీత ప్రపంచానికి చేర్చిన సిద్దేశ్వరీదేవి దగ్గర భారతరత్న ఎమ్.ఎస్ సుబ్బలక్ష్మి భజనలు పాడటం నేర్చుకున్నారన్న విషయం అబ్బురం. దక్షిణ భారత సంప్రదాయంలోని దేవదాసీల్లా ఉత్తర భారతదేశంలో తవైఫ్లు సంగీత ప్రపంచాన్ని అత్యంత సారవంతం చేసారట. సంగీతంతో పాటు సభ్యత కూడా నేర్చుకునేందుకు సంపన్నులు సైతం వారి పిల్లల్ని వీరి వద్దకు పంపేవారని తెలుసుకుని మనకు ఆశ్చర్యం కలగక మానదు. తవైఫ్లు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు తమ ఆస్తులను, ప్రాణాలను పణంగా పెట్టడం కంటనీరు తెప్పిస్తుంది.
కాశీలో పుట్టిన ‘నాగరీ ప్రచారణీయసభ’ పలురాష్ట్రాలకు విస్తరించి హిందీ భాషా సేవా సంస్థలైన హిందీ సాహిత్య సమ్మేళన్, దక్షిణ భారత హిందీ ప్రచారసభ, రాష్ట్ర భాష ప్రచార సమితులకు జన్మనిచ్చిందట. రచయిత బెనారస్‌లో పండిత పహిల్వానుల గురించి చాలా పరిశోధనే చేశారు. మల్లయోధుడిగా జీవితం ప్రారంభించి బెనారస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన శకుర్పహిల్వాన్ అసెంబ్లీ కుస్తీలలో మునిగి తేలుతూనే, పోటీలో విదేశీ పహిల్వాన్‌ను ఓడిరచాడని తెలుసుకున్నప్పుడు మన అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలు మల్లయోధులే కదా అనిపించింది. కాకపోతే వీరు పట్టే కుస్తీలు వారి అక్రమాలను, దుర్నీతిని సమర్థించుకోడానికే గానీ ప్రజా సంక్షేమానికి కాదు.
కిల్లాడవారు బెనారస్ భాంగ్ భాగోతాన్ని బహుబాగా పట్టేసారు. బనారస్ ప్రజలు దీన్ని ‘భాంగ్ భవానీ’ అంటారట. శివునికి అర్పించే ఈ భాంగ్‌కు ‘విజయా, సిద్ధి, దూధియా, శివమూలిక, సజ్జవరీ’ అని శివ అష్టోత్తరమన్ని పలు పేర్లు ఉన్నాయట. ‘కాశీ గృహిణి ముఖ్య ధర్మం భాంగ్ దేవీ సేవలో తమ భర్తలకు సహకరించడం’ అన్న మహాకవి చచ్చా మాట వింటే దేశంలోని భాంగ్ భక్తులందరూ కాశీ కన్యలనే కలవరించి వరిస్తారేమో అనేంత ఆకర్షణీయమైన ఆలోచన రేకెత్తించిన రచయిత కడు సమర్థులు. భాంగోపాఖ్యానాన్ని ముగిస్తూ ‘‘శ్రుతిమించితే ఏదైనా వికారమే. హద్దుల్లో ఉంటేనే అందం. భాంగ్ మోతాదు ఎక్కువైతే ఊపుతుంది. ముదిరితే పిచ్చిలోకి దించుతుంది. ఆ తర్వాత మనల్ని మనకు దూరం చేస్తుంది’’ అని స్మాల్ ప్రింట్లో ముక్తాయించిన రచయిత పనిలో పనిగా మోరల్ పోలీసింగూ చేసేసారు.
కాశీకి ప్రత్యేకమైన ఠలువా (హాస్య) కబ్ల సభ్యులను గురించి ప్రస్తావిస్తూ ‘ఏ ఇజానికీ లొంగని నిజాలు వీరు. ఠలువా ఆకలికి లొంగడు. అవసరం ముందు వంగడు. ఆత్మాభిమానాన్ని అమ్మడు… వాళ్ళు బైరాగి మనసు కలవాళ్ళు’ అని రచయిత వారి హృదయావిష్కరణ చేస్తారు. ఠలువాక్లబ్ల మీద చేసిన పరిశోధనకు రెండు డాక్టరేట్ల ప్రదానం జరిగిందంటే వాటికి అప్పట్లో ఎంత గొప్ప రేటింగ్ ఉందో అర్థమవుతుంది.
రచయిత బనారస్ టాంగా వాలాల మూలాలనూ వెలికితీసారు. ఆ రోజుల్లో కాశీలో జరిగే గుర్రపు బండి పోటీల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించారు. బెనారస్ విశ్వవిద్యాలయ స్థలసేకరణ, స్థాపన, అభివృద్ధిని ఆయన ఎంతో ఆసక్తిగా మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. పండిట్ మదన్మోహన్ మాలవ్యా అకుంఠిత దీక్ష, కృషి, పట్టుదలతో బెనారస్ విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రసిద్ధి నొందింది. అక్కడి హైదరాబాద్ నిజాం కాలనీ పుట్టుపూర్వోత్తరాలు ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. కవి గాలిబ్‌కు, కాశీ నగరం పట్ల ఉన్న అవ్యాజ ప్రేమను రచయిత వర్ణించిన తీరు అద్భుతం. గాలిబ్, కాశీ పర్యాయపదాలే అనిపిస్తుంది.
అఘోరాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను సేకరించిన రచయిత, వారిని ముఖతా కలిసి మరిన్ని సంగతులు మన ముందుంచారు. ‘‘వాళ్ళు కష్టనష్టాలకు అందరు. సుఖదు:ఖాలకు చిక్కరు. ఎక్కడ, ఏది ఎలా దొరికితే అలా, నిరాపేక్ష భావంతో ఉంటారు. ఇది వాళ్ళ ‘సహజ స్థితి’. వీరు అద్వైతులు భిన్న ధృవాలను కలిపి జీవిస్తారు. చావూ-బతుకు, అందం, అసహ్యం, మంచీ-చెడు… అన్నీ ఒక్కటే. ద్వందాలను దాటి జీవిస్తారు. సృష్టి అంతా ఒక్కటే. ఆత్మ`పరమాత్మ ఒక్కటే. అన్నీ శక్తి స్వరూపాలే’’ అని వారి జీవన సరళతని, తత్త్వాన్ని సాకారం చేసిన రచయితకు హేట్సాఫ్. కాశీ స్మశానంలో హోలీని గురించి రాసినా, మోక్ష భవనాల గురించి రాసినా రచయిత పూర్తి సాధికారత, అవగాహన మనకు కనిపిస్తుంది.
బహుముఖ బనారస్ ఆసాంతం చదివాక నాకు గొప్ప దిగులులాంటిదేదో కలిగింది. సత్యనారాయణ గారు పోలీసు ఉన్నతాధికారిగా విధి నిర్వహణలో ఉంటూనే చింతానాపరులై, ప్రతి అంశాన్నీ ఒక పరిశోధకునిగా సూక్ష్మంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ, ఎందరో కాశీపుర ప్రముఖుల్ని, సామాన్యులను కలిసి ఇంత మంచి పుస్తకం రాస్తే, ఆయన విశ్వవిద్యాలయ ఆచార్యులుగా కుదురుకునుంటే ఇంకెంత సాహితీ సేవ చేసేవారో కదా అని, హైదరాబాద్ నగరంలో అల్లర్లు జరుగుతుంటే పోలీసు వాహనంలో నుండి పైకొచ్చిన కెమెరా అన్నివైపులా గిరగిర తిరిగేసి అందరి మీద ఒక కన్నేసి పోతుంది. ఆ తరువాత పోలీసులు ఆ దృశ్యాలను తీరిగ్గా విశ్లేషించి ఆందోళనకారుల్ని గుర్తించి వారిని పట్టుకొచ్చి ‘ఉచిత రీతిన’ సత్కరిస్తారు. సరిగ్గా సత్యనారాయణ గారు పోలీస్ బాస్‌గా కాశీనీ 360 డిగ్రీల్లో చూసేసి మన చేయి పట్టుకుని వర్చ్యువల్ వాక్‌త్రూ చేయించారు. నేతి బీరకాయలో నెయ్యి ఉండదు కాని బహుముఖ బనారస్‌లో బహుముఖత్వం ఎంతలా ఉందంటే గంగానదికి ఉండే నిత్య నూతనమంత.
పుస్తకంలో ఎక్కడో ఒక చోట ‘‘కాశీ మారుతున్న కాలాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. నవతరానికి నవీన శైలిలో పరంపరను అందిస్తుంది. అంతేగానీ ప్రవాహంలో తను కొట్టుకుపోదు. మూలాలను మరుగున పడనివ్వదు. అందుకే కాశీ భారతీయతకు ఎప్పుడూ నిలువుటద్దంలా నిలబడుతుంది’’ అని కాశీ ఆత్మను సూటిగా, గట్టిగా పట్టేసుకున్నారు. పుస్తకంలో ప్రతి చాఫ్టర్ చివర రెఫరెన్స్లివ్వడం చదువరులకు దిక్సూచి. కాశీ పరిశోధకులకు బహుముఖ బనారస్ బహుళ ప్రయోజనకారి.
పుస్తకం చదవడం ముగించిన వెంటనే కాశీ విశ్వనాథునికి ఒక మహజరు సమర్పించుకున్నా. సత్యనారాయణగారిని మరోసారి కాశీ కొత్వాల్‌గా ఆ విశ్వనాథబాబు కొలువుదీరిస్తే, వారు రాసిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వారితో కలిసి తనివి తీరా చూసేసి, పనిలో పనిగా భాంగ్ భవానీ సేవించే కటాక్షం కలిగించాలని ఆశిస్తూ ….

Excellent description of various facets of Kasi. Having visited twice, experienced few things described in the article. Had a very good understanding of Bhang’s effect on my college friend when he took as prasadam on Sarswati Devi puja in Durgapur or our friends from Bihar having it on Holi.
Should visit once again if “He” permits before “He” calls me.
As usual, your writing really made me go back to my Kasi memories. Thank you Harsha garu.
very good article