
మా చిన్నప్ప్పుడు పి.హెచ్.డి పట్టాను ఏదైనా కొత్తగా కనిపెడితే వాళ్ళకు ఇస్తారు అని చెప్ప్పుకునేవాళ్ళు. ఇంకాస్త పెద్దయ్యాక ఐన్‌స్టీన్, ఆర్కిమెడీస్, ఎడిసన్, రైట్ సోదరులు లాంటి వాళ్ళే ఈ కోవలోకి వస్తారని తెలిసింది. మరింత బుద్ధి వికసించడంతో దొరక్కుండా కాపీ కొట్టినా (మన తెలుగు సినీ దర్శకుల్లా) పి.హెచ్.డీలు వస్తుండటం చూశా. తీసి తీసి రాసిందే థీసీస్ అవుతుందని మరి కొంత కాలానికి తెలిసింది. వెనకటికి దయాసాగర్ గారు (Wise కాదు Vice) వైస్‌ఛాన్సలర్‌గా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయానికి కొంతకాలం సేవలనందించారు. సార్థక నామధేయులగుట చేతనేమో తమ పదవీ కాలంలో కాస్త లిబిరల్గా రెండొందలకు పైగా (RGV Factory సైన్మాల్లా) కుప్పలు కుప్పలుగా థీసీస్‌లు ముద్రింపచేసారు. వారి పెద్దమనసును అపార్థం చేసుకున్న కొందరు ఆయన్ను పలు ఇక్కట్లు పెట్టారు. నిజానికి వారు గొప్ప పరోపకారి. ఆచార్యులందరికీ కేవలం రెండు ఇంక్రిమెంట్లు ఇప్పించాలన్నదే (కాస్త లాంఛనాలతోనేలేండి) వారి తపన! అలా పకోడి పొట్లాల్లా డాక్టరేట్ పట్టాలు పంచేశారు.
మా మేనల్లుడు డాక్టర్ అభిరామ్ అమెరికా నుండి ఎప్ప్పుడు ఫోన్ చేసినా ‘Whats’up మామయ్యా’ అంటాడు. మన వాళ్ళు ‘క్యాచల్ రా’ అన్నట్లుగానే. ‘Whats’up పలకరింపుకు పోటీగా Whats app వచ్చి పడి ప్రపంచంలో అందర్నీ ఫోన్‌కు కట్టిపడేసింది. ఇది చాలదన్నట్లు గత పదేళ్ళుగా దేశమంతా Startups జోష్‌తో ఉక్కిరి, బిక్కిరి అవుతోంది. వీటినే (ఒంటి కన్ను రాకాసిలా ఒంటి కొమ్మున్న ఎగిరే గుర్రాలు), అంకురాలని కూడా అంటారు. ఈ స్టార్ట్ప్ప్పులకు Unicorns అని నామకరణం చేసినాయన Aileen Lee అనే Venture Capitalist (సాహస పెట్టుబడిదారు). ఆదిలో చిన్నగా ప్రారంభమైనా వాటిలో కొన్ని వామనుడిలా ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎంతో ఎత్తుకు పెరిగిపోవడం, ఎగిరిపోవడం చూస్తున్నాము. నేలమీద పరుగెత్తే గుర్రానికి రెక్కలు తొడగటం “ఏమో గుర్రం నింగికి ఎగరావచ్చు” అన్న ఆశావాదంతోనే. కాకపోతే కొన్ని ఎగరడం కాదు కదా కనీసం కుంటడంలేదు. కొందరు ముందు జాగ్రత్తగా కోర్ట్‌లో కేవియట్ వేసినట్లు వీటిని అంకురాలన్నారు. ఎప్ప్పుడైనా తేడా కొడితే నవ్వేసి అన్ని విత్తనాలు మొలవ్వుకదండీ అనొచ్చు. మాన్య మహోదయ్ మోడీ గారు “Make In India” నినాదంతో ఈ గుర్రాలు గుంపులుగా గుంపులుగా పుట్టుకొస్తున్నాయి. వీటి ఎదుగుదల ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఇంక్యుబేటర్స్ ఉంటాయి. ఇవి మన కోళ్లఫారాల్లో గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్స్ లాంటివే.

ప్రస్తుతం ఇంక్యుబేటర్స్‌ను పక్కన బెట్టి మన స్టార్టప్ప్పుల గొడవ చూద్దాం. గత రెండు మూడేళ్ళుగా ఎవరింటికి పోయి మీ పిల్లలు ఏమి చేస్తున్నారని అడిగామా… అందరూ మా వాడు స్టార్టప్ మీద వర్క్ చేస్తున్నాడనేదే Talk of the Town. వీటన్నింటి మీద పెద్దగా అవగాహన లేని నేను మేక్ ఇన్ ఇండియా అంటే ఇండియాలో ‘మేకు’లు తయారుచేస్తారని అని పొరబడినట్లు గతంలో తరచు స్టార్ట్ప్ సమస్య వచ్చే బజాజ్ స్కూటర్ స్టార్టింగ్ ట్రబుల్‌కు హెల్ప్ చేసేవారు అనుకునే వాడ్ని.
వీటిపట్ల ఆతురతను ఆపుకోలేక కొంత మంది విద్యావంతుల్ని స్టార్టప్స్‌లో ఏమి చేస్తారని అడిగా… ‘రెస్ట్రూమ్లో అతి తక్కువ నీరెలా వాడాలో చెప్పేందుకు ఒక Startup అట. నాలుగురోజుల కొకసారి టాయిలెట్‌కు పోయేలా చేసేందుకు ఇంకొక Startup అట’. ఇదెలా సాధ్యమండీ, కష్టం కదా? అని అడిగితే మన పేగుల్లో చిన్న సెన్సార్ పెడితే అది టాయిలెట్ వెళ్ళాల్సిన అవసరం నాలుగురోజులకొకసారి వచ్చేలా ట్రిగర్ ఇస్తుందట. కాకపోతే లోపలి సెన్సార్లు ఏడాదికొకసారి (మన యురేకాఫోర్చ్స్ వాటర్ ఫిల్టర్ క్యాండిల్స్లా) మార్చడం ఒక్కటే రికరింగ్ ఖర్చని చెప్పారు. ఇంటికో పువ్వు ఈశ్వరుడికోమాలన్నట్లు ఇంటికోస్టార్టప్ కనిపెట్టు, జనానికి పనిపెట్టు అనేది నేటి కనికట్టు.
పోయిన చోటల్లా స్టార్టప్‌ల కథనాలు వినివిని మెల్లగా ఒక సందేహం నా చిన్న బుర్రను తొలచడం మొదలెట్టింది. కాలేజి నుండి బయటకొచ్చిన వాళ్ళందరూ ఇలా ఎడాపెడా స్టార్టప్‌లు మొదలెడితే వీటిని వాడే జనాలెవరబ్బా! అని ఇంకాస్త లోతుగా తెలుసుకోవడంతో వీటిలో ఎక్కువ శాతం కాలక్షేపం బఠానీలే అని తేలింది. డబ్బు చేసిన వారి పిల్లలు అమెరికా, జర్మనీ, ఇంగ్లాండ్, కెనడా వెళ్ళి రెండు, మూడేళ్ళు చదివి వెనక్కి వచ్చేస్తారు. అబ్బాయిలకు ఎక్స్పోజర్, విజన్ విస్తృతమవడానికే ఈ కాస్మటిక్ స్టడీస్. పెళ్ళి సంబంధాలు కుదుర్చుకునేప్ప్పుడు ఈ ఫారిన్ రిటర్నన్స్ కు కాస్త రేటింగ్ పెరిగి మంచి మేచ్ ఫిక్సింగ్స్ అవుతాయి అని వారి పెద్దల ఆశ.

ముప్పై, నలభై ఏళ్ళ క్రితం పనీపాటలేని కుర్రకారుకి పెళ్ళిళ్ళు కుదరాలంటే అబ్బాయి కాంట్రాక్ట్స్ చేస్తున్నాడు అనేవాళ్ళు. పార్క్‌కు రంగులేయడం, కాలనీ రోడ్లకు స్పీడ్ బ్రేకర్స్ వేయడం, డ్రైనేజీకి గట్టు కట్టించడం లాంటి వర్క్స్ అన్నమాట.

మరికొంత మంది అబ్బాయిలు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారనేవాళ్ళు. జీవితంలో మనందరం ఇద్దరికో, ముగ్గురికో పదో, పరకో అప్పుడప్పుడు అప్పిస్తాం కదా! అదే ఫైనాన్స్ బిగినెస్ అంటే. ఇంకాస్త తెలివైనవాళ్ళు పిల్లల్ని ఢిల్లీ పంపి మా అబ్బాయి ఐ.ఎ.ఎస్ చదువుతున్నాడు అని చెప్పేవారు. మరికొంతమంది కలిగినోరు వారి మైనర్బాబులు మద్రాసులో సి.ఎ చేస్తున్నారని చెప్పేవారు. వీళ్ళల్లో ఎక్కువ మందికి హిందీ, తమిళం వచ్చి, తండ్రి ఆస్తిలో ఎకరం పోయేది కానీ వీరికి ఏమీ వచ్చేది కాదు. వీళ్ళను చూసినప్ప్పుడు మేము చదువుకునేప్ప్పుడు గోడలమీద ఒక రౌడీ రాజకీయ నాయకుడిపేరు ప్రక్కన(బి.ఎ.) అని బ్రాకెట్లో రాసిన సంగతి గుర్తొచ్చింది. తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు ఆయన అనతి కాలంలో మంత్రిగా ఎదిగినా రామ్‌కో సిమ్మెంట్స్ వారి యాడ్‌లా వారి పేరు ప్రక్కన ఈ బంధము ధృడమైనది అన్నట్లు ఆ బ్రాకెట్ విడిపోలేదు, కానీ ఈ లోపు వారు ఈ లోకాన్నే వీడిపోయారు.
పైన చెప్పిన పెళ్ళి గోసాయి చిట్కాలు ప్లాన్‌బి’ గా కొంతకాలం తిండికి తిమ్మరాజులకు, పనికి పోతురాజులకు, పనిగండం బాబుల పెళ్ళిళ్ళకు కొంత వర్కౌట్ అయిన మాట వాస్తవమే. ఉద్యోగం పురుషలక్షణం పోయి స్త్రీ లక్షణ యుగం రావడంతో ప్లాన్సి’ పథకంగా ఈ అంకురాలు అంకురించాయి. ప్రొద్దున లేచిన దగ్గర నుండి తాత, తండ్రులు సంపాదించినదంతా ఎలా తగలేయ్యాలన్న సింగిల్ పాయింట్ ఎజెండా గల వొళ్ళు వొంగని (V.V.Bachelors) దొరబాబులకు, దత్తుళ్ళకు, రాజకీయ యువకెరటాలకు, పిల్ల జమీందార్లకు స్టార్ట్‌ప్‌లు కాస్త లైఫ్లైనే. ఎటొచ్చి నేటి కాలంలో అమ్మాయిలూ చదువుకుని అసెంబ్లీలో క్వశ్చెన్ అవర్‌లో అసలు ప్రశ్నలతోపాటు “స్టార్టప్ దేనికి? మీ ప్లానింగేమిటి? మీ క్లయింట్స్ ఎవరు? మీ టర్నోవర్ ఎంత? స్టాఫ్ ఎంత మంది?” అని అనుబంధ ప్రశ్నలు సంధించడంతో మన స్టార్టప్ బాబులకు ఏ.సి.రూమ్‌లోనూ ఉక్కపోస్తోంది. కొంత మంది ఈ రాపిడ్ ఫైర్ సెషన్స్ తట్టుకోలేక గతంలో ఒక పెద్దాయన బి.కామ్‌లో ఫిజిక్స్ చదివా అని చెప్పినట్లు సమాధానాలు చెప్పడం మొదలెట్టేసారు.
నేటి బాచిలర్స్, ఇలాంటి ప్రశ్నలను సమర్థవంతంగా, ధీటుగా ఎదుర్కొనేందుకు వారి శిక్షణకై త్వరలో “కళ్యాణ్ కారణ్” అనే వినూత్నమైన స్టార్టప్ ప్రారంభించాలని (ఆ రోజుల్లో ప్రఖ్యాత సివిల్స్ శిక్షణా గురువులు రావ్గారు సివిల్స్ ఇంటర్వ్యూను ఎదుర్కొవడమెలాగో కోచింగ్ ఇచ్చినట్లు) తీవ్రంగా ఆలోచిస్తున్నా. చాలా స్టార్టప్‌లు లోక కళ్యాణ కారకాలనేదీ నిజమే. స్విగ్గీ, జొమాటో, అర్బన్‌క్లాప్ వంటివే కొన్ని అద్భుత విజయ గాథలు. పనిలో పనిగా అక్కడక్కడా కొన్ని స్టార్ట్‌ప్‌లు జన కళ్యాణ కారకాలవ్వడం కూడా వాస్తవమే. వంద అబద్దాలాడైనా ఒక పెళ్ళి చెయ్ అన్న ఆర్యులనాటి జీ.వో. ఇంకా రిసైండ్ అయినట్లు లేదు. ఏ కళ్యాణమైనా శుభప్రదమే. ఈవెంట్ మేనేజర్స్‌కు, కేటరర్స్‌కు, మంగళవాద్యకారులకు మరింత మంగళకరమే కనుక మనమూ అలా ‘ముందుకుపోతూ’ వారిని షాదీఖానాకు చేరుద్దాం.
సర్వేజనా సుఖినోభవంతు.

పి. హెచ్. డి ల మీద బాగా చెప్పారు. అది చదివేటప్పుడు నాకు ఓ విషయం గుర్తుకు వచ్చింది. నేను ఈ మధ్య ఒక వార్డు సచివాలయం కు వెళ్ళినప్పుడు అక్కడ ఒక name plate చూసా, so and so, Ph.D, ward digital Assistant అని. అది చూసి ఔరా పి. హెచ్. డి లు ఎంత దిగజారి పోయాయనుకొన్నాను.
ఈరోజే news paper లో చూసా 11 సంవత్సరాల కుర్రోడు 25 కోట్ల start up అట 🤔🤔🤔🤔
వ్యంగ్యంగా, తలంటినట్లు ఉంది.. అసలు పరిశోధనకు పనికిరాని వస్తువు అంటూ ఏదీ ఉన్నట్టుగా లేదు. సౌండ్ తక్కువ చేసే టపాసులు కనిపెట్టినట్టు. 😄
మీ స్టార్టప్ వ్యాఖ్యానం బాగుంది. బలిసిన బాచిలర్ల కథలన్నీ బాగానే బయటపెట్టారు. కాకపోతే ఒక రిక్వెస్ట్. తమ స్టార్టప్ ను పట్టాలెక్కించడానికి పాట్లు పడుతున్న genuine ఔత్సాహికులకు పనికొచ్చే అయిడియాలు కూడా ఇవ్వండి సార్. మీ సుదీర్ఘ ఉద్యోగ జీవితం ఇలాంటి ఎన్నో సందర్భాలను చూసే ఉంటుంది. వెంచర్ క్యాపిటలిస్ట్ కు సాహస పెట్టుబడిదారు అనే పదం సరిగ్గా సరిపోతుంది. భలే వాడారు. Thank You.
అభినందనలు. 💐🙏🏼