
ఇటీవల మద్రాసు వెళ్ళినప్ప్పుడు మా బావమరిది పి.వి.రావు చదువుతున్న Think Like Da Vinci అనే పుస్తకం కాసేపు తిరగేసా. డావిన్సీ జీనియస్‌లకే జీనియస్ అని సంభ్రమానికి లోనై ఉండగానే ఎచ్చట నుండి వీచెనో ఈ చల్లని గాలి అన్నట్లు ‘సింగీతం సినిమా’ విడుదలవార్త చెవిన బడింది. వెంటబడి రిలీజైన రోజే చూసేసా. సింగీతం సినిమా ‘మండే మే నెల ఎండల్లో ఎర్లీ మాన్సూన్ జల్లుల్లా’ చల్లబరిచింది. అది చూసాక ఎవరైనా సింగీతం శ్రీనివాసరావుగారి మీద కూడా ‘How to think like Singeetham’ అనే పుస్తకం రాస్తే బాగుండు అని కూడా అనిపించింది.
సింగీతం గారి ప్రతిభ నేను పుట్టిన సంవత్సరం 1957 లో విడుదలైన మాయాబజార్లో కనబడినా వారితో నా ఫస్ట్ క్రష్ అమావాస్య చంద్రుడితోనే. ఆ తరువాత పుష్పక విమానం, అపూర్వ సహోదరులు, ఆదిత్య 369 వంటి అద్భుత చిత్రాలతో వారి సినీ విజయపరంపర కొనసాగింది. ఎన్నో దశాబ్ధాల తరువాత సెంచెరీ చేరుకోవడానికి కాస్త ముందు ‘సింగీతం’ తో వరల్డ్ వెటరన్ మూవీ దర్శకునిగా ఔరా అనిపించారు. దర్శకులైనా, రచయితలైనా కొన్నేళ్ళు గడిచాక ‘spent force, అయిపోయి, తీసిందే తియ్యడం, రాసిందే రాయడంతో ప్రేక్షకులు, పాఠకులు కాస్త మొనాటనీ ఫీలవ్వడం సహజం. సింగీతంగారు, దర్శకేంద్రులు లాంటి అతికొద్దిమంది క్రియేటివిటీ ఎవర్‌గ్రీనే. పదహారేళ్ళ వయస్సుతో మొదలైన దర్శకేంద్రుల ప్రతిభ ఇటీవల విడుదలైన భక్తరామదాసు వరకు అప్రతిహతంగా కొనసాగింది. సినిమా హిట్టావ్వాలి అన్న ప్రతిఫలాపేక్షతో వారు మృదు ఫలాలను విసరకూడని చోట విసిరినా మరో తన సినిమాకు ఆ హీరోయిన్ జీవించి ఉండాలన్న ఎరుకతో పుచ్చకాయల్ని, పనసకాయల్ని మాత్రం విసరని దీర్ఘదర్శి, మానవతా మూర్తులు వారు.
సింగీతం గారు ఆదిత్య 369 సినిమాకు హెచ్.జి.వెల్స్ రాసిన టైమ్ మిషిన్ పుస్తకం ప్రేరణ. టైమ్ మిషన్ పుస్తకాన్ని మేము ఇంటర్లో చదివాము. ఈ టాకీ యుగంలో, నరుకుళ్ళుతో సుమోలు గాల్లోకి లేపి, ఇద్దరు హీరోయిల్నతో హీరోని కాచుకుంటూ, పలు దేశాల్లో పాటలు తీసుకుంటూ, ఇవి చాలవన్నట్లు ఐటమ్సాంగేసి ఇంకా సినిమా హిట్టవ్వదేమో అని హనుమాన్ చాలీసా చదివే కాలంలో, పుష్పకవిమానం లాంటి మూకీ సినిమా తియ్యడంతో మాకు మాటల్లేవ్. పెద్దాయనా ఏమీ తక్కువ కాదు లెండి. మాకు మాటల్లేకుండా చేసి పాటలలో సినిమా అల్లాడించేసారు.
మూకీసినిమాకు పూర్తిగా భిన్నంగా ఇప్ప్పుడు మాటల్లేని, పాటలే ఉన్న సినిమా (బాహుబలి, పెద్ది, వారణాసిల మధ్య) తీయడం మరింత దుస్సాహసం. సీమలో ఎప్ప్పుడో చచ్చిపోయిన ఫ్యాక్షనిజాన్ని చచ్చి, చెడి సినిమాల్లో బతికిస్తూ తాము బతికేస్తున్న దర్శక, నిర్మాతలకు ఇది అస్సలు మింగుడు పడని విషయం. త్రివిక్రమ్ మాటల మాంత్రికుడైతే మా సింగీతం గారు పాటల మాంత్రికుడ్ని అని నిరూపించారు. సింగీతం గారి సినిమా చూస్తుంటే చిన్నప్ప్పుడు మాస్కూల్లో ఎక్స్‌కర్షన్‌కు వెళ్ళేటప్ప్పుడు వినోద, విజ్ఞాన యాత్ర అని బస్సుకు కట్టుకున్న బ్యానరే గుర్తొచ్చింది. సినిమా మొదలైన కాసేపటికి గౌరి చెట్టును కౌగిలించుకొని నరకొద్దు అని ఏడుస్తుంటే రాజస్థాన్‌లో జింకల్ని వేటాడానికొచ్చిన షర్ట్‌లెస్ కండల వీరుడ్ని బంధించిన వృక్షప్రేమికులు బిష్ణోయ్ తెగవారు గుర్తొచ్చారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం ఆవశ్యకతను ఎంతో హృద్యంగా, సున్నితంగా చూపించడం వారి గొప్పదనం. కథ కాస్త ముందుకు సాగగానే అందరికీ మాటలు పోయి పాటలే రావడం ఇటీవల తీసిన మ్యూజికల్ లే మిసరబుల్స్ సినిమా గుర్తు తెచ్చింది. సినిమాలో దురాశ (గ్రీడ్) మితిమీరితే మానవ వినాశనం తప్పదన్న సత్యాన్ని సజ్జెస్టివ్గానే అయినా బలంగా చూపించారు. ఇదే కోవలో వచ్చిన తుమ్బాద్ సినిమా క్లైమాక్స్ తీరుగానే సింగీతం క్లైమాక్స్ నడుస్తుంది.
పట్టిందల్లా బంగారమవ్వడం మనిషికి వరం కాదు, గొప్ప శాపం. ఈ నీతిబోధించే కింగ్ మిడాస్ కథను సినిమాకు అన్వయించిన తీరు అపూర్వం. బంగారం, సంపదల మీద మోజు పెరిగే కొద్దీ మనిషి క్రూరంగా, అమానుషంగా ఎలా మారుతాడో ఎంతో గ్రాఫిక్‌గా పాత్రలతో పాటలు పాడించి మరీ చూపారు. గతంలో వచ్చిన మెకన్నాన్గోల్డ్, బ్లడ్ డైమండ్, గోల్డ్‌రష్ సినిమాలకు ‘సింగీతం’ సినిమా గొప్ప సీక్వెలే. ముప్పై ఏళ్ళ క్రితం విశాఖ జిల్లాలో పనిచేసేటప్ప్పుడు నర్సీపట్నం ఏజెన్సీ ప్రాంతంలో రంగురాళ్ళ మైనింగ్ సృష్టించిన కలకలం నాకు ఇంకా గుర్తుంది. ఆ మ్యాడ్ స్టోన్రష్ కాలంలో నర్సీపట్నం లాడ్జింగ్స్లో బొంబాయి, విశాఖశేఠ్లు మకాం వేసి కూలీలకు పెట్టుబడి పెట్టి కొండల్ని తవ్వించడం, కొన్నిసార్లు కొండచరియలు విరిగి పడి కూలీలు వాటిక్రింద సమాధైపోవడం సినిమా చూస్తున్నంతసేపు నాకు బ్యాక్ డ్రాప్లో నడుస్తూనే ఉంది.
సినిమా క్లైమాక్స్‌లో పసిపిల్లలు సైతం పెద్దల్ని చూసి అత్యాశతో గనిలోకి పోయి బంగారం కోసం తవ్వడం చూస్తుంటే పిల్లల్ని పెద్దలు ఏవిధంగా పెడదారి పట్టిస్తారో తెలుస్తుంది. క్లైమాక్స్‌లో గ్రామస్థులు బంగారు మూటలతో పెనుగులాడుతూ, పరుగులెత్తుతూ తోసుకుంటూ శిలలుగా మారడం మొదలవ్వగానే వాళ్ళల్లో కాస్త భయం మొదలవుతుంది. అలా మనిషిని తాకడానికి భయ పడిన వాళ్లే తల్లి ప్రసవవేదనకు చలించిపోయి సాయపడటం revival of basic human nature and instinct మీద పోయిన నమ్మకాన్ని మళ్లీ చిగురింపజేస్తుంది.
అప్పుడే పుట్టిన బిడ్డ పైడిబొమ్మ అవడంతో వాళ్ళందరూ తమ తప్ప్పు తాము తెలుసుని పశ్చాత్తాపం పొందుతారు. దానితో జరిగిన నష్టం మెల్లమెల్లగా undo అవడం మొదలవుతుంది. బంగారు శిలలు క్రమక్రమంగా రక్త మాంసాలున్న దేహాలుగా మారడంతో దేహధర్మ శ్వేదజలాలు జలజలరాలడం సింగీతం మార్క్ సింగారమే. గ్రామస్థులందరికీ కనువిప్ప్పు కలిగి ఆనందంగా జీవిస్తుంటే కథ మళ్ళీ మొదటికొస్తుంది.
ఈసారి tempting Satan మరిన్ని advanced features తో ఏకంగా Rolls Royce కారు లోనించి దిగుతాడు. బప్పీలహరిలా ఒంటిమీద కేజీ బంగారంతో, గోవాకార్నివల్ చొక్కాతో, చుట్టూ సూటేసుకున్న బౌన్సర్లతో దిగీ దిగగానే “మీ ఊళ్ళో ఎంత బంగారం ఉందో మీకు తెలుసా” అని ఆకర్ష ఆకర్ష మంత్రం ప్రయోగిస్తాడు. మూతి కాలిన పిల్లి మజ్జిగైనా ఊదుకుని ఊదుకుని తాగినట్లు మన గ్రామస్థులు ఈసారి నిలకడగా ఉండి రోల్స్‌రాయిస్ డాన్ని సాగనంపుతారు. డాన్ స్థాయిని మెర్సిడీస్ నుంచి రోల్స్ రాయస్కు అప్‌గ్రేడ్ చేయడంంలో సింగీతం వారు నాగిభాయ్ల డైరెక్టర్స్ టచ్ తళుక్కున మెరిసింది.
ఇక ఈ సినిమా స్టార్ క్యాస్ట్కొస్తే నాకు తెలిసినవి రెండే ముఖాలు శరద్పవర్లా బెల్స్పాల్సీ విలన్ బెనర్జీగారొకరు. జయమ్మ పంచాయితీలో పూజారిగారి అమాయకపు అమ్మాయిగా నటించి, ఈ సినిమాలో అపరిచుతురాలిగా, పూర్తిగా చంద్రముఖిగా మారి తన నటనా కౌశలాన్ని అద్భుతంగా ప్రదర్శించిన లేడీడాన్ రేణుమేడమ్గా శాలిని జీవించేసింది. గౌరి పాత్రలో అహల్య పూర్తిగా ఇమిడిపోయింది. సినిమా ఆద్యంతం DSP బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉద్విగ్న సన్నివేశాల టెంపోను మరింత పెంచింది. ఏమైనా ఈ సినిమాతో మన DSP హాలివుడ్ సినిమాల్లో ఒక కాలుమోపేస్తాడా అనిపించింది. మల్టీస్టారర్ మూవీస్ చేయలేని పనిని మైన్యూట్ స్టార్స్‌తో మహ బేషుగ్గా చేయించడం గురుశిష్యుల టీమ్వర్కే. అరుపులు, కేకలు, ఏ మాత్రం హింస లేకుండా పర్యావరణ పరిరక్షణకు, మానవతా విలువలకు సున్నితంగా దృఢమైన సందేశాన్నివ్వడం ఈ సినిమా గొప్పదనం.
చివరగా గ్రామస్థులందరూ మట్టిలో బంగారాన్ని కప్పెట్టి, మనుషుల్లో బంగారాన్ని వెతుక్కునే ఊరు మావూరు అని ఆనందంగా పాడుకోవడం వారి హృదయ పరివర్తన వల్లనే. అవును మరి 90 దాటినా మెర్క్యూ‘రియల్’ బ్రెయిన్స్ ఉన్న పెద్దాయన, గడ్డం, క్రాఫ్ చేయించుకుంటే టైమ్వేస్టవుతుందేమో అని నిరంతర చింతనలో మునిగితేలుతూ రమణుల ఆశీస్సులు పుష్కలంగా సంపాదించుకున్న వరపుత్రుడు నాగ అశ్విన్‌ల కెమిస్ట్రీ ‘నాగస్వర సింగీతాన్ని’ వినిపించక ఊరుకుంటుందా? బాగానే వినిపించింది. ఇక మన పని అది కని, విని తరించడమే.
ప్రస్తుతం బాగా ట్రెండింగ్ అవుతున్న డైలాగు ‘కొత్తగా ఏదైనా చెప్ప్పు’ అనడం. ఇదేమాట సింగీతం వారిని కానీ నాగ్ గారిని కానీ అడక్కండే. ఎందుకంటే వారిద్దరూ ఏదైనా కొత్తగా చెప్పగల కడు సమర్థులు.
విశ్వనాథ్, బాపు రమణులతో పాటు మనం ఈ గురుశిష్యుల్ని కూడా మన తెలుగు సినీ వారసత్వ సంపదలో చేర్చేస్తే ఓ పనైపోతుంది.

సినిమా టీజర్ వచ్చింది కానీ ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు, అస్సలు ట్రైలర్ లేదేమో అని అనుకొని ఇంక సినిమా గురించి ఏం ఆలోచిస్తాంలె అనుకున్న సమయం లో మీ ఈ blog చాలా మంచిగా అనిపించింది సార్! Thank you for showing us paths on the parent hood, children upbringing, and finding the Real gold! Keep inspiring, keep writing!!
హర్షవర్ధన్ గారూ! మీ విశ్లేషణ నాకు సంక్లిష్టంగా మారింది. సింగీతం వారి సినిమా సరే. వారి సినిమా ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ కొన్ని (మాకు తెలియని ) సినిమాలు గురించి ఉట్టంకించారు. వాటిని ఎక్కడ పట్టుకోవాలి. ఏమైనా మీ బహుముఖీ నత కు అభినందనలు.
శుభోదయం సార్
సింగీతం సినిమా గురించి దర్శకుని ప్రతిభ మరియి సినిమా లోని అంతర్లీనం గా సమాజానికి ఇచ్చిన సందేశాన్ని చాలా చక్కగా వివరించారు.
ఆర్. వెంకటయ్య
సహాయ కమీషనర్
CCT Hyderabad 🙏🙏
నేను ఈ సినిమా చూడకపోయినా, తప్పనిసరిగా చూడాలి అనిపించేలా చేసింది మీ సమీక్ష.
మీరు రాసిన తీరు బహు భేషుక్కుగా ఉంది.
సింగీతం గారు మన దేశం గర్వించ తగ్గ చాలా ప్రజ్ఞావంతులైన, దర్శకుడు.
నేను ఈ సినిమా చూడకపోయినా, తప్పనిసరిగా చూడాలి అనిపించేలా చేసింది మీ సమీక్ష.
మీరు రాసిన తీరు బహు భేషుక్కుగా ఉంది.
సింగీతం గారు మన దేశం గర్వించ తగ్గ చాలా ప్రజ్ఞావంతులైన, దర్శకుడు.
You have wonderfully captured the soul of the movie, Annayya. The review beautifully brings out the creativity, depth, and timeless brilliance of Singeetham garu and Naga Ashwin in a very engaging way. Since the film is very close to my heart, I thoroughly enjoyed reading this thoughtful appreciation as much as I enjoyed watching the movie. Truly a celebration of meaningful cinema.
Now I will watch this movie to understand the magic of Sing Geetam. To enjoy musical motion picture.
హర్షవర్ధన్ గారూ! మీ విశ్లేషణ నాకు సంక్లిష్టంగా మారింది. సింగీతం వారి సినిమా సరే. వారి సినిమా ఎప్పుడూ బాగానే ఉంటుంది. కానీ కొన్ని (మాకు తెలియని ) సినిమాలు గురించి ఉట్టంకించారు. వాటిని ఎక్కడ పట్టుకోవాలి. ఏమైనా మీ బహుముఖీ నత కు అభినందనలు.
సింగ్ గీతం గురించి చాలా విషయాలు చెప్పారు!
ప్రతీసారి ఆశ్చర్యానికి గురి చేసినట్టే ఈసారీ మీ సినిమా అవగాహన నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది!
బహుశా అది ఇది అని కాకుండా అన్ని రంగాలలోనూ ప్రజ్ఞ కలిగియుండటం మీ ప్రత్యేకతేమో!
అభినందనలు 🙌—-చలం