ఈ టైటిలేదో మంచి క్యాచీగా ఉందనుకోకండి. ఇదంతా మన కథే. ముందే డిస్‌క్లైమర్‌ పడేస్తున్నా, వాస్తవానికి ఇది నాకు కనువిప్పునిచ్చిన కథే! ఆసాంతం చదివాక ఇందులో మీరు కనిపిస్తే It is a mere co-incidence అని సరిపెట్టుకోమని మనవి. మన పెద్దలు మనుషుల్ని ప్రేమించండి, వస్తువుల్ని ఇష్టపడండన్న మాట మారిపోయి మనుషుల్ని ఇష్టపడి వస్తువుల్ని ప్రేమించి మోహించేస్థాయికి చేరుకున్నాం. వెనకటికి వొక మతిమరుపు ప్రొఫెసర్‌ హోటల్లో తిన్న తరువాత తన భార్యకు టిప్పిచ్చి వెయిటర్‌ను ముద్దాడాడట! గిరీశం అన్నట్లు డామిట్‌ కథ అడ్డం తిరిగింది ఎక్కడో తేడా కొట్టింది అంటే ఇదే మరి.

మేము ప్రభుత్వోద్యోగులం కనుక తరచూ ట్రాన్స్‌ఫర్స్‌ అయ్యేవి. ఇలా బదిలీ అయినప్పుడు సామానంతా (Packers & Movers లేని రోజులు) మనమే సర్ధుకుని బయలుదేరే వాళ్ళం. గోడ్రెజ్‌ ఇనుప బీరువా మినహా మిగతా వస్తువులన్నీ సునాయాసంగా కదిలేవి. బీరువా మాత్రం శివధనుస్సులా ఎంత మంది పట్టినా రావణాసురుడు కైలాసగిరిని ఎత్తడానికి ప్రయత్నిస్తే, శివుని పాదంతో కుంగి, వొరిగినట్లు ఎటోవైపు వాలిపోయేది. హమాలీలు ఎంత సంబాళించుకున్నా ప్రతీ బదిలీలో ఏదో గోడకు గీరుకుని బీరువా పెయింటింగ్‌ పావలా మందం పోయేది. ఇలా జరిగిన ప్రతిసారీ నా వొళ్ళు గీరుకుపోయినంత దు:ఖం కలిగి కూలీలను కేకలేసే వాడిని. ఇలా జరుగుతున్న రోజుల్లో ఒకసారి మా మామగారింటికి వెళ్ళాం. వారి ఇంటి ప్రక్కన బాగా డబ్బు చేసినామె ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో ఏటా జరిగే ఆలిండియా ట్రేడ్‌ఫేర్‌లో పాత సినిమాలో జమీందారుగారి మేడలో ఉండే లాంటి మంచి కార్వింగ్సున్న కుషన్‌ సోఫా కొన్నారట. వాటిని విజయవాడకు లారీలో చేర్చి విప్పి చూడగా సదరు సోఫా రవాణాలో ఏకొక్కానికో తగులుకుని కుషన్‌ చిరిగి ఫ్యాక్షన్‌ హత్యల్లో పేగుల్లా లోపలి దూదంతా బయటకొచ్చేసిందట. ఈ హృదయ విదారక దృశ్యం చూసి ఆమెకు ఏడుపు తన్నుకొచ్చిందట. ఈ కథంతా మా వాళ్ళు డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పేనల్‌ డిస్కషన్లో బయటపడింది.

ఇదంతా విన్న నాకు ఆ రోజు రాత్రి ఆలోచనలతో మబ్బు వీడింది. ఆమె శోకం గురించి ఆలోచిస్తూ వెధవ సోఫా చిరిగితే బాధపడటం వరకూ Ok కానీ ఏడ్వడం (అప్పటికే ఆమె అమ్మమ్మ అయినా మనవళ్ళను మంచంమీద ఎక్కి ఆడుకోనిచ్చేది కాదన్న Flash back కూడా ఉందిలెండి) ఏమిటా అనుకునేలోపు మనం మాత్రం ఏమి తక్కువ, ప్రాణం లేని బీరువా భద్రత కోసం హమాలీల ప్రాణాలు తీసైనా గీతలు పడకూడదని తాపత్రయపడ్డామే అనుకుని, పోనిలే మనం ఏడ్వలేదు అని నా భుజం నేనే తట్టుకుని సరిపెట్టుకున్నా. సోఫా నేర్పిన పాఠంతో అప్పటి నుండి బీరువాని ఉప్పు, ఇసుకేసి చేపను రుద్దినట్లు రుద్దానని గొప్పలు చెప్పను గానీ, డామేజీని లైట్‌గా తీసుకోవడం మొదలెట్టా. సోఫా ఎపిసోడ్‌తో వస్తు ప్రేమికుడి టైటిల్‌ పోగొట్టుకునేలా జ్ఞాన బోధ చేసిన గురుమాతకు మనసులో కృతజ్ఞతలు చెప్పుకుని మన తెలుగు టి.వి.సీరియల్స్‌ recap మోడ్‌లోకి పోయి చూస్తును గదా ఎంతో మంది కామ్రేడ్స్‌ తోసుకుంటూ గుర్తుకొచ్చారు.

జంధ్యాల గారి సినిమాలో ఒకడు చెప్పులు పోగొట్టుకుని ‘‘నా షోలాపూర్‌ చెప్పులు పెళ్ళిలో పోయాయి అవి కొత్తవి, మెత్తవి, కాలికి హత్తుకుపోయేవి’’ అని గగ్గోలు పెడతాడు. అమెరికా నుండి కొత్తగా ఘాస్‌ కొనుక్కొచ్చినాయన రోజూ మా పార్క్‌లో వాకింగ్‌ ముగించుకుని ఇంటికొచ్చి రోజు క్యారీ బ్యాగులో వాటిని భద్రం చేసుకోవడం చూసి ICU లో పేషంట్స్‌ను చూడ్డానికి వెళ్ళే విజిటర్స్‌ కాళ్ళకు వేసుకునే ప్లాస్టిక్‌ కవర్స్‌ లాంటివి వేసుకుని వాకింగ్‌కు రావచ్చు కదండీ అని సలహా ఇస్తే బాగుండదేమో మాస్టారు అని బిడియపడ్డాడు. మరో ICU ఫాదర్‌ వాళ్ళబ్బాయి కొనిచ్చిన Rado విష్ణువాచ్‌ పెట్టుకుని దానిపై కర్చీఫ్‌ కట్టుకుని అరగంటకోసారి కర్చీఫ్‌ విప్పి క్లోజప్‌ యాడ్లోలా నోటితో హా..హా అని ఆవిరులూదుతూ కర్చీఫ్‌తో సుతిమెత్తగా డయల్‌ను తుడవడం చూసి హతవిధీ రాడో వీరికి వేడి నిట్టూర్పులను మిగిల్చిందే అని నేనూ ఓ నిట్టూర్చా.

పాత తమిళ డబ్బింగ్‌ సినిమాలో కమెడియన్‌ నాగేష్‌ బంగారం పన్ను కట్టించుకున్న వాడితో ‘‘నువ్వు రోజూ రాత్రులు బీరువాలో పడుకుంటావా?’’ అని అడుగుతాడు. ఆ కామెడీ ఇప్పుడు రియాల్టీ. మన వాళ్ళు పెళ్ళిళ్ల సీజన్‌లో బ్యాంక్‌ లాకర్స్‌లోని నగలను తీయడం, ధరించడం మళ్ళీ లాకర్లో పెట్టేవరకు వెర్రీ కావడం అందరికీ తెలిసిందే. ఎప్పుడైనా ఒక్కరోజు వాటిని లాకర్లో పెట్టడం ఆలస్యమయిందా మనవాళ్ళ కంగారు, బాధ వర్ణనాతీతం. కన్సల్టెంట్స్‌ లేని రోజుల్లో అమెరికాలో చదువు ముగించుకున్న మన స్టూడెంట్స్‌ బెంచి మీద ఉన్నంతకాలం advisor (Student) to Budweiser (ఒక బ్రాండ్‌ బీర్‌ అని వినికిడి) Budweiser to advisor circuit వలెనే నగలు Locker to Home-Home to Locker అదే చక్రభ్రమణం.

విలువైన వస్తువులు మనశ్శాంతిని ఎలా పోగొడతాయో మరోస్వానుభవం. ఏలూరులో పని చేసే రోజుల్లో ఏడాదికి రెండు, మూడుసార్లు మీటింగ్స్‌ నిమిత్తం లెక్కలన్ని జమచేసుకుని పుస్తకాలుగా కుట్టుకుని రైల్లో హైదరాబాద్‌ పోయేవాళ్ళం. ‘పనిచేసే ముఖ్యమంత్రి’ గారి హయాంలో ఒకసారి అలాంటి మీటింగ్‌కు హైదరాబాద్‌ (కంప్యూటర్‌ యుగారంభంలో) వెళ్తే మా అందరికీ అంకగణాంకాలను (Laptop) బ్యాగుతో సహా ఇచ్చి ‘‘దీని ఖరీదు లక్షన్నర, బరువు ఒకటిన్నర కేజీలు (ఛార్జర్‌, బ్యాగ్‌ కలిపితే రెండు కేజీలు) ఇది పోతే, మీ ఆర్నెల జీతం కట్‌’’, అని హెచ్చరించారు. ఆ రోజు తిరుగుప్రయాణంలో నాకు కంటి మీద కునుకు పడితే వొట్టు. సదరు Laptop ను అంకానికి తగిలేలా చేర్చుకుని (బాలింతరాలు పిల్లవాడ్ని పక్కలో వేసుకున్నట్లు) తడుముకోవడంతో తెల్లారి పోయి, ఏలూరు వచ్చేసింది. మరుసటిరోజు ‘‘కళ్ళు ఎర్రగా ఉన్నాయి నిద్రపట్టలేదా?’’ అని అడిగినవాళ్ళకు ‘‘ఒకటే దోమలు ఎక్కడి నిద్ర’’ అని గోబొంకర్స్‌.

మా చిన్నప్పుడు పోస్టాఫీసుకు పోతే అక్కడకు వచ్చినవాళ్ళ పెన్నులు ఎరువడిగేవారు. ఫౌంటెన్‌ పెన్నులు కాలం కనుక cap ను మన దగ్గర (Caution deposit లా) ఉంచుకుని ఇస్తే వారు పని ముగించుకుని తిరిగిచ్చేవారు. ఇప్పుడు One Rupee, Two Rupee బాల్‌పెన్స్‌ వచ్చాక Caution deposit గొడవపోయింది. అసలు Post Office లు మ్యూజియమ్స్‌ అవడంతో ఈ సీన్‌ మిస్‌ అయి పోయాం. ప్రస్తుతం వేలరూపాయలు ఖరీదు చేసే Mont Blanc, Parker పెన్నులు పోస్టాఫీసుల్లోనో, ఎయిర్‌పోర్ట్‌లోనో ఎవరికో ఇచ్చి మర్చిపోతే నా షోలాపూర్‌ పాట మార్చి పాడుకుని ఏడ్చుకోవడమే! లేదా పట్టుచీర ఎరువిచ్చినామె పీట పట్టుకుని కట్టుకున్నామె వెనకే తిరుగుతూ ‘‘వస్తా నీవెనుక ఏమైనా కాని ఇక’’ అని పాడాల్సిందే. మేము గ్రామ గ్రంథాలయాలకు వెళ్ళేరోజుల్లో బయట ఎత్తుబల్ల మీద గీతలుకొట్టిన పుస్తకం, దారంతో బంధింపబడిన రెండంగుళాలకు మించని పెన్సిల్‌ ముక్కా ఉండేవి. ఆ పెన్సిల్‌ ముక్కతో సంతకం చేసి లోనికి పోవాలి. ఆ పెన్సిల్‌ ముక్కను పట్టుకుని సంతకం చేయడమే గొప్ప ఆర్ట్‌. ఆ చిన్న పెన్సిల్‌ ముక్కల్నీ కూడా మాయం చేయడం ఇంకా పెద్ద ఆర్టే!

నేటికీ చేతికి చిక్కని లైబ్రరీ పెన్సిల్‌

బదిలీల సీజన్లో విజయవాడలో ఒక వస్తు ప్రేమికుడి సంరక్షణలో ఉన్న వారి NRI అమ్మాయి గారి ఫ్లాట్‌ అద్దెకు తీసుకోవాల్సిన భాగ్యం కలిగింది. ఆయన ఫ్లాట్‌ చూపిస్తూ, ‘‘గోడకు మేకులు కొట్టరాదు, కుంకుడు కాయలు కొట్టరాదు, టైల్స్‌ జాగ్రత్త, సింకులు జాగ్రత్త, తలుపులు గట్టిగా వేయరాదు’’, అని మరెన్నో నిషిద్ధాక్షరులు చెప్పుకుంటే పోతుంటే సహనం కోల్పోయి ‘‘సార్‌ మేము ఇల్లు అద్దెకు తీసుకునేది ఉండటానికే గానీ మీరు చెప్పినవన్నీ చేయడానికి కాదు అని, ఏమైనా డ్యామేజులుంటే అడ్వాన్సులో మినహాయించుకోండి. ఇక్కడితో ముగించండనేసా’’. వారి వ్యధ చూస్తే పొరపాటున గోడకు మేకు కొడితే వారికి శిలువేశి మేకు కొట్టినట్లే అన్నట్లుంది వారి ఫీలింగ్‌.

ఆ రోజు సాయంత్రం వారింటికి అడ్వాన్సు ఇవ్వడానికి వెళ్తే ఇల్లంతా తిప్పి చూపించారు. పదేళ్ళక్రితం కట్టిన ఇల్లే అయినా ఇవాళే గృహప్రవేశం అయినట్లు మంచి పగ్గంలా ఉంది. వంటగది చూస్తే ఎక్కడా వంట జరుగుతున్న ఆనవాళ్ళే లేకపోవడంతో ‘‘వంట చేసుకోరా’’, సార్‌ అని అడిగితే ఆయన చిరునవ్వుతో వంటగది కవాటం తెరిచి (యశోదకు చిన్నికృష్ణుడు తన నోటపదునాలుగు భువనాలు చూపినటుల) బయటరేకుల షెడ్డు చూపించి లోపల టైల్స్‌, గ్రేనైట్‌ పాడైపోతాయని ఇక్కడ వండుకుంటాం అని నా అజ్ఞానాంధకారాన్ని తొలగించారు. లోపలి కిచెన్‌ వాడకానికి కాదు Demo, Modular Kitchen for public and visitors consumption కే అని ఏతో అందర్‌ కీ బాత్‌హై అని అప్పుడు బోధపడింది. ఈ షాక్‌లో నుండి కోలుకుని తూలూతూ సోఫాలో కూర్చోబోతుంటే, ‘‘సార్‌ సార్‌ అవి గోతుల్లా ఉంటాయి, కంఫర్ట్‌ ఉండ’’ దని వారించి Couch ల పక్కనే వేసున్న చెక్కకుర్చీలపై కూర్చోమన్న తరువాతే విదితమైంది ఇవి కూడా Demo couch లేనని. పనిలో పనిగా పాలరాతి డెమో డైనింగ్‌ టేబుల్‌, ప్రక్కనే సవతి తమ్ముడిలా దీనంగా ఉన్న Usage dining table చూపించడంతో ఫ్లాట్‌ అద్దెకు ఇచ్చేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల వెనుక వారి మాటల్లో ఉన్న ఆర్థ్రత ఎక్కడో టచ్‌ చేసింది.

నలభై ఏళ్ళ పూర్వం కాలేజీ లెక్చరర్‌గా పనిచేసే రోజుల్లో మా కొలీగ్‌ ఒకాయన అప్పటికే ఐదారేళ్ళ క్రితం ఢిల్లీ నుండి తెచ్చిన ప్లాస్టిక్‌ వైరింగ్‌తో ఉన్న అల్యూమీనియం కుర్చీలు తెచ్చుకున్నారు. ఆ రోజుల్లో ఎపి ఎక్స్‌ప్రెస్‌, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుండి వచ్చిన ప్రతివారు ప్లాస్టిక్‌ కవర్స్‌ తొడిగిన ఈ కుర్చీలతోనే సవ్యసాచుల్లా విజయవాడలో దిగేవారు. ఒకరోజు మా మాస్టారు ఇంటికి కాఫీకి రమ్మంటే వెళ్ళా. ఆయన రండి రండి అని సాదరంగా ఆహ్వానించి గోడకు చేర్చిన ప్లాస్టిక్‌ కవర్లలోని కుర్చీలను పరచి కూర్చోమన్నారు. ముచ్చట్లు, కాఫీలు అయిన తరువాత మేము లేచి, ‘‘వెళ్ళొస్తాం మాస్టారు’’ అనగానే వారు వొక్క నిముషం అని మేము నిలబడగానే మా కుర్చీలు మడచి, జాగ్రత్తగా కవర్లు ముసుగు తొడిగి గోడలకు చేర్చి మమ్ముల్ని సాగనంపారు. కుర్చీల వన్నెచిన్నెల, తళుకు బెళుకుల సోయగం వెనుక ఉన్న రహస్యం తెలిసిపోవడంతో ‘యురేకా’ అనుకుంటూ రోడ్డున పడ్డాం.

ఇదియును అట్టిదే!

ఆ మధ్య మా బంధువులామె అమెరికాలో ఓ పెళ్ళికి వెళ్ళింది. పోతూపోతూ కోటిరూపాయల నగలు, డైమండ్స్‌ (రాళ్ళు రప్పలు పొదిగినవి) పోగేసుకుని తీసుకుపోయింది. పెద్దింటి వారి అమెరికా పెళ్ళి. అక్కడ మరో నలుగురు మరోనాలుగుకోట్ల నగలు సంచీల్లో వేసి ఈమెను (Care Taker) చూస్తుండమని చెప్పారు. ఆమె ఈ సంచుల్ని భుజాలకు తగిలించుకుని, కాళ్ళ దగ్గర పెట్టుకుని సిజేరియన్‌ చేయించుకున్నామె కుట్లను నిమురుకున్నట్లు నిమురుకుంటూ, తడుముకుంటూ తన్మయావస్థలో కూర్చుందట. పాపం ఏమి చూసిందో పెళ్ళి ఏమి ఎంజాయ్‌ చేసిందో! అని ఆమెను తలుచుకుని జాలిపడ్డా.

అడవిలో కౌపీనంతో జీవనం కొనసాగిస్తున్న సన్యాసి వారి కౌపీనం ఎలుకలు కొరికేస్తున్నాయని పిల్లిని పెంచి, పిల్లి పాలకోసం ఆవును పెంచి, ఆవును చూసుకోవడానికి ఒకామెను ఉంచి కాలక్రమేణ ఆమెను పెళ్ళాడి పిల్లల్నీ కనేసాడట. ఆయన్ను కలవడానికి హోమ్లీ ఆశ్రమానికి వచ్చిన పాత మిత్రుడు ఇవన్నీ చూసి అవాక్కైతే సదరు సన్యాస-సంసారి ‘‘కౌపీనం తెచ్చిన తంటా’’ మిత్రమా అని పశ్చాత్తాపడ్డాడట. ద్వాపర యుగంలోనూ బంగారాన్ని ఈనే శమంతక మణిని పోగొట్టుకున్న సత్రాజిత్తు శ్రీకృష్ణునిపై నిందమోపడం వస్తుప్రీతే. కాకపోతే అవన్నీ లోకకళ్యాణార్థం అన్న Special G.O కిందకొస్తాయి కనుక మనకు వినాయక వ్రత కథొకటి మాత్రమే మిగిల్తే, జాంబవతి కృష్ణ భగవానునికి అష్టమ భార్యల్లో ఒకరుగా లభించడమేగాక సత్రాజిత్తు కుమార్తె అయిన సత్యభామ మరో భార్యగా కూడటం వారి ఘనతే. భారతంలో చూసిన ఉదంకుడు తన గురుపత్ని పౌలోమి కోరిన మణికుండలాలను ఎంతో శ్రమపడి పౌష్యుని భార్యనుండి సంపాదిస్తాడు. దారికాచి తక్షుడు వాటిని కాజేస్తాడు. ఇదంతా వస్తుప్రీతి కాక మరేమిటి?

చలంగారు రమణాశ్రమంలో ఉన్న రోజుల్లో వారింట్లో చిన్నచిన్న వెండి పూజాసామాగ్రి పోయిందట. ఈ విషయం చలంగారితో చెప్తే సౌరిస్‌తో కలిసి మిగతా కుటుంబసభ్యులంతా గంతులేస్తూ హమ్మయ్య వాటిని కాపలా కాసే పనిలేకుండా పోయిందని సెలబ్రేట్‌ చేసుకున్నారట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రిగారనే గొప్ప పండితులు చందోలులో ఉన్నప్పుడు దొంగలు పడివారి వెండి ఉద్దరిణి, పంచపాత్ర పట్టుకుపోయారట. ఈ విషయం అప్పట్లో వారి శిష్యులైన జిల్లా పోలీసు ఎస్‌.పి. గారికి తెలిసి, వారు శాస్త్రిగారిని కలిసి ‘‘గురువుగారు చిన్న కంప్లెట్‌ రాసివ్వండి, మేము చూస్తాం’’ (పోలీసులు మిత్రులైతే మన బంగారం, వెండో కాకపోయినా ఏదో రకంగా, ఎవరిదో ఒకరిది మనకి సర్దుబాటు చేస్తారు అని వినికిడి) అంటే శాస్త్రిగారు ‘‘అవి మనవికావు నాయనా అందుకే మన దగ్గర ఉండకుండా పోయాయి. పోతే పోయాయి ఇంతటితో వాటి విషయం మర్చిపోదాం’’ అని చెప్పిపంపేసారట.

వేలవేల సంవత్సరాల పూర్వం కట్టిన శిథిలమై పడిపోతున్న ఆలయాలను కోటలను చూసైనా భౌతిక సంపదలన్నీ నశించిపోయేవే అన్న భావన కలగకుండా వాటితో తాదాత్మ్యం చెంది ఆచంద్ర తారార్కం ఉండిపోతాయనుకోవడం విష్ణుమాయే! మా షాపులో ఏది కొన్నా Life time Guarantee అని రొదపెడుతున్న సేల్స్‌మెన్‌ను ముందు life కు Guarantee ఇస్తావా అని ఒక పెద్దాయన నిలేస్తే అతగాడు బుర్ర గోక్కుని పిచ్చి నవ్వు నవ్వేశాడు. టాగోర్‌ గీతాంజలిలో ఆడుకోడానికి పిల్లలకు ఆభరణాలు అవరోధాలు కాకూడదు అన్న మాట ఎంతో అందమైంది, అర్థవంతమైంది.

లాస్ట్‌ ఫ్లైట్‌ నో బ్యాగేజ్‌ ఇంక్లూడింగ్ హ్యాండ్‌ లగేజ్‌

మన పెద్దలు చెప్పినట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క దాని మీద పట్టు, భ్రాంతి. అవి వదిల్తే గాని వెలుతురు కనపడదంటారు జ్ఞానులు. సాధనతో కొంతైనా, కొన్నైనా వదిలించుకుందాం. ప్రస్తుతానికి నన్ను వదిలించుకుని మీ బరువు దించుకోండి.
(గురుబోధ చేసిన గురుమాతకు కృతజ్ఞాభివందనములతో …)

28 Replies to “వస్తు ప్రేమికులు”

 1. Excellent comedy hidden in deep philosophy.
  The last cartoon is worth a thousand page episode.
  Congratulations Harsha

  1. వస్తు వ్యామోహం కు హాస్యాన్ని జోడిస్తూ మీరు చెప్పిన తీరు ప్రశంసనీయం సార్.దీని వల్ల ఎక్కడా బోరుకొట్టకుందా సుదీర్ఘంగా చదివించగలిగారు. చిన్నప్పటి నుంచీ జీవిత పయనంలో ఎదురైన ఏదో ఒక సంఘటన దీనిలో తరసపడెలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు సార్

 2. హర్షవనం లో విహరించినప్పుడల్లా మనకి తెలిసిన పూలనో, మొక్కలనో చూస్తున్నామనిపించినా, అవి ఇంకా అందంగా కనపడటం వారి చతురత.
  “వేలవేల సంవత్సరాల పూర్వం కట్టిన శిథిలమై పడిపోతున్న ఆలయాలను కోటలను చూసైనా భౌతిక సంపదలన్నీ నశించిపోయేవే అన్న భావన కలగకుండా వాటితో తాదాత్మ్యం చెంది ఆచంద్ర తారార్కం ఉండిపోతాయనుకోవడం విష్ణుమాయే! “
  ఇది మాత్రం వారి సున్నితత్వనికి(లౌక్యానికి) నిదర్శనం!
  నేనైతే విష్ణు మాయకు బదులు “అజ్ఞానం” అని కొందరి మితృల్ని శతృవులుగా మార్చుకొనేవాడిని😃

 3. చాల హాయిగా సునిశితంగా సాగిన రచన , ప్రతి వారి అనుభవాలు చాల చమత్కారంగా
  చెప్పారు సర్..సుపర్బ్

 4. అల్లిక బాగుంది హర్షవర్ధన్ గారూ! విషయం చెప్పడం కాదు, విషయం చుట్టూ ప్రాపంచిక విషయాలు జోడించడం మీ నిపుణత.

 5. Good morning sir,
  Very funny but realistic🙂.
  In real life we all experienced these types of situations and sometimes followed too.

  Thank you sir for sharing 🙏

 6. సర్,

  సునిశిత హాస్యం,గంభీర విషయం అధ్బుతం గా రంగరించి స్వానుభవ సత్యంతో చిలిపిగా చెప్పారు… చదివించి,నవ్వించి…ఆలోచింపచేసింది…

  1. కథా వస్తువు ప్రేమించే అంత గొప్పగా ఉంది. ఎన్ని కొత్త పద ప్రయోగాలు ఉన్నాయో చెప్పడం కష్టం. ఉప్మా అలంకారాలన్నీ క్యాష్ యు నట్స్ లాగా బాగా వేగాయి. అలాంటి ఉప్మా తిని మద్రాస్ కాఫీ గ్లాసులో ఊదుకుంటూ కాఫీ తాగినంత అనుభూతి కలిగించింది. ధన్యవాదములు

 7. హాహా. చాలా బాగుంది. ఇవన్నీ నిజమైన సంఘటనలే. చివరి రోజుల్లో వస్తువులు, ఆస్తులు, ఇతర బంధాలు తెంచుకుంటే మరణం సునాయాసంగా వుంటుంది అని అంటారు.

 8. ప్రియ మిత్రులు హర్షవర్ధన్ గారికి…మీరు పోస్ట్ పంపిన
  12 గంటల్లో 12 సార్లు చదివాను.
  సమయం అలా కలిసి వచ్చింది. నేను రైలు ప్రయాణంలో ఉండగా పంపించారు….వెంట తెచ్చుకున్న పుస్తకం పక్కన బెట్టి వస్తు ప్రేమ ప్రేమ తగ్గించు కోవాలి అని మీ రచన పారాయణ చేశాను.
  తీరా రైలు దిగి విజయవాడలో ఆటో ఎక్కాక చూసుకున్నాను….రైల్లో నా tupperware water బాటిల్ , Phone speed ఛార్జర్ మర్చి పోయాను. మనవి కానివి మనకు మిగలవు…అనే వేదాంత భావన మీ post చదివిన ఫలశ్రుతి గా భావించి, ఇల్లు చేరాను.

 9. Sir very interesting really and enjoyed a lot. Narration is very simple and realistic, attached with everyone life once in a time. Thank you sir

 10. Sir
  Taking care of laptop comapred to pregnant lady is hilarous.😆😆. Everyone has to admit we too have some sort of attchment with various things. Detachment to things told very funny way Sir

 11. ఇటువంటి వస్తు ప్రేమ వ్యక్తులు నా చిన్నతనంలో తరచూ కనబడేవారు😀, అటువంటి వ్యక్తులను వారి విషయాలను మీరు ఇలా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

 12. హర్షవర్ధన్ మిమ్ము వదిలించు కోవటం కష్టమేమరి . నేను చదువుకొనే రోజులలో రిలీఫ్ కొరకు హాస్య రచనలను చదువుతూ ఉండే అలవాటు. ప్రస్తుతం మీ రచనలు ఆస్తా నాన్ని తీసుకొని నాకు ప్రియమైనవిగా ఉన్నవి. ఇవన్నీ వక పుస్తుకరూపంలోఉంటే బాగుగా ఉంటుంది. పోలిక కాదుగాని , బాపుగారి కుప్పిగంతులు గుర్తుచేస్తున్నాయి. ప్రతిసారి మీరచన కొరకు చూస్తూ ఉండు
  మీ అభిమాని.

 13. ఇది నిజం వస్తు ప్రేమ మమకారం ఆవకాయ అన్నంలా వదలవు

 14. చాలా చాలా బాగుందండి, చమత్కారంతో కూడిన మీ కదనం,అలనాటి సంగతులు కళ్ళకు కట్టినట్లు వ్రాసే విధానం మీకు మీరే సాటి.Really enjoyed a lot reading it.

 15. అద్భుతమైన హాస్య స్పర్శతో చాలా అందమైన వ్యాసం హర్ష. జ్ఞాపకశక్తిని వ్యాసంగా మార్చడంలో మీ ఉనికి సూపర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.