ఉమ్మిటి శివలింగం గారు సామాన్యులలో అసమాన్యులు. ఇరుగుపొరుగు అవటంతో వారి కుటుంబంతో మా కుటుంబానికి మూడు తరాల సాన్నిహిత్యం. జన్మతః సంక్రమించిన పేదరికంతో పోరాటం వారిని జీవితాంతం వదలలేదు. కానీ ఆయన జ్ఞానాన్వేషణతో దాన్ని జయించారు. జీవన పోరాటం, బ్రతుకు ఆరాటంతో ఆయన చదువు చల్లపల్లి రాజా హైస్కూల్‌లో ఎస్‌. ఎల్‌. సి. తో ఆగిపోయింది. చదువు ముగిసిన వెంటనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏడాదిపాటు తాత్కాలికంగా పనిచేశారు. ప్రభుత్వ కొలువుతో రాజీ పడలేక ఉద్యోగం విరమించుకున్నారు.

కులవృత్తినే నమ్ముకొని మగ్గం నేత పనిలో జీవితాంతం శ్రమించారు. స్వభావరీత్యా సాత్వికులు, సున్నిత మనస్కులు. ఎవ్వరినీ నొప్పించలేని స్వభావం కావడంతో పరిచయాలు కూడా పరిమితమే. స్కూల్‌ రోజుల నుండి పుస్తక పఠనం తీవ్ర వ్యసనం. చల్లపల్లి గ్రంథాలయంలోని అన్ని పుస్తకాలు చదివేశారు. ఒకసారి నేను చల్లపల్లిలో కలిసినప్పుడు “పుస్తకాలు చదవడం కంటే భోజనం అంత ముఖ్యమైనది కాదు అనిపించేది” అన్నారు. అలాగే జీవితాంతం సత్యాన్వేషణలో సాధన కొనసాగించారు. ఆఖరుకి బందరులో పాత పుస్తకాలు (అంతకంటే దూరంగా వెళ్ళలేని పేదరికం వల్ల) కొనడం, వాటిని చదవడం మాత్రం వదలలేదు. వారు ఎప్పుడు నాకు ఫోన్‌ చేసినా ఈ మధ్య ఏ పుస్తకాలు చదివారు? అన్న ప్రశ్నతో సంభాషణ ఆరంభించేవారు.

చదవడం, రాయడం వారి ఉచ్చ్వాస, నిశ్వాసలంటే అతిశయోక్తి కాదేమో! చాలా చిన్న వయసు నుండి గేయాలతో మొదలుపెట్టి వ్యాసాల వరకు రచనాభిలాషను కొనసాగించారు. తెలుగు విద్యార్థి, భారతి, మిసిమి పత్రికల్లో వందలకొద్దీ వ్యాసాలు, కవితలు రచించారు. చల్లపల్లి లాంటి మారుమూల గ్రామం వదలక, ఏ డిగ్రీ పొందక వారు హిందూమతం, బౌద్ధం, మానవ జీవన శైలి వంటి అంశాలతోపాటు సమకాలీన సాహితీవేత్తలైన శ్రీశ్రీ, సినారె, నగ్నముని, గురజాడ, చలం, ఠాగూర్‌, తిలక్‌ రచనలను చాలా లోతుగా విశ్లేషించారు. ఎవరి నుండీ ఏమీ ఆశించే కోరిక లేకపోవడం వలన విమర్శలన్నీ నిర్మొహమాటంగా, తాను అర్ధం చేసుకున్న రీతిలో వ్యక్తీకరించారు. ఏ ఇజానికీ కట్టుబడక పోవడం వలన వారి భావాల్లో స్వభావ సిద్ధమైన స్వచ్చత ప్రత్యేకంగా కనబడుతుంది. మగ్గం నేత, సాహితీకృషి సుమారు అర్థ శతాబ్దం (2008) వరకు అలుపెరగక సాగించారు.

తన ‘సాహితీ వ్యాసాలు” పుస్తకం ముందుమాట ‘ఆత్మనివేదన’ లో వినమ్రంగా “నేను సాహితీవేత్తను కాను. వేత్త అంటే తెలివైనవాడు, జ్ఞాని అని అర్ధం ఉంది. సాహిత్య అభిమాని అంటే ఒప్పుకుంటాను అని చెప్పుకున్నారు. అలాగే వ్యక్తులు “మొగ్గలా ఉన్న మనసును వికసింప చేసుకోవడానికి ప్రాపంచిక జ్ఞానాన్ని శాస్త్ర అధ్యయాన్ని పెంపొందించుకోవాలి. అంతర్గతంగా ఉన్న పరిపూర్ణ చైతన్య సాక్షాత్మారం కోసం మౌన ధ్యానాన్ని ఆశ్రయించాలి. అంతర్భహిత జగత్తుల సమన్వయ సాధన సాహితీవేత్త లక్ష్యం. అచంచల శాంతి సాధన తాత్త్వికుని గమ్యం” అని దిశానిర్దేశం చేసిన రుషితుల్యులు శివలింగం గారు.

2001లో నేను ఉద్యోగరీత్యా ఏలూరులో ఉన్నప్పుడు అనుకోకుండా మా స్వగ్రామం చల్లపల్లికి శ్రీరామనవమి జరుపుకోవడానికి వెళ్ళడం, అక్కడ మా బాబాయి శ్రీరామచంద్రరావు గారి (శివలింగం గారి బాల్యమిత్రులు) ద్వారా నాకు శివలింగం గారి పరిచయ భాగ్యం కలగడం దైవికమే కాక నా అదృష్టంగా భావిస్తాను. నాకు కొంత సాహిత్యాభిలాష ఉండటంచే వారితో సంభాషించటం, మాటల్లో వారి వ్యాసాల ప్రస్థావన రావటం జరిగింది. ఆ రోజు సాయంత్రం వారి ఇంటికి వెళ్ళాను. ఇల్లు అనేకంటే చిన్న కుటీరం (గది) అనొచ్చు. వారి జీవితంలాగే సగ భాగం పుస్తకాలతో, సగ భాగం మగ్గంతో నిండి ఉంది. వారి ధర్మపత్ని గొప్ప సంస్కారంతో ఆప్యాయంగా నన్ను ఆదరించిన తీరు మరువలేనిది. వారిద్దరినీ చూసిన తరువాత మనుషుల్లో సంస్కారానికి, సంపదకి సంబంధం లేదనిపించింది. వారు రాసిన వ్యాసాల్లో వారు సేకరించి ఉంచినవి ఇచ్చారు. అవి అన్నీ పది రోజుల్లో చదివాను. వారి విషయ పరిజ్ఞానం, వివిధ అంశాలపై వారికి గల అవగాహన నన్ను సిగ్గుపడేలా చేశాయి. ఈ రోజున చాలా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యులుగా, ఉపన్యాసకులుగా ఉన్న అతి కొద్దిమందికి మాత్రమే శివలింగం గారి స్థాయి ఉందని నాకనిపించింది.

మేమందరం ఏదో ఒక డిగ్రీ, ఒక పరీక్ష సాయంతో ఉన్నతోద్యోగులుగా చెలామణి అయిపోతుంటే, శివలింగంగారి వంటి మట్టిలో మాణిక్యాలు మరుగునపడి ఉండటం నన్ను బాధించింది. ఎలాగైనా వారి రచనలను కొన్నింటినైనా వెలుగులోకి తీసుకురావాలి అనుకొని వారి అనుమతి అడగటం, వారు సంతోషంగా అంగీకరించడంతో వారి వ్యాసాల్లో ఎక్కువ మందికి అర్థమయ్యేవి మాత్రం (వారు రాసిన కొన్ని వ్యాసాలు మేధో వర్గానికి మాత్రమే సంబంధించినవి కనుక) ఎంపిక చేసే పని మిత్రులు శ్రీ రంకిరెడ్డి రామ్మోహన్‌రావు (ఆంధ్రోపన్యాసకులు, పెనుగొండ కళాశాల) గారు స్వీకరించారు. మధు స్క్రీన్స్‌ అధిపతి మిత్రులు మధు గారు డి.టి.పి చేయడం, మరో మంచి మిత్రులు శ్రీ లక్ష్మీగణపతి ప్రింటర్స్‌ అధినేత శ్రీ వీరభద్రరావు గారు ప్రత్యేక (శ్రద్ధతో ఉచితంగా ఆ వ్యాసాల్ని ‘సాహితీ వ్యాసాలు పుస్తకంగా తీసుకొచ్చారు.

ఆత్మీయ మిత్రులు ఆచార్యులు శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు సాహితీ వ్యాసాలు పుస్తకానికి పీఠిక రాస్తూ ‘కచ్చితమైన తన అభిప్రాయాలను సాధారణంగా సుకుమారంగా చెప్పడం వీరి ప్రత్యేకత. అనుభూతి అనేదీ, స్వేచ్చ అనేదీ సృజనాత్మక రచనలకు ప్రాణమనే సిద్ధాంతంతో వారెక్కడా రాజీపడలేదు. నిబద్ధత పేరుతో ఈ రెండింటినీ పోగొట్టుకున్న వారికి ఆ విషయం తెలియజెప్పడానికి వెనకాడలేదు. తనకు నచ్చిన కవుల్లోనూ, రచనల్లోనూ నచ్చని విషయాలను హేతుబద్ధంగా చెప్పడానికి జంకలేదు. ఉత్తమ విమర్శకుడికి ఇంతకన్నా కావలసిన గుణాలు ఏమున్నాయి?” అని అనడంలో శివలింగం గారి విమర్శనా పటిమ మనకు తెలుస్తుంది. వారు రాసిన వ్యాసాలన్నీ పాఠకుల జ్ఞాన పరిధుల్ని విస్తరింపచేసి ఆలోచింపచేస్తాయి అనడంలో సందేహం ఏమీ లేదు. అలాగే వ్యాసాల్ని సమీక్షిస్తూ రామ్మోహన్‌రావు గారు ‘డబ్బు, అధికారం, అహంకారం, డిగ్రీలు, బిరుదులు, పదవులు, కుర్చీల తేడాలు, అవసరాలు, ఆశ్రయింపులు లాంటి పరదాల వెనుక ఉండి, చీకటి అంతఃపురాల్లోంచి కాకుండా వెలుగు రేఖల వెలుతురు నిండిన నిష్కల్మష సాహిత్య సత్య లోకంలో నిలబడి సాహిత్య విమర్శకుడైన శివలింగం గారి వ్యాసాల్ని మనసారా చదవమని పాఠకుల్ని ఆహ్వానించారు.

ప్రతిభాశాలి, జ్ఞానపిపాసి శివలింగం గారు 2011లో కీర్తిశేషులు కావడం దురదృష్టం. వారి వ్యాసాలు చదివి శ్రీమతి రాయదుర్గం విజయలక్ష్మి గారు నాకు ఫోన్‌ చేసి, శివలింగం గారి సంస్మరణగా ‘పాలపిట్ట’ లో ఒక వ్యాసం రాశారు. ఈ విషయాలన్నీ తెలిసిన శ్రీ కాండ్రేగుల నాగేశ్వరరావు గారు నన్ను కూడా వారి గురించి ఒక వ్యాసం రాసి స్మరించుకుంటే బాగుంటుందనటంతో నా ఈ ప్రయత్నం. శివలింగం గారి ఇతర పత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల్ని ఇంకొక పుస్తకంగా తీసుకురావాలనే ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్‌ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధప్రసాద్‌ గారితో నేను సాంస్కృతికశాఖ సంచాలకునిగా పనిచేస్తున్నప్పుడు ప్రస్తావించడం, శివలింగం గారితో వారికి గల సాన్నిహిత్యాన్ని మననం చేసుకుంటూ వారే పెద్ద మనస్సుతో ఆ పుస్తకాన్ని ప్రచురిస్తానని అంగీకరించడం ముదావహం. త్వరలో ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చి, పుస్తకం పాఠకులకు అందించటం జరుగుతుంది.

శివలింగం గారి చిరకాల మిత్రుడు శివానంద బాబు గారు చెప్పిన విషయాలు, జ్ఞాపకాల నుండి కొంత సమాచారం ఈ వ్యాసంలో పొందుపరచాను. అందుకు వారికి నా కృతజ్ఞతలు. శివలింగం గారి జ్ఞానాన్వేషణ, వారి సాహితీ కృషి నేటి తరానికి ఒక వెలుగురేఖ కావాలి. అట్టి స్ఫూర్తి ప్రదాత చిరస్మరణీయులు. జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్శొన్నాా ఎంత పేదరికం అనుభవించినా ఆయన ఆశావాదం వీడక గొప్ప ధార్మికునిగా, స్థితప్రజ్ఞులుగా నిలిచారు. చివరిగా ఎక్కడో ఒక గేయంలో వారి జీవన దృక్పథాన్ని ఈ విధంగా ఆవిష్కరించారు.

“అనంత చైతన్య పరిష్వంగం/
ప్రశాంత విద్యుల్లహరీ ప్రవాహం
సమచిత్తం సమదర్శ్భనం నీ సులోచనాలు కావాలి
అప్పుడే న దర్శనం పూర్ణయోగం/
అప్పుడే నీ భావన సార్వకాలికం”



9 Replies to “మట్టిలో మాణిక్యం ఉమ్మిటి శివలింగం”

  1. శ్రీ ఉమ్మిటి శివలింగం గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదములు. మరెందరో మహనీయుల గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తన్న 🙏

  2. ఎందరో మహానుభావులు. మరుగున పడిన ఇలాంటి అనర్ఘరత్నాలు ఎందరో! ఉమ్మిటి శివలింగంగారిని పరిచయం చేసినందుకు అనేక ధన్యవాదాలు. వారి వ్యాస సంపుటి వెలువడబోతున్నందుకు సంతోషం. ఈ వ్యాసాలద్వారా వారి జ్ఞానాన్ని అందరికీ పంచే కార్యక్రమం చేపట్టినందుకు మీకు కృతజ్ఞతలు. ఎంత త్వరగా చదువుదామా అని ఆత్రుతతో ఎదురుచూస్తున్నాను.

  3. కీర్తిశేషులు శ్రీ ఉమ్మిటి శివలింగంగారి పరిచయాన్ని సాహితీక్షేత్రంలో వారి కృషిని, ప్రత్యేకతలను నిర్భయ,నిస్సంకోచ భావవ్యక్తీకరణలను గురించి, అనేకానేక అననుకూలతల మద్య వారిసాహిత్యసేద్యనిపుణతను చాలా చక్కగ వివరించారు సర్! ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు🙏🏼🙏🏼🙏🏼

  4. ఉమ్మటి శివలింగం గారి గురించి మన సంభాషణలలో అనేక పర్యాయాలు మననానికి వచ్చాయి. మిసిమిలో మీరు విపులమైన వ్యాసం రాసిన విషయం గుర్తుంది. మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  5. గొప్ప వ్యక్తిని పరిచయం చేశారు. గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన స్తిత ప్రజ్ఞుడు ఈ శివ లింగం గారు అనిపించింది.

  6. Thanks for introducing this great writer. Can I get his book , you mentioned in your essay in routine book shops? .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.