1994 లో మద్రాసు బాబాయి కృష్ణారావుగారి అమ్మాయి మా చెల్లెలు విజయలక్ష్మితో శుభముహూర్తాన ప్రారంభమైన నా అరుణాచల యాత్ర నేటికీ కొనసాగుతోంది. తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడు కొలువైన చోటే కాక జ్ఞానస్వరూపులైన భగవాన్‌ రమణులు నడయాడిన పుణ్యభూమి కూడా అవడంతో అక్కడకు వెళ్ళిన ప్రతిసారీ గొప్ప అనుభూతికి లోనవ్వడం గురుకృపయే. ఇరవై ఏండ్ల క్రితమే ఆప్తులు విజయకుమార్‌, అనురాధ (ఐ.ఎ.ఎస్‌) పుణ్యదంపతుల సౌజన్యంతో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర్రావ్‌ గారి ‘అరుణాచలం – రమణులు’ అనుగ్రహ భాషణం ఏలూరులో నిర్వహించడంతో అది విన్న మా ఆఫీసు సిబ్బందిలో పదిమంది రమణాశ్రమానికి వెళ్ళడం ఆనందదాయకం. అటు తరువాత చాగంటి గారి ప్రవచన ఝరిలో మునిగిన ఎన్నోవేల మంది భక్తులు అరుణాచలేశ్వర సన్నిధికి చేరి రమణుల కరుణను పొందారు.

తిరువణ్ణామలై టెంపుల్‌ టౌన్‌ కావడంతో అరుణాచలేశ్వరాలయం, అరుణగిరి, రమణాశ్రమ ప్రాంతమంతా ప్రశాంతమైన భక్తి వాతావరణం తొణికసలాడుతూ ఉంటుంది. రమణాశ్రమం ఎదురుగా ఉన్న టీ, కాఫీ అమ్మే అంగళ్ళు దగ్గర ఎందరో విదేశీ భక్తులు నిరంతరం చర్చలు కొనసాగిస్తుంటారు. రమణ మహర్షితోపాటు పలువురు గురువులను సందర్శించిన బ్రిటీష్‌ విలేఖరి పాల్‌బ్రంటన్‌ రాసిన In search of Sacred India నో, A Message from Arunachala  చదువుతూనో, హార్వార్డ్‌ ప్రొఫెసర్‌ Dyana Eck  రాసిన India A Sacred Geography, Encountering God, Benaras  పుస్తకాన్నో, రమణ మహర్షి, శ్రీరామకృష్ణపరమహంసలపై అరుణ్‌శౌరి రాసిన Two saints పుస్తకాన్నో చదువుతూ కనిపిస్తారు. అలా అక్కడ ఒకసారి మురికివాడల్లో నివసిస్తూ, మరాఠీ తప్ప మరో భాష తెలియని అతి సామాన్యుడిగా జీవిస్తూ ఎందరినో ప్రభావితుల్ని చేసిన సద్గురువులు నిసర్గదత్త మహారాజ్‌ బోధనల ‘I am That’  పుస్తకం చదువుతున్న ఒక పోలెండ్‌ వాసితో మాటకలిపి ‘‘మీకు నిసర్గదత్త మహారాజ్‌ అంటే ఇష్టమా’’ అని అడిగా. అతను చేతిలోపుస్తకాన్ని నిమురుతూ “Oh Nisargdatta, I love him” అని గాలిలోకి ఒక flying kiss వదిలాడు. “Do you know Ramakrishna Paramahamsa?” అని అడిగితే మరో flying kiss  వదిలాడు. రమణాశ్రమ పరిసరాల్లో ఎందరో విదేశీ భక్తులు నెలల తరబడి నివసిస్తూ తమ సాధన కొనసాగిస్తుంటారు.

మహాత్మాగాంధీజీ సహచరుల్లో ఒకరు తీవ్ర వ్యాకులత చెందితే గాంధీజీ వారిని కొద్దిరోజులు రమణాశ్రమంలో గడిపి రమ్మని పంపడం విశేషం. సద్గురువుకై తీవ్ర అన్వేషణలో ఉన్న పాల్‌బ్రంటన్‌ను అరుణాచలం వెళ్ళి రమణులను దర్శించమని కంచి పరమాచార్య చంద్రశేఖర స్వామి సూచించడంతోనే ఆయన రమణుల శరణాగతి పొందాడు.  నేను రమణాశ్రమం వెళ్ళినప్పుడల్లా కనిపించే ఒక విదేశీ భక్తుడ్ని ఎప్పుడూ ఇక్కడే ఉంటారా అని అడిగితే అతను నవ్వుతూ  “No I stay here for nine months in a year and remaining three months I work in my country to live here for the rest of  nine months”  అని చెప్పడంతో వాళ్ళు అంత దూరం నుండి వచ్చి ఇంత తీవ్రమైన సాధన చేస్తుంటే మనం  ఏడాదిలో నాలుగురోజులు ఇక్కడకు వచ్చి ఉండలేకపోవడం చాలా అపరాధ భావనలో పడేసింది.

మరొకసారి వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణలో న్యూయార్క్‌లో మెన్స్‌ సెలూన్‌లో పనిచేసే జాన్‌, అక్కడే యోగా సెంటర్‌ నడుపుతున్న నాన్సీలను కలిశాను. ఇది రమణాశ్రమానికి వాళ్ళ ఐదో సందర్శనట. ఆ రోజున మన దేశస్థులు కొందరు చెప్పులతో గిరిప్రదక్షిణ చేస్తుంటే వారి దేశంలో పాదరక్షలు లేకుండా అడుగుపెట్టని వాళ్ళిద్దరూ అవేమీ లేకుండా గిరి ప్రదక్షిణ చేస్తుండటం చూస్తే వాళ్ళ నమ్మకానికి ముచ్చటేసింది.

నమ్మిన దాన్ని మంచైనా, చెడైనా ఏ మాత్రం inhibitions లేకుండా చేయడంలో విదేశీయులు మనకంటే చాల ముందుంటారు. ఒక్కొక్కప్పుడు రైల్వేస్టేషన్లోనో, ట్రాఫిక్‌ జంక్షన్స్‌ దగ్గరో Iskon లో చేరిన విదేశీ యువకులు, తులసి మాలలతో, నిలువు నామాలతో, పిలకలతో Iskon  పుస్తకాలు అమ్మడం చూస్తుంటాం. కొన్నిసార్లు మనగుళ్ళల్లో కొందరు అర్చకస్వాములు పిలకను క్రాఫ్‌లో దాచి పెట్టేయడం చూస్తే వాళ్ళకూ, వీళ్ళకూ ఎంతతేడానో అనిపిస్తుంది.

రమణాశ్రమానికి వచ్చే విదేశీభక్తులందరూ మన సంప్రదాయ దుస్తులైన చీరెలు, పంచెలు ధరించి బొట్టు, పూలతో కనబడతారు. ఒకసారి ప్యారిస్‌ నుండి వచ్చినామె పూర్తిగా మన సంప్రదాయ వేషధారణతో మాతృభూతేశ్వరాలయంలో అమ్మవారిని అలంకరించడానికి పూజారికి సాయమందిస్తూ కనిపించింది.  ఆశ్రమంలో ఉన్న అన్ని రోజులూ వేకువ జామున ఈ సేవలో పాల్గొనడం తనకు అమితమైన ఆనందాన్నిస్తుందని ఆమె నాతో  చెప్పింది. ఆమె నిజంగా ధన్యమయి.

భగవాన్‌ రమణులు తమ పదహారో యేట తిరువణ్ణామలై చేరుకుని అర్థశతాబ్ధం పైబడి అరుణగిరి పరిసరాల్లో నివసించినా, వారు దేహాన్ని విడచి డెబ్బది ఏళ్ళు గడచిపోయినా నేటికీ ప్రపంచం నలుమూలల నుండి భక్తులు రమణాశ్రమ సందర్శనకు పదేపదే రావడం రమణుల మహిమే. కట్టుబాట్లకు, సంప్రదాయానికి ఎదురొడ్డిన చలంగారు సైతం ఈశ్వరత్వం వైపు మళ్ళింది భగవాన్‌ కృపచేతనే. ‘‘నాకే భగవాన్‌ దొరకకపోతే నేను ఏమై పోయేవాడినో’’ అని చలంగారే అనడం విశేషం.

ఉత్సాహవంతులైన సాధకులు కొందరు అరుణగిరి పైనున్న విరూపాక్ష గుహలోనో, స్కంధాశ్రమానికికో వెళ్ళి ధ్యానసాధన కొనసాగిస్తారు. సంగీత సామ్రాట్‌ ఇళయరాజా అతిసామాన్యుడిగా ఆశ్రమంలో ఎవరి దృష్టిపడకుండా In Cognito గా ఒక మూల రాళ్ళపైనో, చెట్లక్రిందో  కూర్చుని అరుణగిరిన పరికిస్తూ తన్మయులవడం ఎన్నో మార్లు చూశాము.

తిరువణ్ణామలై చేరుకున్న రమణులు సుమారు ఇరవై రెండేళ్ళ పాటు అరుణగిరిపైనున్న విరూపాక్ష గుహలో, స్కందాశ్రమంలో తపోనిష్టలో గడిపారు. ఎనభై, తొంభయి ఏళ్ళ క్రితం అంతటి నిర్జనమైన అటవీ ప్రాంతంలో కేవలం కౌపీనంతో, బిక్షాపాత్రతో వారు గడిపితే నేటి మన మోడ్రన్‌ గురువులు ఖరీదైన వేషభాషలతో, విలాసవంతమైన చలువరాతి మేడల్లో, మెర్సిడీస్‌ కార్లలో తిరుగుతూ వైరాగ్యప్రకరణ బోధించడం అతిపెద్ద Paradox  గా తోస్తుంది. తలకి గడ్డాలకు రంగులేసుకొని దేహ స్థితిని దాటలేని ఎందరో, గురువులుగా నీరాజనాలు అందుకోవడం చాలా శోచనీయం. రమణులను సందర్శించిన పాల్ బ్రంటన్‌ వారి నిరాడంబరతకు ఆశ్చర్యపోయి, ‘‘కేవలం కౌపీనం, బిక్షాపాత్ర, చేతికర్ర ధరించిన రమణులు మా వస్తుమయ పాశ్చాత్య సంస్కృతిపై గొప్ప మౌన వ్యాఖ్యానం చేసినట్లు అనిపించింది” అనడం భగవాన్‌ తత్త్వాన్ని వారు ఆకళింపు చేసుకున్నందునే.

రమణ సన్నిధిలో పాల్‌ బ్రంట‌న్‌

భగవాన్‌ కౌపీన ధారణ చూసినప్పుడల్లా, నాకు ఎక్కడో చదివిన “The last shirt you are wearing should not have any pockets”  అన్న ఇటలీదేశ సామెత గుర్తొచ్చి నవ్వొస్తుంది. జ్ఞాన స్వరూపులైన రమణులు ఎంతో ముందు చూపుతో చొక్కా ఉంటేనే జేబు కదా కౌపీనం ధరిస్తే జేబు అవసరం, ఆలోచనే ఉండదని మౌనబోధ చేశారు. మౌనబోధ చేసిన రమణులు జీవితాంతం ఏ నియమాలను పాటించలేదు, ఎవరినీ పాటించమనలేదు. వారి బోధలో ఖరీదైనా కాషాయాలు, కషాయాలు రుద్రాక్ష ధారణలు లేవు. అందువల్లనే వందేళ్ళల్లో వందకోట్లు జనాభా దాటినా ఈ దేశంలో ఒక రామకృష్ణ పరమహంస, ఒక్క రమణుల్నే మనం చూడగలిగాం.

కోవిడ్‌ ఉధృతి తగ్గిన తరువాత ఇటీవల రమణాశ్రమం వెళ్ళినప్పుడు నాకొక వింత అనుభవం అయింది. రమణాశ్రమం ఎదుటునున్న స్టాల్‌లో ఒక రోజు ఉదయం ఏడు గంటలకు కాఫీ తాగుదామని వెళ్ళాం. స్టాల్‌ యజమాని టీ, కాఫీలు కాచే నీళ్ళ బాయిలర్‌ను మిలమిలా మెరిసేలా తోమి, మంచి విభూతితో పవిత్రంగా మూడు అడ్డునామాలు తీర్చిదిద్ది, కుంకుమ అద్ది, పూలదండతో అలంకరించి పనిలోకి దిగాడు. బాయిలర్‌ ప్రక్కనే ఎదురుగా ఉన్న ఉన్నతమైన అరుణగిరితో పోటీపడేలా అల్యూమినియం పాత్రలో అల్లాన్ని కొండలా పేర్చి ఉంచాడు. అది చూడగానే నా చిన్నతనంలో మా మేనత్త రాజమ్మ తరచూ పాడే …

‘‘అరుణాచల శివ అరుణాచల శివ

అరుణా చలమనుచు స్మరియించు వారల

అహము నిర్మూలించుమో అరుణాచల’’,

పాట గుర్తొచ్చి, ప్రతిరోజూ సాయంత్రానికి టీస్టాల్‌లోని అల్లంకొండ హరించుకుపోతుందే కానీ ఎన్నిసార్లు అరుణాచలం వెళ్ళినా నా అహం హరియింపబడటం లేదే అన్న ఆలోచన, విచారణ మెదిలింది. ఘాటైన అల్లం కన్నా నా అహమే మొండిదని తెలిసొచ్చింది.

అల్లం కొండ‌

పలుమార్లు రమణాశ్రమానికి వెళ్తున్న నాకు ఆశ్రమానికి దగ్గర్లో ఏదైనా చిన్నగదో, ఇల్లో కొనుక్కుంటే,  అక్కడకు వెళ్ళినప్పుడు  ఎక్కువ రోజులు ఉండటానికి బాగుంటుందన్న కోరిక కలిగింది. ఆ ప్రయత్నం కూడా మొదలుపెట్టేసి శ్రీమతితో అంటే, ఎంతైనా better half కదా better advise యే ఇచ్చింది. ‘‘అందరూ అన్నీ వదిలించుకోవడానికి రమణాశ్రమానికి పోతే మీరు అక్కడకుపోయి కొత్తవి అతికించుకుంటారా? అలాంటి జంజాటాలేవీ పెట్టుకోకండి,” అని జ్ఞానబోధ చేసి కనువిప్పు కలిగించి నా ప్రయత్నాన్ని విరమింప చేసింది. ఆలోచించగా ఆలోచించగా ఆమె చెప్పిందే నిజం. ఎవరో పెద్దాయన చెప్పినట్లు “Beyond a point all our assets become our liabilities”   అనే మాట ‘assets’  కే కాదు మనం తెలియకుండా పెంచుకునే మన కాయానికీ వర్తిస్తుందనేది ఎందరికో స్వానుభవమే.

నారాయణసేవ

కొన్ని ఆశ్రమాలు ఇళ్ళలాగా అనిపిస్తే, కొన్ని ఇళ్ళు ఆశ్రమాల్లా ఉంటాయని తెలిసింది. రమణాశ్రమం మాత్రమే ఇల్లులా, ఆశ్రమంలా అనిపిస్తుంది. ఇక్కడ ఏ నియమనిబంధనల్ని చూడం. వాలంటర్లీ హడావుడే లేదు. నెమళ్ళు, కోతులు, మిగిలిన జీవులు నిర్భయంగా ఆశ్రమమంతా మనతో తిరిగేస్తుంటాయి. గృహస్థులకు కూడా సాధన సాధ్యమే అని తెలియచెప్పేందుకే భగవాన్‌ ఆశ్రమాన్ని అలా తీర్చిదిద్దారేమో. ఆశ్రమం ఏర్పడిన తొలిరోజుల్లో రమణులే స్వయంగా వంటలుచేసి భక్తులకు పెట్టేవారు. ఇహపరాలను సమతౌల్యం చేసే ప్రయత్నమే ఇది. గత డెబ్బయి ఏళ్ళుగా అనునిత్యం ఆశ్రమవాసులకు భోజనంతో పాటు ఆ ప్రాంతంలోని సాధువులకు ఉదయం పదకొండు గంటలకు నారాయణసేవ పేరుతో అన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. అతిథి దేవోభవ అనుభవమవ్వాలంటే రమణాశ్రమం వెళ్ళాల్సిందే కోవిడ్‌ కష్టకాలంలో కూడా నారాయణ సేవ కొనసాగడం రమణుల సంకల్ప బలమే! రోగులకు సేవలందించేందుకై ఉచిత వైద్యశాలను కూడా ఆశ్రమం నిర్వహించడం విశేషం.

వేద విద్యార్థులతో విదేశీ భక్తుని ముచ్చట్లు

ఆశ్రమ ప్రాంగణంలో వేద పాఠశాల కూడా నిర్వహిస్తుండటంతో అనునిత్యం ఆ ప్రాంతమంతా వేదఘోషతో విరాజిల్లుతుంటుంది. ఆశ్రమవాసులకు బస, భోజన వసతి పూర్తిగా ఉచితం. ఎక్కడా హుండీలు, చందాలివ్వండనే ప్రకటనలు కనబడవు. భక్తులెవరైనా ఇష్టపూర్వకంగా ఇచ్చిన చందాలతో ఇవన్నీ నిర్విఘ్నంగా, విరామం లేకుండా జరుగుతుండటం రమణుల ఆశీస్సులతోనే. 

రమణాశ్రమం సందర్శించిన వారందరికీ అనిర్వచనీయమైన అనుభూతి, ప్రశాంతత లభిస్తాయనేది పదుగురి అనుభవం.

తొలి రమణాశ్రమ యాత్ర మాతో చేయించి రమణుల కృపకు పాత్రుల్ని చేసిన చెల్లెలు విజయలక్ష్మికి (Toronto)  ప్రేమతో..

26 Replies to “అరుణగిరి – అల్లంకొండ”

 1. బాగుంది. నేను రెండు సార్లు వెళ్ళాను. ఇది చదివిన తర్వాత సాధ్యమైనంత త్వరలో మళ్ళీ వెళ్ళాలి అని పిస్తోంది. రమణ కృప.

 2. Sir,
  I have visited nearly a decade back with my wife along with some of our close family friends and other Tourists in a bus.

  What did you said those are all correct and we personslly experienced there. Walking on the hill and doing Giri Pradakshina is a good memory. We save the Peacocks which are staying with out fear.

  Coming to the specific point which madam advised to you (not to purchase of house at there) is correct. That is true spiirit of Bhakti Tatva to relinquish the materialism (like desire / astha ).

 3. అంతా మీరే చేసారు.. అరుణగిరి దర్శనాన్ని రెండు సార్లు ఆత్మీయంగా ప్రసాదించారు.మీ అరుణారుణాన్ని ఎలా తీర్చుకోగలను..

 4. సర్,
  శుభోదయం..అనిర్వచనీయ ఆనందాన్ని అందంగా అందించినందుకు కృతజ్ఞతలు..అరుణాచలం నిరంతరం నిత్య నూతనం,నిష్కల్మష హృదయ ప్రదీప్తం…ఎన్నో అనుభవాలు… పిడారి అమ్మన్,పాండవ తీర్థం,సముద్రం, నంది వాయ్ తీర్థం,ఆది అన్నామలై….ఆధ్యాత్మిక అమృతవాహిని అరుణాచలం…ధన్యోస్మి…

 5. కళ్లకు కట్టినట్లు గా రాశారు సార్ .ఆద్యంతం ఆసక్తికరంగా, మనసుకు హత్తుkunelagaa వుంది సార్

 6. రమణాశ్రమ పవిత్రతను అక్షరరూపం చేసారు. ధన్యవాదాలు.

 7. Dear brother
  It’s a research on Arunachalam with real memorable facts enumerated
  It’s an extraordinary piece of work
  God bless you

 8. Really super sir.. I don’t have words to express my happiness after reading… I recollected all my sweet memories.
  Chala chala andanga rasaru sir..
  We all blessed by reading.

 9. It’s an experience of ecstasy,only can be felt.Wirds fall short to experience the bliss.
  Regards Sir, 🙏

 10. అరుణచల మహత్యాన్ని , అక్కడి తాదత్మ్యతని కళ్ళకి కట్టినట్టు చూపారు. అరుణాచల క్షే త్రాన్ని దర్శించిన ప్రతిసారి కొత్త అనుభూతులె కలుగుతాయి. అక్కడి ప్రతి అణువు ఆగ్నిరూపమయి భక్తుల మనస్సు రంజింపచేసి పాపహరం చేస్తాయని పెద్దల నానుడి .
  అల్లంకొండలాంటి అహం కరగాలనె భావన అద్భుతం.
  చివరిలొ madam సలహా అచ్చమయిన అద్వైత భావనె .
  ఏమయినా మీ భావతరంగాలు మళ్ళీ మమ్మల్ని అరుణాచలం వేపు మళ్ళించాయి . ధన్యోస్మి 🙏

 11. అరుణగిరి కి పోవలసినదే,అహం పోయేలా అల్లం ఘాటుగా తాగవలసినదే. Peudospirituality fellows are spirits only అని బాగా ఉతికేసారు. ధన్యవాదాలు

 12. Dear sir
  You are intimately connected to Ramanasramam
  I felt as though I was in the asram
  You are really blessed with Sri Ramana grace

 13. Annaya I’m So happy 😃 I don’t have words to express my gratitude. Tears are flowing from my eyes. Mean’s Annanda bhashpallu. Inthakanna

 14. Dear Harsha,
  You’ve facilitated a virtual tour of
  Sri Ramanasramam. Very fondly remember our first visit to Arunachalam with you years ago. Thank you for your excellent article. I am sure that I would read it many times more.

 15. అబ్బ ఎప్పటి నుండో మీరు రమణాశ్రమం గురించి అరుణాచలం గురించి ప్రస్తావిన ఎప్పటి తెస్తారోనని ఎదురుచూస్తున్నా! ఎందుకంటే రమణ మహర్షి అన్నా అరుణాచలం అన్నా మీరెంత తన్మయం చెందుతారో నాకు తెలుసు. Two Saints book ఇప్పుడే అమెజాన్లో ఆర్డర్ పెడ్తున్నా. ఎప్పుడూ అరుణాచలం మరియు రమణమహర్షి గురించి వినడమేగాని వెళ్ళిందిలేదు మీ బ్లాగ్ చూసాకా తప్పక వెళ్ళి చూడాలనే బలమైన కోరిక కల్గుతోంది అంత రమ్యంగా చిత్రించారు మరి! ధన్యోస్మి🙏🏼🙏🏼🙏🏼

 16. భగవత్ అనుగ్రహం వల్ల నాకు రమనాశ్రమాన్ని సందర్శించే
  భాగ్యం two years back కలిగింది.
  3hours spent చేసాము …

 17. అరుణాచలం వెళ్లాలనే కోరిక ఉన్నా ఇప్పటి వరకు. వెళ్లలేని నాకు ఒక రిమైండర్ లాగ అనిపించింది సర్🙏

 18. చాగంటి వారి వాగ్రూపం, మీ అక్షర రూపం రమణాశ్రమాన్ని కళ్ళకు కట్టాయి. హర్షవర్ధన్ గారూ!అభినందనలు.

 19. రమణాశ్రమ రామణీయకత కళ్లకు కట్టావ్. నన్ను మరో సారి అక్కడికి నువ్వు తీసుకెళ్లావ్. నమోస్తు!

 20. హర్షవర్ధన్ గారికి ధన్యవాదములు, మీ వ్యాసం ద్వారా అరుణగిరి అనుభూతులను చదువుతున్నప్పుడు, కోవిడ్ మొదటి వేవ్ తరువాత నేను దర్శించిన అరుణాచలేశ్వరుని దర్శనం మరియు గిరి ప్రదర్శన జ్ఞప్తికి వచ్చాయి. అవెంతో నాకు మరపురాని జ్ఞాపకాలు. చాగంటిగారు చెప్పినట్టు శివానుగ్రహం ఉంటేనేగాని అరుణగిరిని దర్సించే భాగ్యం కలగదంటారు.

 21. Sir,
  U took me soulful journey to Ramanashram and arunchalam. The haunting eyes of Sri Ramana will never leave once we feel his divine presence. I remember u guided me to Tiruchuli,birth place of Ramana during my trip to Madurai. Felt blessed to visit.🙏🙏🙏

 22. It’s like real time walking tour. Always you are more an observer of surroundings than a pilgrim. You have taken me to great sweet memories. Thank you Harsha.

 23. Anna Chala bagundhi maku malli Arunachalam gurthuku thychaaru vallalani corika kaligaylaa chysaru meru vrasay vedanam avarininayinaa machy vedamga untudhi that is ANNA. Superb

 24. రమనాశ్రమ విశేషాలతో నిండియున్న వ్యాసం మార్గదర్శకం. మీ అభిప్రాయాలు సందర్శన కాంక్షను ఇనుమడింప చేస్తున్నది. ఆదర్షన సమయముకొసము ఎదురు చూస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.